nellore coast
-
నెల్లూరు జాతి ఆవు @ రూ. 35 కోట్లు!
ఎక్కడైనా మేలు జాతి ఆవు ధర ఎంత ఉంటుంది? మహా అయితే రూ. లక్షల్లో ఉంటుందంటారా.. అయితే మీరు తప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే బ్రెజిల్లో ఇటీవల జరిగిన వేలంలో నెల్లూరు జాతికి (ఏపీలోని నెల్లూరు జిల్లా నుంచి దశాబ్దాల కిందట కొన్ని ఆవులను బ్రెజిల్ తీసుకెళ్లి జన్యు లక్షణాలను మరింత అభివృద్ధి చేసుకున్న ఆవులు) చెందిన తెల్ల ఆవు కనీవినీ ఎరుగని అత్యధిక ధర పలికింది. తద్వారా ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఆవుగా నిలిచింది. వియాటినా–19 ఎఫ్4 మారా ఇమ్విస్ అనే నాలుగున్నరేళ్ల ఆవు మూడో వంతు యాజమాన్య హక్కు ఏకంగా రూ. 11.82 కోట్లకు అమ్ముడుపోయింది!! గతేడాది ఈ ఆవు సగం యాజమాన్య హక్కు రూ. 6.5 కోట్లు పలకడం అప్పట్లోనే రికార్డు సృష్టించగా ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. మొత్తంమీద ఈ ఆవు విలువ రూ. 35.30 కోట్లు పలికింది. అత్యంత నాణ్యౖమెన జన్యులక్షణాలు గల బ్రెజిల్‌లోని నెల్లూరు జాతి ఆవును రికార్డు ధరకు సొంతం చేసుకొనేందుకు డెయిరీ వ్యాపారులు పోటీపడటం దీని అసలుసిసలు విలువను చాటిచెబుతోంది. బ్రెజిల్‌లోని ముఖ్యమైన ఆవు జాతుల్లో నెల్లూరు జాతి ఆవులు కూడా ఒకటి. వీటిని ఎక్కువగా మాంసం కోసం పెంచుతారు. వీటి మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల చాలా దేశాల్లో ఈ ఆవుల మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం బ్రెజిల్లో 16.70 కోట్ల నెల్లూరు జాతి ఆవులు ఉన్నాయి. బ్రెజిల్లో ఉన్న మొత్తం ఆవుల సంఖ్యలో ఇవి 80 శాతం కావడం విశేషం. ఈ జాతికి చెందిన శ్రేష్టమైన ఎద్దుల వీర్యం సైతం అర మిల్లీలీటర్‌కు రూ. 4 లక్షలు పలుకుతోంది. నెల్లూరు జాతి ఆవుల ప్రత్యేకతలు ఇవీ... ♦ ఈ ఆవులు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొనేలా చిక్కటి తెలుపు రంగులో ఉంటాయి. ♦ దళసరి చర్మంతో ఉండటం వల్ల రక్తం పీల్చే కీటకాలు వాటిని దరిచేరవు. ♦ ఓక్లహామా స్టేట్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం వాటి స్వేద గ్రంథులు యూరోపియన్ జాతి ఆవులతో పోలిస్తే రెండు రెట్లు పెద్దగా ఉండటంతోపాటు గ్రంథుల సంఖ్య సైతం 30 శాతం ఎక్కువగా ఉంటుంది. ♦ రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో ఇన్ఫెక్షన్లను సమర్థంగా తట్టుకోగలవు. ♦ సమర్థమైన జీవక్రియ కారణంగా నాసిరకం గడ్డి జాతుల రకాలను సైతం తిని అరిగించుకోగలవు. ♦ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఈనగలగడం, సరై న యాజమాన్య పద్ధతులు పాటించనప్పటికీ దూ డలు సులువుగా పెరగగలగడం మరో ప్రత్యేకత. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
హ్యాట్సాఫ్ సార్!... హీరోలా రక్షించారు!
నెల్లూరు: చాలా మంది పోలీసులు, రెస్య్కూ సిబ్బంది వరదల్లో చిక్కుకుపోయిన వాళ్లను రక్షించేందుకు వాళ్లు చూపించే తెగువ, ధైర్య సాహసాలను చూస్తే ఎవరికైన వారికి రెండు చేతులు ఎత్తి నమస్కరించకుండా ఉండలేరు. పైగా వాళ్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కాపాడతారు. అచ్చం అలానే ఇక్కడొక ట్రాఫిక్ పోలీసు వరద నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడాడు. (చదవండి: జనరల్నాలెడ్జ్ ఉంటే చాలు... ఈ ఆటోలో ఫ్రీగా వెళ్లిపోగలం!!) అసలువిషయంలోకెళ్లితే.. నెల్లూరు జిల్లా కొడవలూరు శివాలయానికి చెందిన పూజారి వెంకటేశ్వరపురం వంతెన పై బైక్‌పై వెళ్తుండగా వరద నీటిలో కొట్టుకుపోయాడు.అదృష్టవశాత్తూ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాయక్ సంఘటనా స్థలానికి సమీపంలోనే ఉన్నాడు. అయితే ఆ పూజారి సహాయం కోసం అతని కేకలు పెట్టడం విన్నాడు. అంతే ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా నాయక్ వరదనీటిలో ధైర్యంగా వెళ్లి ఆ పూజరిని తాడు పట్టుకోమంటూ ధైర్యం చెబుతాడు. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన వీడియోను ఆంధ్ర పోలీసులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు నెటిజన్లు "మీ నిస్వార్థ మానవత్వానికి సెల్యూట్... అలాగే కొనసాగించండి సార్" అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: సైబర్ మోసాలకు చెక్ పెట్టే మొబైల్ యాప్! ఇక సైబర్ కేటుగాళ్ల ఆటకట్టు..) -
అయ్యో! వారి బతుకులు కరిగిపోతున్నాయ్
ఉప్పు నీటిని ఆరుగాలం శ్రమించి ఉప్పుగా మార్చే రైతుల బతుకు తిరిగి కరిగి నీరైపోతోంది. కరోనా విపత్తు ఉప్పు రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. ఎగుమతులు లేక.. ధర పతనం కావడంతో మార్కెట్ లేక ఉప్పు నిల్వలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఉప్పు నిల్వలు తడిసి కరిగిపోతున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నేరుగా సముద్ర నీటితో యంత్రాల ద్వారా అయోడైజ్డ్ ఉప్పు తయారీ జరుగుతోంది. జిల్లాలో ఉప్పు ఆధారిత పరిశ్రమలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతులపై ఆధారపడుతున్న పరిస్థితి నెలకొనడంతో ఈ పరిణామాలు దాపురించాయి. విడవలూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) : ఉప్పు సత్యాగ్రహానికి నాంది పలికి బ్రిటిష్ వారినే గడగడలాడించిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉప్పు రైతుల బతుకులు నానాటికి కరిగిపోతున్నాయి. జిల్లాలో విడవలూరు, అల్లూరు, ముత్తుకూరు తీర ప్రాంత గ్రామాలు ఉప్పు ఉత్పత్తికి అనుకూలమైన ప్రాంతాలు. వ్యవసాయాధారిత ప్రాంతాలైన ఈ మూడు తీర ప్రాంత మండలాల్లో ఉప్పు ఉత్పత్తిది రెండవ స్థానంగా నిలుస్తోంది. గతంలో సుమారుగా పాతిక వేల ఎకరాల్లో ఉప్పు సాగు జరుగుతుండేది. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ఉప్పు తయారీకి యంత్రాలు రావడంతో సముద్ర నీటితో నేరుగా ఉప్పుగా మార్చే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. దీంతో సంప్రదాయ ఉప్పు కొనుగోళ్లు తగ్గాయి. కాలక్రమేణ ఉప్పు సాగు గణనీయంగా తగ్గిపోయింది. విడవలూరు మండలంలోని రామతీర్థం, అల్లూరు మండలంలోని ఇస్కపల్లి, గోగులపల్లి, ముత్తుకూరు మండలాల్లో సుమారు 4000 ఎకరాల్లో సొసైటీల ద్వారా ఉప్పు ఉత్పత్తి చేపడుతున్నారు. అయితే గతేడాది నుంచి కరోనా విపత్తు కారణంగా ఎగుమతులు లేకపోవడంతో నిల్వలు పేరుకుపోయాయి. ఈ ఏడాది 3200 ఎకరాల్లోనే ఉప్పును ఉత్పత్తి చేశారు. క్వింటా రూ.220 గతేడాది కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఉప్పు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. అన్‌లాక్ అనంతరం ఉప్పు ధర గరిష్ట స్థాయిలో క్వింటా రూ.350 వరకు పలికింది. ఉప్పును నిల్వ ఉంచిన రైతులు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాలోని ఈ మూడు ప్రాంతాల నుంచి ఉప్పును కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. అన్‌లాక్ తర్వాత మళ్లీ ఉప్పు ఆధారిత పరిశ్రమలు ప్రారంభమైన సంతోషం అంతలోనే ఆవిరైంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడడంతో పాటు వాహనాలకు కూడా సరిగా అనుమతులు లేకపోవడంతో ఉప్పు ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఉప్పు నిల్వలు మళ్లీ పేరుకుపోతున్నాయి. జిల్లాలో ఉప్పు ఆధారిత పరిశ్రమలు లేకనే... జిల్లాలో ఉప్పు ఉత్పత్తి జరుగుతున్నా.. ఉప్పు ఆధారిత పరిశ్రమలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అల్లూరులో ఒక పరిశ్రమ ఏర్పాటైనా పదేళ్ల క్రితమే అది మూతపడింది. ప్రధానంగా అయోడైజ్డ్ ఉప్పు వినియోగం పెరగడంతో సంప్రదాయ ఉప్పు వినియోగం లేకుండా పోయింది. ఉప్పు ఆధారిత పరిశ్రమలకు గత ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇవ్వకపోవడంతో ఏర్పాటు కాలేకపోయాయి. కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి రెండేళ్ల నుంచి కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. ఉప్పు ఉత్పత్తి కేవలం సంవత్సరంలో 5 నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ప్రత్యామ్నాయ పనులకు వెళ్లాల్సిందే. ఈ 5 నెలల్లో ఉత్పత్తి చేసిన ఉప్పు సరిగా ఎగుమతులు లేకపోవడంతో పాటు మంచి ధర కోసం నిల్వ ఉంచితే వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా దెబ్బతింటున్నాం. – ఆటా లక్ష్మయ్య పెట్టుబడులు వస్తే చాలు ఉప్పు ఉత్పత్తి చేసేందుకు ఎకరాకు రూ.12 వేల వరకు ఖర్చు అవుతుంది. వర్షాలు, వాతావరణంలో ప్రతికూల పరిస్థితులతో పాటు కరోనా కూడా జత కట్టడంతో మా పరిస్థితి దయనీయంగా మారింది. ఎగుమతులు నిలిచిపోవడంతో ఉప్పును కొనేవారు కరువయ్యారు. ఈ కారణంగా పెట్టిన పెట్టుబడులు వస్తే చాలు అనుకుంటున్నాం. – పుచ్చలపల్లి వినోద్ ఉన్న ధరకే విక్రయిస్తున్నాం కరోనా కారణంగా గతేడాది పూర్తిగా ఉప్పు ఉత్పత్తులు నిలిచిపోయాయి. అన్‌లాక్ సమయంలో ఉప్పునకు మంచి ధర లభించింది. దీంతో నిల్వ ఉంచిన ఉప్పును విక్రయించాం. ప్రస్తుతం కరోనా కొనసాగుతున్న కారణంగా పలు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు అమలవుతున్నాయి. దీంతో ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. – ఓరుంపాటి ప్రసాద్ చదవండి: -
తీరంలో డీశాలినేషన్ ప్లాంట్
సాక్షి, నెల్లూరు : జిల్లాలో నీటి ఇబ్బందుల శాశ్వత పరిష్కారం కోసం తీరంలో డీశాలినేషన్ (లవణ నిర్మూలన) ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విన్నవించారు. చెన్నై నగరం సమీపంలో ఉన్న డీశాలినేషన్ ప్లాంట్‌ను ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వివరించారు. సోమవారం మొదటి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన అమరావతిలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. ఈ క్రమంలో సదస్సుకు రాష్ట్ర మంత్రివర్గంతోపాటు ప్రభుత్వ సలహాదారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రధాన సమస్యలపై కలెక్టర్ సమగ్ర నివేదిక సిద్ధం చేసుకొని సమావేశానికి హాజరయ్యారు. తాగునీటి ఇబ్బందులు, శాఖాపరంగా తీసుకుంటున్న చర్యలు, అలాగే నూతన ప్రాజెక్ట్ అయిన డీశాలినేషన్ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు, పశువుల దాణాకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై కలెక్టర్ల సమావేశంలో ప్రస్తావించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు అందజేశారు. తీవ్రమవుతున్న తాగునీటి సమస్య జిల్లాలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, ముఖ్యంగా ఈ వేసవిలో వందలాది గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు అధికంగా ఉండడంతో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నామని, రోజులు గడిచే కొద్దీ తాగునీటి సమస్య ఉన్న గ్రామాల సంఖ్య పెరుగుతోందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో 940 గ్రామాలు ఉండగా వాటిలో 339 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి అధికంగా ఉందని, దీనికోసం ట్యాంకర్ల ద్వారా ఆయా గ్రామాల్లో నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. డెల్టా, మెట్ట ప్రాంతాలతో సంబంధం లేకుండా గడిచిన నాలుగేళ్లుగా వర్షాభావంతో జిల్లాలో ఇబ్బందులు పెరిగాయని వివరించారు. గత నెలలో తాగునీటి సరఫరాకు సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ అధికారుల ప్రతిపాదనల మేరకు రూ.6 కోట్ల బిల్లులు మంజూరు చేశారని, ప్రస్తుత పరిస్థితుల్లో మరో రూ.10 కోట్ల వరకు తాగునీటి సరఫరాకు కేటాయించాలని కలెక్టర్ ముఖ్యమంత్రికి విన్నవించారు. దీనిపై స్పందించిన సీఎం సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే చెన్నై నగరం సమీపంలోని మింజూరులో డీశాలినేషన్ ప్లాంట్లను సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారని, నెల్లూరు జిల్లాలో 168 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉందని, తీరం వెంబడి 12 మండలాలు ఉన్నాయని, జిల్లాలో అనువైన ప్రాంతంలో డీశాలినేషన్ ప్లాంటు ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వివరించారు. అలాగే జిల్లాలో పశువుల దాణా కొరత అధికంగా ఉందని, దీనిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. మంగళవారం కూడా కాన్ఫరెన్స్ కొనసాగనుంది. మంగళవారం కలెక్టర్‌తోపాటు ఎస్పీ కూడా సమావేశంలో పాల్గొననున్నారు. -
తప్పిన పెథాయ్ ముప్పు
నెల్లూరు(పొగతోట): పెథాయ్ తుపాను ముప్పు నుంచి జిల్లా తప్పించుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి, శుక్రవారం రాత్రి దిశమార్చుకుంది. శనివారం రాత్రి తుపానుగా మారి తూర్పుగోదావరి వైపు అతి వేగంగా పయనిస్తోంది. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలో తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తొలుత అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారి నెల్లూరు–చెన్నైల మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు భావించారు. తుపాను ప్రభావం జిల్లాపై అధికంగా ఉంటుందని, తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రత్యేకాధికారులను నియమించారు. అయితే పెథాయ్ తన దిశను మార్చుకుంటూ మచిలీపట్నం వైపు నుంచి కాకినాడ వైపు కదిలిపోయింది. దీంతో జిల్లాకు ముప్పు తప్పిందని అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. అయితే తుపాను ప్రభావంతో జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. గత నెలలో ఏర్పడిన గజ తుపాను కూడా నెల్లూరు ప్రాంతంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు భావించారు. గజ తన దిశను మార్చుకుని తమిళనాడులో తీరం దాటింది. వాతావరణంలో పెనుమార్పులు పెథాయ్ తుపాన్ తీరం వైపు దూసుకున్న నేపథ్యంలో జిల్లాలో వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. విపరీతంగా చలిగాలు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోంగా మారింది. తుపాను ప్రభావంగా తీర ప్రాంతాల మండలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు జిల్లా యంత్రాంగాన్ని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతంలోని 13 మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. ప్రతి హ్యాబిటేషన్‌కు వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శులను నియమించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లతో అధికారులు సిద్ధంగా ఉన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులను జిల్లా అధికారులు వెనక్కి రప్పించారు. ఎటువంటి విపత్తు సంభవించినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలతో సిద్ధంగా ఉంది. అల్లకల్లోలంగా తీరం పెథాయ్ ప్రభావంతో జిల్లాలోని సముద్రం తీరప్రాంతం అల్లకల్లోలంగా మారింది. పలుచోట్ల సముద్రం 50 నుంచి 60 మీటర్లు ముందుకొచ్చింది. గాలులు తీవ్రంగా ఉన్నాయి. తోటపల్లిగూడూరు మండలంలోని కోడూరు, వెంకన్నపాళెం సముద్రతీరాల్లో శనివారం సాయంత్రానికి అలల తాకిడి అధికమై అల్లకల్లోలంగా మారిపోయింది. సముద్రపు నీరు దాదాపు 50 నుంచి 60 అడుగుల మేర ముందుకు చొచ్చుకుని రావడంతో తీరం కోతకు గురవుతోంది. ఉవ్వెత్తిన ఎగిసి పడుతున్న అలలతో తీర ప్రాంత వాసుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. మత్స్యకారులు వేటకు విరామం పలికి ఇళ్లకే పరిమితమయ్యారు. ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్‌కు పర్యాటకుల రాక తగ్గుముఖం పట్టింది. మత్స్యకారులు ఇప్పటికే వేటను తాత్కాలికంగా నిషేధించారు. తీర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దారు మధుసూదన్‌రావు హెచ్చరించారు. వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో అలల ఉధృతి, ఈదురు గాలులు అధికమై సముద్రం అల్లకల్లోంగా మారింది. నిత్యం పర్యాటకులు, చిరుతిండి దుకాణాలతో సందడిగా ఉండే తూపిలిపాళెం బీచ్ తుపాన్ కారణంగా బోసిపోయింది. తీరంలో ఉన్న చిల్లర దుకాణాలు ఈదురు గాలులకు నేలవాలి కుప్ప కూలాయి. మత్స్యకారులు రెండు రోజులుగా వేట మానేసి బోట్లను ఒడ్డుకు చేర్చారు. సముద్రంపై వేట చేస్తోన్న పొరుగు ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు తమ బోట్లతో ఆయా సమీప ప్రాంతాల ఒడ్డుకు చేరుకుని వేట సామగ్రిని భద్ర పరుకుంటున్నారు. సముద్రం సాధారణ స్థితికన్నా ఇప్పుడు 10 మీటర్లు ముందుకు చొచ్చుకు రావడంతో తీరానికి సమీపంలో ఉన్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
నెల్లూరు తీరంలో అల్పపీడనం
విశాఖ: నెల్లూరు తీరంలో అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాగల 24 గంటల్లో ఈ అల్ప పీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్ర తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. అల్పపీడన నేపథంలో మత్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తూర్పు గోదావరి, శ్రీకాకుళం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లో గత రెండు రోజుల నుంచి భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలకు కాకినాడలో మెయిన్ రోడ్డుతో పాటు పలు రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోనసీమలోని ఆత్రేయపురం, కొత్తపేట, తూర్పు డెల్టా పరిధిలోని ఆలమూరు మండలాల్లో పాలుపోసుకుని గింజ గట్టిపడే దశలో ఉన్న వరి చేలు నేలకొరిగాయి. అయితే ప్రస్తుత వర్షాల వల్ల పెద్దగా నష్టం ఉండదని అధికారులు చెబుతున్నారు. కాగా, నెల్లూరు నగరంలో కుండపోతగా వాన కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.