ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర దశ, దిశలను మార్చవచ్చని సీఎం వైఎస్ జగన్ నిరూపించారు. సముద్ర తీరం ఉండాలే కానీ సంపద సృష్టించడం కష్టం కాదనే దిశగా అడుగులు ముందుకు వేశారు. కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో లాజిస్టిక్స్, ఎగుమతులు, దిగుమతుల ద్వారా అద్భుతాలు సృష్టించడానికి మార్గం సుగమం చేస్తున్నారు.
ఒక్కో పోర్టు, ఒక్కో ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి రావడం ద్వారా తీర ప్రాంత అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు వెల్లువెత్తడం ఖాయం. మన రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నప్పటికీ, దానిని సరైన రీతిలో ఉపయోగించుకోవచ్చన్న ఆలోచనే చంద్రబాబు ప్రభుత్వానికి రాలేదు.
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.20,000 కోట్లతో కోస్తా తీరాన్ని అభివృద్ధి చేస్తోంది. ఒకేసారి నాలుగు గ్రీన్ ఫీల్డ్ పోర్టులతో పాటు 10 మినీ పోర్టుల తరహాలో ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించనుంది. రాష్ట్రంలోని 974 కి.మీ సుదీర్ఘ తీర ప్రాంతంలో ప్రతి 50 కి.మీ.కు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఉండేలా ఏపీ మారిటైమ్ బోర్డు అడుగులు ముందుకు వేస్తోంది. ప్రస్తుతం విశాఖలో మేజర్ పోర్టుతో పాటు మరో ఐదు నాన్ మేజర్ పోర్టులు గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ డీప్‌వాటర్, కాకినాడ యాంకరేజ్, రవ్వ కాపిటివ్‌పోర్టులున్నాయి.
ఇవి కాకుండా ఇంకో నాలుగు పోర్టులను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను రాష్ట్ర ల్యాండ్ లార్డ్ మోడల్‌లో అభివృద్ధి చేస్తుండగా, కాకినాడ గేట్‌వే పోర్టును పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. రూ.91.18 కోట్లతో చేపట్టిన కాకినాడ యాంకరేజ్ పోర్టు ఆధునికీకరణ పనులు పూర్తి కానుండటంతో పోర్టు సామర్థ్యం పెరగనుంది. రామాయపట్నంలో బల్క్ బెర్త్ పనులు దాదాపు పూర్తి కావడంతో ఈనెలాఖరు లేదా ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు మారిటైమ్ బోర్డు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
ఈ ఏడాది చివరి నాటికి కాకినాడ గేట్‌వే పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 2025 నాటికి రాష్ట్రంలో మొత్తం పది పోర్టులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ప్రస్తుతం 150 మిలియన్ టన్నులుగా ఉన్న రాష్ట్ర ఎగుమతులు 300 మిలియన్ టన్నులకు చేరుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు లక్షలాది మందికి ఉపాధి లభించడంతో పాటు వ్యాట్, జీఎస్‌టీ రూపంలో రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూరనుంది.
త్వరలోనే తొలి నౌక ఆగమనం
మొదలు పెట్టిన 18 నెలల్లోనే రామాయపట్నం పోర్టు వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమయ్యిందంటే పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సుమారు 850 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,902 కోట్ల పెట్టుబడి అంచనాతో అభివృద్ధి చేస్తున్న రామాయపట్నం పోర్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2022 జూన్‌లో భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు.
తొలి దశలో 34.04 ఎంఎంటీపీఏ (మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ ఆనమ్) సామర్థ్యంతో నాలుగు బెర్తులు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీ పర్పస్) అభివృద్ధి చేయనుండగా, అందులో ఇప్పటికే బల్క్ బెర్త్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ బిల్డింగ్‌ల నిర్మాణ పనులు కూడా పూర్తి కావడంతో త్వరలో తొలి నౌకను తీసుకొచ్చి లంగరు వేయడం ద్వారా వాణిజ్య పరంగా పోర్టును ప్రారంభించడానికి ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళికలను సిద్ధం చేసింది. వచ్చే ఆరు నెలల్లో మిగిలిన మూడు బెర్తులను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
23 ఎకరాల్లో పునరావాస గ్రామ నిర్మాణం
రామాయపట్నం పోర్టుకు సమీపంలోని తెంటు గ్రామం వద్ద 23 ఎకరాల్లో పునరావాస గ్రామాన్ని అభివృద్ధి చేసింది. పోర్టు కోసం భూమిని ఇచ్చిన ప్రతి కుటుంబానికి 5 సెంట్ల భూమి చొప్పున 675 మందికి పునరావాసం కల్పించారు. పునరావాస ప్యాకేజీ కింద ప్రభుత్వం సుమారు రూ.160 కోట్లు వ్యయం చేసింది. ఈ గ్రామంలో రహదారులు, విద్యుత్, తాగునీరు, మురుగు నీటి సరఫరా వంటి మౌలిక సౌకర్యాలను కల్పించారు. దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, పాఠశాల, వైద్యశాల, కమ్యూనిటీ భవనాలు వంటి అన్ని సదుపాయాలను ప్రభుత్వమే కల్పించింది. పునరావాస గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.20 కోట్ల వరకు వ్యయం చేసింది.
ఇప్పటి వరకు పనులు ఇలా..
♦ పోర్టు నిర్మాణంలో కీలకమైన బ్రేక్ వాటర్ నిర్మాణం కోసం ఏకంగా ఇప్పటి వరకు 59 లక్షల టన్నుల రాళ్ల వినియోగం.
♦ భారీ ఓడలను సురక్షితంగాతీరానికి తీసుకు వచ్చేలా 7.87 మిలియన్ క్యూబిక్ మీటర్లడ్రెడ్జింగ్, టర్నింగ్ సర్కిల్స్, అప్రోచ్ చానల్ నిర్మాణం.
♦ అప్రోచ్ టెస్టిల్, బల్క్ బెర్త్, కస్టమ్స్ బిల్డింగ్, సెక్యూరిటీ కమ్ రిసెప్షన్ బిల్డింగ్ నిర్మాణం పూర్తి.
♦ శరవేగంగా వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు.. పోర్టును జాతీయ రహదారి ఎన్‌హెచ్ 16కు అనుసంధానం చేస్తూ రహదారి పనులు వేగవంతం.
♦ సముద్రంలో చేయాల్సిన పనులు దాదాపు పూర్తి. తీరంలో నిర్మించే భవనాలు, ఇతర నిర్మాణాలు 45 శాతం వరకు పూర్తి.
స్వరూపం ఇదీ..
ప్రాజెక్టు వ్యయం : రూ.4,902 కోట్లు
తొలి దశలో పోర్టు సామర్థ్యం: 34.04ఎంఎంటీపీఏ
పూర్తి స్థాయి సామర్థ్యం: 138.54 ఎంఎంటీపీఏ
తొలి దశలో బెర్తులు: 4 (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీ పర్పస్)
తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం : 80,000 డీడబ్ల్యూటీ (డెడ్ వెయిట్ టన్నేజ్)
పనులు ప్రారంభించినది : 2022 జూన్ 24
కార్యకలాపాలు ప్రారంభం : 2024 జనవరి
ప్రారంభించేందుకు చర్యలు
సుదీర్ఘ తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా హార్బర్ ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకు అనుగుణంగా కొత్తగా నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే రామాయపట్నం పోర్టులో ఒక బెర్తు పనులు పూర్తి కావడంతో త్వరలో వాణిజ్య పరంగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. – ప్రవీణ్ కుమార్, సీఈవో ఏపీమారిటైమ్ బోర్డు, వీసీఎండీ ఏపీఐఐసీ
రికార్డు సమయంలో ..
నిర్మాణ పనులు ప్రారంభమైన 18 నెలల రికార్డు సమయంలోనే రామాయపట్నం పోర్టును రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. బల్క్ బెర్త్ నిర్మాణం, డ్రెడ్జింగ్, బ్రేక్‌వాటర్ పనులు పూర్తి కావడంతో ఓడలను తీసుకురావడానికి అనుమతి కోసం కేంద్ర కస్టమ్స్, ఎక్సైజ్ శాఖకు లేఖ రాశాం. కేంద్రం నుంచి అనుమతి రాగానే రామాయపట్నం పోర్టులో వాణిజ్య కార్యక్రమాలను ప్రారంభింస్తాం. – పి. ప్రతాప్, ఎండీ రామాయపట్నం పోర్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
మా ప్రాంతం మారుతోంది..
దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న రామాయపట్నం పోర్టు నిర్మాణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో వేగంగా సాగుతోంది. ఎన్నో సంవత్సరాలుగా కలగా ఉన్న పోర్టు నిర్మాణం మా కళ్ల ముందటే పూర్తవుతుంటే సంతోషంగా ఉంది. పోర్టు నిర్మాణంతో మా ప్రాంతం వేగంగా అభివృద్ధి అవుతుంది. ఇప్పటికే భూముల వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పోర్టు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నాం. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. – రాయిని రామకృష్ణ, చేవూరు గ్రామం
సొంత ఊళ్లోనే ఉద్యోగం
మా ప్రాంతంలో పోర్టు నిర్మాణం వల్ల యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. నేను ఉళ్లోనే ఉండి ప్రస్తుతం రామాయపట్నం పోర్టులో సూపర్‌వైజర్‌గా ఉద్యోగం చేస్తున్నా. నాలాంటి వందల మంది యువకులు స్థానికంగానే ఉద్యోగం చేస్తున్నారు. దీని వల్ల ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు పోయే ఇబ్బందులు తప్పాయి. అనుకున్న సమయం కంటే పోర్టు నిర్మాణం వేగంగా జరుగుతోంది. పోర్టులో కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. తద్వారా వేల మందికి ఉపాధి అవకాశాలు స్థానికంగానే దొరుకుతాయి. – అట్ల సురేష్, రావూరు గ్రామం
Comments
Please login to add a commentAdd a comment