Cyclone Pethai
-
‘పెథాయ్’ పరిహారం ఇవ్వకపోగా....
తూర్పుగోదావరి, కాకినాడ: ఇటీవలి పెథాయ్ తుపాన్ కారణంగా నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు న్యాయం చేయాల్సిందిగా మంత్రి కొల్లు రవీంద్రకు విజ్ఞప్తి చేసేందుకు సిద్ధమైన వైఎస్సార్సీపీ శ్రేణులను గృహ నిర్బంధం చేసి అడ్డుకున్నారు. మత్స్యకార ప్రాంతమైన దుమ్ములపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. టీడీపీ నేతల ఒత్తిడితో వైఎస్సార్సీపీ శ్రేణులు ఇంటిలోనుంచి బయటకు రాకుండా అడ్డుకున్నతీరు స్థానికంగా అక్కడి మత్స్యకారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. వివరాల్లోకి వెళ్తే...కాకినాడ దుమ్ములపేట ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం మత్స్యకార సదస్సు ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి మంత్రితోపాటు విశాఖకు చెందిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, అధికారులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పెథాయ్ తుపాన్ కారణంగా తమ ప్రాంత బాధితులకు ఇప్పటి వరకు పరిహారం అందలేదన్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్ళేందుకు అక్కడి మత్స్యకార ప్రతినిధులు, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు వాసుపల్లి కృష్ణ, తిరుదు జగన్నాథం, ఎరుపల్లి సీతారామ్, వాసుపల్లి సతీష్, వాసుపల్లి కృపానందం, సూరాడ నూకరాజు, ఏసుపాదం తదితరులు ప్లకార్డులతో సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు పోలీసుల ద్వారా వీరిని బయటకు రాకుండా ఇంటి వద్దే నిలువరించారు. ఎస్సై, కానిస్టేబుళ్లు వీరందరినీ వైఎస్సార్సీపీ నాయకుడు వాసుపల్లి కృష్ణ నివాసం వద్ద మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇంటిలో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం వాసుపల్లి కృష్ణ, ఇతర నాయకులు విలేకర్లతో మాట్లాడుతూ విశాఖ నుంచి నర్సాపురం వరకు దాదాపు అన్ని మత్స్యకార ప్రాంతాల్లోను తుపాన్ పరిహారాలు పంపిణీ చేశారన్నారు. అయితే కాకినాడలో మాత్రం ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దత్తత గ్రామంగా ఉన్న దుమ్ములపేటలో మాత్రం ఇంత వరకు ఎలాంటి సహాయం అందించలేదన్నారు. తుపాన్ కారణంగా వేలాది కుటుంబాలు నష్టపోయాయని, వీరికి బియ్యం, ఇతర సరుకులు నగదు రూపంలో ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పరిహారం అందించకపోతే ఆందోళనకు సిద్ధమవుతామన్నారు. -
రికార్డు స్థాయికి చేరిన చికెన్ ధర
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ మార్కెట్లో చికెన్ ధర అనూహ్యంగా పెరిగింది. కార్తీకమాసం ముగియడం, పెథాయ్ తుఫానుతో పెరిగిన చలి, క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో చికెన్ రేటు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. రెండు వారాల క్రితం కిలో రూ.170 ఉన్న ధర ఇప్పుడు రూ.250కి చేరింది. చలికాలంలో సాధారణంగా చికెన్ ధరలు తక్కువగా ఉంటాయి. కానీ ఈసారి గతంలో ఎన్నుడూ లేని విధంగా ధరలు ఆకాశాన్నంటాయి. సాధారణ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల కిలోల వరకు చికెన్ విక్రయాలు జరుగుతాయి. ఆదివారం మాత్రం 70 లక్షల కిలోల విక్రయాలు జరుగుతాయని అంచనా. ఈ క్రిస్మస్కు మాత్రం 1.5 కోట్ల కిలోల విక్రయాలు దాటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నగర హోల్‌సేల్ మార్కెట్లో కోడి కిలో రూ.135 నుంచి రూ.140 మధ్య ఉంది. రిటైల్ మార్కెట్లో రూ.150 వరకు ఉంది. డ్రెస్డ్ ధర రూ.200 వరకు ఉండగా, స్కిన్లెస్ రూ.240 దాటుతోంది. మరికొద్ది రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. డిమాండ్ తగ్గ సరఫరా లేదు రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు కోళ్ల సరఫారా లేకపోవడంతో చికెన్ ధరలు పెరిగుతున్నాయి. న్యూయర్ దాకా ధరలు ఇలాగా ఉంటాయి. ఫారంరేట్ కోడి ధర కిలో రూ.110 దాటింది. ఇందులో 33 శాతం ధరలు కలుపుకొని హోల్‌సెల్ వ్యాపారులు కిలో రూ.135 వరకు విక్రయిస్తారు. స్కిన్లెస్ కిలో హోల్‌సేల్ రూ.220 దాటింది. వినియోగదారులు ఎప్పటికప్పుడు పేపర్ రేటును గమనిస్తూ దాని ప్రకారమే చికెన్ కొనాలి. అంతకు మించి అధికంగా చెల్లించవద్దు. – డా.రంజీత్ రెడ్డి, తెలంగాణ బ్రీడర్స్ అసోసియోషన్ అధ్యక్షుడు -
కాకినాడ ఓఎన్జీసీ సిబ్బందికి తప్పిన ప్రమాదం
-
కుంపటి... కొంప ముంచుతోంది!
సాక్షి, సిటీబ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ ప్రభావంతో నగరంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. అసలే శీతాకాలం కావడంతో పరిస్థితి దారుణంగా మారింది. దీంతో ప్రజలు వెచ్చదనం కోసం వివిధ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ఇందులో భాగంగా నిద్రిస్తున్న గదుల్లో బొగ్గుల కుంపట్లను ఏర్పాటు చేసుకోవడమేగా, చల్లగాలి గదిలోకి రాకుండా తలుపులు, కిటికీలు భిగిస్తున్నారు. ఇలాంటి గదుల్లో నిద్రిస్తే ప్రాణాలకే ప్రమాదమని ఫోరెన్సిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. . ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లలో జరిగే న్యూ ఇయర్ పార్టీల నేపథ్యంలోనూ ఇలాంటి అపశృతులకు ఆస్కారం ఉందని పేర్కొన్నారు. అన్నీ బిగించేస్తే... బొగ్గులు, నిప్పులు, మంట... ఇలా ఏదైనా మండటానికి ఆక్సీజన్ అవసరం. ఏదైనా గదిలో బయట నుంచి చలి, గాలి రాకుండా తలుపులు, కిటికీలు మూసేసి వీటిని వెలిగిస్తే... గదిలోని ఆక్సీజన్‌ను ఈ మంట, నిప్పు గ్రహిస్తాయి. దీంతో గాలిలోని ఆక్సిజన్, బొగ్గుల్లో ఉండే కార్బన్ కలిసి కార్బన్డయాక్సైడ్ (సీఓ2) విడుదలవుతోంది. ఇదే పరిస్థితి మరి కొద్దిసేపు కొనసాగితే కార్బన్‌డయాక్సైడ్‌లో ఉన్న ఆక్సీజన్‌ను సైతం మంట లాక్కుని కార్బన్‌మోనాక్సైడ్ విడుదలవుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన విష వాయువుగా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి వాసన ఉండని ఈ వాయువును కేవలం నాలుగైదు సార్లు పీలిస్తే చాటు... ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే. కార్బాక్సీ హిమోగ్లోబిన్ తయారై... ఇలా పీల్చిన కార్బన్‌మోనాక్సైడ్ గుండె, మెదడుకు చేరుకుని కొన్ని నిమిషాల్లోనే మెదడును నిస్తేజం చేస్తుంది. గుండె ద్వారా ఈ వాయువు రక్తంలోకి ప్రవేశించి కార్బాక్సీ హిమోగ్లోబిన్‌ను తయారు చేస్తుంది. దీని ఫలితంగానే మనిషి ప్రాణాలు కోల్పోతాడు. నిద్రలో ఉండే వారు తమ శరీరంలో అంతర్గతంగా వస్తున్న ఈ మార్పులను సైతం గుర్తించలేరని తద్వారా మృత్యువాత పడతారని ఫోరెన్సిక్ నిపుణులు పేర్కొన్నారు. ఇలాంటి మరణాలు చలి ఎక్కువగా ఉండే ఉత్తరాదిలో ఏటా పెద్ద సంఖ్యలో ఉంటాయన్నారు. ఈ కార్బన్ మోనాక్సైడ్ వాయువు డ్రైనేజీ గుంతలు, లోతైన బావుల్లోనూ పుడుతుంటుందని, వాటిలో దిగిన కార్మికులు ప్రాణాలు కోల్పోయేందుకు ఇదే కారణమని వారు పేర్కొంటున్నారు. గాలి వచ్చి పోయేలా... చలి కారణంగా తలుపులు, కిటికీలు పూర్తిగా బిగించుకుని పడుకోవడం సరికాదని ఫోరెన్సిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికి తట్టుకోలేక గదుల్లో హీటర్ ఆన్ చేసుకున్నా, కుంపటి పెట్టుకున్నా, మరో మార్గాన్ని అనుసరించినా కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆయా గదులకు కచ్చితంగా గాలి ప్రసరించే మార్గాలు ఉండేలా చూసుకోవాలని, లోపలి గాలి బయటికి, బయటకు లోపలికి వచ్చేలా కనీస ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. ‘కుంపటి’ ప్రమాదాలు ఇవీ ♦ బుధవారం జూబ్లీహిల్స్‌లో ఇంట్లో బొగ్గుల కుంపటి పెట్టుకుని నిద్రించిన తల్లీకుమారులు బుచ్చి వేణి, పద్మరాజు కన్నుమూశారు. ♦ గత ఏడాది డిసెంబర్లో యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట శివారులోని పౌల్ట్రీఫామ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారు. వీరు నిద్రిస్తున్న గదిలో ఓ బొగ్గుల కుంపటి ఉండటాన్ని గుర్తించిన పోలీసులు అదే వీరి ప్రాణం తీసిందని ప్రాథమికంగా తేల్చారు. ♦ 2008లో డిసెంబర్ 31న కొందరు యువకులు దేవరయాంజల్‌లోని రామరాజు ఫామ్‌హౌస్‌లో విందు చేసుకున్నారు. వీరిలో శ్రీరామమూర్తి, వెంకటపతిరాజు ఓ గదిలో నిద్రిస్తూ నిప్పు రవ్వలు రాజేసుకున్నారు. తెల్లవారేసరికి ఇద్దరూ మరణించారు. దీనికి కారణం నిప్పుల కుంపటే. ♦ కొన్నేళ్ళ క్రితం నాంపల్లిలోని చాకలిబస్తీలో ఇలాంటి మరణమే సంభవించింది. తన గది తలుపులు, కిటికీలు బిగించుకున్న ఓ వ్యక్తి కూలర్ ఆన్ చేసుకుని పడుకున్నారు. ఆ కూలర్ కాలిపోవడంతో తయారైన కార్బన్‌మోనాక్సైడ్ పీల్చి కన్నుమూశాడు. తొలుత ఇది హత్యగా భావించినా... ఫోరెన్సిక్ నిపుణులు చిక్కుముడిని విప్పారు. -
నష్టం కొండంత.. పరిహారం గోరంతే
-
పెథాయ్ పగ.. సర్కారు దగా!
