నెల్లూరు(పొగతోట): పెథాయ్ తుపాను ముప్పు నుంచి జిల్లా తప్పించుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి, శుక్రవారం రాత్రి దిశమార్చుకుంది. శనివారం రాత్రి తుపానుగా మారి తూర్పుగోదావరి వైపు అతి వేగంగా పయనిస్తోంది. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలో తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తొలుత అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారి నెల్లూరు–చెన్నైల మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు భావించారు. తుపాను ప్రభావం జిల్లాపై అధికంగా ఉంటుందని, తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
ప్రత్యేకాధికారులను నియమించారు. అయితే పెథాయ్ తన దిశను మార్చుకుంటూ మచిలీపట్నం వైపు నుంచి కాకినాడ వైపు కదిలిపోయింది. దీంతో జిల్లాకు ముప్పు తప్పిందని అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. అయితే తుపాను ప్రభావంతో జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. గత నెలలో ఏర్పడిన గజ తుపాను కూడా నెల్లూరు ప్రాంతంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు భావించారు. గజ తన దిశను మార్చుకుని తమిళనాడులో తీరం దాటింది.
వాతావరణంలో పెనుమార్పులు
పెథాయ్ తుపాన్ తీరం వైపు దూసుకున్న నేపథ్యంలో జిల్లాలో వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. విపరీతంగా చలిగాలు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోంగా మారింది. తుపాను ప్రభావంగా తీర ప్రాంతాల మండలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు జిల్లా యంత్రాంగాన్ని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతంలోని 13 మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. ప్రతి హ్యాబిటేషన్‌కు వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శులను నియమించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లతో అధికారులు సిద్ధంగా ఉన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులను జిల్లా అధికారులు వెనక్కి రప్పించారు. ఎటువంటి విపత్తు సంభవించినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలతో సిద్ధంగా ఉంది.
అల్లకల్లోలంగా తీరం
పెథాయ్ ప్రభావంతో జిల్లాలోని సముద్రం తీరప్రాంతం అల్లకల్లోలంగా మారింది. పలుచోట్ల సముద్రం 50 నుంచి 60 మీటర్లు ముందుకొచ్చింది. గాలులు తీవ్రంగా ఉన్నాయి. తోటపల్లిగూడూరు మండలంలోని కోడూరు, వెంకన్నపాళెం సముద్రతీరాల్లో శనివారం సాయంత్రానికి అలల తాకిడి అధికమై అల్లకల్లోలంగా మారిపోయింది. సముద్రపు నీరు దాదాపు 50 నుంచి 60 అడుగుల మేర ముందుకు చొచ్చుకుని రావడంతో తీరం కోతకు గురవుతోంది. ఉవ్వెత్తిన ఎగిసి పడుతున్న అలలతో తీర ప్రాంత వాసుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. మత్స్యకారులు వేటకు విరామం పలికి ఇళ్లకే పరిమితమయ్యారు.
ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్‌కు పర్యాటకుల రాక తగ్గుముఖం పట్టింది. మత్స్యకారులు ఇప్పటికే వేటను తాత్కాలికంగా నిషేధించారు. తీర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దారు మధుసూదన్‌రావు హెచ్చరించారు. వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో అలల ఉధృతి, ఈదురు గాలులు అధికమై సముద్రం అల్లకల్లోంగా మారింది. నిత్యం పర్యాటకులు, చిరుతిండి దుకాణాలతో సందడిగా ఉండే తూపిలిపాళెం బీచ్ తుపాన్ కారణంగా బోసిపోయింది. తీరంలో ఉన్న చిల్లర దుకాణాలు ఈదురు గాలులకు నేలవాలి కుప్ప కూలాయి.
మత్స్యకారులు రెండు రోజులుగా వేట మానేసి బోట్లను ఒడ్డుకు చేర్చారు. సముద్రంపై వేట చేస్తోన్న పొరుగు ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు తమ బోట్లతో ఆయా సమీప ప్రాంతాల ఒడ్డుకు చేరుకుని వేట సామగ్రిని భద్ర పరుకుంటున్నారు. సముద్రం సాధారణ స్థితికన్నా ఇప్పుడు 10 మీటర్లు ముందుకు చొచ్చుకు రావడంతో తీరానికి సమీపంలో ఉన్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment