ఉప్పు నీటిని ఆరుగాలం శ్రమించి ఉప్పుగా మార్చే రైతుల బతుకు తిరిగి కరిగి నీరైపోతోంది. కరోనా విపత్తు ఉప్పు రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. ఎగుమతులు లేక.. ధర పతనం కావడంతో మార్కెట్ లేక ఉప్పు నిల్వలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఉప్పు నిల్వలు తడిసి కరిగిపోతున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నేరుగా సముద్ర నీటితో యంత్రాల ద్వారా అయోడైజ్డ్ ఉప్పు తయారీ జరుగుతోంది. జిల్లాలో ఉప్పు ఆధారిత పరిశ్రమలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతులపై ఆధారపడుతున్న పరిస్థితి నెలకొనడంతో ఈ పరిణామాలు దాపురించాయి.
విడవలూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) : ఉప్పు సత్యాగ్రహానికి నాంది పలికి బ్రిటిష్ వారినే గడగడలాడించిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉప్పు రైతుల బతుకులు నానాటికి కరిగిపోతున్నాయి. జిల్లాలో విడవలూరు, అల్లూరు, ముత్తుకూరు తీర ప్రాంత గ్రామాలు ఉప్పు ఉత్పత్తికి అనుకూలమైన ప్రాంతాలు. వ్యవసాయాధారిత ప్రాంతాలైన ఈ మూడు తీర ప్రాంత మండలాల్లో ఉప్పు ఉత్పత్తిది రెండవ స్థానంగా నిలుస్తోంది. గతంలో సుమారుగా పాతిక వేల ఎకరాల్లో ఉప్పు సాగు జరుగుతుండేది.
సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ఉప్పు తయారీకి యంత్రాలు రావడంతో సముద్ర నీటితో నేరుగా ఉప్పుగా మార్చే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. దీంతో సంప్రదాయ ఉప్పు కొనుగోళ్లు తగ్గాయి. కాలక్రమేణ ఉప్పు సాగు గణనీయంగా తగ్గిపోయింది. విడవలూరు మండలంలోని రామతీర్థం, అల్లూరు మండలంలోని ఇస్కపల్లి, గోగులపల్లి, ముత్తుకూరు మండలాల్లో సుమారు 4000 ఎకరాల్లో సొసైటీల ద్వారా ఉప్పు ఉత్పత్తి చేపడుతున్నారు. అయితే గతేడాది నుంచి కరోనా విపత్తు కారణంగా ఎగుమతులు లేకపోవడంతో నిల్వలు పేరుకుపోయాయి. ఈ ఏడాది 3200 ఎకరాల్లోనే ఉప్పును ఉత్పత్తి చేశారు.
క్వింటా రూ.220
గతేడాది కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ఉప్పు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. అన్‌లాక్ అనంతరం ఉప్పు ధర గరిష్ట స్థాయిలో క్వింటా రూ.350 వరకు పలికింది. ఉప్పును నిల్వ ఉంచిన రైతులు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాలోని ఈ మూడు ప్రాంతాల నుంచి ఉప్పును కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలకు ఎగుమతులు జరుగుతున్నాయి.
అన్‌లాక్ తర్వాత మళ్లీ ఉప్పు ఆధారిత పరిశ్రమలు ప్రారంభమైన సంతోషం అంతలోనే ఆవిరైంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడడంతో పాటు వాహనాలకు కూడా సరిగా అనుమతులు లేకపోవడంతో ఉప్పు ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఉప్పు నిల్వలు మళ్లీ పేరుకుపోతున్నాయి.
జిల్లాలో ఉప్పు ఆధారిత పరిశ్రమలు లేకనే...
జిల్లాలో ఉప్పు ఉత్పత్తి జరుగుతున్నా.. ఉప్పు ఆధారిత పరిశ్రమలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అల్లూరులో ఒక పరిశ్రమ ఏర్పాటైనా పదేళ్ల క్రితమే అది మూతపడింది. ప్రధానంగా అయోడైజ్డ్ ఉప్పు వినియోగం పెరగడంతో సంప్రదాయ ఉప్పు వినియోగం లేకుండా పోయింది. ఉప్పు ఆధారిత పరిశ్రమలకు గత ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇవ్వకపోవడంతో ఏర్పాటు కాలేకపోయాయి.
కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి
రెండేళ్ల నుంచి కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. ఉప్పు ఉత్పత్తి కేవలం సంవత్సరంలో 5 నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ప్రత్యామ్నాయ పనులకు వెళ్లాల్సిందే. ఈ 5 నెలల్లో ఉత్పత్తి చేసిన ఉప్పు సరిగా ఎగుమతులు లేకపోవడంతో పాటు మంచి ధర కోసం నిల్వ ఉంచితే వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా దెబ్బతింటున్నాం.
– ఆటా లక్ష్మయ్య
పెట్టుబడులు వస్తే చాలు
ఉప్పు ఉత్పత్తి చేసేందుకు ఎకరాకు రూ.12 వేల వరకు ఖర్చు అవుతుంది. వర్షాలు, వాతావరణంలో ప్రతికూల పరిస్థితులతో పాటు కరోనా కూడా జత కట్టడంతో మా పరిస్థితి దయనీయంగా మారింది. ఎగుమతులు నిలిచిపోవడంతో ఉప్పును కొనేవారు కరువయ్యారు. ఈ కారణంగా పెట్టిన పెట్టుబడులు వస్తే చాలు అనుకుంటున్నాం.
– పుచ్చలపల్లి వినోద్
ఉన్న ధరకే విక్రయిస్తున్నాం
కరోనా కారణంగా గతేడాది పూర్తిగా ఉప్పు ఉత్పత్తులు నిలిచిపోయాయి. అన్‌లాక్ సమయంలో ఉప్పునకు మంచి ధర లభించింది. దీంతో నిల్వ ఉంచిన ఉప్పును విక్రయించాం. ప్రస్తుతం కరోనా కొనసాగుతున్న కారణంగా పలు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు అమలవుతున్నాయి. దీంతో ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి.
– ఓరుంపాటి ప్రసాద్
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment