సాక్షి, అమరావతి: టీటీడీలోని విద్యుత్ సరఫరాలో విప్లవాత్మక మార్పులు తేబోతున్నారు. సమర్థమైన విద్యుత్ పరికరాలతో ఇంధన పొదుపు చేపట్టబోతున్నారు. టీటీడీ, అనుబంధ ఆలయాలు, ధర్మసత్రాల్లో సమగ్ర ఇంధన ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి కేంద్ర సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సాంకేతిక, ఆర్థిక తోడ్పాటు అందిస్తుందని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం చెప్పారు. బీఈఈ నేతృత్వంలో సోమవారం నుంచి టీటీడీలో నీటి పంపుల పనితీరుపై ఆడిట్ నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఉపకరణాలన్నీ మారతాయి
టీటీడీ పరిధిలో 399 పంపుసెట్లున్నాయి. వీటి సామర్థ్యం 3,500 హెచ్‌పీ. వీటి స్థానంలో ఇంధన సామర్థ్యం గల పంపుసెట్లు అమరిస్తే ఏటా దాదాపు 1.14 మిలియన్ యూనిట్లు (20 శాతం) ఆదా చేయవచ్చని ప్రాథమిక పరిశీలనలో వెల్లడైందని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ తెలిపింది. ఇప్పుడున్న 38,000 ఫ్యాన్ల స్థానంలో రూ.9.5 కోట్ల పెట్టుబడితో సూపర్ ఎఫిషియంట్ ఫ్యాన్లను అమర్చబోతున్నారు. దీనివల్ల ఏటా 5.02 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని అంచనా వేశారు. ఇలా చేస్తే రూ.4.5 కోట్లు పొదుపు చేయవచ్చని గుర్తించారు. దేవస్థానం పరిధిలో 1,608 ఏసీలనూ మారుస్తున్నారు. రూ.8.4 కోట్ల ఖర్చుతో 5 స్టార్ ఏసీలను అమర్చబోతున్నారు. దీంతో ఏటా రూ.1.85 కోట్ల విలువైన 3.09 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని భావిస్తున్నారు.
30 శాతం పవన, సౌర విద్యుత్
టీటీడీ ఏటా 68 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగిస్తోంది. ఇందులో 30 శాతం సౌర, పవన విద్యుత్ ఉంటోంది. మిగతా 70 శాతం (435 లక్షల యూనిట్లు) దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి తీసుకుంటోంది. టీటీడీకి 7.5 మెగావాట్ల సామర్థ్యం గల పవన విద్యుత్ కేంద్రం, 10 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం ఉన్నాయి. ఏటా రూ.కోట్ల విలువైన కోటి యూనిట్ల పవన విద్యుత్, రూ.3 కోట్ల విలువైన 1.45 కోట్ల యూనిట్ల సౌర విద్యుత్‌ను టీటీడీ ఉత్పత్తి చేసుకుని వాడుకుంటోంది. దేవస్థానం పరిధిలోని కళాశాలల భవనాలపై రూప్‌టాప్ ద్వారా సౌర విద్యుత్ అందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment