![Nellore Collector Ask Cm to Establishment Desalination Plant - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/25/nnn.jpg.webp?itok=QTWGDf7v)
సాక్షి, నెల్లూరు : జిల్లాలో నీటి ఇబ్బందుల శాశ్వత పరిష్కారం కోసం తీరంలో డీశాలినేషన్ (లవణ నిర్మూలన) ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించారు. చెన్నై నగరం సమీపంలో ఉన్న డీశాలినేషన్ ప్లాంట్‌ను ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వివరించారు. సోమవారం మొదటి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన అమరావతిలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది.
ఈ క్రమంలో సదస్సుకు రాష్ట్ర మంత్రివర్గంతోపాటు ప్రభుత్వ సలహాదారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రధాన సమస్యలపై కలెక్టర్ సమగ్ర నివేదిక సిద్ధం చేసుకొని సమావేశానికి హాజరయ్యారు. తాగునీటి ఇబ్బందులు, శాఖాపరంగా తీసుకుంటున్న చర్యలు, అలాగే నూతన ప్రాజెక్ట్ అయిన డీశాలినేషన్ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు, పశువుల దాణాకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై కలెక్టర్ల సమావేశంలో ప్రస్తావించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు అందజేశారు.
తీవ్రమవుతున్న తాగునీటి సమస్య
జిల్లాలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, ముఖ్యంగా ఈ వేసవిలో వందలాది గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు అధికంగా ఉండడంతో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నామని, రోజులు గడిచే కొద్దీ తాగునీటి సమస్య ఉన్న గ్రామాల సంఖ్య పెరుగుతోందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో 940 గ్రామాలు ఉండగా వాటిలో 339 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి అధికంగా ఉందని, దీనికోసం ట్యాంకర్ల ద్వారా ఆయా గ్రామాల్లో నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. డెల్టా, మెట్ట ప్రాంతాలతో సంబంధం లేకుండా గడిచిన నాలుగేళ్లుగా వర్షాభావంతో జిల్లాలో ఇబ్బందులు పెరిగాయని వివరించారు.
గత నెలలో తాగునీటి సరఫరాకు సంబంధించి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల ప్రతిపాదనల మేరకు రూ.6 కోట్ల బిల్లులు మంజూరు చేశారని, ప్రస్తుత పరిస్థితుల్లో మరో రూ.10 కోట్ల వరకు తాగునీటి సరఫరాకు కేటాయించాలని కలెక్టర్ ముఖ్యమంత్రికి విన్నవించారు. దీనిపై స్పందించిన సీఎం సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే చెన్నై నగరం సమీపంలోని మింజూరులో డీశాలినేషన్ ప్లాంట్లను సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారని, నెల్లూరు జిల్లాలో 168 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉందని, తీరం వెంబడి 12 మండలాలు ఉన్నాయని, జిల్లాలో అనువైన ప్రాంతంలో డీశాలినేషన్ ప్లాంటు ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వివరించారు. అలాగే జిల్లాలో పశువుల దాణా కొరత అధికంగా ఉందని, దీనిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. మంగళవారం కూడా కాన్ఫరెన్స్ కొనసాగనుంది. మంగళవారం కలెక్టర్‌తోపాటు ఎస్పీ కూడా సమావేశంలో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment