లీకేజీ వెనుక ఒప్పందం? | Telangana: Police Investigating On Polytechnic Question Paper Leaked | Sakshi
Sakshi News home page

లీకేజీ వెనుక ఒప్పందం?

Published Tue, Feb 15 2022 12:53 AM | Last Updated on Tue, Feb 15 2022 12:53 AM

Telangana: Police Investigating On Polytechnic Question Paper Leaked - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన పాలిటెక్నిక్‌ రెండు, మూడో ఏడాదికి సంబంధించిన మూడు, ఐదవ సెమిస్టర్‌ పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్‌ శివార్లలోని స్వాతి ఇంజనీరింగ్‌ కాలేజీ నుంచి జరిగిన ఈ లీకేజీలో సిండికేట్‌ అయిన కాలేజీలు ఎన్ని? లీక్‌ అయిన ఎంతసేపటికి వాట్సాప్‌ ద్వారా పేపర్లు వెళ్లాయి? అనే సమాచారం సేకరిస్తున్నారు. దీనివెనుక సాంకేతిక విద్యామండలి సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు.

కాల్‌డేటాపై దృష్టి...
పరీక్ష పేపర్‌ 8, 9 తేదీల్లో లీక్‌ అవగా 9వ తేదీన లీకేజీ వ్యవహారాన్ని ఓ ప్రభుత్వ కాలేజీ సిబ్బంది గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే 8వ తేదీనే లీకేజీని సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారనే కోణంలో పోలీసులు పలువురు విద్యార్థుల వాట్సాప్‌ నంబర్లను సేకరించారు. సర్వీస్‌ ప్రొవైడర్ల ద్వారా ఆ సెల్‌ నంబర్ల నుంచి రెండు రోజులపాటు వెళ్లిన కాల్స్‌ను పరిశీలిస్తున్నారు.

మరోవైపు కాలేజీ యాజమాన్యం, సిబ్బంది సెల్‌ నంబర్లనూ పరిశీలించగా మొత్తం 10 కాలేజీలకు ఆ నంబర్ల నుంచి ఫోన్లు వెళ్లినట్లు తేలింది. వివిధ ప్రాంతాలకు చెందిన పాలిటెక్నిక్‌ కాలేజీల యాజమాన్యాలతో స్వాతి ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యానికి ఉన్న లింకేంటి? ముందే ఒప్పందం చేసుకొని పేపర్‌ లీక్‌ చేశారా? అనే కోణంలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు.

పాస్‌వర్డ్‌ అధికారులు పంపినదేనా?
స్వాతి ఇంజనీరింగ్‌ కాలేజీ గుర్తింపును గతంలోనే రద్దు చేశామని, పాలిటెక్నిక్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లకు అనుమతి లేదని సాంకేతిక విద్య అధికారులు తెలిపారు. ఈ స్థాయిలో విశ్వసనీయత లేని కాలేజీకి ముందే పాస్‌వర్డ్‌ చేరడం, అధికారుల బాధ్యతారాహిత్యాన్ని స్పష్టం చేస్తోందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అసలు పాస్‌వర్డ్‌ అధికారులు పంపిందేనా? మరో మార్గంలో పాస్‌వర్డ్‌ రాక ముందే హ్యాక్‌ చేశారా? ఇలా జరిగితే ఉన్నత విద్యామండలి అధికారుల పాత్ర ఉందా? అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి.

సంబంధిత అధికారులనూ విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు. నేర స్వభావం, అధికారుల వివరణ పరస్పర విరుద్ధంగా ఉండటం ఈ కేసులో కొత్త అనుమానాలకు తావిస్తోంది. నిబంధనల ప్రకారం అరగంట ముందు పరీక్ష కేంద్రాలకు పాస్‌వర్డ్‌ పంపాలి. కాలేజీ నిర్వాహ కులు, బాధ్యతగల అధికారుల పర్యవేక్షణలో పేపర్‌ను డౌన్‌లోడ్‌ చేయాలి. కానీ స్వాతి ఇంజనీరింగ్‌ కాలేజీలో నిర్ణీత గడువుకన్నా ముందే పాస్‌వర్డ్‌ చేరిందనే సందేహాలు బలపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పాస్‌వర్డ్‌ వెళ్లిన సమయానికి ముందే పాస్‌వర్డ్‌ ఇవ్వడం వెనుక ఉద్దేశమేంటనే దిశగానూ దర్యాప్తు జరుగుతోంది. కాగా, ఈ కేసులో ముగ్గురు కాలేజీ సిబ్బంది పాత్రను నిర్ధారిం చిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. మరోవైపు కాలేజీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశామని.. ఇంకా యాజమాన్యం బదులివ్వలేదని సాంకేతిక విద్య అధికారులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement