కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యచార ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆర్‌జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తలా పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో అభిజిత్ మండల్‌లను మూడు రోజుల(సెప్టెంబర్ 17) వరకు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ ఇద్దరిని ఆదివారం స్థానిక కోర్టులో హాజరుపరిచిన సీబీఐ.. సందీప్ ఘోష్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. వైద్యురాలిపై హత్యాచారం ఘటనను ఆత్మహత్యగా చూపించడానికి ప్రయత్నించాడని పేర్కొంది. ఇది నేరాన్ని తక్కువ చేసి చూపడంతోపాటు సాక్ష్యాలను నాశనం చేయడానికి దారి తీసిందని తెలిపింది.
కాగా ఆర్‌జీ కర్ వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవలకు సంబంధించి ఈనెల 2న సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగాలను ఆ తర్వాత ఆయనపై నమోదు చేసింది. ఈ కేసులో తలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి అభిజిత్ మోండల్‌ను కూడా సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
కోర్టుకు సీబీఐ సమర్పించిన రిమాండ్ రిపోర్టు ప్రకారం.. మహిళా వైద్యురాలిపై హత్యాచారం విషయంపై ఆగస్టు 9న ఉదయం 9.58 గంటలకు సందీప్‌ఘోష్‌కు సమాచారం అందింది. అయితే ఆయన వెంటనే ఆసుపత్రిని సందర్శించలేదు. కనీసం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. అదే విధంగా కేసు విచారణలో సందీప్‌ఘోష్ మోసపూరిత సమాధానాలు ఇస్తున్నారని సీబీఐ పేర్కొంది.
ఆయనకు పాలీగ్రాఫ్ టెస్టు, వాయిస్ అనాలిసిన్ నిర్వహించగా.. కీలకమైన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని సీబీఐ అధికారులు చెబుతున్నారు. ఈ టెస్టుల్లో ఆయన ఇచ్చిన సమాధానాలు మోసపూరితమైనవని ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక ఇచ్చినట్లు తెలిపారు.
బాధితురాలి ఒంటిపై గాయాలు ఉన్నప్పటికీ.. ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడని పేర్కొంది. తమ కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఆసుపత్రి నుంచి వచ్చిన ఫోన్ కాల్ కూడా వచ్చిందని వైద్యుల తల్లిదండ్రులు తెలిపినట్లు చెప్పింది. ఈ ఘటన వెలుగుచూసిన అనంతరం ఘోష్, అభిజిత్ మోండల్‌తోపాటు ఓ లాయర్‌తో టచ్‌లో ఉన్నారని తెలిపింది.
బాధితురాలి తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చినప్పుడు కూడా మాజీ ప్రిన్సిపాల్ వారిని కలవలేదని, ఘటన అనంతరం వైద్యపరమైన విధివిధానాలను సకాలంలో పూర్తి చేయడంలో డాక్టర్ ఘోష్ విఫలమయ్యారని తెలిపింది. వెంటనే మృతదేహాన్ని మార్చురీకి పంపాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించినట్లు సీబీఐ కోర్టుకు పేర్కొంది. అంతేకాక ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో మండల్‌కు సందీప్ సూచనలు చేసినట్లు కోర్టులో సీబీఐ తెలిపింది. ఘోష్, మండల్‌లు కలిసి నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment