నర్సాపురం లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణరాజుకు కూటమి పార్టీలు మొండి చేయి చూపాయి. రఘురామకృష్ణరాజు రెచ్చిపోయి రచ్చబండ పేరుతో రచ్చచేసి అప్రతిష్టపాలైన నేపథ్యంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు హాండిచ్చిన తీరు రాజకీయాలలో ఉన్నవారికి గుణపాఠం అని చెప్పాలి. నోటి దురద అనండి, నోటి దూల అనండి, తీట అనండి... ఏదైనా కాని తొందరపాటుతో, అతిశయంలో ఏది పడితే అది మాట్లాడి కొందరు నేతల మన్ననలు పొందుదామనుకునే వారికి ఇలాగే పరాభవం ఎదురవుతుంటుంది. తన గురించి తాను గొప్పగా ఊహించుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఎంత తప్పో రాజుకు ఇప్పటికైనా అర్దం అవుతుందా? అన్నది డౌటే.
ఎందుకంటే ఆయనకు బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోతే దానికి కారణం ముఖ్యమంత్రి జగన్‌అని రాజు ఆరోపించే దైన్య స్తితికి తెచ్చారు. ఎందుకంటే ఆయన నాలుగేళ్లుగా ఎవరి ట్రాప్ లో ఉన్నారు? చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణల ట్రాప్ లోనే కదా! నిజంగా రాజుకు ఇవ్వాలని అనుకుంటే చంద్రబాబు నాయుడే నర్సాపురం సీటును టీడీపీ కోటాలోకి తీసుకుని ఇచ్చి ఉండవచ్చు కదా! లేదా బీజేపీ గట్టిగా కోరుకున్న విశాఖపట్నాన్ని వారికి ఇచ్చి, తాను నర్సాపురం తీసుకుని రాజుకు కేటాయించవచ్చు కదా! విశాఖలో తన బందువైన భరత్‌కు సీటు ఇవ్వడంలో చూపిన ఆసక్తి రఘురామకీష్ణంరాజుపై లేదనే కదా దీని అర్ధం.
రాజు గట్టిగా కోరి ఇంకా ప్రకటించని విజయనగరం సీటు అయినా పొందవచ్చు. ఆ రకంగా ఈయన ప్రయత్నిస్తారో, లేక చంద్రబాబుకు పూర్తిగా సరెండర్ అయ్యారు కనుక నోరు మూసుకుని కూర్చుంటారో తెలియదు. చిత్రమైన సంగతి ఏమిటంటే బీజేపీలో ఆరు సీట్లలో ఒక్కరే ఒరిజినల్ బీజేపీ నేత. నర్సాపురం నుంచి బీజేపీ టిక్కెట్ పొందిన శ్రీనివాస వర్మ తప్ప మిగిలిన వారంతా ఇతర పార్టీల నుంచి వలస వెళ్లినవారే. సీ.ఎమ్.రమేష్ టీడీపీ ఎంపీగా ఉండి బీజేపీలోకి వెళ్లారు. ఆయన బీజేపీలో ఉన్నట్లు చెబుతున్నా కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల ఎన్నికల విరాళం ఇచ్చారు. అయినా బీజేపీ ఆయనకు టిక్కెట్ ఇచ్చింది. కొత్తపల్లి గీత గతంలో వైసీపీ ఎంపీ, తదుపరి టీడీపీ ఎంపీ, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆమెకు టిక్కెట్ ఇచ్చారు
పురందేశ్వరి కాంగ్రెస్ లో పదేళ్లు ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉండి బీజేపీలోకి వచ్చారు. వర ప్రసాద్ తనకు టిక్కెట్ ఇవ్వని వైసీపీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరితే మరుసటి రోజే ఈ పార్టీ టిక్కెట్ వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. వీరందరికి టిక్కెట్లు ఇచ్చి రఘురామకృష్ణంరాజుకు ఎందుకు ఇవ్వలేదో ఆయనే ఆలోచించుకోవాలి. ఈ వ్యవహారంలో రాజు వల్ల తమకు కూడా నష్టం జరుగుతోందని భావించారో ఏమో కాని, ఆంధ్రజ్యోతి రాదాకృష్ణ ద్వారా రాయబారం చేసి అసెంబ్లీ టిక్కెట్ ఇస్తామని చెబుతున్నట్లు ఉన్నారు. అది బుగ్గ గిల్లి జోలపాడడానికే కావచ్చు. ఉండి నియోజకవర్గానికి ఇప్పటికే అభ్యర్ధిని టీడీపీ ప్రకటించింది. మరి ఆయనను మార్చి రఘురామ కు ఇస్తారా అన్నది డౌటే. 2019 ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ టిక్కెట్ ఇస్తే దానికి ద్రోహం చేసి రాజు టీడీపీ పంచన చేరారు. చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణల ప్రాపకం కోసం వారు ఏది మాట్లాడమంటే అది మాట్టాడి పరువు పోగొట్టుకున్నారు. చివరికి తాను ఏమి మాట్లాడుతున్నానో తనకే తెలియని పరిస్థితికి వెళ్లారు.
ఎన్నికల సమయంలో కాపు సామాజికవర్గాన్ని ఉద్దేశించి ఈయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అయినా జగన్‌కు ఉన్న ఆదరణ రీత్యా ఈయన బయటపడగలిగారు. డిల్లీలో జగన్‌తో సంబందం లేకుండా సొంత రాజకీయం చేయడం, బీజేపీ వారితో పైరవీ చేసుకుని కమిటీ పదవులు పొందడం వంటివి చేశారు. ఈ క్రమంలో వైసీపీ నాయకత్వంతో కొంత తేడా వచ్చింది. అయినా కొంత సంయమనం పాటించి ఉంటే అన్ని సర్దుకుపోయేవేమో! అలాకాకుండా టీడీపీకి ఏజెంట్ అయిన ఆంద్రజ్యోతి రాదాకృష్ణ ట్రాప్‌లోకి వెళ్లి, జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆరంభించారు. ఆ సమయంలో ఒక ఏడాది పాటు మౌనంగా ఉండండని, ఆ తర్వాత అన్ని కుదుట పడతాయని కొందరు హితవు చెప్పినా ఆయన వినలేదు. దీంతో నరసాపురంలో మరో నేతను వైసీపీ ఇన్ చార్జీగా ప్రకటించింది. ఆ తర్వాత పార్టీకి సంబందం తెగిపోయింది.
ఆ దశలో కాస్త నిజాయితీ ఉన్నా ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజు ప్రతిష్ట నిలబెట్టుకుని ఉండేవారు. ఉభయ గోదావరి జిల్లాలలో క్షత్రియులకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. కాని రాజు తెలివితక్కువగా, మూర్ఖంగా, కేవలం ప్రచార పిచ్చితో దానిని అంతటిని నాశనం చేసి, ఆయన వర్గానికి కూడా కళంకం తెచ్చారన్న విమర్శలకు గురయ్యారు. వైసీపీ ఈయనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్‌ను కోరుతూ పిటిషన్ ఇచ్చినా, రకరకాల పద్దతులలో బీజేపీ పెద్దలను మేనేజ్ చేసుకుని నాలుగేళ్లు కధ నడిపించారు. ఈ కాలంలో ఒకటి,రెండుసార్లు తప్ప నియోజకవర్గం వైపే చూడలేదు. ఈనాడు, ఆంద్రజ్యోతి, టీవి 5 వంటివి తనకు లైవ్ కవరేజీ ఇస్తున్నాయనే సంబడంలో ఆయన రోజూ జగన్‌పై విమర్శలు సాగించారు. అవి కూడా కొన్నిసార్లు దూషణలుగా, అనుచిత వ్యాఖ్యలుగా ఉండేవి. ఒక అగ్రవర్ణ సామాజికవర్గాన్ని తూలనాడడం, మతపరమైన వ్యాఖ్యలు చేయడం వంటివాటి ద్వారా కులాలు, మతాల మద్య చిచ్చుపెట్టే యత్నం కూడా చేశారు.
ఆ క్రమంలో ప్రభుత్వం కేసు పెట్టి అరెస్టు చేసింది. అప్పట్లో ఆయా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్దహస్తుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు ద్వారా బెయిల్ పై బయటకు వచ్చారు. అప్పుడైనా పదవికి రాజీనామా చేసి, వైసీపీకి చాలెంజ్ విసిరారా అంటే అదీ లేదు. ఓడిపోతానన్న పిరికి తనంతో ఉండిపోయారు. ఈయనను వైసీపీ ఎంపీగా పిక్చర్ ఇస్తూ ఎల్లో మీడియా కధ నడిపేవి. తనకు టీడీపీ, బీజేపీ, జనసేనలలో ఎవరైనా టిక్కెట్ ఇస్తారని బీరాలు పోయేవారు. నిజంగానే ఈయనకు అంత పలుకుబడి ఉందేమోలే అనుకున్నవారు ఉన్నారు. ఆ నమ్మకంతోనే వైసీపీని, జగన్‌ను అంత నీచంగా మాట్లాడుతున్నారని భావించినవారు లేకపోలేదు. సీన్ కట్ చేస్తే ఆ మూడు పార్టీలు ఈయనను వదలించుకోవడానికి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఉన్నవి,లేనివి కలిపి అబద్దాలు చెప్పించిన టీడీపీ నేతలే ప్రస్తుతం మొహం చాటేశారంటేనే అర్ధం చేసుకోవచ్చు.
చంద్రరబాబు నాయుడును నమ్మితే ఇంతే సంగతి అన్నది సాదారణంగా ఉన్న నానుడి. ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్ధికి కాకుండా టీడీపీకి ఓటు వేసి అనర్హత వేటుకు గురైన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కూడా చంద్రబాబు మొండి చేయి చూపారు. ఆమె బాపట్ల లోక్ సభ సీటు ఇస్తారని ఆశించి భంగపడ్డారు. దాంతో తత్వం బోధపడి ఏమన్నారో చూడండి. 'రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటివారు ఈ రోజు అర్దం అయింది "అని శ్రీదేవి వ్యాఖ్యానించారు. అంటే దాని అర్దం చంద్రబాబు తనకు వెన్నుపోటు పొడిచారని చెప్పడమే కదా! రఘురామకృష్ణంరాజుకు కూడా అలాగే చంద్రబాబు ప్రస్తుతానికి వెన్నుపోటు పొడిచినట్లే అవుతుంది కదా! ఆయనను నిలదీసి తాను ఇంతగా సేవ చేస్తే ఇలా నమ్మక ద్రోహం చేస్తారా అని చంద్రబాబును ప్రశ్నించాలి కదా! మరో ప్రత్యామ్నాయ సీటుకు డిమాండ్ చేయాలి కదా! ఈ మూడు పార్టీలు రఘురామకృష్ణంరాజుకు టిక్కెట్ ఇవ్వడం వేస్ట్ అని అనుకున్నాయనే కదా అర్ధం.
తనను కరివేపాకు మాదిరి చంద్రబాబు వాడేసి, ఎటూ కాకుండా చేశాడని ఈయనకు జ్ఞానోదయం అవ్వాలి కదా! ఇంత జరిగాక కూడా తాను చంద్రబాబుతోనే ఉంటానని ఉసూరుమంటూ చెప్పారు. తనకు ఇంతకన్నా గతి లేదని ఫీల్ అవుతున్నారని ఆయన మొహం చూస్తేనే అర్దం అవుతుంది. తాను చిన్న ఓటమికి గురయ్యాయని అంటూ మళ్లీ ఆత్మవంచన చేసుకుని జగన్‌తన ప్రభావం చూపి టిక్కెట్ రాకుండా చేశారని పిచ్చి విమర్శ చేశారు. ఇలా చాతకాని వ్యాఖ్యలు చేసే బదులు తాను ఇంతకాలం తప్పు చేశానని, శ్రీదేవి మాదిరి తనకు కూడా జ్ఞానోదయం అయిందని ప్రకటించి రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదేమో ఆయన ఆలోచించాలి. అలా చేసే పరిస్థితి లేదు.. రామోజీ, రాదాకృష్ణ తదితర తెలుగుదేశం ఎజెంట్లు పెట్టిన ప్రలోభాలకు లొంగి, రోజూ తనను కాబట్టి టీవీ లైవ్ లలో చూపిస్తున్నారని, పత్రికలలో తన స్టేట్ మెంట్లు వేస్తున్నారని భ్రమపడి, వారి కోరిక మేరకు పిచ్చి మాటలన్నీ మాట్లాడి, ఇప్పుడు లబో, దిబో అంటున్నారు.
ఇప్పటికైనా వారంతా తనను వాడుకుని వదలివేశారన్న సంగతి బోదపడిందో లేదో తెలియదు. రఘురామకృష్ణరాజుకు ఇంకో ఆప్షన్ లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ నేత, తన వియ్యంకుడైన కెవిపి రామచంద్రరావునో, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలనో కోరితే. వారు కాంగ్రెస్ టిక్కెట్ ఇప్పించవచ్చు. ఆ రకంగా ప్రయత్నం చేస్తారేమో చూడాలి. కాంగ్రెస్ టిక్కెట్ పైన అయినా, లేక స్వతంత్ర ఈ అభ్యర్ధిగా అయినా రంగంలో దిగి తన సత్తా చూపితే అప్పుడు రఘురామకృష్ణంరాజుకు కొంతైనా విలువ వస్తుంది. లేకుంటే ఈయన రోశం ఉన్న రాజకాదని, ఉత్తి రాజే అన్నే భావన కలుగుతుంది. సర్వభ్రష్టత్వం చెంది రఘురామకృష్ణంరాజు, టీడీపీ కూటమికే ఊడిగం చేస్తారా? లేక తనకు కూడా వ్యక్తిత్వం ఉందని నిరూపించుకుంటారా అన్నది ఆయన తేల్చుకోవాలి.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment