సాక్షి, ముంబై: నగరంలో అక్రమంగా ఏర్పాటుచేసిన సెల్‌ఫోన్ టవర్లను తొలగించేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిపాలన విభాగానికి ముహూర్తం దొరకడం లేదు. నియమాలను తుంగలో తొక్కి ఏర్పాటు చేసుకున్న వివిధ కంపెనీలకు చెందిన వేలాది సెల్‌ఫోన్ టవర్లను తొలగించేందుకు నిర్ణయించిన బీఎంసీ ఆ మేరకు కొత్త నియమావళిని రూపొందించడంలో సాగదీత ధోరణిని అవలంభిస్తోంది. దీన్ని రూపొందించేందుకు ఇప్పటివరకు బీఎంసీకి సమయం దొరకకపోవడం వారికి పనిమీద ఉన్న శ్రద్ధను తెలియజేస్తోంది. నగరంలో వివిధ సంస్థలకు చెందిన 4,776 సెల్‌ఫోన్ టవర్లు ఉన్నాయి. ఇందులో ఏకంగా 75 శాతం టవర్లు అక్రమంగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. కేవలం 1,145 టవర్లు మాత్రమే అవసరమైన అనుమతులు తీసుకున్న నిర్వాహకులు నియమాలకు కట్టుబడి వాటిని ఏర్పాటు చేశారు. మిగతా టవర్లు అక్రమంగా ఏర్పాటు చేసినట్లు బీఎంసీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో వెల్లడైంది.
అయినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ టవర్ల నుంచి వెలువడుతున్న రేడియేషన్ వల్ల చుట్టుపక్కల ప్రజలు పడుతున్న ఇబ్బందులను విన్నవించేందుకు హిందీ సినీ నటి జూహి చావ్లా ఇటీవల బీఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ సీతారాం కుంటేతో భేటీ అయ్యారు. దీంతో నగరంలోని సెల్ టవర్లపై జూన్ ఒకటో తేదీ వరకు వివరాలు అందజేసి, జూలై 15 వరకు కొత్త నియమావళి ప్రకటిస్తామని చావ్లాకు కుంటే హామీ ఇచ్చారు. కానీ ఆయన స్పందించకపోవడంతో బీజేపీ కార్పొరేటర్ వినోద్ శేలార్ సీతారాం కుంటేతో భేటీ అయి ఆగస్టు ఒకటో తేదీ వరకు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కానీ ఆగస్టు రెండో వారం ముగుస్తున్నా ఇంతవరకు ఎలాంటి నియమావళి అమలు చేయలేదు.
అయితే అనేక సెల్ టవర్లకు బెస్ట్ సంస్థ, రిలయన్స్ ఎనర్జీ విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. ఇందులో అత్యధిక శాతం టవర్లు అక్రమంగా ఏర్పాటుచేసినవే ఉన్నాయి. ఇలాంటి టవర్లపై దర్యాప్తు చేయడంతో పాటు వీటికి విద్యుత్ సరఫరా చేసేందుకు అనుమతినిచ్చిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని శేలార్ డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రజల సమస్యలు వినేందుకు సెల్ టవర్ల కంపెనీల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సమాజ సేవా సంస్థల పదాధికారులతో కూడిన ఒక కమిటీని స్థాపించాలని కోరుతూ ఆయన కేంద్ర మంత్రి మిలింద్ దేవరాకు ఒక లేఖ పంపించారు.
అక్రమ సెల్‌ఫోన్ టవర్లపై చర్యలేవీ?
Published Mon, Aug 12 2013 11:46 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement
Advertisement