ఉదయగిరి దుర్గం
రాష్ట్రంలోని ప్రముఖ చారిత్రక స్థలాల్లో ఉదయగిరి కోట ఒకటి. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఉదయగిరి రాజరిక పాలనకు అక్కడ ఉన్న ప్రాకారాలే నిదర్శనం. ఆనాటి కళా నైపుణ్యానికి ఇప్పటికీ కనిపించే ఆలయాలు, కోటలు, ప్రార్థనా మందిరాలే నిదర్శనం. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలతో సాగిన ఆనాటి రాజరిక పాలనకు ఉదయగిరి దుర్గం శిథిల సాక్ష్యం.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎత్తైన ప్రాకారాలు, బురుజులు, రాచరికత ఉట్టిపడే రాజ ప్రాసాదాలు ఒకప్పుడు శత్రు దుర్భేద్యమైన ఉదయగిరి కోట సొంతం. నేడు అదొక శిథిల సౌందర్యం. వెయ్యేళ్ల నాటి పాలనా వ్యవస్థకు మిగిలిన శిథిల సాక్ష్యం. పల్లవ, చోళ, గజపతులు, మహమ్మదీయ రాజుల వాస్తు శిల్ప రీతులతో నిర్మితమైన ప్రార్థనా మందిరాలు, విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలతో కూడిన విశేష చరిత్ర ఉదయగిరిది. అలరించే సెలయేర్లు, నీటి బుగ్గలు విభిన్న జాతుల వృక్షాలు, వందలాది అరుదైన వనమూలికలు ఉదయగిరి కొండపై ఉన్నాయి. పదకొండో శతాబ్దంలో పల్లవులు ఉదయగిరిని రాజధానిగా చేసుకుని పాలించారు. ఆ సమయంలోనే శత్రు దుర్భేద్యమైన దుర్గానికి పునాదులు వేశారు.
సముద్ర మట్టానికి 3,079 అడుగుల ఎత్తున విశాల భూభాగంలో దీన్ని నిర్మించారు. కోట ముఖద్వారాన్ని గుర్రపు నాడా ఆకారంలో రెండు పెద్ద రాతి శిలల మధ్యన నిర్మించడం ఆనాటి కళా నైపుణ్యానికి నిదర్శనం. దుర్గం శిఖరాగ్ర భాగం 8 కోటలతో వందలాది బురుజులతో నిర్మితమైంది. పెద్దఎత్తున ప్రాకారాలు, గుర్రపుశాలలు, చూడచక్కగా రూపుదిద్దుకున్న రాజ ప్రసాదాలు, రాణి మహళ్లు ఈ దుర్గానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఉదయగిరి కొండపై ఉన్న మసీదులు నవాబుల నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. ప్రకృతి అందాల నడుమ ఉన్న ఉదయగిరి దుర్గం ప్రాచీన కట్టడాలు శిథిలమవుతూ కాలగర్భంలో కలిసి పోతుండడమే బాధ కలిగించే అంశం.
ఎందరో రాజులు.. ఎన్నెన్నో యుద్ధాలు..
ఉదయగిరి దుర్గం పదో శతాబ్దానికి పూర్వం బోయవిహారంగా ఉండేది. క్రీస్తు శకం 930లో తూర్పుచాళుక్య చక్రవర్తి విజయాదిత్యుని సేనాని పండ్రంగుడు బోయ విహారాలను కూల్చి శాంతి నెలకొల్పినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 1160లో పల్లవరాజు నందివర్మ అమ్మరాజు ఉదయగిరిని పాలిస్తుండగా వెలనాటి చోడరాజు దండెత్తి వచ్చి ఓడించారని చెబుతారు. 1235లో ఉదయగిరి కాకతీయ సామ్రాజ్యంలో చేరి గణపతిదేవుడు చక్రవర్తి ఈ ప్రాంతాన్ని ఏలారు. తరువాత విజయనగర రాజులు దుర్గాన్ని స్వాధీన పరుచుకున్నారు. 1513లో విజయనగరరాజు శ్రీకృష్ణదేవరాయులు ఉదయగిరిపై దండెత్తి 18 నెలల పాటు అవిశ్రాంతంగా పోరాడి 1514 జూన్ 9న కోటను వశపరుచుకున్నారని చరిత్రకారులు చెబుతారు. 1574లో కొండ్రాజు వెంకటరాజు, 1586లో పెనుకొండ వెంకటపతి చక్రవర్తుల ప్రతినిధి మీర్‌జుమ్లా ఈ దుర్గాన్ని వశపరుచుకున్నాడు. ఆ తరువాత ఢిల్లీ సుల్తానుల వశమైంది. ఆంగ్లేయుల ప్రాబల్యం పెరిగి 1836లో ఈ దుర్గం తెల్లదొరల హస్తగతమైంది.
పర్యాటకంగా అభివృద్ధి చేయాలి
వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఉదయగిరి దుర్గాన్ని పర్యాటక ప్రదేశంగా గుర్తించాలని స్థానికులు నాలుగు దశాబ్దాలుగా కోరుకుంటున్నా ఫలితం దక్కలేదు. జిల్లాలో చెప్పుకోదగ్గ చారిత్రక నేపథ్యం ఉన్న ప్రదేశం ఉదయగిరి దుర్గం ఒక్కటే. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే ఉన్న వనరులను వినియోగించుకోవాలి. పురాతన కట్టడాలను పరిరక్షించి రోడ్లు, షెల్టర్లు తదితర కనీస వసతులు కల్పించి పర్యాటకులను ఆకర్షించగలిగితే ఉదయగిరి అభివృద్ధికి అడుగులు పడతాయి.
– ఎస్‌కే మహమ్మద్‌ఖాజా, విశ్రాంత ఉపాధ్యాయుడు, ఉదయగిరి
చారిత్రక గిరిని కాపాడుకోవాలి
చారిత్రక ఉదయగిరి దుర్గాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఉదయగిరి కోట శిథిలావస్థకు చేరుకుంది. దుర్గంపై ఉన్న ఆనాటి రాజరిక పాలనకు సజీవ సాక్ష్యాలైన కట్టడాలను కాపాడుకోవాలి. వెంకయ్యనాయుడు దుర్గాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని ఎంతో కృషి చేశారు. ఉదయగిరికి వచ్చిన ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డికి వినతిపత్రం ఇవ్వగా పార్లమెంటులోనూ ప్రస్తావించారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదయగిరి దుర్గాన్ని పర్యాటక కేంద్రంగా చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
– ఆవుల రోశయ్య యాదవ్, బీజేపీ నాయకుడు, ఉదయగిరి
Comments
Please login to add a commentAdd a comment