ఇంటర్ ప్రశ్నపత్రాల లీకు! | Inter Supplementary Exam Paper Bundles leaked | Sakshi
Sakshi News home page

ఇంటర్ ప్రశ్నపత్రాల లీకు!

Published Wed, May 28 2014 4:50 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM

ఇంటర్ ప్రశ్నపత్రాల లీకు!

ఇంటర్ ప్రశ్నపత్రాల లీకు!

* నారాయణ కళాశాలలో వారం రోజులుగా ఉన్న ప్రశ్నపత్రాల బాక్సులు
* ఈనెల 22నే ప్రశ్నపత్రాల బాక్సులు తీసుకెళ్లిన ప్రిన్సిపాల్
* అదనపు ప్రశ్నపత్రాల కోసం బోర్డు అధికారి రావడంతో వెల్లడి
* క్రమపద్ధతిలో ఉండాల్సిన తాళాలతో తెరుచుకోని బాక్సులు
* ప్రశ్నపత్రాలు లీకై ఉంటాయని బలపడుతున్న అనుమానాలు

 
 సాక్షి, హైదరాబాద్/ గుడివాడ (కృష్ణ్లా): ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలు లీక్ చేశారనే వార్త కృష్ణాజిల్లా గుడివాడలో సంచలనం సృష్టించింది. పోలీసుస్టేషన్‌లో ఉన్న ప్రశ్నపత్రాలను వారం ముందే గుడివాడలో ఉన్న నారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తీసుకువెళ్లటం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రశ్నపత్రాల కోసం మంగళవారం జిల్లా ఇంటర్ బోర్డు అధికారి రావటంతో ఈ వ్యవహారం బయటపడింది. ప్రముఖ కార్పొరేట్ కళాశాలకు ప్రమేయమున్న ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచాలని ప్రయత్నించినా.. మీడియాకు తెలియడం తో బట్టబయలైంది. ఈ ఏడాది మార్చిలో గుడివాడలో ఐదు సెంటర్లలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. వీటిలో నారాయణ జూనియర్ కాలేజీ కూడా ఒక సెంటర్‌గా ఉంది. పోలీసు స్టేషన్లో ప్రశ్నపత్రాలను భద్రపరిచేందుకు పరీక్షలు నిర్వహించే కాలేజీల వారే ఇనుప ట్రంకు పెట్టెలు ఇవ్వాలి. ఇందులో భాగంగా 12ప్రశ్నపత్రాలు భద్రపరిచేందుకు నారాయణ జూనియర్ కళాశాల వారు 12 ట్రంకు పెట్టెలను ఇచ్చారు.
 
 ఒక్కో ట్రంకుపెట్టెలో మూడు సెట్ల ప్రశ్నపత్రాలను సీలువేసి భద్రపరుస్తారు. పరీక్ష సమయంలో ఇంటర్మీడియెట్ బోర్డువారు జంబ్లింగ్ పద్ధతిలో వాటిలో ఒక సెట్‌ను ఎంపిక చేస్తారు. మిగిలిన రెండుసెట్లును పెట్టెలోనే ఉంచి సీలువేసి పోలీసు స్టేషన్‌లోనే భద్రపరుస్తారు. సప్లిమెంటరీ పరీక్షలకు బాక్సుల్లో మిగిలిన రెండు సెట్లలో ఒకదాన్ని వాడతారు. ఈనెల 25నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఈ పరీక్షలకు గుడివాడ లో విద్యార్ధుల సంఖ్య తక్కువగా ఉండటంతో జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు వారు గుడివాడకు నాలుగు సెంటర్లు మాత్రమే ఇచ్చారు.
 
 దీంతో గుడివాడ నారాయణ జూనియర్ కాలేజీకి సెంటర్ లేకుండా పోయింది. దీంతో ఆ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యశాస్త్రి ఈనెల 22న స్థానిక టూటౌన్ పోలీసు స్టేషన్‌కు వచ్చి తమ కళాశాలకు పరీక్షా కేంద్రం లేదని తమ ట్రంకు పెట్టెలు ఇవ్వాలని లేఖరాసి తీసుకెళ్లారు. అయితే రెండేసి సెట్లు ప్రశ్నపత్రాలున్న ఆ 12 ట్రంకుపెట్టెలనూ ఖాళీ బాక్సులు పేరుతో కార్పొరేట్ కళాశాలవారు తీసుకెళ్లడం అనుమానాస్పదంగా మారింది.
 
 ఇలా బయటకు వచ్చింది: సప్లిమెంటరీ పరీక్షల్లో జిల్లాలోని ఒక కేంద్రంలో బోటనీ ప్రశ్నపత్రాలు తక్కువయ్యాయి. గుడివాడలోని నారాయణ కాలేజీ సెంటర్ లేకపోవటంతో దానికి సంబంధించిన ప్రశ్నపత్రాలు పెట్టెల్లోనే ఉంటాయి కాబట్టి తీసుకెళ్లేందుకు జిల్లా ఇంటర్ బోర్డు అధికారి వెంకట్రామారావు గుడివాడ   పోలీసు స్టేషన్‌కు వచ్చారు.
 
 అయితే ఆ పెట్టెలను నారాయణ కళాశాలవారు 22వ తేదీనే తీసుకెళ్లారని చెప్పటంతో ఆయన ఒక్కసారిగా అవాక్కయ్యారు. కాలేజీ ప్రిన్సిపాల్‌ను పిలిపించగా 27వతేదీ బాక్సులన్నీ తెచ్చి స్టేషన్‌లో పెట్టారు. ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా చూడాలని అధికారులు ప్రయత్నించినా మీడియాకు తెలియటంతో బట్టబయలైంది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రఘునందనరావు స్పందించి జిల్లా జేసీ మురళీని విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని తెలిసిన జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు కూడా  గుడివాడకు చేరుకున్నారు. గుడివాడ ఆర్డీఓ ఎస్.వెంకటసుబ్బయ్య, తహశీల్దార్ పద్మావతిల సమక్షంలో పెట్టెలు తీసి పరిశీలించారు.
 
 తాళాలు తెరుచుకోలేదు: ప్రశ్నపత్రాలు భద్రపరిచే పెట్టెలు తాళాలు తీయటంలో ప్రత్యేక విధానాన్ని పాటిస్తారు. మొత్తం 12 ట్రంకుపెట్టెల్లో ఒకటో నెంబరు బాక్సు తాళం మాత్రమే బయట ఉంటుంది. ఒకటో నెంబరు బాక్సులో రెండో నెంబరు బాక్సు తాళం, రెండో నెంబరు బాక్సులో మూడో నంబర్ బాక్సు తాళం... ఇలా 12 పెట్టెల తాళాలను భద్రపరుస్తారు. అయితే ఆయా బాక్సుల్లో ఉన్న తాళాలతో తర్వాతి నంబరు బాక్సులు తెరుచుకోలేదు.
 
 దీంతో ఆర్‌ఐఓ వద్ద ఉన్న డూప్లికేట్ తాళంచెవులు ఉపయోగించి తాళాలు తెరవాల్సివచ్చింది. ట్రంకుపెట్టెలు వారం రోజులపాటు నారాయణ కళాశాలలో ఉండటం, బాక్సుల్లో ఉన్న తాళంచెవులతో తర్వాతి నంబరు బాక్సులు తెరుచుకోకపోవడంతో ప్రశ్నపత్రాలు లీకయ్యి ఉంటాయనే అనుమానాలు నెలకొన్నాయి. ట్రంకు పెట్టెల సీళ్లన్నీ బాగానే ఉన్నాయని, అయితే బాక్సులు నిబంధనలకు విరుద్ధంగా బయటకు వెళ్లటం నేరమని జేసీ మురళి, ఎస్పీ ప్రభాకర్ చెప్పారు. పూర్తిస్థాయి విచారణ జరిగాక కారకులపై చర్యలు ఉంటాయని వారు తెలిపారు. ప్రశ్నపత్రం బయటకు వెళ్లినట్లు రుజువైతే, ఆ పరీక్షను మళ్లీ నిర్వహించే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టనున్నామని వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement