లీకేజీ వెనుక పెద్ద ప్యాకేజీ ఉంది: ఆళ్ల
హైదరాబాద్ : ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం అంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం నిర్వాకాన్ని అందరూ చూస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. కొద్దిపాటి వర్షానికే ఏపీ సచివాలయం ఛాంబర్లు వర్షపు నీటితో లీక్ అయిన వ్యవహారంతో ఆంధ్ర రాష్ట్ర పరువును దిగజార్చుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘సచివాలయంలో లీకేజీలు చాలా చిన్న విషయం అని, భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని మంత్రి నారాయణ అంటున్నారు. ఏపీ సచివాలయం ఛాంబర్ల లీకేజీ వెనక చాలా పెద్ద ప్యాకేజీ ఉంది. మీకు, ప్రభుత్వానికి, చంద్రబాబుకు వచ్చిన ప్యాకేజీ మాత్రం భారీ ఎత్తున ఉండి ఉంటుంది. లీకేజీ వెనుక అసలు విషయం ప్రజలకు తెలియాల్సి ఉంది. అందుకే చదరపు అడుగుకు పదివేల రూపాయిలకు కాంట్రాక్ట్ కట్టబెట్టారు.
దీని వెనుక పెద్ద ఎత్తున ప్యాకేజీ కుదిరింది. గతంలోనూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఛాంబర్ కూడా వర్షంనీరు చేరింది. దానిపై సీఐడీ ఎంక్వైరీ వేశారు. నెలరోజుల గడుస్తున్నా దానిపై కదలిక లేదు. ఇప్పుడు మంత్రుల ఛాంబర్లు కురుస్తున్నాయి. ఓ వైపు వర్షం, మరోవైపు అధికారులు పని చేసుకోవాలి. దీంతో వాళ్లు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. చిన్న వర్షానికే ఇలా ఉంటే తుపాను వస్తే పరిస్థితి ఏంటి?. హుద్‌హుద్ తుఫాను సమయంలో కేవలం విశాఖలో రెవెన్యూ శాఖలో రికార్డులు మాయం అయ్యాయి. ఇప్పుడు కూడా సచివాలయం నిర్మాణానికి సంబంధించి ఏ కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్లకు సంబంధించిన పైళ్లు మాయం అయ్యే అవకాశం ఉంది. దీనిపై సీఐడీ కాదు సీబీఐ విచారణ జరిపించాలి.’ అని ఆయన డిమాండ్ చేశారు.