సీబీఐ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు
హైదరాబాద్ : బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ వేసిన పిటిషన్‌పై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరఫున న్యాయవాదులు శుక్రవారం కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌లో సీబీఐ చేసిన ఆరోపణలు అవాస్తవమని, రమాకాంత్‌రెడ్డి ఇంటర్వ్యూతో వైఎస్ జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆ పిటిషన్‌లో తెలిపారు. పత్రికా స్వేచ్ఛకు అనుగుణంగానే రమాకాంత్‌రెడ్డితో ఇంటర్వ్యూ తీసుకున్నట్లు తెలిపారు. ఎక్కడా కూడా ఆస్తులకు సంబంధించిన కేసులను ప్రస్తావించలేదన్నారు. తమ క్లయింట్ కేసును ప్రభావితం చేస్తున్నారంటూ చేసిన వాదనలో వాస్తవం లేదన్నారు.
సాక్షిని ప్రభావితం చేశారనేది అవాస్తవమని, గతంలో ఓ వర్గం మీడియా జగన్‌కు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసిందని, దర్యాప్తు తీరును ప్రభావితం చేసేలా విస్తృతంగా ప్రసారం చేసినా దాన్ని ఎప్పుడు కూడా సీబీఐ అడ్డుకోలేదని వైఎస్ జగన్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఆ వర్గం మీడియాకు లీకులు కూడా ఇచ్చిందని, ఆ మీడియాపై ఎప్పుడు కూడా చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూ ఆధారంగా జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరడం సరికాదన్నారు. సీబీఐ వేసిన పిటిషన్‌ను వెంటనే డిస్‌మిస్ చేయాలని, దురుద్దేశపూరితంగా పిటీషన్ దాఖలు చేశారని వ్యాఖ్యానించారు. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది.