Kerala Congress Shares Video Of Water Leak In Vande Bharat Express Goes Viral - Sakshi
Sakshi News home page

వీడియో: వందే భారత్‌ రైలులో వర్షపు నీరు లీక్‌.. టబ్స్‌ పెట్టిన సిబ్బంది

Published Thu, Jun 15 2023 5:46 PM | Last Updated on Thu, Jun 15 2023 6:02 PM

Water Leak In Kerala Vande Bharat Express Video Goes Viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ రైళ్లు ఇప్పటికే పలు ప్రమాదాల్లో దెబ్బతిన్న విషయం తెలిసిందే. అంతకుముందు జంతువులు ఢీకొనడంతో రైలు ముందు భాగం దెబ్బతిన్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక, తాజాగా వర్షాల నేపథ్యంలో రైలులో వర్షపు నీరు కారడంతో ఆ నీళ్లు బోగీలోకి ప్రవేశించాయి. దీంతో, వర్షపు నీటిని సిబ్బంది టబ్స్‌తో పట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన కేంద్రం కేరళకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస​్‌ను కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ కేరళ రాజధాని తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్‌లో స్వయంగా పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. తిరువనంతపురం నుంచి కాసర్‌గోడ్ మధ్య రాకపోకలు సాగించే రైలు ఇది. అయితే, ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో డొల్లతనం బయటపడింది. వర్షాల కారణంగా రైలులోకి వర్షపు నీరు రైలు బోగీల్లో కారింది. 

కాగా, భారీ వర్షాలకు ఈ రైలు చూరు లీక్ కావడంతో బోగీల్లోకి వర్షపు నీరు ప్రవేశించింది. దీంతో, వర్షపు నీటిని సిబ్బంది టబ్స్‌తో పట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోను కేరళ కాంగ్రెస్.. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. దీనిపై సెటైరికల్‌ కామెంట్స్‌ చేసింది. వందే భారత్‌లో ప్రయణికులకు గొడుగులు సప్లై చేసే పరిస్థితి ఏర్పడిందంటూ కామెంట్స్ పెట్టింది.


ఇదిలా ఉండగా.. కిందటి నెలలో కురిసిన భారీ వర్షాలకు ఒకసారి ఈ రైలు టాప్ లీక్ కావడం వల్ల వర్షపు నీరు లోనికి ప్రవేశించిన విషయం తెలిసిందే. అప్పట్లో సిబ్బంది దీనికి మరమ్మతు చేశారు. నీరు లోనికి ప్రవేశించకుండా రబ్బర్ బెండ్స్ అమర్చారు. ఇప్పుడు తాజాగా మళ్లీ అదే తరహా పరిస్థితి కనిపించింది.

మరోవైపు.. ఈ ఘటనపై దక్షిణ రైల్వే స్పందించింది. కేరళ లేదా సంబంధిత రైలు సేవలను అందించే ఏ ఇతర దక్షిణాది రాష్ట్రం నుండి ఇలాంటి ఘటనలు జరిగినట్టు తమ దృష్టికి రాలేదని స్పష్టం చేసింది. కేరళలో నడుస్తున్న వందే భారత్‌లో అలాంటి ఘటన జరగలేదు అంటూ ట్విట్టర్‌లో తెలిపింది. 

ఇది కూడా చదవండి: బీజేపీకి ఊహించని షాక్‌.. సీనియర్‌ నేత ఔట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement