సాక్షి, అమరావతి: ‘అసలే కోతి.. ఆపై కల్లు తాగింది.. ఆపై తేలు కుట్టింది.. ఆ తర్వాత దానికి దెయ్యం పట్టింది’... ఇక ఆ కోతి ఏం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాలా?! ఈనాడు అధినేత రామోజీరావు కూడా రోజురోజుకు ఇలాగే తయారవుతున్నారు. ఆయనకు ఒకటే ఏకసూత్ర అజెండా.. తనకు నచ్చిన చంద్రబాబు అధికారంలో ఉంటే ఆయన ఏం చేసినా ‘ఓహో.. అద్భుతం.. పరమాద్భుతం.. మహాద్భుతం’ అంటూ తన విషపుత్రిక ఈనాడులో రాసేస్తారు.
అదే చంద్రబాబు కాకుండా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉంటే రామోజీలో పది తలల రావణుడు నిద్ర లేస్తాడు. ప్రజలకు ప్రభుత్వం ఎంత మంచి చేసినా అందులో ఆయనకు తప్పులు మాత్రమే కనిపిస్తాయి.. అంతా అవినీతిలా అనిపిస్తోంది. దీంతో అగ్గిమీద గుగ్గిలమైపోయి ప్రభుత్వంపైన యథేచ్ఛగా దుష్ప్రచారం చేసేస్తారు. ఈ కోవలోనే సోమవారం ఈనాడులో ‘పెద్ద తెరపైనే ప్రభుత్వ పెద్దల మోజు’ అంటూ ఎప్పటిలానే ఒక విష కథనాన్ని వండివార్చారు. ఈ కథనానికి సంబంధించి వాస్తవాలు ఇవిగో..
వైఎస్ జగన్ 2019లో అధికారంలోకి చేపట్టాక విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు. ముఖ్యంగా టీడీపీ హయాంలో కునారిల్లిపోయిన విద్యా రంగాన్ని ప్రభుత్వ ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కింద పది రకాల వసతులను కల్పించారు. అంతేనా.. జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి వంటి పథకాలను అందిస్తున్నారు.
ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచాన్ని ఏలుతుండటంతో ప్రభుత్వ విద్యార్థులు వెనుకపడిపోకుండా ప్రభుత్వమే ఉచితంగా వారికి బైజూస్ కంటెంట్‌ను నింపి ట్యాబ్‌లను అందజేస్తోంది. దీన్ని రామోజీరావు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పేద పిల్లలు ప్రభుత్వం అందిస్తున్న అంతర్జాతీయ ప్రమాణాలతో ఎదిగిపోవడం ఆయనకు నచ్చడం లేదు. అందుకే గుడ్డు మీద ఈకలు పీకినట్టు.. ప్రభుత్వం ఏ తప్పు చేయకపోయినా ఈనాడులో విష కథనాలు వండివారుస్తున్నారు.
విద్యార్థులకే స్వేచ్ఛనిచ్చిన ప్రభుత్వం..
వాస్తవానికి ట్యాబ్‌ల విషయంలో విద్యార్థులకే ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. వారు కోరుకుంటే 9 అంగుళాల తెర ఉన్న ట్యాబ్‌లు ఇవ్వాలని విక్రేతలకు సూచించింది. గతేడాది ఎనిమిదో తరగతి విద్యార్థులకు 8.7 అంగుళాల ట్యాబ్‌లను ప్రభుత్వం పంపిణీ చేసింది. వాటిని విద్యార్థులు బాగున్నాయి అని చెప్పడంతో ఈ సంవత్సరం కూడా అలాంటి ట్యాబ్‌లనే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పైగా ట్యాబ్‌లను సరఫరా చేసే చాలా కంపెనీలు 8.7 అంగుళాల సైజులోనే తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో 8.7 అంగుళాలు, 9 అంగుళాల ట్యాబ్‌ల ధరల్లో పెద్ద వ్యత్యాసం లేదు. వీటిని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ద్వారా కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలో కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి తప్పులు జరగకుండా జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపడంతోపాటు రివర్స్ టెండరింగ్ కూడా నిర్వహిస్తోంది.
ఇక ఇందులో అక్రమాలు అనే మాటకు తావే లేదు. కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ నిబంధనలను అనుసరించి 8 అంగుళాలు, అంతకంటే ఎక్కువ సైజు తెర ఉండాలని ‘ఈనాడు’ తన కథనంలోనే చెప్పుకొచ్చింది. ఆ నిబంధన ప్రకారం చూసినా అంతకంటే పెద్ద సైజు 8.7 అంగుళాల తెర ఉన్న ట్యాబ్‌లనే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించింది. మరి దీన్ని రామోజీరావు తప్పుపడుతూ విషం చిమ్మడం ఎంతవరకు సమంజసం?
సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం
విద్యార్థులకు అందించిన ట్యాబ్‌ల్లో ఏ చిన్న సాంకేతిక సమస్య తలెత్తినా ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు వెంటనే సరిచేసి ఇస్తున్నారు. సాధారణంగా తలెత్తే చిన్న సమస్యలపై స్థానిక ఉపాధ్యాయులకు నిపుణులతో పలుమార్లు శిక్షణ కూడా ఇచ్చారు. వారి స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే వార్డు సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ వాటిని సరిచేసి ఇస్తారు.
పొరపాటున ట్యాబ్ స్క్రీన్ పాడైపోతే డిజిటల్ అసిస్టెంట్ ఇన్వెంటరీ లాగిన్‌లో టికెట్ నమోదు చేసి ఆ విద్యార్థి ట్యాబ్‌కు కొత్త స్క్రీన్ వేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు అందరికీ ఈ ట్యాబ్‌లపై ఎన్నోసార్లు అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు. సమస్య ఉన్న ట్యాబ్‌ను విద్యార్థి/తల్లిదండ్రులు/ఉపాధ్యాయులు.. డిజిటల్ అసిస్టెంట్‌కు ఇస్తే రశీదు ఇచ్చి, ట్యాబ్‌ను రిపేర్ చేసి మూడు రోజుల్లో తిరిగి ఇస్తున్నారు.
ప్రతి నెలా ఆయా డిజిటల్ అసిస్టెంట్లు తమకు కేటాయించిన పాఠశాలలను సందర్శించి ట్యాబ్‌ల వినియోగంపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవగాహన కలిగించడంతో పాటు సమస్యలను సరిచేస్తున్నారు. అయితే ‘ఇవన్నీ నాకెందుకు.. నాకు నచ్చింది మాత్రమే నేను రాస్తా’ అనే రీతిలో రామోజీరావు ట్యాబ్‌ల కొనుగోలుపై ఒక విషకథనం వండివార్చారు.
Fact Check: పేద పిల్లలకు ఇచ్చే ట్యాబ్‌లపైనా ఏడుపేనా?
Published Tue, Sep 5 2023 4:54 AM | Last Updated on Tue, Sep 5 2023 4:54 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment