cancellation of bail
-
వాంగ్మూలాలు మార్చేసి.. ‘సుప్రీం’ను ఏమార్చాలి
సాక్షి, అమరావతి : సీఆర్పీసీ 164 వాంగ్మూలాలు మార్చాలి.. సుప్రీంకోర్టును ఏమార్చాలి.. ఏం చేసినా ఈ నెల 21లోగా చేసేయాలి.. అందుకు ఎంతకైనా బరితెగించాలన్నది టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్రగా స్పష్టమవుతోంది. సీఐడీని అడ్డుపెట్టుకుని ఈ కుతంత్రానికి పాల్పడుతోంది. చంద్రబాబుపై అవీనీతి కేసులను నీరుగార్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. న్యాయస్థానంలో సీఆర్పీసీ 164 కింద వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల సంగతి తేలుస్తామని ఎన్నికల ముందు లోకేశ్ హెచ్చరించినట్టుగానే.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం న్యాయస్థానాల్లో ఉన్న కేసులను ప్రభావితం చేసేలా అక్రమాలకు పాల్పడుతోంది. అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించి ఏకంగా సుప్రీంకోర్టునే ఏమార్చేందుకు బరితెగిస్తోంది. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై ప్రస్తుతం సీఐడీ వరుసగా వాయిదాలు కోరుతుండటంపై సుప్రీంకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం హడలిపోతోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టు అయిన చంద్రబాబు.. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని గతంలోనే సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పిటిషన్ అంశంలో సీఐడీ ప్లేటు ఫిరాయించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణకు ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీ వరుసగా వాయిదాలు కోరుతుండటం గమనార్హం. గత విచారణకు కూడా ఆయన నేరుగా హాజరు కాకుండా వర్చువల్‌గా పాల్గొని వాదనలు వినిపించకుండా మరోసారి వాయిదా కోరారు. వరుస వాయిదాలు కోరడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి వాయిదా ఇవ్వమని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. దాంతో ఈ నెల 21న సుప్రీంకోర్టు విచారణకు హాజరై చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సీఐడీ తరఫు న్యాయవాది తప్పనిసరిగా తన వాదనలు వినిపించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఆ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన కేసునే ఆయన వాదిస్తున్నారు. అంటే నిబంధనల ప్రకారం చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఆయన వాదనలు వినిపించాలి. కానీ ఈ పిటిషన్ వీగిపోయేలా చేసేందుకే ప్రస్తుత సీఐడీ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు కుట్రలకు పదును పెడుతున్నారు. ఈ నెల 21లోగా తిమ్మిని బమ్మి చేసేందుకు బరితెగిస్తున్నారు. అబద్ధపు వాంగ్మూలాలతో ‘సుప్రీం’ను ఏమార్చే కుట్ర 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కుంభకోణాలకు చంద్రబాబే ప్రధాన కుట్రదారు అని ఐఏఎస్ అధికారులు చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్, కాంతిలాల్ దండే స్పష్టం చేశారు. ఆమేరకు 164 సీఆర్పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ కేసులో ఆ వాంగ్మూలాలు కీలక సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అందుకే వారిపై టీడీపీ కూటమి ప్రభుత్వం గురి పెట్టింది. గతంలో ఇచ్చిన వాంగ్మూలాలకు పూర్తి విరుద్ధంగా అబద్ధపు వాంగ్మూలాలను సీఆర్పీసీ 164 కింద మరోసారి నమోదు చేయించేందుకు కుతంత్రం పన్నుతోంది.సీఆర్పీసీ 164 కింద ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇవ్వడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయినా సరే ఈ నెల 8న ఆ అధికారులతో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించాలని సీఐడీ పట్టుబడుతోంది. ఈ నెల 21లోగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించి, ఆ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా సుప్రీంకోర్టును ఏమార్చేందుకు పన్నాగం పన్నింది. అప్పుడే హెచ్చరించిన లోకేశ్సీఆర్పీసీ 164 కింద న్యాయస్థానంలో వాంగ్మూలం ఇవ్వడమన్నది రాజ్యాంగం కల్పించిన అవకాశం. ప్రమాణ పూర్తిగా ఇచ్చే ఆ వాంగ్మూలాలకు న్యాయస్థానం రక్షణ కల్పిస్తోంది. కానీ అంతటి కీలకమైన 164 వాంగ్మూలాలను కూడా నారా లోకేశ్ ప్రశ్నించడం విభ్రాంతికరం. ఎన్నికల ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేస్తూ ఐఏఎస్ అధికారులు 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలాలు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. అందుకే రెడ్‌బుక్ రాస్తున్నామని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారుల సంగతి తేలుస్తామని హెచ్చరించారు.అప్పటికే న్యాయస్థానంలో విచారణలో ఉన్న అంశంపై ఆయన మాట్లాడటం, సాక్షులను బెదిరించడం న్యాయ ధిక్కారమేనని పరిశీలకులు స్పష్టం చేశారు. లోకేశ్ ముందుగా చెప్పినట్టుగానే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. గతంలో 164 సీఆర్పీసీ వాంగ్మూలాలు ఇచ్చిన అధికారులను ప్రభుత్వం వేధిస్తోంది. వారితో అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించేందుకు సీఐడీ ద్వారా బరితెగిస్తోంది. ఇది కచ్చితంగా చంద్రబాబుపై అవినీతి కేసుల విచారణను ప్రభావితం చేయడమేనని పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. దీన్ని న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణించాలని కోరుతున్నారు. -
నారాయణకు చుక్కెదురు
చిత్తూరు అర్బన్: టీడీపీ నేత, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణకు చిత్తూరు జిల్లా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాల మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణకు మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసింది. ఈ మేరకు చిత్తూరులోని 9వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30లోపు నారాయణ కోర్టులో లొంగిపోవాలని న్యాయమూర్తి శ్రీనివాసులు ఆదేశాలిచ్చారు. నారాయణ కోర్టులో లొంగిపోయిన అనంతరం ఆయనను జుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో తెలుగు కాంపోజిట్ ప్రశ్నపత్రాన్ని తిరుపతి నారాయణ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ఎన్.గిరిధర్‌రెడ్డి ‘చిత్తూరు టాకీస్’ అనే వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చిత్తూరు డీఈవో పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదుతో వన్‌టౌన్ సీఐ నరసింహరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏప్రిల్ 29న తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీకృష్ణారెడ్డి చైతన్య ప్రిన్సిపాల్ పి.సురేష్, తిరుపతి ఎన్ఆర్ఐ అకాడమీ ఆంగ్ల ఉపాధ్యాయుడు కె.సుధాకర్, తిరుపతి చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ ఆరిఫ్, డీన్ కె.మోహన్, గిరిధర్‌రెడ్డిలతోపాటు గంగాధర నెల్లూరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పవన్‌కుమార్‌రెడ్డి, బి.సోమును అరెస్టు చేశారు. వీరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు మినహా మిగిలినవాళ్లంతా గతంలో నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసినవాళ్లే కావడం గమనార్హం. గిరిధర్‌రెడ్డి, సుధాకర్, సురేష్, పవన్‌కుమార్‌రెడ్డిలను మే 9న కస్టడీకు తీసుకుని విచారించారు. టీడీపీ నేత నారాయణ ఆదేశాలతోనే తాము ఇదంతా చేసినట్లు నిందితులు అంగీకరించారు. నారాయణ ఆదేశాలతో ఆ సంస్థ సిబ్బంది మరికొందరు కార్పొరేట్ విద్యాసంస్థల ప్రతినిధులతో కలిసి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారని వెల్లడైంది. దీంతో నారాయణను మే 10న ఐపీసీ 5 రెడ్‌విత్ 8, 10 ఎగ్జామినేషన్ మాల్‌ప్రాక్టీస్ యాక్టు 408, 409, 201, 120 (బి) ఐపీసీ, 65 ఆఫ్ ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో చిత్తూరులోని నాలుగో అదనపు ఇన్చార్జ్ మేజిస్ట్రేట్ సులోచనరాణి.. నారాయణకు బెయిల్ మంజూరు చేశారు. దీనిపై పోలీసులు చిత్తూరు జిల్లా కోర్టులో సవాలు చేశారు. ఇదే కేసులో మిగిలిన నిందితులకు జుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించారని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తాజాగా తీర్పును వెలువరించింది. -
న్యాయమే నెగ్గింది
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ‘పిల్’ను న్యాయస్థానం కొట్టివేయడం ద్వారా చివరకు న్యాయమే గెలిచిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం తనను కలసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. గాలి పోగేసి లేని ఆరోపణలు చేస్తూ అవకాశం ఉంది కదా అని న్యాయస్ధానాల వద్దకు ఎంపీ రఘురామ వెళ్లారని చెప్పారు. ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు కాబట్టి తిరస్కరిస్తారని ఆయన కేసు వేసిన రోజే గ్రహించామన్నారు. కేసులు దాఖలు చేసిన వారు కోర్టులపై కూడా అనుమానాలు వ్యక్తం చేసేలా దుస్సాహసానికి పాల్పడుతున్నారన్నారు. ఈ కేసులో వచ్చే తీర్పుపై టీడీపీ అనుకూల చానళ్లలో చర్చలు జరిగాయని, ఓటింగ్ కూడా నిర్వహించారని పేర్కొన్నారు. ప్రజల్లో అపోహలు రేకెత్తించేలా వ్యవహరించారని విమర్శించారు. సీఎం జగన్ సాగిస్తున్న సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి కేసులు వేశారన్నారు. సుప్రీం కోర్ట్ కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దుర్వినియోగం కాకుండా చూడాలని ఇటీవల పలు కేసుల్లో సూచించిందని గుర్తు చేశారు. దీనిపై కోర్టులు ఆలోచన చేస్తాయని ఆశిస్తున్నానన్నారు. మైనారిటీల్లో నిశ్చింత దేశంలో మైనారిటీలు గుండె మీద చేయి వేసుకుని పూర్తి భరోసాగా, భద్రంగా ఉండగలిగే రాష్ట్రం ఒక్క ఏపీ మాత్రమేనని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో షేక్ కులస్ధుల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి షేక్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ ఆశా బేగం అధ్యక్షత వహించారు. మైనారిటీలు విద్య, ఉద్యోగావకాశాలలో వెనకబడి ఉండటాన్ని గమనించి దివంగత వైఎస్సార్ విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించారని ఈ సందర్భంగా సజ్జల తెలిపారు. అదే తరహాలో సీఎం జగన్ మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ పలు సంక్షేమ పథకాలను తెచ్చారని చెప్పారు. మైనారిటీల హృదయాల్లో వైఎస్సార్ చిరస్థాయిగా ఉంటారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వై. వెంకట్రామిరెడ్డి, ఏపీ ఏపీఎండీసీ ఛైర్పర్సన్ షమీమ్ అస్లాం తదితరులు పాల్గొన్నారు. -
సీబీఐ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు
హైదరాబాద్ : బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ వేసిన పిటిషన్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరఫున న్యాయవాదులు శుక్రవారం కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో సీబీఐ చేసిన ఆరోపణలు అవాస్తవమని, రమాకాంత్‌రెడ్డి ఇంటర్వ్యూతో వైఎస్ జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆ పిటిషన్లో తెలిపారు. పత్రికా స్వేచ్ఛకు అనుగుణంగానే రమాకాంత్‌రెడ్డితో ఇంటర్వ్యూ తీసుకున్నట్లు తెలిపారు. ఎక్కడా కూడా ఆస్తులకు సంబంధించిన కేసులను ప్రస్తావించలేదన్నారు. తమ క్లయింట్ కేసును ప్రభావితం చేస్తున్నారంటూ చేసిన వాదనలో వాస్తవం లేదన్నారు. సాక్షిని ప్రభావితం చేశారనేది అవాస్తవమని, గతంలో ఓ వర్గం మీడియా జగన్‌కు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసిందని, దర్యాప్తు తీరును ప్రభావితం చేసేలా విస్తృతంగా ప్రసారం చేసినా దాన్ని ఎప్పుడు కూడా సీబీఐ అడ్డుకోలేదని వైఎస్ జగన్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఆ వర్గం మీడియాకు లీకులు కూడా ఇచ్చిందని, ఆ మీడియాపై ఎప్పుడు కూడా చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూ ఆధారంగా జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరడం సరికాదన్నారు. సీబీఐ వేసిన పిటిషన్‌ను వెంటనే డిస్మిస్ చేయాలని, దురుద్దేశపూరితంగా పిటీషన్ దాఖలు చేశారని వ్యాఖ్యానించారు. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది.