నూతన పార్లమెంట్‌లో వర్షపు నీరు కారుతుండటంతో విపక్షాల విమర్శలు
న్యూఢిల్లీ: ఢిల్లీని ముంచెత్తిన వరుణుడు పార్లమెంట్ వేదికగా విపక్షాలకు కొత్త విమర్శనాస్త్రాన్ని అందించాడు. గత ఏడేళ్లలో 15 రాష్ట్రాల పరిధిలో ఏకంగా పలురకాలైన 70 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకవడంపై కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే.
గురువారం పడిన వర్షాలకు నూతన పార్లమెంట్ భవంతిలోని లాబీ పైకప్పు నుంచి వర్షపు నీరు ధారగా పడుతోంది. దీంతో పేపర్ లీకేజీలను వాటర్ లీకేజీతో ముడిపెడుతూ విపక్షాలు భవన నిర్మాణ పటిష్టతను ఎత్తిచూపాయి. ‘‘ పేపర్ లీకేజీ బయట. వాటర్ లీకేజీ లోపల. రాష్ట్రపతి విచ్చేసినపుడే వినియోగించే లాబీ పైకప్పు నుంచి ధారగా పడుతున్న వర్షపు నీరు.. భవంతి ఏ మేరకు పటిష్టంగా ఉందనే చేదు నిజాన్ని చాటుతోంది.
ఈ విషయమై లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడతా’ అని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు మాణిక్కం ఠాకూర్ ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. వర్షపు నీటి కోసం బకెట్ పట్టడం, అక్కడి వారంతా చూస్తూ వెళ్తున్న వీడియోను పోస్ట్‌చేశారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సైతం విమర్శించారు. ‘‘ ఈ భవంతి కంటే పాత భవనమే నయం. ఎంపీలంతా మాట్లాడుకోవడానికి వర్షపు నీరు పడని చోటు ఉండేది. వేల కోట్లతో మళ్లీ కొత్త భవంతి రిపేర్లు పూర్తయ్యేదాక ఎంపీలు పాత భవంతికి మారితే మంచిదనుకుంటా’ అని వ్యంగ్య పోస్ట్ చేశారు. గాజు డోమ్‌ల మధ్య ప్రాంతాలను అతికించే జిగురు జారిపోవడంతో అక్కడి నుంచి మాత్రమే నీరు లీక్ అయిందని, వెంటనే సమస్యను పరిష్కరించామని లోక్‌సభ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment