పోలీసుల హౌస్ అరెస్టుతో పరిహారం కోసం ఇంటివద్దే నిరసన తెలియజేస్తున్న మత్స్యకార నాయకులు
తూర్పుగోదావరి, కాకినాడ: ఇటీవలి పెథాయ్ తుపాన్ కారణంగా నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు న్యాయం చేయాల్సిందిగా మంత్రి కొల్లు రవీంద్రకు విజ్ఞప్తి చేసేందుకు సిద్ధమైన వైఎస్సార్‌సీపీ శ్రేణులను గృహ నిర్బంధం చేసి అడ్డుకున్నారు. మత్స్యకార ప్రాంతమైన దుమ్ములపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. టీడీపీ నేతల ఒత్తిడితో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఇంటిలోనుంచి బయటకు రాకుండా అడ్డుకున్నతీరు స్థానికంగా అక్కడి మత్స్యకారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. వివరాల్లోకి వెళ్తే...కాకినాడ దుమ్ములపేట ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం మత్స్యకార సదస్సు ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి మంత్రితోపాటు విశాఖకు చెందిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, అధికారులు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో పెథాయ్ తుపాన్ కారణంగా తమ ప్రాంత బాధితులకు ఇప్పటి వరకు పరిహారం అందలేదన్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్ళేందుకు అక్కడి మత్స్యకార ప్రతినిధులు, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు వాసుపల్లి కృష్ణ, తిరుదు జగన్నాథం, ఎరుపల్లి సీతారామ్, వాసుపల్లి సతీష్, వాసుపల్లి కృపానందం, సూరాడ నూకరాజు, ఏసుపాదం తదితరులు ప్లకార్డులతో సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు పోలీసుల ద్వారా వీరిని బయటకు రాకుండా ఇంటి వద్దే నిలువరించారు. ఎస్సై, కానిస్టేబుళ్లు వీరందరినీ వైఎస్సార్‌సీపీ నాయకుడు వాసుపల్లి కృష్ణ నివాసం వద్ద మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇంటిలో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం వాసుపల్లి కృష్ణ, ఇతర నాయకులు విలేకర్లతో మాట్లాడుతూ విశాఖ నుంచి నర్సాపురం వరకు దాదాపు అన్ని మత్స్యకార ప్రాంతాల్లోను తుపాన్ పరిహారాలు పంపిణీ చేశారన్నారు. అయితే కాకినాడలో మాత్రం ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దత్తత గ్రామంగా ఉన్న దుమ్ములపేటలో మాత్రం ఇంత వరకు ఎలాంటి సహాయం అందించలేదన్నారు. తుపాన్ కారణంగా వేలాది కుటుంబాలు నష్టపోయాయని, వీరికి బియ్యం, ఇతర సరుకులు నగదు రూపంలో ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పరిహారం అందించకపోతే ఆందోళనకు సిద్ధమవుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment