rain water leakage
-
Parliament Opposition leaders: బయట పేపర్.. లోపల వాటర్ లీకేజీ
న్యూఢిల్లీ: ఢిల్లీని ముంచెత్తిన వరుణుడు పార్లమెంట్ వేదికగా విపక్షాలకు కొత్త విమర్శనాస్త్రాన్ని అందించాడు. గత ఏడేళ్లలో 15 రాష్ట్రాల పరిధిలో ఏకంగా పలురకాలైన 70 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకవడంపై కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే. గురువారం పడిన వర్షాలకు నూతన పార్లమెంట్ భవంతిలోని లాబీ పైకప్పు నుంచి వర్షపు నీరు ధారగా పడుతోంది. దీంతో పేపర్ లీకేజీలను వాటర్ లీకేజీతో ముడిపెడుతూ విపక్షాలు భవన నిర్మాణ పటిష్టతను ఎత్తిచూపాయి. ‘‘ పేపర్ లీకేజీ బయట. వాటర్ లీకేజీ లోపల. రాష్ట్రపతి విచ్చేసినపుడే వినియోగించే లాబీ పైకప్పు నుంచి ధారగా పడుతున్న వర్షపు నీరు.. భవంతి ఏ మేరకు పటిష్టంగా ఉందనే చేదు నిజాన్ని చాటుతోంది. ఈ విషయమై లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడతా’ అని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు మాణిక్కం ఠాకూర్ ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. వర్షపు నీటి కోసం బకెట్ పట్టడం, అక్కడి వారంతా చూస్తూ వెళ్తున్న వీడియోను పోస్ట్‌చేశారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సైతం విమర్శించారు. ‘‘ ఈ భవంతి కంటే పాత భవనమే నయం. ఎంపీలంతా మాట్లాడుకోవడానికి వర్షపు నీరు పడని చోటు ఉండేది. వేల కోట్లతో మళ్లీ కొత్త భవంతి రిపేర్లు పూర్తయ్యేదాక ఎంపీలు పాత భవంతికి మారితే మంచిదనుకుంటా’ అని వ్యంగ్య పోస్ట్ చేశారు. గాజు డోమ్‌ల మధ్య ప్రాంతాలను అతికించే జిగురు జారిపోవడంతో అక్కడి నుంచి మాత్రమే నీరు లీక్ అయిందని, వెంటనే సమస్యను పరిష్కరించామని లోక్‌సభ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. -
వీడియో: వందే భారత్ రైలులో వర్షపు నీరు లీక్.. ప్రయాణికుల ఇక్కట్లు!
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ రైళ్లు ఇప్పటికే పలు ప్రమాదాల్లో దెబ్బతిన్న విషయం తెలిసిందే. అంతకుముందు జంతువులు ఢీకొనడంతో రైలు ముందు భాగం దెబ్బతిన్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక, తాజాగా వర్షాల నేపథ్యంలో రైలులో వర్షపు నీరు కారడంతో ఆ నీళ్లు బోగీలోకి ప్రవేశించాయి. దీంతో, వర్షపు నీటిని సిబ్బంది టబ్స్‌తో పట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన కేంద్రం కేరళకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ కేరళ రాజధాని తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్లో స్వయంగా పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. తిరువనంతపురం నుంచి కాసర్గోడ్ మధ్య రాకపోకలు సాగించే రైలు ఇది. అయితే, ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో డొల్లతనం బయటపడింది. వర్షాల కారణంగా రైలులోకి వర్షపు నీరు రైలు బోగీల్లో కారింది. కాగా, భారీ వర్షాలకు ఈ రైలు చూరు లీక్ కావడంతో బోగీల్లోకి వర్షపు నీరు ప్రవేశించింది. దీంతో, వర్షపు నీటిని సిబ్బంది టబ్స్‌తో పట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోను కేరళ కాంగ్రెస్.. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. దీనిపై సెటైరికల్ కామెంట్స్ చేసింది. వందే భారత్‌లో ప్రయణికులకు గొడుగులు సప్లై చేసే పరిస్థితి ఏర్పడిందంటూ కామెంట్స్ పెట్టింది. Farewell blankets, hello umbrellas: Vande Bharat redefines comfort. pic.twitter.com/8mTKeaqkYL — Congress Kerala (@INCKerala) June 14, 2023 ఇదిలా ఉండగా.. కిందటి నెలలో కురిసిన భారీ వర్షాలకు ఒకసారి ఈ రైలు టాప్ లీక్ కావడం వల్ల వర్షపు నీరు లోనికి ప్రవేశించిన విషయం తెలిసిందే. అప్పట్లో సిబ్బంది దీనికి మరమ్మతు చేశారు. నీరు లోనికి ప్రవేశించకుండా రబ్బర్ బెండ్స్ అమర్చారు. ఇప్పుడు తాజాగా మళ్లీ అదే తరహా పరిస్థితి కనిపించింది. మరోవైపు.. ఈ ఘటనపై దక్షిణ రైల్వే స్పందించింది. కేరళ లేదా సంబంధిత రైలు సేవలను అందించే ఏ ఇతర దక్షిణాది రాష్ట్రం నుండి ఇలాంటి ఘటనలు జరిగినట్టు తమ దృష్టికి రాలేదని స్పష్టం చేసింది. కేరళలో నడుస్తున్న వందే భారత్‌లో అలాంటి ఘటన జరగలేదు అంటూ ట్విట్టర్లో తెలిపింది. ఇది కూడా చదవండి: బీజేపీకి ఊహించని షాక్.. సీనియర్ నేత ఔట్ -
గన్నవరం ఎయిర్పోర్ట్ ఆఫీస్ రూమ్ జలమయం
సాక్షి, విజయవాడ : గన్నవరం విమానాశ్రయం ఆఫీస్ రూమ్ జలమయమైంది. బుధవారం సాయంత్రం గన్నవరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి ఎయిర్పోర్ట్ ఆఫీస్ రూమ్ చెరువును తలపించింది. ఆఫీస్ రూమ్‌పై భాగం దెబ్బతినడంతో వర్షపు నీరు లోనికి ప్రవేశించింది. భారీగా వర్షపు నీరు ఆఫీస్ రూమ్‌లోకి చేరడంతో.. ఆ నీటిని తోడేందుకు ఎయిర్పోర్ట్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పై నుంచి నీరు కారడంతో ఆఫీసులోని ఫర్నీచర్ కూడా తడిసిపోయింది. ఏలూరు రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ విజయవాడ, ఏలూరు రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 2 కి.మీ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఓ వైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మూడు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక.. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. కృష్ణా జిల్లాలోని విజయవాడ రూరల్, గన్నవరం, గుడివాడ, కృత్తివెన్ను, బంటుమిల్లి, కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి, నందివాడ, పెదపారుపూడి, బాపులపాడు, ఉంగుటూరు, గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల, వినుకొండ, కాకుమాను, పెద్దనందిపాడు, నిజాంపట్నం, కొల్లిపర, కొల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, మొగల్తూరు, నర్సాపురం, కాళ్ల మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండ, సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని తెలిపింది. -
విడ్డూరం: మంత్రి ఇంట్లోకి వర్షపు నీరు
లక్నో: ప్రభుత్వ ఏజెన్సీల పనితీరు ఎంత దారుణంగా ఉంటుందో చూస్కోండంటూ ఏకంగా ఓ మంత్రే తన ఇంట్లో వర్షపు నీరు లీకేజీ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖా మంత్రి సిధార్థ్ నాథ్ సింగ్ ఇంట్లో పై కప్పు నుంచి వర్షపు నీరు లీక్ అవుతోంది. వెంటనే తన ట్విట్టర్ లో ఆయన ఆ వీడియోను పోస్ట్ చేశారు. ‘మంత్రుల బంగళాలో ఎంత దయనీయమైన స్థితి ఉందో చూడండి. ప్రభుత్వ ఏజెన్సీలపైనే ఇంకా ఆధారపడి ఉన్నాం. మెరుగైన సదుపాయాలు కల్పించుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ సిధార్థ్ ఓ సందేశం ఉంచారు. గత ప్రభుత్వ(అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ) నిర్లక్ష్యం ఇదేనంటూ మంత్రి సిధార్థ్ విమర్శించారు. వంట గదిలో పై కప్పు నుంచి నీరు కారుతుండటం, కింద ఐదు బకెట్లలో వాన నీటిని పడుతుండటం వీడియోలో చూడొచ్చు. -
లీకేజీ వెనుక పెద్ద ప్యాకేజీ ఉంది: ఆళ్ల
హైదరాబాద్ : ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం అంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం నిర్వాకాన్ని అందరూ చూస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. కొద్దిపాటి వర్షానికే ఏపీ సచివాలయం ఛాంబర్లు వర్షపు నీటితో లీక్ అయిన వ్యవహారంతో ఆంధ్ర రాష్ట్ర పరువును దిగజార్చుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘సచివాలయంలో లీకేజీలు చాలా చిన్న విషయం అని, భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని మంత్రి నారాయణ అంటున్నారు. ఏపీ సచివాలయం ఛాంబర్ల లీకేజీ వెనక చాలా పెద్ద ప్యాకేజీ ఉంది. మీకు, ప్రభుత్వానికి, చంద్రబాబుకు వచ్చిన ప్యాకేజీ మాత్రం భారీ ఎత్తున ఉండి ఉంటుంది. లీకేజీ వెనుక అసలు విషయం ప్రజలకు తెలియాల్సి ఉంది. అందుకే చదరపు అడుగుకు పదివేల రూపాయిలకు కాంట్రాక్ట్ కట్టబెట్టారు. దీని వెనుక పెద్ద ఎత్తున ప్యాకేజీ కుదిరింది. గతంలోనూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఛాంబర్ కూడా వర్షంనీరు చేరింది. దానిపై సీఐడీ ఎంక్వైరీ వేశారు. నెలరోజుల గడుస్తున్నా దానిపై కదలిక లేదు. ఇప్పుడు మంత్రుల ఛాంబర్లు కురుస్తున్నాయి. ఓ వైపు వర్షం, మరోవైపు అధికారులు పని చేసుకోవాలి. దీంతో వాళ్లు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. చిన్న వర్షానికే ఇలా ఉంటే తుపాను వస్తే పరిస్థితి ఏంటి?. హుద్‌హుద్ తుఫాను సమయంలో కేవలం విశాఖలో రెవెన్యూ శాఖలో రికార్డులు మాయం అయ్యాయి. ఇప్పుడు కూడా సచివాలయం నిర్మాణానికి సంబంధించి ఏ కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్లకు సంబంధించిన పైళ్లు మాయం అయ్యే అవకాశం ఉంది. దీనిపై సీఐడీ కాదు సీబీఐ విచారణ జరిపించాలి.’ అని ఆయన డిమాండ్ చేశారు.