విశాఖ: నెల్లూరు తీరంలో అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాగల 24 గంటల్లో ఈ అల్ప పీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్ర తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. అల్పపీడన నేపథంలో మత్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
బంగాళఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తూర్పు గోదావరి, శ్రీకాకుళం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లో గత రెండు రోజుల నుంచి భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలకు కాకినాడలో మెయిన్ రోడ్డుతో పాటు పలు రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోనసీమలోని ఆత్రేయపురం, కొత్తపేట, తూర్పు డెల్టా పరిధిలోని ఆలమూరు మండలాల్లో పాలుపోసుకుని గింజ గట్టిపడే దశలో ఉన్న వరి చేలు నేలకొరిగాయి. అయితే ప్రస్తుత వర్షాల వల్ల పెద్దగా నష్టం ఉండదని అధికారులు చెబుతున్నారు. కాగా, నెల్లూరు నగరంలో కుండపోతగా వాన కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నెల్లూరు తీరంలో అల్పపీడనం
Published Tue, Oct 22 2013 7:16 PM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement
Advertisement