న్యాయమే నెగ్గింది | Sajjala Ramakrishna Reddy Comments On TDP | Sakshi
Sakshi News home page

న్యాయమే నెగ్గింది

Published Thu, Sep 16 2021 4:20 AM | Last Updated on Thu, Sep 16 2021 9:33 AM

Sajjala Ramakrishna Reddy Comments On TDP - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ‘పిల్‌’ను న్యాయస్థానం కొట్టివేయడం ద్వారా చివరకు న్యాయమే గెలిచిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం తనను కలసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. గాలి పోగేసి లేని ఆరోపణలు చేస్తూ అవకాశం ఉంది కదా అని న్యాయస్ధానాల వద్దకు ఎంపీ రఘురామ వెళ్లారని చెప్పారు.

ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు కాబట్టి తిరస్కరిస్తారని ఆయన కేసు వేసిన రోజే గ్రహించామన్నారు. కేసులు దాఖలు చేసిన వారు కోర్టులపై కూడా అనుమానాలు వ్యక్తం చేసేలా దుస్సాహసానికి పాల్పడుతున్నారన్నారు.  ఈ కేసులో వచ్చే తీర్పుపై టీడీపీ అనుకూల చానళ్లలో చర్చలు జరిగాయని, ఓటింగ్‌ కూడా నిర్వహించారని పేర్కొన్నారు. ప్రజల్లో అపోహలు రేకెత్తించేలా వ్యవహరించారని విమర్శించారు. సీఎం జగన్‌ సాగిస్తున్న సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి కేసులు వేశారన్నారు.  సుప్రీం కోర్ట్‌ కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దుర్వినియోగం కాకుండా చూడాలని ఇటీవల పలు కేసుల్లో సూచించిందని గుర్తు చేశారు. దీనిపై కోర్టులు ఆలోచన చేస్తాయని ఆశిస్తున్నానన్నారు. 

మైనారిటీల్లో నిశ్చింత
దేశంలో మైనారిటీలు గుండె మీద చేయి వేసుకుని పూర్తి భరోసాగా, భద్రంగా ఉండగలిగే రాష్ట్రం ఒక్క ఏపీ మాత్రమేనని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో షేక్‌ కులస్ధుల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి షేక్‌ కార్పొరేషన్‌ ఛైర్‌ పర్సన్‌ ఆశా బేగం అధ్యక్షత వహించారు. మైనారిటీలు విద్య, ఉద్యోగావకాశాలలో వెనకబడి ఉండటాన్ని గమనించి దివంగత వైఎస్సార్‌ విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించారని ఈ సందర్భంగా సజ్జల తెలిపారు. అదే తరహాలో సీఎం జగన్‌ మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ పలు సంక్షేమ పథకాలను తెచ్చారని చెప్పారు. మైనారిటీల హృదయాల్లో వైఎస్సార్‌ చిరస్థాయిగా ఉంటారని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా అన్నారు. కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వై. వెంకట్రామిరెడ్డి, ఏపీ ఏపీఎండీసీ ఛైర్‌పర్సన్‌ షమీమ్‌ అస్లాం తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement