వరద ముంపు గ్రామాల ప్రజలకు టార్పాలిన్‌లను తరలిస్తున్న సిబ్బంది
సాక్షి, అమరావతి/ సాక్షి, పాడేరు: గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎంతో ముందుచూపుతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం పకడ్బందీగా వరద సహాయక చర్యలు చేపట్టడమే రామోజీరావు అక్కసుకు కారణమైంది. ఎలాంటి నష్టం జరగకుండా, ఏ లోటూ లేకుండా వరద బాధితులు పునరావాస కేంద్రాల్లో సురక్షితంగా ఉండటం చూసి ఆయన తట్టుకోలేక కన్నీటి వరద కారుస్తున్నారు.
సీఎం వైఎస్ జగన్ నిరంతర పర్యవేక్షణలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం మొత్తం గోదావరి వరద బాధితులకు సహాయక చర్యల్లో నిమగ్నమైనా ఈనాడు మాత్రం అవి కనపడకుండా కళ్లు మూసుకొని, అధికార యంత్రాంగం మొద్దునిద్రలో ఉన్నట్లుగా భ్రమిస్తోంది. ఆ భ్రమలనే వార్తలుగా మలచి సీఎం వైఎస్ జగన్ పైన, ప్రభుత్వం పైన రకరకాల పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది.
వరదల సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను అప్రమత్తం చేశారు. జూలై 28వ తేదీన ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వరదల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు. అవసరమైన అన్ని చర్యలు ఆగమేఘాలపై తీసుకునేలా యంత్రాంగాన్ని నడిపించారు.
చదవండి: ‘టీడీపీ కార్యాలయంలో జై జగన్ నినాదాలు’
గ్రామ వలంటీర్ నుంచి సచివాలయాల సిబ్బంది, ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బంది వరద ప్రభావిత గ్రామాల్లోనే మకాం వేసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. గత ప్రభుత్వంలోకంటె ఇప్పుడు ఎంతో మిన్నగా వరద సహాయక చర్యలు చేపట్టారు. ఏ ప్రాంతానికి వెళ్లినా ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి.
చింతూరు పునరావాస కేంద్రంలో కూరగాయలు పంపిణీ చేస్తున్న సిబ్బంది
85 పునరావాస కేంద్రాలకు 49 వేల మంది తరలింపు
వరద ప్రభావిత ఐదు జిల్లాల్లో 237 గ్రామాల్లోని 49,262 మందిని 85 పునరావాస కేంద్రాలకు తరలించారు. 10 లాంచీలు, 230 బోట్లతో బాధితుల్ని పెద్దఎత్తున తరలించే దృశ్యాలు అన్ని చోట్లా కనిపిస్తూనే ఉన్నాయి. పది ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలతో ప్రజలకు సేవలందిస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది ముంపు గ్రామాల్లో తిరుగుతూ అందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలూ కల్పించారు. తా
గునీరు, నిత్యావసరాలకు ఎటువంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్, ఫాగింగ్ వంటి పారిశుధ్య చర్యలు చేపట్టారు. అవసరమైన వారికి వెంటనే వైద్యం అందించేందుకు వైద్య బృందాలను నియమించారు. బాధితులకు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ప్రతి క్షణం అందుబాటులో ఉంటున్నారు. బాధితులకు నిత్యావసరాలకు లోటు రాకుండా అన్ని రకాల సరకులని స్టాక్ పాయింట్లకు ముందే పంపించారు. ప్రతి బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, లీటర్ పామాయిలు ఇస్తున్నారు.
ముందే రూ.12 కోట్లు విడుదల
వరద సహాయక చర్యల కోసం సీఎం జగన్ 5 జిల్లాలకు తక్షణమే రూ.12 కోట్లు విడుదల చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా వరదల సమయంలోనే ముందుగా నిధులు విడుదల చేయలేదు. చంద్రబాబు హయాంలో వరదలు వచ్చి, అంతా మునిగిపోయి ప్రజలు గగ్గోలు పెట్టిన తర్వాత అరకొరగా నిధులిచ్చేవారు. దీంతో జిల్లా కలెక్టర్లు రకరకాల ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా సహాయక చర్యల ప్రారంభానికి ముందే నిధులిచ్చే సంప్రదాయానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. వరద బాధితులకు అందించే ప్రత్యేక ఆర్తిక సాయం విషయంలోనూ సీఎం సరికొత్త రీతిలో ముందుకెళుతుండడం ఈనాడుకు మింగుడుపడడంలేదు.
చంద్రబాబు హయాంలో ఈ ప్రత్యేక సాయం ఊసే ఉండేది కాదు. వరద తగ్గిన తర్వాత తెలుగు తమ్ముళ్లు బాధితులకు ఇచ్చినట్లు రాసేసుకుని ఆ సొమ్ముని మింగేసేవారు. ఇప్పుడు అలాంటివేమీ లేకుండా వరద తగ్గిన తర్వాత బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు రూ.1,000 నుంచి రూ. 2,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. వరదల వల్ల దెబ్బతిన్న ఇళ్లకు ఇచ్చే పరిహారాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ రూ.10 వేలకు పెంచారు. గతంలో ఇది రూ.5 వేలు మాత్రమే.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇవేమీ కనిపించని ఈనాడు ఈనాడు బృందం తిరిగినట్లుగా చెప్పుకొంటున్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వ చర్యలు విస్పష్టంగా కనిపిస్తున్నా, అక్కడ ఏదీ జరగనట్లే అబద్ధాలు రాసి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. వరదలపై ముఖ్యమంత్రి ముందస్తుగా ఆదేశించిన వెంటనే జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ పర్యవేక్షణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు చేపట్టారు.
కలెక్టర్‌తో సహా అధికార యంత్రాంగం చింతూరులో మకాం వేసింది. వరదపై ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసింది. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. సిద్ధం చేసింది. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను కూడా సిద్ధంగా ఉంచింది. చింతూరు డివిజన్లోని నాలుగు మండలాల్లో 177 గ్రామాలు వరదలకు ప్రభావితమవగా 110 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 24,279 కుటుంబాలను తరలించింది.
బాధితులకు సత్వర సాయం
వరద బాధితులకు తక్షణ సాయం అందించేందుకు ప్రభుత్వం నాలుగు మండలాల్లో ముందుగానే స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి నిత్యావసర సరకులను నిల్వ చేసింది. ముంపు ప్రాంతాల్లో జూలై, ఆగస్టు నెలల రేషన్‌ను ముందుగానే పంపిణీ చేసింది. నాలుగు మండలాల్లో సహాయక చర్యల నిమిత్తం రూ.3 కోట్లు మంజూరు చేసింది.
ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు
సీఎం జగన్ ఆదేశాల మేరకు వరద బాధితులకు ఎలాంటి నష్టం జరగకుండా నాలుగు మండలాల్లో ముందస్తు చర్యలు చేపట్టాం. ప్రతి మండలానికి ప్రత్యేకాధికారులను నియమించాం. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను సురక్షితంగా తరలించి వారికి నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశాం. గర్భిణులను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాం.
గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడంతో పాటు వైద్య శిబిరాలు నిర్వహించాం. గోదావరి, శబరి నదుల్లో వరద తగ్గడంతో ఆయా ముంపు గ్రామాల్లో సహాయక కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తున్నాం.
– సుమిత్‌కుమార్, కలెక్టర్, అల్లూరి సీతారామరాజు జిల్లా
అన్ని విధాలుగా ఆదుకున్నారు
పునరావాస కేంద్రంలో తలదాచుకున్న మాకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంది. పక్కా భవనంలో విద్యుత్ సౌకర్యంతో పాటు నిత్యావసరాలు కొరత లేకుండా అందించింది. ప్రభుత్వ సిబ్బంది అందుబాటులో ఉంటూ మా బాగోగులు చూసుకున్నారు
– కొండా సరోజిని, చింతూరు
అన్ని సౌకర్యాలు కల్పించారు
ఇంటి సమీపంలోకి వరద వస్తుండడంతో గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తీసుకొచ్చారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించారు. తాగు నీటికి ఇబ్బంది లేదు. బియ్యం, పప్పులు, కూరగాయలు, పాలు అందించారు.
– మాటూరి శ్రీనివాసరావు, చింతూరు శబరిఒడ్డు
అధికారులు అప్రమత్తం చేశారు
వరద సమాచారంపై అధికారులు మమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలకు తరలించారు. అందరం ఇక్కడ సురక్షితంగా ఉన్నాం.
– బొర్రా పద్మారెడ్డి, వడ్డిగూడెం, వీఆర్‌పురం మండలం
అధికారుల స్పందన బాగుంది
వరదల సమయంలో అధికారుల స్పందన బాగుంది. ప్రభుత్వం చేపట్టిన సహా యక కార్యక్రమాలతో అందరం సురక్షితంగా ఉన్నాం. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న మాకందరికీ నీరు, బియ్యం, పాలు సహా అన్నీ అందుబాటులో ఉంచుతున్నారు. ఏ లోటూ రాకుండా చూస్తున్నారు.
– యడ్ల బాయమ్మ, టేకులబోరు, కూనవరం మండలం
Comments
Please login to add a commentAdd a comment