
చేసింది కొంత.. ప్రచారం కొండంత
నెల్లూరు(బారకాసు): స్థానిక సంస్థలకు పన్నుల రూపంలో వచ్చే రాబడి ఎంతో కీలకం. ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రూపాల్లో నిధులు మంజూరు చేస్తున్నా.. స్థానికంగా ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ఖజానాను నింపుకోవడం కీలకం. అలా ఆదాయాన్ని సమకూర్చుకున్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 2023 – 24 సంవత్సరంలో ఆస్తి, ఖాళీ స్థలాలకు సంబంధించి పన్నుల డిమాండ్ రూ.130 కోట్లు ఉండగా వసూలు చేసింది రూ.66.37 కోట్లు. ఆనాడు సాధించిన లక్ష్యం 51 శాతం. అప్పట్లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మెజార్టీ శాతం సిబ్బంది ఆ విధుల్లో ఉన్నారు. ఓ వైపు ఎన్నికల విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు పన్నుల వసూళ్లను మెరుగ్గా చేశారు. 2024 – 25కు వచ్చేసరికి డిమాండ్ రూ.150 కోట్లకు చేరింది. అంటే గతాని కంటే రూ.20 కోట్లు పెరిగింది. కానీ ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసింది రూ.71.38 కోట్లు మాత్రమే. సాధించిన లక్ష్యం 47 శాతం. గతంతో పోల్చుకుంటే నాలుగు శాతం తక్కువగానే వసూలు చేయగా కార్పొరేషన్ అధికారులు మాత్రం భేష్ అంటూ గొప్పగా ప్రచారం చేసుకోవడం విశేషం.
నాడు వంద శాతం రాయితీ
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రజలపై భారం పడకూడదని ఆస్తి, ఖాళీ స్థలాల పన్నుల్లో వంద శాతం వడ్డీ రాయితీ ఇవ్వడం జరిగింది. దీంతో ప్రజలు కూడా సహకరించి పన్నులను చెల్లించడంతో నగరపాలక సంస్థకు రాబడి పెరిగింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 50 శాతం మాత్రమే వడ్డీ రాయితీ ఇచ్చింది. 2024 – 25 ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత పన్నుల వసూళ్లలో రెవెన్యూ విభాగం కృషి అభినందనీయమంటూ అధికారులు కొనియాడారు. వంద శాతం సాధించేసినట్లుగా గొప్పలు చెప్పుకొంటున్నారు. వసూళ్ల శాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఉన్నతాధికారుల నుంచి చీవాట్లు వస్తాయనే భయంతో భేష్ అంటూ ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రచారం ఎవరి మెప్పుకోసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంది. పన్నుల వసూలు అనుకున్న స్థాయిలో చేయలేకపోవడంతో ఎక్కడ తమ అసమర్థత బయట పడుతుందననే భయంతో పురపాలక శాఖ మంత్రి వెనుక ఉండి అధికారులచే ఇలా గొప్పలు ప్రచారం చేయించి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.
పన్ను వసూళ్ల విషయంలో నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు గొప్పలు చెప్పుకొంటున్నారు. గతంతో పోల్చుకుంటే సాధించిన లక్ష్యం తక్కువైనా వంద శాతం చేసినంతగా ప్రచారం చేసుకుంటున్నారు. సాక్షాత్తు పురపాలక శాఖ మంత్రి నియోజకవర్గంలో నెలకొన్న ఈ పరిస్థితి చర్చనీయాంశంగా మారింది.
పన్ను వసూళ్లలో భేష్ అట
సాధించింది 47 శాతమే..
కానీ వంద శాతం చేసినట్లుగా గొప్పలు
పురపాలక శాఖ మంత్రి నియోజకవర్గంలో ఇదీ చోద్యం