పైచిత్రంలోని రైతు పేరు పాశం పూర్ణచంద్రరావు. స్వగ్రామం కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం గాంధీనగరం. ఖరీఫ్‌లో 3.5 ఎకరాల్లో బీపీటీ రకం ధాన్యం సాగు చేశాడు. పంట కోత కోసిన వెంటనే పెథాయ్ తుపాను ప్రభావంతో వర్షం మొదలైంది. కనీసం పంటను కుప్పగా వేసే అవకాశం సైతం లేకుండాపోయింది. వర్షపు నీరు పంట పొలంలో చేరడంతో ధాన్యమంతా నీళ్లపాలై మొలకలు వచ్చింది. పంట సాగుకోసం పూర్ణచంద్రరావు ఎకరాకు రూ.35 వేల చొప్పున మొత్తం రూ.1,19,500 పెట్టుబడి పెట్టాడు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వస్తుందని భావిస్తే.. గాలికి వాలి మొలకెత్తిన ధాన్యానికే పరిహారం ఇస్తామని ప్రభుత్వం నిబంధన విధించింది. దీంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి నెట్వర్క్: పెథాయ్ తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిని నిలువునా వంచిస్తోంది. నిబంధనల పేరిట బంధనాలు వేస్తోంది. నష్టపరిహారం ఇవ్వకుండా తప్పించుకో వడానికి పెథాయ్ తుపాను వల్ల పంటలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని చిత్రీకరించేందుకు ప్రయత్ని స్తోంది. తమను మోసగించడానికే సీఎం చంద్రబాబు టెక్నాలజీతో తుపాను నష్టాన్ని నివారించానంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని బాధిత రైతులు వాపోతున్నారు. పెథాయ్ తుపాను వల్ల కేవలం 66 వేల ఎకరాల్లోనే పంటలు పాడయ్యాయని ప్రభుత్వం చెబుతోంది. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. ఒక్క రోజులో వివరాలు సేకరించేదేలా? తుపాను వల్ల నష్టపోయిన పంటల వివరాలను సేకరించే బాధ్యతను ప్రభుత్వం వ్యవసాయ అధికారులకు అప్పగించింది. కానీ, నిబంధనలను మాత్రం మంగళవారం అర్ధరాత్రి 11 గంటలకు విడుదల చేసింది. బుధవారం సాయంత్రంలోగా అన్ని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వివరాలను సేకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం 12 గంటల వ్యవధిలో వేలాది ఎకరాల్లో జరిగిన పంట నష్టాన్ని ఎలా సేకరించాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు. మరోవైపు పంట నష్టం వివరాల నమోదుకు ప్రభుత్వం ‘సైక్లోన్ అప్లికేషన్’ పేరిట కొత్త మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో 29 ఆంశాలను నమోదు చేయాల్సి ఉంది. రైతు ఆధార్ నెంబర్‌తో లాగిన్ అయిన తర్వాత బ్యాంక్ ఆకౌంట్, ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్యాంక్ బ్రాంచ్ పేరు వంటి అన్ని అంశాలను ఎంటర్ చేసి, రైతు పొలాన్ని ఫొటో తీసి జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది. కోస్తా ప్రాంతంలో సముద్ర తీరం వెంబడి సెల్‌ఫోన్ సిగ్నల్స్ అంతంతమాత్రంగానే ఉండటంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క రైతు వివరాలను నమోదు చేయడానికి 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతోంది. ప్రభుత్వం ఇచ్చిన 12 గంటల సమయంలో పంట నష్టం వివరాలను నమోదు చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. నష్టపరిహారం ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని రైతులు మండిపడుతున్నారు. ఎన్నెన్ని తిరకాసులో... పంట నష్టం వివరాలను నమోదు చేసే ప్రక్రియలో ప్రభుత్వం ఎన్నో తిరకాసులను పెట్టింది. సర్కారు నిబంధనల ప్రకారం.. కోతలు పూర్తయి పొలాల్లో వర్షానికి తడిసిన వరి పంట వివరాలను నమోదు చేయొద్దు. సరిగ్గా కుప్ప వేయని వరి తడిస్తే నష్టపరిహారం ఇవ్వరు. కేవలం కోతకు సిద్ధంగా ఉండి నేలకొరిగి, మొలకెత్తిన పంటల వివరాలను మాత్రమే నమోదు చేస్తారు. అందులో కూడా 33 శాతం కంటే అధికంగా నేలకొరిగిన వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. దీనిప్రకారం 90 శాతం పొలాలను జాబితాలోంచి తొలగిస్తున్నారు. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో 47,000 హెక్టార్లలో పంట నష్టపోతే 8,231 హెక్టార్లను మాత్రమే నమోదు చేస్తున్నారు. ఈ–క్రాప్‌లో రైతుల వివరాలేవీ? సైక్లోన్ యాప్‌లో రైతుల పంట నష్టం వివరాలు నమోదు కావాలంటే ఈ–క్రాప్‌లో ఇదివరకే ఆ రైతు పేరు నమోదై ఉండాలి. గతంలో అధికారుల అలసత్వంతో ఈ–క్రాప్‌లో రైతులందరి వివరాలు నమోదు చేయలేదు. ఇన్ని సమస్యల మధ్య అధికారులు పొలాల్లోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఈ నెల 20వ తేదీన తుపాను బాధిత రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. క్షేత్రస్థాయిలో మాత్రం కనీసం పంట నష్టాన్ని పరిశీలించడానికి కూడా అధికారులు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టం కొండంత.. పరిహారం గోరంతే ప్రభుత్వం అరకొరగా పరిహారం ఇచ్చి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నిస్తోందని పెథాయ్ బాధిత రైతులు అంటున్నారు. వరి పంటకు హెక్టార్‌కు రూ.15 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంటే ఎకరాకు రూ.6 వేలు ఇవ్వనున్నారు. రైతులు ఇప్పటికే ఎకరాకు రూ.35 వేల పెట్టుబడి పెట్టారు. తడిసిన పంట కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రారు. ఒకవేళ వచ్చినా సగం ధరకే విక్రయించాల్సి వస్తుంది. అంటే ఎకరాకు రూ.50 వేల ఆదాయం రావాల్సి ఉండగా, తుపాను ప్రభావం వల్ల రూ.25 వేలు మాత్రమే అందనుంది. పరిహారం కింద ఎకరాకు రూ.6 వేలు మాత్రమే ఇస్తామనడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పు గోదావరిలో 500 హెక్టార్లకే పరిహారం ఇస్తారట! పెథాయ్ తుపాను ధాటికి తూర్పు గోదావరి జిల్లాలో 12 వేల ఎకరాల్లో రబీ నారుమళ్లు దెబ్బతిన్నాయి. 25 వేల ఎకరాల్లో పనలపై ఉన్న ధాన్యం తడిసిముద్దయి ఎందుకూ పనికిరాకుండా పోయింది. 5,705 ఎకరాల్లో అరటి, 8,400 ఎకరాల్లో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. కానీ, అధికారికంగా ఖరీఫ్, రబీ పంటలకు సంబంధించి 5,484 హెక్టార్లలో మాత్రమే పంటలు దెబ్బతిన్నాయని అధికారులు నివేదిక ఇచ్చారు. ఇందులో వరి 3,059 హెక్టార్లు ఉన్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా 2,450 హెక్టార్లలో జీడి, మామిడి, అరటి, బొప్పాయి తోటలతోపాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నట్టు నివేదికలో తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను బట్టి చూస్తే 500 హెక్టార్లకు మించి నష్టపరిహారం వచ్చే అవకాశం లేదు. కౌలు రైతులకు మొండిచేయి పంట నష్టం వివరాల నమోదుకు ప్రవేశపెట్టిన సైక్లోన్ యాప్‌ను పశ్చిమ గోదావరి జిల్లాలో బుధవారం రాత్రికి కూడా ప్రభుత్వం యాక్టివేట్ చేయలేదు. ప్రస్తుతం క్షేత్రస్థాయికి వెళ్లకపోవడంతో వివరాలు చెప్పలేమని అధికారులు పేర్కొంటున్నారు. చాలామంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేవు. గుర్తింపు కార్డు ఉంటేనే సాఫ్ట్వేర్ వారి వివరాలను స్వీకరిస్తుంది. అంటే కార్డులు లేని కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారం రాదు. పెథాయ్ తుఫాన్ వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో 14,788 హెక్టార్లలో పనలపై ఉన్న వరి పంట నీటమునిగింది. కుప్పల రూపంలో 59,150 హెక్టార్లలో వరి పంట నీటిపాలైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పంటను అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. అంటే బాధిత రైతులకు పరిహారం అందే అవకాశం లేదు. నిబంధనలే శాపం విశాఖ జిల్లాలో ఖరీఫ్‌లో 99 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల 37 వేల హెక్టార్లలో పంట పూర్తిగా ఎండిపోయింది. పెథాయ్ తుపానుకు ముందు 29 వేల హెక్టార్లలో ధాన్యం కోతలు పూర్తయ్యాయి. 33 వేల హెక్టార్ల పంట కోతకు సిద్ధంగా ఉంది. పెథాయ్ తుపాను ప్రభావంతో జిల్లాలో 23 వేల హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందులో 90 శాతం పంటకు నష్టపరిహారం రాదని అధికారులు తేల్చిచెబుతున్నారు. సర్కారు కాకిలెక్కలు శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో 2.10 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. ఇందులో దాదాపు 2 లక్షల హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయి. పెథాయ్ ప్రభావం వల్ల ఇందులో 1.36 లక్షల హెక్టార్లలో వరి పనలు నీటిలో తడిసి పాడయ్యాయి. దాదాపు లక్ష హెక్టార్లలో పెసర, మినప వేయగా, 40 వేల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. అయితే, పెథాయ్ తుపాను వల్ల శ్రీకాకుళం జిల్లాలో పెద్దగా పంట నష్టం వాటిల్లలేని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. నష్టపరిహారం ఎగ్గొట్టడానికి ప్రభుత్వం కాకిలెక్కలు చెబుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. -
చలి మంటే చితిమంటైంది!
రాయపర్తి: చలి మంటే ఓ వృద్ధుడి పాలిట చితిమంటైంది. చలి తీవ్రతను తట్టుకోలేక ఇంట్లోనే చలికాగుతూ ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాడు. ఈ ఘటన బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ లక్ష్మణ్‌రావు కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కుంట మారయ్య (85), మల్లమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు ఒక్క కూతురు. అందరి వివాహాలు చేశారు. భార్య మల్లమ్మ మృతితో మారయ్య ఒంటరిగానే ఉంటున్నాడు. రెండు నెలల క్రితం అనారోగ్యం బారిన పడి కాళ్లు చచ్చుపడిపోయాయి. చలిని తట్టుకోలేక మంచం పక్కనే మంట పెట్టుకుని పడుకున్నాడు. మధ్యరాత్రి గొంగడికి నిప్పంటుకోగా.. కాళ్లు సహకరించకపోవడంతో లేవలేని పరిస్థితిలో అక్కడికక్కడే ఆహుతయ్యాడు. చలికి 18 మంది మృతి సాక్షి నెట్వర్క్: చలి తీవ్రతకు బుధవారం 18 మంది మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మంది, కరీంనగర్ జిల్లాలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. పెథాయ్ తుపాను ప్రభావంతో వీస్తున్న చలిగాలులతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. -
కాటేసిన కుంపటి
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో దారుణం జరిగిపోయింది. పెథాయ్ తుపాను ప్రభావంతో వీచిన శీతలగాలులకు తెలంగాణ గజగజ వణికిపోయింది. అయితే ఈ శీతల గాలులనుంచి తప్పించుకునేందుకు వేసుకున్న చలిమంటే ఓ తల్లీ, కొడుకుల ఊపిరి తీసింది. చలిమంటకోసం ఏర్పాటు చేసుకున్న బొగ్గులకుంపటి నుంచి పొగలు కమ్ముకుని ఊపిరాడక ఆ తల్లీ కొడుకులిద్దరూ నిద్రలోనే మృతి చెందారు. హృదయవిదారకమైన ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం, జల్లూరు గ్రామానికి చెందిన కె.సత్యబాబు, బుచ్చమ్మ (39) దంపతులు బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి జూబ్లీహిల్స్ 25లో నివసించే సంకీర్త్ ఆదిత్యారెడ్డి ఇంట్లో పనిమనుషులుగా పనిచేస్తున్నారు. వీరికి కూతురుతోపాటు కొడుకు పద్మరాజు (20) కూడా ఉన్నారు. ఆదిత్యారెడ్డి పెంపుడు కుక్క బుధవారం మృతి చెందడంతో దానిని ఖననం చేసేందుకు పనిమనిషి సత్యబాబు డ్రైవర్‌తో కలిసి కారులో ఉప్పల్‌కు వెళ్లారు. బాగా చలిగాలులు వీస్తుండటంతో సత్యబాబు భార్య బుచ్చమ్మ, కొడుకు పద్మరాజు తమ సర్వెంట్ క్వార్టర్లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో నిప్పులు రాజేసుకుని చలిమంట వేసుకున్నారు. మంచం కింద ఓ బొగ్గులకుంపటి, టీవీ వద్ద ఇంకో కుంపటి ఏర్పాటు చేసి గాలికి నిప్పులు ఆరిపోకుండా గది వేడిగా ఉండాలనే ఉద్దేశంతో కిటికీలు, తలుపులు మూసేశారు. బుచ్చమ్మ కుర్చీలో కూర్చుని, పద్మరాజు మంచంపై పడుకుని టీవీ చూస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. ఊపిరాడకేనా?.. ఇల్లంతా పొగ నిండుకోవడంతో బుచ్చమ్మ, పద్మరాజులిద్దరూ ఊపిరాడక నిద్రలోనే మృతిచెందినట్లు తెలుస్తోంది. సాయంత్రం మూడు గంటలకు ఆదిత్యారెడ్డి ఇంటికి అతిథులు రావడంతో టీ పెట్టేందుకు బుచ్చమ్మను పిలవాలని యజమానురాలు ఇంకో పనిమనిషిని పంపగా... ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో పడుకున్నారనుకుని తిరిగి వెనక్కి వచ్చేసింది. కొద్దిసేపటికి సత్యబాబు వెంకటగిరిలో సామాన్లు తీసుకుని ఇంటికివచ్చి తలుపులు కొట్టగా ఎంతకూ తీయలేదు. దీంతో అనుమానం వచ్చి కిటికీలు తెరిచి చూడగా ఇల్లంతా పొగలువ్యాపించి ఉంది. సత్యబాబు డ్రైవర్‌తో కలిసి తలుపులు పగలగొట్టి లోనికి వెళ్ళి చూడగా కుర్చీపై భార్య, మంచంపై కొడుకు విగతజీవులుగా కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జూబ్లీహిల్స్ ఎస్సై శంకర్ ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేపడతామని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత వాస్తవాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. -
ప్రకృతి అనే భూతం
ప్రకృతి మనల్ని అక్కున చేర్చుకుని ఆశీర్వదించే కన్నతల్లి. అందుకే ఆ శక్తిని– అర్థం చేసుకోనవసరంలేని సామాన్య ప్రజానీకం ‘దేవత’ అన్నారు. ప్రకృతి సామరస్యం దెబ్బతినకుండా నిరంతరం మన జీవనవిధానాన్ని పూర్వులు నియంత్రించారు. కూల్చిన చెట్టుకి ప్రత్యామ్నాయం ఉండాలి. ఎందుకు కూలుస్తున్నామో, దానికి మారుగా ఏంచేస్తున్నామో చెప్పాలి. దీనికి కర్మకాండ ఉంది. ఉద్దేశం– ప్రకృతిని కదిలించే ఏ పనయినా తెలిసి చేయాలి. కానీ మనం తెలివయినవాళ్లం. ప్రకృతి దేవత ఏమిటి– పిచ్చి వాగుడు కాకపోతే! ఏ ప్రకృతి శక్తినయినా యథేచ్ఛగా, నిరాటంకంగా, నిర్భయంగా వాడుకోగలిగే పద్ధతుల్నీ, ఆలోచనలనీ పెంపొందించుకున్నాం. ఫలితం? నేను మా అబ్బాయి, మనుమరాళ్లతో– 2013లో ఈ భూగ్రహం కొనవరకూ ప్రయాణం చేశాను. నార్వేలో ట్రోమ్సో అనే ఊరు. ఆ తర్వాత భూమిలేదు. అక్కడి నుంచీ దాదాపు 2,000 మైళ్ల పైచిలుకు ఆర్కిటిక్ మహా సముద్రం. ఉత్తర ధృవం. పోనుపోను గడ్డకట్టిన మహా స్వరూపం. ఈ అనూహ్యమయిన మంచు భూతం కింద ఎన్నో సమాధి అయిన– మన గ్రహం వంటి భూభాగాలు, సంస్కృతులూ ఉండి ఉండవచ్చునని శాస్త్రజ్ఞులు భావిస్తున్నట్లు మొన్న పత్రికల్లో వచ్చింది. ఇప్పుడు అసలు కథ. 2018లో మానవుడి దురాశ, దురాక్రమణ, నాగరిక వైపరీత్యాల కారణంగా రికార్డు స్థాయిలో భూమి ఉష్ణోగ్రత పెరిగిం దట. పెరిగే అతి చిన్న ఉష్ణోగ్రతకే మన ఆరోగ్యం, ఆహారం, తాగే నీటి వనరులూ దెబ్బతింటాయి. ఈ శతాబ్దపు చివరికి– ఈ లెక్కన 3.5 శాతం ఉష్ణోగ్రత పెరుగుతుంది. అప్పుడేమవుతుంది? చాలా జంతు సంతతి నాశనమవుతుంది. వృక్ష సంపద నశిస్తుంది. సముద్రాల్ని శుభ్రపరిచే నాచు వంటి ‘పెరుగుదలలు’(రీఫ్) పోతాయి. ధృవాలలో నీటిమట్టం కరిగి –సముద్రాల నీటి మట్టం పెరిగి–విశాఖపట్నం, భువనేశ్వర్, చెన్నై, కొచ్చి, నాగపట్టణం వంటి ప్రాంతాలలో భూమట్టం బాగా తరిగిపోతుంది. చాలా స్థలాలు మునిగిపోతాయి. వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుదలవల్ల భూమి ఆర్చుకుపోతోంది. చెమ్మతో సమతలంగా ఉండే నేల ఒకప్పుడు వర్షం పడగానే– నీటిని చెరువులకూ, నదులకూ పారించేది. కానీ భూమికే నీటి చెమ్మ అవసరం ఏర్పడింది కదా? 160 దేశాలలో పరిశోధన జరిపిన ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ శాస్త్రజ్ఞులు దీనికి రంగుల అన్వయాన్ని ఇచ్చారు. భూమి మీద 100 వర్షపు చుక్కలు పడ్డాయనుకోండి. ప్రస్తుతం 36 చుక్కలే వనర్లకు చేరుతున్నాయి. దీన్ని ‘బ్లూ వాటర్’ అన్నారు. మిగతా 64 చుక్కల్ని భూమి ఆర్చుకుపోయిన తన భూభాగాన్ని నింపుకుం టోంది. దీన్ని ‘గ్రీన్ వాటర్’ అన్నారు. ఇది ఒక పార్శ్వం. గత 22 సంవత్సరాలలో సముద్రమట్టం సాలీనా 3.2 మిల్లీమీటర్లు పెరుగుతోంది. న్యాయంగా ఏ 80 సంవత్సరాలకో పెరగవలసిన మట్టమిది. ఒక్క కొచ్చీలోనే మిగతా సముద్ర తీరపు పట్టణాలలో కంటే నీటిమట్టం భయంకరంగా చాపకింద నీరులాగ పెరుగుతోందట. డచ్ దేశంలో ఒక సామెత ఉంది. ‘ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించి ఉండవచ్చు. కానీ డచ్ వారు జీలెండుని నిర్మించారు’ అని. గత వెయ్యి సంవత్సరాలలో డచ్ వారు ‘జీలాండ్’ అనే ప్రాంతాన్ని సముద్ర జలాలను తప్పించి నిర్మించారు. ఆ పని జపాన్ చేస్తోంది. వేల ఎకరాల స్థలాన్ని సముద్ర ప్రాంతాల నుంచి– నీటిని తప్పించి సాధించింది. విచిత్రం ఏమిటంటే సముద్రాన్నించి భూభాగాన్ని సంపాదించే ఆధునిక విజ్ఞానం ఒక పక్క పురోగమిస్తుం డగా– భూమిని కబళించే సముద్ర ఉష్ణోగ్రతలను పెంచే అనర్థం మరోపక్క జరుగుతోంది. ఈ భూమి మీద ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కాలగమనంలో లక్ష ద్వీపాలు, మాల్దీవ్‌లు, బంగ్లాదేశ్‌లో అధిక భాగం సముద్ర గర్భంలో ఉంటాయట. జవహర్లాల్ నెహ్రూ వర్సిటీలో ప్రకృతి విపత్తు పరిశీలనకు ఏర్పాటైన కేంద్ర ప్రొఫెసరు డాక్టర్ అమితాసింగ్ ఒకమాట అన్నారు. నేడు నానాటికీ పెరుగుతున్న జంతు సంహారానికి కబేళాలు వాతావరణంలో విష వాయువుల వ్యాప్తికి కారణమవుతున్నాయట. శాకాహారంతో కనీసం ప్రకృతిలో నాలుగో భాగాన్ని పరిరక్షించవచ్చు. అయితే ఈ ఒక్క మాట చాలు సమాజంలో పెద్ద అల్లర్లు లేవడానికి. ఇప్పుడు గోసంరక్షణ కథలు వింటున్నాం కదా? ఏమయినా మానవుడు తెలివైనవాడు. తాను దిగవలసిన గోతిని తానే తెలిసి తెలిసి తవ్వుకుంటున్నాడు. ఇప్పుడు వచ్చే ప్రళయం నుంచి రక్షించడానికి అలనాడు వచ్చిన నోవా నావ ఉండదు. కారణం– ఇది స్వయంకృతం. మానవుడి పేరాశ, రక్తపాతంతో అతను స్వయంగా తెచ్చిపెట్టుకున్న విపత్తు. ఇది నా మాట కాదు. డాక్టర్ అమిత్ సింగ్ తీర్పు. కాలగమనాన్ని రుతువులతో పలకరిస్తూ, తరతరాలుగా మానవ కల్యాణానికి మన్నికయిన గొడుగును పట్టిన ప్రకృతి శక్తిని గుర్తించిన వారికి ఆనాడు – తల్లి. ఇప్పుడు నిశ్శబ్దంగా మీద పడి కబళించనున్న పెనుభూతం. గొల్లపూడి మారుతీరావు -
ప్రకాశం బ్యారేజికి భారీగా వస్తున్న వరదనీరు
-
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు
సాక్షి, విజయవాడ: పెథాయ్ తుపాను కారణంగా కృష్ణానది పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయ్. దీంతో ప్రకాశం బ్యారేజికి పెద్దఎత్తున చేరుతున్న వరద నీరు చేరుతోంది. మున్నేరు, కట్టలేరుల ద్వారా ప్రకాశం బ్యారేజీకి ఏడువేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం గరిష్ఠంగా 12 అడుగుల మేరకు చేరింది. దీంతో పదిగేట్లను ఎత్తి బ్యారేజి నుంచి అదనపు వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా నది లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. -
జీవిత నౌక మునక
తీవ్ర తుపాను హెచ్చరికలతో సముద్రంలో సుదూర ప్రాంతాల్లో వేట సాగిస్తున్న బోట్లన్నీ రెండు రోజుల క్రితమే చేరుకున్నాయి. ఫిషింగ్ హార్డర్ జెట్టీల్లో నిలిచిపోయాయి. సముద్రంలో ఉంటే ప్రమాదమని భయపడి తీరానికి చేరుకుంటే.. ఇక్కడా పెథాయ్ తుపాను ముప్పు తప్పలేదు.తుపాను ప్రభావంతో వీచిన పెనుగాలులు, విరుచుకుపడిన అలల ఉధృతికి జెట్టీల్లో ఉన్న బోట్లు పరస్పరం ఢీకొని సముద్రంలో మునిగిపోయాయి. విశాఖ ఫిషింగ్ హార్డర్లో ఇలా లంగరేసిన 9 మరబోట్లు, 3 ఫైబర్ బోట్లు బోల్తాపడి సముద్రంలో మునిగిపోయి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిణామంతో బోట్ల యజమానులకు సుమారు రూ.3 కోట్ల నష్టం వాటిల్లిందంటున్నారు. మరోవైపు వీటిపైనే ఆధారపడిన మత్స్యకారులు, కలాసీలు తమ జీవనోపాధి పోయిందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరుస తుపాన్ల వల్ల వేట సక్రమంగా సాగక పూట గడవని స్థితిలో ఉన్న తాము ఇప్పుడు పూర్తిగా ఉపాధి కోల్పోయామని వారు వాపోతున్నారు. పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): పెథాయ్ ప్రకోపానికి విశాఖ మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. సముద్ర తీర ప్రాంతాలను చిగురుటాకులా వణికించి తీరం దాటిందన్న సంతోషం ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఆవిరైపోయింది. ఫిషింగ్ హార్బర్లో జెట్టీలకు చేర్చిన తొమ్మిది మరబోట్లు, మూడు ఫైబర్‌బోట్లు నీటిలో మునిగిపోవడంతోపాటు మరో ఐదు ఫైబర్ బోట్లు దెబ్బతినడంతో బోట్ల యజమానులకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. జెట్టీలలో కట్టిన బోట్లు సోమవారం ఉదయం నుంచి వీచిన ఈదురుగాలుల ప్రభావంతో తాళ్లను తెంచుకుని ఒకదానికి ఒకటి గుద్దుకుని నీట మునిగాయి. బోటులో బిగించిన ఇంజిను, డీజిల్ ఆయిల్, వలలు, ఇతర వేట పరికరాలు నీట మునిగిపోయాయి. బోట్లు ముక్కలు చెక్కలుగా విడిపోయాయి. వీటిని నీటి నుంచి వెలుపలికి తీసినా పనిచేసే పరిస్థితి కనిపించడం లేదని బోట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోటులో ఉన్న పరికరాలతో సహా మునిగిపోవడంతో ఒక్కొక్క మర బోటుకు సుమారుగా రూ.30 లక్షలు, ఫైబర్ బోటుకు రూ.3 లక్షల వరకూ నష్టపోయామని... అన్ని బోట్లకు కలిపి రూ.3కోట్లకు పైబడి ఆస్తి నష్టం జరిగిందని యజమానులు వాపోతున్నారు. మరోవైపు బోట్లు మునిగిపోవడంతో వీటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేసే సుమారు 200 మంది ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వం ఆర్థికంగా తమను ఆదుకోవాలని వీరంతా కోరుతున్నారు. ఇటీవలి వరకూ వేట సక్రమంగా సాగకపోయినా అప్పులు చేసి చేపల వేటకు బోట్లను పంపామని, ఇప్పుడు పూర్తిగా మునిగిపోవడంతో తాము కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునిగిన బోట్ల వివరాలివీ జీరో జెట్టీలో ఒకటి, 7వ నంబరు జెట్టీలో 4, 11వ నంబరు జెట్టీలో 3, 9వ నంబరు జెట్టీలో ఒకటి చొప్పున మరబోట్లు మునిగిపోగా... 9వ నంబరు జెట్టీలో మూడు ఫైబర్ బోట్లు మునిగిపోగా, 5 ఫైబర్ బోట్లు దెబ్బతి న్నాయి. అల్లిపిల్లి సత్యవతి, కె.సత్యనారాయణ, మైలపిల్లి పోలయ్య, మైలపిల్లి ఎర్రన్న, పుక్కళ్ల మస్తానమ్మ, సుగ్గళ్ల నూకరత్నం, సీహెచ్.వీర్రాజు, మేడ ఎల్లయ్యల బోట్లు నీటమునిగాయి. 11వ నంబరు జెట్టీలో మునిగిపోయిన బోటు యజమాని వివరాలు ఇంకా తెలియరాలేదు. గాలి తాకిడికి గుద్దుకున్నాయి తుపాను గాలి తీవ్రతకు జెట్టీలో కట్టి ఉంచిన మరబోట్లు తాళ్లను తెంచుకుని ఒకదాన్ని ఒకటి గుద్దుకోవడం వల్ల చెక్కలు పగిలి బోట్లు నీట మునిగిపోయాయి. మునిగిన బోట్ల వల్ల సుమారుగా రూ.3కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నాం. మత్స్యశాఖ అధికారులు, ప్రభుత్వం బోటు యజమానులను ఆదుకోవాలి. – పి.సి.అప్పారావు, బోటు యజమాని, మరబోట్ల సంఘం అధ్యక్షుడు మునిగిన బోటు పనికిరాదు బోటు ఉప్పు నీటిలో మునిగిపోవడంతో అందులో ఉన్న ఇంజిన్‌తో సహా ఏ పరికరమూ పనికిరాకుండా పోయింది. సుమారుగా రూ.30 లక్షల వరకూ నష్టపోయాను. నేను, నాస్నేహితుడు కలిసి బోటు నడుపుతున్నాం. ప్రభుత్వ అధికారులు ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు ప్రయత్నించాలి.– సీహెచ్.వీరరాజు, బోటు యజమాని ఇటీవలే రూ.3 లక్షలు వెచ్చించాను వేటకు వెళ్లి వచ్చిన తరువాత ఇటీవలే రూ.3 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయించాను. బోటు పూర్తిగా మునిగిపోవడంతో సుమారుగా రూ.35 లక్షల వరకూ నష్టపోయాను. ఇప్పటికే అప్పులు చేశాను. ఇప్పుడు పూర్తిగా ఊబిలో కూరుకుపోయాను.– సుగ్గళ్ల నూకరాజు, బోటు యజమాని నిండా మునిగిపోయాం బోటు నీటిలో మునిగిపోవడంతో నా కుటుంబం నిండా అప్పుల్లో మునిగిపోయింది. బోటును నీటి నుంచి వెలుపలికి తీసినా ఎందుకూ పనికిరాదు. ముక్కలుగా విడిపోయింది. రూ.30 లక్షల వర కూ నష్టపోయాను. అధికారులు తగిన చర్యలు తీసుకొని బోట్ల యజమానులను ఆదుకోవాలి. – కంబాలి హరి, బోటు యజమాని -
చలి చంపేసింది
అరకులోయ/పాడేరు/చోడవరం: పెథాయ్ తుపానుతో చలితీవ్రత పెరిగి వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. వీరిలో నలుగు రు గిరిజనులు కాగా ఒకరు మైదాన ప్రాంతవాసి. అరకులోయ మండలం పంచాయతీ కేంద్రమైన మాడగడ గ్రామానికి చెందిన గిరిజన రైతు శెట్టి అమ్మన్న (48) తన వరికుప్పను వర్షం బారి నుంచి కాపాడుకునే ప్రయత్నంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి బాగా తడిచాడు. రాత్రికి వరికుప్ప వద్దే బస చేశాడు. చలితీవ్రత అధికంగా ఉండడంతో సోమవారం తెల్లవారు సమయంలో ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే వణుకుతూ మృత్యువాతపడ్డాడు. అలాగే సోమవారం కురిసిన భారీ వర్షానికి ఇదే గ్రామానికి చెందిన గాజుల మంగ్లయ్య(40) అనే గిరిజన రైతు బాగా తడిచి రాత్రికి ఇంటికి వెళ్లాడు. చలితో వణుకుతూనే అతను కూడా రాత్రి 8 గంటల సమయంలో మృతిచెందాడు. ఇద్దరు గిరిజన రైతులు చనిపోవడంతో మాడగడ గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. చలితో వ ణుకుతున్న సమయంలో చలిమంటలు వేసి, రగ్గులు కప్పినప్పటికీ ఫలితం లేకపోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. అలా గే హుకుంపేట మండలం తడిగిరి పంచాయతీ ఇసుకగరువు గ్రామానికి చెందిన గిరిజన రైతు వంతాల మల్లన్న సోమవారం మధ్యాహ్నం నుంచి వర్షానికి తడిచి చలిగాలులను తట్టుకోలేక మంగళవారం తెల్లవారు జామున మృతి చెందాడు. పాడేరు మండలం ఇరడాపల్లి పంచా యతీ తురాయిమెట్టకు చెందిన బడ్నాయిని ఎండన్న అనే గిరిజనుడు కూడా సోమవారం రాత్రి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పెథాయ్ తుపాను కారణంగా భారీ వర్షం కురుస్తున్న సమయంలో వరి కుప్పలపై టార్పాలిన్ వేసేందుకు వెళ్లి పూర్తిగా తడిచిపోయాడు. తిరిగి రాత్రి ఇంటికి చేరుకున్న ఎండన్న చలికి తట్టుకోలేక మృతి చెందాడు. వృద్ధుడు మృతి చోడవరం మండలంలో ఆదివారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు మండలంలో గాలితో వర్షం కురిసింది. అధిక చలిగాలులకు మంగళవారం తెల్లవారుజామున బుచ్చెయ్యపేట మండలం రాజాం గ్రామానికి చెందిన మరిశా గజ్జంనాయుడు(65) అనే వృద్ధుడు మృతి చెందాడు. -
60 గంటలైనా ఆచూకీ లేదు
విశాఖపట్నం , నక్కపల్లి/ఎస్‌రాయవరం (పాయకరావుపేట): కాకినాడ నుంచి ఈ నెల 10న వేటకు వెళ్లి పెథాయ్ తుపానుకు సముద్రంలో చిక్కుకున్న రేవుపోలవరం, వాడచీపురుపల్లికి చెందిన ఐదుగురు మత్య్సకారుల ఆచూకీ ఇంకా లభ్యంకా లేదు. స్థానికంగా వేట సాగకపోవడంతో రేవుపోలవరం గ్రామానికి చెందిన వాడబదుల ప్రసాద్, వాడబదుల కోటి, «వాడబదుల ధనరాజ్తోపాటు వాడచీపురుపల్లికి చెందిన మసేను, ప్రసాద్ కాకినాడకు వలసవెళ్లారు. అక్కడినుంచి ఈ నెల 10న మెకనైజ్డ్ బోటుపై యజమానితోపాటు కూలికోసం సముద్రంలో వేటకు వెళ్లారు. సుమారు 30 నాటికన్ మైళ్ల దూరంలో వేట సాగిస్తున్నారు. ఒక సారి వేటకు వెళ్తే పదిరోజుల వరకు తిరిగిరారని, పదిరోజులకు సరిపడా ఆహార సామగ్రి తీసుకెళ్తారని బంధువులు, తోటి మత్య్సకారులు చెప్పారు. అయితే ఈనెల 10న వేటకు బయలు దేరిన వీరికి పెథాయ్ తుపాను సమాచారం అందింది. దీంతో వెనక్కి తిరిగి వచ్చే క్రమంలో సముద్రంలో అలల తాకిడికి వీరు ప్రయాణిస్తున్న బోటు గల్లంతయినట్లు స్థానికులకు సమాచారం అందింది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో తాము సురక్షితంగానే ఉన్నామని.. కంగారు పడొద్దని.. ఒడ్డుకు చేరుకుంటామని కుటుంబ సభ్యులకు తోటి మత్య్సకారులకు సమాచారం ఇచ్చిన వీరి ఆచూకీ తర్వాత లభించలేదు. సోమవారం ఉద యం నుంచి తుపాను తీవ్రవాయుగుండంగా మా రి కాకినాడ సమీపంలో తీరం దాటింది. ఈ సమయంలో సముద్రంలో అలలు మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. తిరుగు ప్రయాణంలో ఉన్న తమవారు ఏ రాత్రికైనా ఇళ్లకు చేరుకుంటారని ఆ«శపడ్డ ఆ కుటుంబాలకు నిరాశేఎదురైంది. మంగళవారం కూడా వీరి ఆచూకీ లభించలేదని కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. గల్లంతైన మత్య్సకారుల కోసం అధికారులకు ఫిర్యాదు చేశామని, కానీ ఎటువంటి సాయం అందలేదని, ఆచూకీ కనుగొ నడం కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన చెందుతున్నారు. గల్లంతైన వారు కేవలం వేటే ఆధారంగా కుటుంబాలను పోషిస్తున్నారు. మెకనైజ్డ్ బోట్లు, లైసెన్స్ కలిగిన ఇంజిన్ తెప్పలపై యజమానులతో పాటు, కూలికి వెళ్తుంటారు. ఒక్కో తెప్ప/ బోటులో ఆరునుంచి 8 మంది వెళ్తుంటారు. వీరు కాకినాడకు ఆరుమాసాల క్రితం వలస వెళ్లారు. ఈ నెలా ఖరుకు స్వగ్రామాలకు చేరుకోవాల్సి ఉంది. అయి తే తుపాను రావడంతో వీరంతా సముద్రంలో చిక్కుకోవడంతో ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారోతెలియక భయాందోళన చెందుతున్నారు. కాకినాడ నుంచి కోస్ట్‌గార్డ్ సిబ్బందిని పంపించి ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆచూకీ కనుగొనడంలో ప్రభుత్వం వైఫల్యం రేవుపోలవరం మత్య్సకారులు గల్లంతైన విష యం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు ఆ గ్రామాన్ని సందర్శించి బంధువులతో మాట్లాడా రు. అక్కడి నుంచి కాకినాడ వెళ్లారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. అధైర్యపడొద్దని, తాను జిల్లా ఎస్పీతో మాట్లాడి గల్లంతైన వారిని సురక్షితంగా ఇళ్లకు తీసుకువచ్చేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఐదుగురు మత్య్సకారులు గల్లంతయి మూడ్రోజులు గడుస్తున్నా ఆచూకీ కనుగొనే విషయంలో ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని బాబూ రావు విమర్శించారు. కోస్ట్‌గార్డ్ సిబ్బందిని పంపించి సహాయ కార్యక్రమాలు చేపట్టడంకూడా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గల్లం తైన వారిలో కడు పేదలున్నారని, సొంత తెప్పలు లేకపోవడంతో కూలి కోసం బోట్లపై యజమానులతో కలసి వేటకు వెళ్లారని చెప్పారు. గల్లంతైనవారి కోసం కుటుంబీకులు ఎంతో ఆతృతతో ఎదు రు చూస్తున్నారని, ఇప్పటిౖMðనా ప్రభుత్వం స్పం దించి కోస్ట్ గార్డులను సముద్రంలోకి పంపించి వెతికించాలని కోరారు. జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీతో ఫోన్లో మాట్లాడి సహాయక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. బాధిత కుటుంబా లకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. -
గల్లంతై.. గట్టున చేరి..
తూర్పుగోదావరి, కరప (కాకినాడ రూరల్): కరప మండలం ఉప్పలంక గ్రామం నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన రెండు బోట్లు పెథాయ్ తుపాను ప్రభావంతో గల్లంతయ్యాయి. వాటిల్లోని 14 మంది మత్స్యకారుల జాడ తెలియరాకపోవడంతో వారి కోసం కుటుంబ సభ్యులు, బంధువులు నిద్రాహారాలు మాని కళ్లల్లో ఒత్తులు వేసుకుని రేయింబవళ్లు ఎదురు చూశారు. తమవారిని క్షేమంగా ఇంటికి చేర్చాలని వేయి దేవుళ్లను వేడుకున్నారు. చివరకు వారి ప్రార్థనలు ఫలించాయో ఏమో కానీ, గల్లంతై న మత్స్యకారులు క్షేమంగా ఒడ్డుకు చేరారని మంగళవారం రాత్రి సమాచారం అందింది. ఒక బోటు అంతర్వేది వద్ద, మరో బోటు కొత్తపాలెం వద్ద ఉన్నట్టు మత్స్యశాఖ అధికారులు గుర్తిం చారు. వాటిల్లోని మత్స్యకారులను ఫోనులో మా ట్లాడించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చు కున్నారు. ఉప్పలంక గ్రామ మాజీ సర్పంచ్ బొమ్మిడి గంగావతి భర్త కామేశ్వరరావుకు చెందిన 3255 నంబరు బోటులో ఏడుగురు, ఆయన తమ్ముడు బొమ్మిడి శివకు చెందిన 3306 నంబరు బోటులో ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 12న సముద్రంలో వేటకు వెళ్లారు. పెథాయ్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో వెనక్కి వచ్చేయాలని వారికి బంధువులు సమాచారమందించారు. దీంతో వారు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో తుపాను తీవ్రత ఎక్కువవడంతో వారి బోట్లు సముద్రంలోకి వెళ్లిపోయాయి. ఒక బోటులో బొమ్మిడి శ్రీను (ఉప్పలంక), గంటా కృష్ణ (పగడాలపేట), సూరాడ అయ్యన్న (పగడాలపేట), అరదాడి రాము (పగడాలపేట), గేదెల ముసలయ్య (ఉప్పలంక), చోడిపల్లి సూర్యారావు (చొల్లంగి), లంకే ఏసు (ఉప్పలంక) ఉన్నారు. రెండో బోటులో ఆకుల వెంకటరాజు (ఉప్పలంక), గలగళ్ల కామేశ్వరరావు (పగడాలపేట), నీలపల్లి వీరబ్బాయి (పగడాలపేట), దండుప్రోలు వెంకటేశులు (చినవలస), ఓలేటి వీరబాబు (ఏటిమొగ), పంతాడి దుర్గ (ఉప్పలంక), పాలెపు ప్రసాద్ (ఉప్పలంక) ఉన్నారు. తమవారి జాడ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు మాజీ సర్పంచ్ గంగావతి ఇంటి వద్ద ఎదురు చూస్తున్నారు. బొమ్మిడి శివ తల్లి నూకరత్నం (మాజీ సర్పంచ్ గంగావతి అత్త) కుమారుని ఆచూకీ కోసం విషణ్ణవదనంతో ఎదురు చూసింది. గ్రామంలోని మహిళలు వచ్చి ఆమెకు ధైర్యం చెప్పారు. మూడేళ్ల క్రితం భర్త కామేశ్వరరావును పోగొట్టుకున్నానని, ఇప్పుడు ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. బోట్లు, మత్స్యకారుల గల్లంతు సమాచారాన్ని బంధువులు కోస్ట్‌గార్డ్, ఫిషరీస్ శాఖలకు అందించారు. కోస్ట్‌గార్డ్ కమాండెంట్ శ్యామ్‌కుమార్, విశాఖపట్నంలోని నేవీ డీఐజీ నవదీప్ రాజుల పర్యవేక్షణలో కోస్ట్‌గార్డ్‌కు చెందిన ఆరు నౌకలు, తూర్పు నౌకాదళానికి చెందిన రెండు నౌకలతో ప్రత్యేక బృందాలు గల్లంతైన బోట్ల కోసం గాలించాయి. కోస్ట్‌గార్డ్, నౌకాదళానికి చెందిన రెండు హెలికాప్టర్ల సహాయంతో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. కన్నబాబు పరామర్శ ఉప్పలంకలో బాధిత కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మంగళవారం పరామర్శించారు. సముద్రంలో చిక్కుకున్నవారు క్షేమంగా తిరిగి వస్తారని ధైర్యం చెప్పి ఓదార్చారు. మత్స్యకారుల గల్లంతు సమాచారాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫోనులో వివరించారు. జగన్మోహన్రెడ్డి స్పందించి, ఫోనులో మాజీ సర్పంచ్ గంగావతి భర్త కామేశ్వరరావుతో మాట్లాడారు. ‘‘అధైర్యపడకండి. వేటకు వెళ్లినవారందరూ క్షేమంగా తిరిగివస్తారు’’ అని ధైర్యం చెప్పారు. మరో 20 మంది క్షేమం కాకినాడ సిటీ: పెథాయ్ తుపానులో చిక్కుకున్న మరో మూడు బోట్లు తీరానికి చేరడంతో వాటిల్లోని మరో 20 మంది మత్స్యకారులు క్షేమంగా బయటపడ్డారు. నగరంలోని దుమ్ములపేట, పర్లోవపేట గ్రామాలకు చెందిన 13 మంది మత్స్యకారులు గత మంగళవారం రెండు బోట్లలో సముద్రంలో వేటకు వెళ్లారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో తిరిగి వస్తుండగా బోట్లలో ఆయిల్ అయిపోవడంతో సముద్రంలో ఉన్న ఓఎన్జీసీ ఆయిల్ రిగ్గుల వద్దకు వారు చేరుకున్నారు. అక్కడే బోట్లను నిలిపివేసి, వారిని రక్షించాలని మూడు రోజులుగా కోరినా అధికారులు స్పందించలేదని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. చివరకు ఒక రిగ్గు వద్ద ఉన్న ఏడుగురు మత్స్యకారులను కోస్టుగార్డు కమాండెంట్ పి.శ్యామ్‌కుమార్ ఆదేశాల మేరకు ఓఎన్జీసీ సిబ్బంది రక్షించి, రిగ్గులో ఆశ్రయం కల్పించారు. వారిని మంగళవారం ఉదయం కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్‌పై కాకినాడ తీసుకువచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదిలా ఉండగా మరో రిగ్గు వద్దకు చేరిన దుమ్ములపేటకు చెందిన వాసిపల్లి దానయ్యకు చెందిన బోటు తుపాను తీవ్రతతో సముద్రంలో మునిగిపోయింది. దానిపై ఉన్న ఆరుగురు కళాసీలను, పర్లోవపేటకు చెందిన వాడమొదలు కోటయ్య (బంగారయ్య) బోటుకు చెందిన మత్స్యకారులు రక్షించి, తమ బోటుపై ఎక్కించుకున్నారు. అందులో మరో ఏడుగురు మత్స్యకారులున్నారు. ఆయిల్ అయిపోవడంతో ఆ బోటు గాలివాటానికి మచిలీపట్నం వైపు వెళ్లి నాగాయలంక సమీపంలోని స్వర్ణగొందికి చేరుకుంది. మొత్తం 13 మంది మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. వారిని కాకినాడ తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. రెండు రోజులుగా ఎదురుచూస్తున్నాం సముద్రంలోకి వేటకు వెళ్లిన నా తమ్ముడు శివ, మరో 13 మంది ఇంతవరకూ తిరిగి రాలేదు. మూడేళ్ల క్రితం నా తండ్రి కామేశ్వరరావు వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. ఇంతలోనే ఇలా జరిగింది. వేటకు వెళ్లినప్పడు ఇటువంటివి జరుగుతాయని, మూడు రోజుల్లో తిరిగి వస్తారని ధీమాతో ఉన్నాం. శివకు పదేళ్ల నుంచి వేటకు వెళ్లే అనుభవం ఉంది. ఏదో దరికి చేరుతారని నమ్మకంగా ఉన్నాం. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకూ మాట్లాడాడు. సిగ్నల్స్ లేక సమాచారం అందడం లేదు. కోస్ట్‌గార్డ్, నేవల్ సిబ్బంది గాలిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కురసాల సత్యనారాయణ ఇతర నాయకులు వచ్చి పరామర్శించారు. జగన్మోహన్రెడ్డి సార్‌తో మాట్లాడించారు. చాలా ధైర్యం చెప్పారు. వారు క్షేమంగా ఉన్నారనే కబురు చెప్పలేని ఆనందాన్నిచ్చింది. – బొమ్మిడి కామేశ్వరరావు(మాజీ సర్పంచ్ భర్త), ఉప్పలంక -
‘పెథాయ్’ పేరిట హంగామా
కాకినాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పెథాయ్.. దాదాపు వారం రోజుల పాటు జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన తుపాను. గంటకోవైపు తిరుగుతూ ముప్పుతిప్పలు పెట్టిన ఈ తుపాను సోమవారం జిల్లా తీరాన్ని తాకింది. ఊహించినంత స్థాయిలో నష్టం లేకుండానే గండం గట్టెక్కడంతో జిల్లావాసులు ఊపిరి పీల్చుకున్నారు. తుపాను విరుచుకుపడినవేళ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసిన రాష్ట్ర ప్రజలను గాలికొదిలేసి, కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాల సంబరాల్లో మునిగితేలేందుకు సీఎం చంద్రబాబు వెళ్లిపోవడంపై ఊరూవాడా విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోకుండా రాజకీయాల కోసం రాష్ట్రాలు పట్టి తిరగడమేమిటంటూ ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలో సీఎం మంగళవారం హఠాత్తుగా జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ తుపాను వల్ల భారీ స్థాయిలో నష్టం లేకున్నా హడావుడి పర్యటనతో హంగామా చేశారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ చేసుకుంటూ ఉదయం 12 గంటలకు గాడిమొగ చేరుకున్న ఆయన నేరుగా ఐ.పోలవరం మండలం భైరవపాలెం వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన తుపాను పునరావాస కేంద్రంలో బాధితులతో ముచ్చటించారు. రెండు రోజులుగా ఇక్కడ పెద్దగా ఆశ్రయం పొందని తుపాను బాధితులందరినీ సీఎం వస్తున్నారంటూ బలవంతంగా రప్పించారు. అక్కడ సీఎం వారి సమస్యలు వినకుండా తన ప్రభుత్వ గొప్పలు చెప్పుకోవడంతో సరిపెట్టారు. ‘మీరొచ్చాక కరెంట్ బిల్లు రూ.500 వస్తోంది’ భైరవపాలెం వాసుల ఆవేదన ముఖ్యమంత్రి వచ్చారు కదా! తమ సమస్యలు చెప్పుకుందామని భైరవపాలెం గ్రామస్తులు ప్రయత్నించారు. అయితే, తాను చెప్పదలచుకున్నదే తప్ప బాధితుల గోడు వినేందుకు చంద్రబాబు ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఎన్ని రోజులుగా ఉన్నారు? భోజనాలు పెట్టారా? అని ఆరా తీశారే తప్ప వారి సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదు. తామంతా పొట్టకూటి కోసం ఇంటిల్లిపాదీ వేటకు వెళ్లిపోతామని, కానీ ఇంటి కరెంట్ బిల్లు ఏకంగా నెలకు రూ.500 వస్తోందని, గతంలో రూ.150 నుంచి రూ.200 వచ్చేదని గ్రామానికి చెందిన భూలక్ష్మి, వీరవేణి అనే మహిళలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కరెంట్ బిల్లులు కట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కా ఇళ్లు లేకపోవడం వల్లనే తుపాను సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని, తమకు ఇళ్లు మంజూరు చేయాలని తాతారావు తదితరులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఇలా ఒకరి తర్వాత మరొకరు తమ సమస్యలు చెబుతుంటే పట్టించుకోకుండా బయటకొచ్చిన ముఖ్యమంత్రి తనదైన శైలిలో తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఏకరవు పెట్టారు. మొన్న హుద్‌హుద్, నిన్న తిత్లీ, నేడు పెథాయ్ తుపాన్లను తానే ఎదుర్కొన్నానని చెప్పారు. గతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. ఆ వెంటనే ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం వెనుక తాను ఉన్నానని చెప్పారు. అనంతరం అక్కడినుంచి హెలికాప్టర్లో కాకినాడ చేరుకున్న చంద్రబాబు తుపాను నష్టం వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాటిని మీడియా సమావేశంలో వివరిస్తూ, హుద్‌హుద్, తిత్లీ మాదిరిగానే పెథాయ్‌ను జయించామని చెప్పారు. ఇదంతా తన గొప్పతనమేనన్నారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కంటే తానే గొప్పని, తాను తీసుకొచ్చిన అవేర్ సిస్టమ్ ద్వారానే తుపాను ఎక్కడ, ఎప్పుడు తీరం దాటబోతుందో పసిగట్టగలిగామని అన్నారు. తుపాను వేళ ప్రమాణ స్వీకారోత్సవాలకు వెళ్లడాన్ని సమర్థిచుకుంటూ.. అలా వెళ్తే తప్పేమిటని ఎదురు ప్రశ్న వేశారు. విపక్షాలు కావాలనే తనపై బురద జల్లుతున్నాయని అన్నారు. -
చినుకు పడితే కొంప కొల్లేరే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న చిన్నపాటి వర్షానికే ప్రధాన నగరాల్లో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై రెండు, మూడు అడుగుల మేరకు వర్షం నీరు పొంగి ప్రవహిస్తుండటంతో జనం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. భూగర్భ మురుగు నీటి కాల్వలు లేకపోవడమే ఈ దుస్థితి కారణం. డ్రైనేజీల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వర్షాలు కురుస్తున్నాయంటే చాలు నగరాలు, పట్టణాల్లో ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిత్య నరకం గుంటూరులో భూగర్భ మురుగు నీటిపారుదల పనులు స్థానికులకు నిత్యం నరకం చూపిస్తున్నాయి. నగరంలో రూ.960 కోట్ల విలువైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను షాపూర్జీ పల్లోంజీ సంస్థ దక్కించుకుంది. 2016లో ఈ పనులను ప్రారంభించింది. 526 కిలోమీటర్ల మేర మురుగునీటి కాల్వల నిర్మాణాలు, 47,000 మ్యాన్‌హోల్స్, 84,000 ఇన్స్పెక్షన్ ఛాంబర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే, నిర్మాణ సంస్థ ఇప్పటివరకు కేవలం 186 కిలోమీటర్ల నిడివిలోనే మురుగునీటి కాల్వల నిర్మాణాలు పూర్తి చేసింది. 21,000 మ్యాన్‌హోల్స్‌ను నిర్మించింది. పనులు అరకొరగానే జరగడంతో వర్షం వస్తే నగరం అతలాకుతలమవుతోంది. ప్రజల నుంచి ఎన్ని ఫిర్యాదులు అందినా నిర్మాణ సంస్థపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. వారానికోసారి జిల్లా అధికారులు సమీక్ష జరుపుతున్నా గుంటూరులో డ్రైనేజీ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. నెల్లూరులో సొంత ఇళ్లకు తాళాలు నెల్లూరు నగరంలో రూ.1,077 కోట్లతో మురుగునీటి పారుదల వ్యవస్థ పనులను ప్రభుత్వం చేపట్టింది. 2016లో మొదలైన ఈ పనులు 2018 డిసెంబరు నాటికి పూర్తి చేయాల్సి ఉంది. పనుల విషయంలో నిర్మాణ సంస్థ ఆలస్యం చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూగర్భ మురుగు కాలువులు లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. ఈ బాధలు భరించలేక నెల్లూరు కొందరు సొంత ఇళ్ల తాళాలు వేసి ఇతర ప్రాంతాల్లో అద్దెకు ఉంటున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. విశాఖపట్నంలో జెఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద రూ.1,289 కోట్లతో జరుగుతున్న భూగర్భ మురుగునీటి పారుదల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. సమన్వయ లోపమే శాపం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నంలో భూగర్భ మురుగునీటి పారుదల పనులకు నిధులు కేటాయించింది. విజయవాడలో ప్రస్తుతం 83 కిలోమీటర్ల మేర మేజర్ డ్రెయిన్లు, 258 కిలోమీటర్ల మేర మీడియం, 982 కిలోమీటర్ల మేర మైనర్ డ్రెయిన్లు ఉన్నాయి. వీటిని 12 నుంచి 18 అడుగుల వెడల్పుతో నిర్మించారు. నగరంలో పెరుగుతున్న జనాభా, పూడిపోయిన డ్రెయిన్లను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం రూ.464 కోట్లతో స్ట్రామ్‌వాటర్ డ్రైనేజీ పనులకు టెండర్లను ఆహ్వానించింది. 2016లో ఈ పనులను ఎల్అండ్టీ సంస్థ దక్కించుకుంది. విజయవాడలో 424 కిలోమీటర్ల నిడివిలో డ్రెయిన్లు నిర్మించేందుకు ఎల్అండ్టీ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రెండేళ్ల క్రితం పనులు ప్రారంభమ్యాయి. ఇప్పటిదాకా కేవలం 4 కిలోమీటర్ల మురుగునీటి కాల్వల నిర్మాణాలు జరిగాయి. మరో 36 కిలోమీటర్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మున్సిపల్, ప్రజారోగ్యశాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. -
పెథాయ్ మిగిల్చిన నష్టంతో.. పొలంలోనే కుప్పకూలి
మెళియాపుట్టి/తెనాలి రూరల్/పెదవేగి రూరల్ : అన్నదాత గుండె పగిలింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లెదుటే తుపాను ప్రభావంతో పాడవుతోందనే ఆవేదన అతని మనసును తొలిచేసింది. ఇంటికి చేరాల్సిన పంట నీటి మునిగితే అన్న ఆలోచనే తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. పంట గింజలను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. అంతలోనే ఉన్న ఫళంగా పొలంలోనే కుప్పకూలిపోయి మరణించాడు. పెథాయ్ రూపంలో వచ్చిన తుపాను శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని ఆ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇదే తరహాలో గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన ఓ రైతు కూడా ప్రాణాలు కోల్పోగా.. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో మరో రైతు తీవ్ర మనస్తాపానికి గురై నిద్రలోనే గుండెపోటుతో మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం కొసమాల గ్రామానికి చెందిన రైతు గొట్టిపల్లి చిన్నయ్య (69)కి నాలుగెకరాలు పొలంలో వరిసాగు చేశాడు. కోతలు పూర్తవడంతో కుప్పలు వేశాడు. అయితే పెథాయ్ తుపానుతో సోమ, మంగళవారాల్లో కురిసిన వర్షానికి పొలంలో నీరు చేరింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన చిన్నయ్య వరికుప్పల చుట్టూ చేరిన నీటిని మళ్లించేందుకు మంగళవారం పొలానికి వెళ్లాడు. అధికంగా నీరుచేరి ఉండడంతో నీటిని మళ్లించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు ఇది గమనించి వెళ్లి చూసేలోపే చిన్నయ్య ప్రాణాలు కోల్పోయాడు. కాగా, మృతినికి భార్య శాంతమ్మ, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. పంటను కాపానుకోవడానికి వెళ్లిన ఇంటిపెద్ద శవమై రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. నీటమునిగిన పంటను చూసి.. ఇక గుంటూరు జిల్లా తెనాలి ఐతీనగర్‌కు చెందిన రైతు కనపర్తి సుందరరావు (58) కూడా ఇదే తరహాలో ప్రాణాలు కోల్పోయాడు. కౌలుకు తీసుకున్న ఐదెకరాల్లో వేసిన వరిపంట కోతకు వచ్చింది. రెండ్రోజుల్లో కోతకు సిద్ధమవుతున్న తరుణంలో పెథాయ్ సుందరరావు గుండెల్లో తుపాను రేపింది. పంటను తీవ్రంగా దెబ్బతీసింది. చేనును చూసుకునేందుకు మంగళవారం వెళ్లిన అతను వాలిపోయిన పంటను చూసి తీవ్ర ఆందోళనకు గురై ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటి రైతులు అతని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణం విడిచాడు. మృతునికి భార్యా, ఇద్దరు కుమారులు. కొట్టుకుపోయిన పంట గురించి కలత చెంది.. మరో ఘటనలో.. ఆరుగాలం పడ్డ కష్టం తుపానుకు కొట్టుకుపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి గ్రామానికి చెందిన రైతు రాజులపాటి మల్లిఖార్జునరావు (39) కూడా రోజంతా తీవ్రంగా కలత చెంది చివరికి రాత్రి నిద్రలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. ఈయన ఐదెకరాల్లో మొక్కజొన్న వేశాడు. ఇప్పటివరకు రూ.రెండుల లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. పైరు ఏపుగా పెరిగింది. మంచి దిగుబడితో కష్టాలు తీరుతాయనుకుంటున్న సమయంలో పెథాయ్ తుపాను విరుచుకుపడడంతో పంట మొత్తం పాడైంది. దీంతో సాగుకు చేసిన అప్పులు తీర్చేదెలా అంటూ సోమవారం ఉదయం నుంచి మల్లికార్జునరావు తీవ్రంగా మథనపడుతున్నాడని అతని భార్య శివదుర్గ తెలిపింది. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో నిద్రలోనే గుండెనొప్పి వచ్చిందని.. ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని కన్నీటిపర్యంతమైంది. -
చలికే వణుకు!
సాక్షి, సిటీబ్యూరో: పెథాయి తుపాను ప్రభావంతో నగరంలో చలి గజగజ వణికిస్తోంది. సిటీలో ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూలేనంతగా పడిపోవడంతో శీతల పవనాలతో సిటీజనులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చలి నుంచి రక్షణ కోసం ఉన్ని దుస్తుల వైపు మళ్లుతున్నారు. ఎముకలు కొరికే చలిలోనూ ఒంటికి వెచ్చదనాన్ని ఇచ్చే పలు రకాల రగ్గులు ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. దీంతో నగర మార్కెట్లలో దేశీయ, విదేశీ రగ్గుల విక్రయాలు జోరందుకున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు చలిని తట్టుకోవడానికి స్వెటర్లు వాడుతున్నా.. రాత్రి పూట రగ్గులు కప్పుకోవాల్సిన అవ సరం ఏర్పడిందని నగర ప్రజలు చెబుతున్నారు. ఎన్నెన్నో రకాలు.. కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్టుగా వ్యాపారులు పలు రకాల దేశీయ, విదేశీ రగ్గులు విక్రయానికి ఉంచారు. సింథటిక్, క్విల్డ్, మింక్‌తో తయారైన దేశీయ రగ్గులు మార్కెట్లో అందుబాటులో ఉన్నట్లు వారు చెబుతున్నారు. లుథియానాలో ఉన్నితో తయారు చేసిన రగ్గులు దిగుమతి చేసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. టర్కీ, ఇరాన్, స్పెయిన్, కొరియా దేశాల్లో తయారైన విదేశీ రగ్గులను దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నట్లు మదీనా సర్కిల్లో మహ్మద్ క్యాప్ మార్ట్ నిర్వాహకుడు మహ్మద్ ఇల్యాస్ బుఖారీ తెలిపారు. ఆకర్షణీయమైన డిజైన్లలో.. దేశీయ రగ్గులు మాత్రమే మూడు నాలుగు రంగుల్లో అందుబాటులో ఉండగా.. విదేశీ రగ్గులు వివిధ రకాల కలర్స్‌తో పలు డిజైన్లలో మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఉన్నితో తయారైన దేశీయ రగ్గులు వెచ్చదనంతో పాటు అంతగా మృదువుగా ఉండవని, అదే విదేశీ రగ్గులు నున్నటి మింక్, సింథటిక్‌తో తయారవుతాయి కాబట్టి మృదువుగా ఉంటాయంటున్నారు. ఇవి అన్ని వయసుల వారూ కప్పుకోవడానికి అనుకూలంగా ఉంటాయని వారు చెబుతున్నారు. విదేశీ రగ్గులకు డిమాండ్ పెథాయి తుపాను ప్రభావంతో నగరంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. దీంతో ప్రజలు రాత్రిపూట కప్పుకోవడానికి రగ్గులు కొనుగోలు చేస్తున్నారు. లూథియానాలో తయారైన దేశీయ రగ్గులకు గతంలో ఎక్కువ డిమాండ్ ఉండేది. ప్రస్తుతం విదేశీ రగ్గులకు డిమాండ్ ఏర్పడింది. ఇవి వెచ్చదనంతో పాటు మృదువుగా ఉండటంతో వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. –మహ్మద్ ఇల్యాస్ బుఖారీ, మహ్మద్ క్యాప్ మార్ట్ నిర్వాహకుడు -
బడికి వెళ్తూ మృత్యుఒడిలోకి..
శ్రీకాకుళం, పాతపట్నం: మరి కొద్దిసేపట్లో పాఠశాలకు వెళ్లాల్సిన ఆ ప్రధానోపాధ్యాయుడిని విద్యుత్ స్తంభం రూపంలో మృత్యువు వెంటాడింది. పెథాయ్ తుఫాన్ గాలుల కారణంగా రోడ్డుకు అడ్డంగా నేలవాలిన స్తంభాన్ని గమనించక బైకుతో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం ఉమామహల్ వెనుకన ఉపాధ్యాయుల కాలనీలో నివాసముంటున్న పాగోటి ధర్మారావు(56) మెళియాపుట్టి మండలం ఆంపురం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఎప్పట్లాగే మంగళవారం ఉదయం 8 గం టలకు భార్య పార్వతికి చెప్పి పాఠశాలకు బైకుపై బయలుదేరారు. కొండల ప్రాంతంలో ఉండే ఆంపురం పాఠశాలకు సిగ్నల్ సమస్య ఉండటం తో ప్రతిరోజూ అదే దారిలో ఉన్న బడ్డుమర్రి పాఠశాలలో బయోమెట్రిక్ వేసుకుని వెళ్తుంటారు. మంగళవారం కూడా అదే మాదిరిగా బడ్డుమర్రి పాఠశాలలో బయోమెట్రిక్ హాజరు వేసుకుని బైకుపై ఆంపురం పాఠశాలకు బయలుదేరారు. సోమవారం కురిసిన వర్షం, ఈదురుగాలుల ధాటికి ఆంపురం–తెంబూరు రోడ్డులోని జామిచిన్నయ్యపేట వద్ద విద్యుత్ స్తంభం వాలిపోయి రోడ్డుకు నాలుగున్నర అడుగు ఎత్తులో ఉండిపోయింది. మంగళవారం ఉదయం కూడా వర్షం కురవడంతో ధర్మారావు రైన్ కోటు వేసుకుని బైకుపై వెళ్తుండగా విద్యుత్ స్తంభాన్ని గమనించక ఢీకొట్టారు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అంతకుముందే విద్యుత్ సిబ్బంది ఈ స్తంభాన్ని పరిశీలించి టిఫిన్ కోసం తెంబూరు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ప్రమా దం జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచా రం అందించడంతో సీఐ బి.ఎస్.ఎస్.ప్రకాష్, ఎస్ ఐ ఈ.చిన్నంనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పాతపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, శవపంచనా మా అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యుల కు అందజేశారు. ఆస్పత్రి వద్దకు కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. ధర్మారావు స్వగ్రామం పాతపట్నం మండలం బడ్డుమర్రి పంచాయతీ కాశీపురం. మూడేళ్లుగా ఆంపురం పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. మెళియాపుట్టి పీఆర్టీయూ మం డలశాఖ అధ్యక్షునిగానూ కొనసాగుతున్నారు. కుమారుడు ఇంద్రసేనాకుమార్ అవనిగెడ్డలో డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నాడు. కుమార్తె విజయవాడలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ధర్మారావు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలి పారు. విషయం తెలుసుకున్న పాతపట్నం, మెళి యాపుట్టి మండల ఎంఈఓలు బి.సింహాచలం, ఎస్.దేవేంద్రరావు, పాతపట్నం పీఆర్టీయూ మండలశాఖ అధ్యక్షుడు ఎ.జనార్దనరావు, అంబేడ్కర్ మండల యువజన సంఘం అధ్యక్షుడు సుదర్శన్, పలువురు ఉపాధ్యాయులు ఆస్పత్రికి చేరుకున్నారు. పీఆర్టీయూ నాయకుల సంతాపం శ్రీకాకుళం: మెళియాపుట్టి మండలంలో ఎల్ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న పాగోటి ధర్మారావు మంగళవారం జరిగిన ప్రమాదంలో మరణించడంతో పీఆర్టీయూ నాయకులు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ధర్మారావు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. సంతాపం తెలిపిన వారిలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు భైరి అప్పారావు, జిల్లా అధ్యక్షుడు పప్పల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పి.రవికుమార్, గౌరవాధ్యక్షుడు వి.హరిశ్చంద్రుడు, అసోసియేట్ అధ్యక్షుడు వైబీఎస్ ప్రసాదరావు, పత్రికా సంపాదక వర్గ సభ్యులు జి.యోగానంద్, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బలివాడ ధనుంజయరావు, బొంగు సత్యనారాయణ, ఎస్.ప్రసాదరావు, ఇ.గణపతి, జె.భరత్చరణ్ తదితరులు ఉన్నారు. -
మూగజీవాల మరణమృదంగం
పెథాయ్ తుఫాన్ జిల్లాలో మూగజీవాల పాలిట మృత్యువుగా మారింది. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో 990 పశువులు మృతి చెందాయి. వీటిలో ఆవులు, లేగదూడలు, గొర్రెలు, మేకలు తదితరమైనవి ఉన్నాయి. వీటి మృతితో రూ.లక్షల్లో నష్టం సంభవించింది. పశుసంవర్ధక శాఖ అంచనాల మేరకు మంగళవారం నాటికి 20 గేదెలు, 18 దూడలు, పది ఎద్దులు, 618 మేకలు, 324 కోళ్లు మృత్యువాత పడ్డాయి. పెంపకందారులు లబోదిబోమంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకొంటున్నారు. విజయనగరం ,గరివిడి: పెథాయ్ తుఫాన్ గొర్రెల పాలిట యమపాశమైంది. తుఫాన్ చలిగాలులకు మండలంలో 95 గొర్రెలు చనిపోయినట్టు రెవెన్యూ, పశు వైద్యాధికారులు గుర్తించారు. ఒక్క కుమరాం గ్రామంలోనే 71 గొర్రెలు మృతి చెందాయి. ఆ గ్రామానికి చెందిన వైగాల రాముడు, వైగాల పెద్దోడు, డొప్ప చిన్నయ్య, డొప్ప కర్రి అప్పయ్య, డొప్ప తాత, డొప్ప తవుడు, తొండ్రంగి తాత, వైగాల మాలచ్చి, వైగాల అప్పమ్మలకు చెందిన గొర్రెలు చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. వెదుళ్లవలస గ్రామంలో బందపు సత్యవతి, బందపు ఈశ్వరరావు, బందపు చిన్నయ్య, బందపు రాములు, వాకాడ అప్పయ్య, దువ్వాన నందినలకు చెందిన గొర్రెలు చనిపోయాయి. కొండశంభాం గ్రామంలో లెంక అసిరినాయుడుకు చెందిన గొర్రెలు చనిపోయాయి. మండలం మొత్తం తుఫాన్ కారణంగా చలికి తట్టుకోలేక 95 గొర్రెలు చనిపోయినట్లు గుర్తించినట్లు తహసీల్దార్ కె.సుభాష్‌బాబు, పశువైద్యాధికారిణి డాక్టర్ కమలకుమారి తెలిపారు. సతివాడలో 108 గొర్రెలు... తెర్లాం: మండలంలోని సతివాడ గ్రామానికి సమీపంలో మామిడితోటలో గొర్రెల మందల్లోని 108 గొర్రెలు, పిల్లలు తుఫాన్ వల్ల వీచిన గాలులకు చల్లి తట్టుకోలేక మృతి చెందాయి. చీపురుపల్లి మండలం పేరిపి గ్రామానికి చెందిన 11 మంది గొర్రెల కాపరులు వారి గొర్రెల మందలను సతివాడ గ్రామంలో మంద కాసేందుకు తీసుకొచ్చారు. పెథాయ్ తుఫాన్ వల్ల కురిసిన వర్షాలు వీచిన గాలులకు సోమవారం రాత్రి మృతి చెందాయి. పేరిపికి చెందిన బాగు చినప్పయ్య, రామప్పమ్మ, లక్ష్మి, శ్రీదేవి, సూర్యకళ, గంగిమ్మ, రామప్పమ్మ, కాకి రాములమ్మ, సూరీడు, చినప్పమ్మ, రాములమ్మ, ఆదిలక్ష్మిలకు చెందిన 108 గొర్రెలు, పిల్లలు చనిపోయాయి. మంగళవారం మందను వేరే ప్రాంతానికి తరలించేందుకు చూడగా అవి మృతి చెంది ఉండడాన్ని గుర్తించి బోరున విలపించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వి.రామస్వామి, ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. వివరాలు తెలుసుకున్నారు. చీపురుపల్లికి చెందిన మండల పశువైద్యాధికారితో పాటు గోపాలమిత్రలు వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. చలితో.. చీపురుపల్లి రూరల్: పెథాయ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవటంతో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. మండలంలోని రావివలస గ్రామంలో పొదిలాపు గణపతికి చెందిన రెండు గేదె దూడలు మృతి చెందాయి. ఇదిలా ఉండగా అలజంగి పంచాయతీ పరిధి ఎలకలపేట గ్రామం కాకి సూర్యనారాయణకు చెందిన 15 గొర్రెలు రాజాం సమీపంలో గల అగూరు కంచరాం వద్ద చలి తీవ్రతతో మృతి చెందాయి. చలి గాలులకు 17 గొర్రెలు... శృంగవరపుకోట రూరల్: తుఫాన్ చలిగాలులకు తట్టుకోలేక మండలంలోని కొట్టాం గ్రామంలో 17 గొర్రెలు మృతి చెందినట్టు గ్రామ రెవెన్యూ అధికారి గణేష్ మంగళవారం తెలిపారు. కొట్టాం గ్రామానికి చెందిన నెక్కళ్ల అబద్ధం, నెక్కళ్ల రాములమ్మ, టేకుబోయిన ఎర్నాయుడు తమ గొర్రెల మందలను విశాఖ జిల్లా పెందుర్తి మండలం, పెదగాడ గ్రామాని కి మందకు తీసుకువెళ్లారు. సోమవారం రాత్రి వీచిన గాలులకు 17 గొర్రెలు మృతి చెందాయి. తహసీల్దార్ ఎం.అరుణకుమారికి సమాచారం అందజేశారు. 32 మూగజీవాలు మృతి సాలూరు రూరల్: పెథాయ్ తుఫాన్ వల్ల వీచిన చలి గాలులకు సాలూరు, పాచిపెంట మండలాల్లో సుమారు 32 మూగజీవాలు మృతి చెందాయి. సాలూరు మండలంలో 2, పాచిపెంట మండలంలో 30 మూగజీవాలు మృతి చెందాయి. సాలూరు మండలంలో దుగ్దిసాగరం పంచాయతీలో పుల్లేరిగుడ్డివలసలో 1 ఆవు, ఒక దూడ మృతి చెందాయి. పాచిపెంట మండలంలో పద్మాపురం, కేసలి, కొటికిపెంట, పనుకువలస, బొర్రమామిడి పంచాయతీల్లో తెట్టేడివలసలో 4 మేకలు, కేసలిలో 2 గొర్రెలు, కోష్టువలసలో 4 గొర్రెలు, పెదచీపురువలసలో 4 మేకలు, బడ్నాయికవలసలో 2 ఆవులు, రాయివలసలో 1 మేక, 3 ఆవులు, బొర్రమామిడిలో 1 ఆవు, చినచీపురువలసలో 1 మేక, బడేవలసలో 6 మేకలు, సేరిగుడ్డిలో ఆవు దూడ, మెట్టగుడ్డిలో 1 మేక మృతి చెందినట్లు ఇన్చార్జి తహసీల్దార్ కుప్పిలి నాగేశ్వరరావు తెలిపారు. పశు వైద్యాధికారులు, సిబ్బంది, రెవెన్యూ అధికారులు పర్యటించి దర్యాప్తు నిర్వహించారు. చలి తీవ్రతతో.. మెంటాడ: ఈదురు గాలులతో ప్రారంభమైన పెథాయ్ తుఫాన్ చలికి తట్టుకోలేక పోరాంలో నాలుగు, ఉద్దంగిలో నాలుగు, జయితిలో 8, చింతలవలస ఆరు గొర్రెలు, మేకలు మృతి చెందాయి. సవరివల్లిలో రెండు ఎద్దులు మృతి చెందినట్లు పెంపకందారులు తెలిపారు. 22 గొర్రెలు మృతి గుర్ల: పెథాయ్ తుఫాన్ వల్ల రెండు రోజులుగా వీస్తున్న చలి గాలులకు 22 గొర్రెలు మృతి చెందాయి. మణ్యపురిపేటలో 14 గొర్రెలు, గుర్లలో 8 గొర్రెలు, చింతలపేటలో ఎద్దు మరణించాయి. రెండు రోజులుగా చలితీవ్రత అధికంగా ఉండడం వల్ల చలికి తట్టుకొలేక మరణించినట్లు పశువైద్యాధికారులు మంగళవారం తెలిపారు. గుర్లలోని గొర్రెల కాపరులను ఎంపీడీవో ఆమంచి కామేశ్వరరావు, ఈవోపీఆర్డీ అల్లు భాస్కరరావు పరామర్శించారు. గొర్రెల మృతి చెందిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహరం అందేలా చర్యల తీసుకుంటాం ఎంపీడీవో హమీ ఇచ్చారు. మృతి చెందిన పశువులు బొబ్బిలి రూరల్: పెథాయ్ తుఫాన్‌తో వీచిన చలి గాలులకు కారాడలో వై.గంగయ్య, వై.అప్పలస్వామిలకు చెందిన చెరో మేక మృతి చెందగా మెట్టవలసలో ఒక మేక చనిపోయింది. నారశింహునిపేటకు చెందిన పి.లకు‡్ష్మనాయుడుకు చెందిన ఆవు, దూడ మృత్యువాత పడ్డాయి. పెంపకందారులకు ప్రభుత్వ పరంగా సాయం అందేలా చూస్తామని పశువైద్యులు సుధాకర్, అనిత తెలిపారు. లెంకపేటలో... మెరకముడిదాం: మండలంలోని గర్భాం మేజర్ పంచాయతీ పరిధిలో గ్రామమైన లెంకపేట గ్రామంలో పెథాయ్ తుఫాన్ కారణంగా చలికి తట్టుకోలేక గ్రామానికి చెందిన కోరాడ చిన్నయ్యకు చెందిన ఐదు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పాటూ ఈదురు గాలుల వల్ల గొర్రెలు మృతి చెందాయి. -
తగ్గిన వానలు... పెరిగిన చలిగాలులు...
విజయనగరం గంటస్తంభం: పెథాయ్ తుఫాన్ తీరం దాటినా... చలిగాలులు మాత్రం గణనీయంగా పెరిగాయి. ఫలితంగా ఉష్టోగ్రతలు తగ్గడంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాన్ సోమవారం కాకినాడ వద్ద ఒకసారి, తుని వద్ద రెండోసారి తీరందాటిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం వల్ల జిల్లాలో ఆదివారం ఆర్ధరాత్రి నుంచి మొదలైన వర్షాలు సోమవారం తీవ్రరూపం దాల్చి ఆర్ధరాత్రి వరకు పడ్డాయి. తర్వాత తగ్గుముఖం పట్టి మంగళవారం ఉదయానికి ఆగాయి. తర్వాత వాతావరణం పూర్తిగా మారి వెలుతురు వచ్చింది. అయితే సాయంత్రం మాత్రం మళ్లీ గాలి చినుకులు, చిరుజల్లులు జిల్లాలో చాలాచోట్ల పడ్డాయి. 8.7సెంటీమీటర్ల వర్షపాతం తుఫాన్ మూలంగా జిల్లాలో ఏకంగా 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 16వ తేదీ రాత్రి నుంచి వర్షాలు పడటంతో17వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు 3 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. 17వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం వరకు కురిసిన వర్షాలకు 84.1 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. మొత్తానికి ఏకధాటిగా 87.1మిల్లీమీటర్లు(8.7సెంటీమీటర్లు) వర్షపాతం నమోదు కావడంతో జలం పొంగింది. సెప్టెంబర్ నెల నుంచి జిల్లాలో సరైన వర్షాలు లేవు. దీంతో భూగర్భజలాలు కూడా కిందకు పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో వర్షాలు పడ్డం జిల్లా ప్రజల కు ఉపశమనం కలిగించే అంశమే. వేసవిలో కొన్నాళ్లపాటు తాగునీటి ఇబ్బందులు తీరే అవకాశం ఉంది. చలిగాలులతో ఇబ్బంది తుఫాన్ తీరం దాటినా చలిగాలులతో జిల్లా ప్రజలు అవస్థలు పడుతున్నారు. మంగళవారం ఉదయం చెప్పుకోదగ్గ వర్షాలు జిల్లాలో లేవు. గాలి చినుకులు మాదిరిగా తుంపర్లు పడుతున్నాయి. మరోవైపు ఈదురుగాలుల వాడి తగ్గింది. అయినా చలిమాత్రం పంజా విసురుతోంది. ఉష్టోగ్రతలు ఏకంగా పడిపోయాయి. మంగళవారం ఉదయం జిల్లాలో 21, 20, 19 డిగ్రీలు ఉష్టోగ్రతలు నమోదు కావడం విశేషం. దీంతో చల్లని గాలులు వీయడంతో ఇంట్లో ఉన్నా దుప్పటి కప్పుకోవాల్సి వచ్చింది. లేకుంటే గజగజ వణకుతున్నారు. మరోవైపు ఇంటి బయటకు వస్తే నరకమే. స్వెట్టర్ల, మంకీ క్యాప్లతో చెవులు, ఒళ్లంతా కప్పినా చలిమాత్రం కాయడం లేదు. దీంతో బయటకు రావడానికే జనం భయపడ్డారు. వృద్ధులు, పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చలికి తట్టుకోలేక బాడంగి మండలం పాల్తేరులో వృద్ధురాలు వంగపండు పారమ్మ(82)మృతి చెందారు. సోమవారం, మంగళవారం చలిగాలులకు గొర్రెలు, మేకలు, పశువులు మృతి చెందాయని రైతులతోపాటు అధికారులు చెబుతున్నారు. దీన్ని బట్టి చలి తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పెథాయ్ తుఫాన్ ఇంకా సముద్రంలో కొనసాగుతోందనీ, ఒడిశా వైపు వెళుతుందని అధికారులు చెబుతున్నారు. అక్కడ తీరం దాటే వరకు చలిగాలులు తప్పవని చెబుతుండడంతో జిల్లా వాసులు అందోళన చెందుతున్నారు. -
పెథాయ్ బాధితులకు అండగా ఉండండి
సాక్షి, అమరావతి: పెథాయ్ తుపాను బాధితులకు పార్టీ నాయకులందరూ అండగా నిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా పాదయాత్రలో ఉన్న ఆయన పెథాయ్ తుపాను ప్రభావం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. తీరందాటిన సమయంలో గాలుల వేగం, వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలు, రైతుల పరిస్థితిపై ఆయా ప్రాంతాల నాయకుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. పలువురు పార్టీ నాయకులతో ప్రతిపక్ష నేత ఫోన్లో మాట్లాడారు. పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో తిరిగి నష్టాన్ని అంచనా వేయాలని, బాధితులకు, రైతులకు అండగా ఉండాలని ఆదేశించారు. పంటలు కోల్పోయిన రైతులకు పూర్తిస్థాయి సహాయం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జగన్మోహన్రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు. -
అన్నదాత గుండె పగిలింది
మెళియాపుట్టి/తెనాలి రూరల్/పెదవేగి రూరల్ : అన్నదాత గుండె పగిలింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లెదుటే తుపాను ప్రభావంతో పాడవుతోందనే ఆవేదన అతని మనసును తొలిచేసింది. ఇంటికి చేరాల్సిన పంట నీటి మునిగితే అన్న ఆలోచనే తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. పంట గింజలను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. అంతలోనే ఉన్న ఫళంగా పొలంలోనే కుప్పకూలిపోయి మరణించాడు. పెథాయ్ రూపంలో వచ్చిన తుపాను శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని ఆ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇదే తరహాలో గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన ఓ రైతు కూడా ప్రాణాలు కోల్పోగా.. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో మరో రైతు తీవ్ర మనస్తాపానికి గురై నిద్రలోనే గుండెపోటుతో మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం కొసమాల గ్రామానికి చెందిన రైతు గొట్టిపల్లి చిన్నయ్య (69)కి నాలుగెకరాలు పొలంలో వరిసాగు చేశాడు. కోతలు పూర్తవడంతో కుప్పలు వేశాడు. అయితే పెథాయ్ తుపానుతో సోమ, మంగళవారాల్లో కురిసిన వర్షానికి పొలంలో నీరు చేరింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన చిన్నయ్య వరికుప్పల చుట్టూ చేరిన నీటిని మళ్లించేందుకు మంగళవారం పొలానికి వెళ్లాడు. అధికంగా నీరుచేరి ఉండడంతో నీటిని మళ్లించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు ఇది గమనించి వెళ్లి చూసేలోపే చిన్నయ్య ప్రాణాలు కోల్పోయాడు. కాగా, మృతినికి భార్య శాంతమ్మ, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. పంటను కాపానుకోవడానికి వెళ్లిన ఇంటిపెద్ద శవమై రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. నీటమునిగిన పంటను చూసి.. ఇక గుంటూరు జిల్లా తెనాలి ఐతీనగర్‌కు చెందిన రైతు కనపర్తి సుందరరావు (58) కూడా ఇదే తరహాలో ప్రాణాలు కోల్పోయాడు. కౌలుకు తీసుకున్న ఐదెకరాల్లో వేసిన వరిపంట కోతకు వచ్చింది. రెండ్రోజుల్లో కోతకు సిద్ధమవుతున్న తరుణంలో పెథాయ్ సుందరరావు గుండెల్లో తుపాను రేపింది. పంటను తీవ్రంగా దెబ్బతీసింది. చేనును చూసుకునేందుకు మంగళవారం వెళ్లిన అతను వాలిపోయిన పంటను చూసి తీవ్ర ఆందోళనకు గురై ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటి రైతులు అతని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణం విడిచాడు. మృతునికి భార్యా, ఇద్దరు కుమారులు. కొట్టుకుపోయిన పంట గురించి కలత చెంది.. మరో ఘటనలో.. ఆరుగాలం పడ్డ కష్టం తుపానుకు కొట్టుకుపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి గ్రామానికి చెందిన రైతు రాజులపాటి మల్లిఖార్జునరావు (39) కూడా రోజంతా తీవ్రంగా కలత చెంది చివరికి రాత్రి నిద్రలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. ఈయన ఐదెకరాల్లో మొక్కజొన్న వేశాడు. ఇప్పటివరకు రూ.రెండుల లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. పైరు ఏపుగా పెరిగింది. మంచి దిగుబడితో కష్టాలు తీరుతాయనుకుంటున్న సమయంలో పెథాయ్ తుపాను విరుచుకుపడడంతో పంట మొత్తం పాడైంది. దీంతో సాగుకు చేసిన అప్పులు తీర్చేదెలా అంటూ సోమవారం ఉదయం నుంచి మల్లికార్జునరావు తీవ్రంగా మథనపడుతున్నాడని అతని భార్య శివదుర్గ తెలిపింది. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో నిద్రలోనే గుండెనొప్పి వచ్చిందని.. ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని కన్నీటిపర్యంతమైంది. -
అవి ప్రభుత్వ హత్యలే
సాక్షి, హైదరాబాద్ : పెథాయ్ తుపానుతో ఏడెనిమిది జిల్లాల్లో పంటలు దెబ్బతిని రైతుల గుండెలు ఆగిపోతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టించుకోకపోవడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ధ్వజమెత్తారు. పెథాయ్ తుపాను తీవ్రతపై కేంద్ర సంస్థలన్నీ గత నాలుగు రోజులుగా ఘోషించినా చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోకుండా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లారని, రాష్ట్ర ప్రజలు ఏమైనా ఫర్వాలేదన్న రీతిలో ఆయన ప్రవర్తించారని దుయ్యబట్టారు. విపత్తు సమయంలో చంద్రబాబుకు తెలంగాణ రాజకీయాలు, ఈవీఎంల వ్యవహారం అవసరమా? అని సూటిగా ప్రశ్నించారు. రైతుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని పేర్కొన్నారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నాగిరెడ్డి మాట్లాడారు. పంట నష్టంపై ప్రభుత్వ లెక్కలకు వాస్తవ నష్టానికి పొంతన లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి, సాగునీటి మంత్రి, రియల్‌టైమ్ గవర్నెన్స్ ప్రకటనలకు సంబంధం లేకుండా పోయిందన్నారు. అలాగే ముఖ్యమంత్రి, ఆయన తనయుడు లోకేష్ ట్విట్టర్లో ఏం పోస్టు చేస్తారో అర్థం కావడం లేదన్నారు. గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకూ 13 లక్షల హెక్టార్లు వరి సాగైందన్నారు. గుంటూరు జిల్లా పశ్బిమ డెల్టాలో పంట అంతా నీటిలో తేలియాడుతున్నట్లు ప్రభుత్వం అనుకూల పత్రికల్లోనే కథనాలు వచ్చాయన్నారు. 10 నుంచి 15 సెంటీమీర్ల వర్షం పడితే ఒక్క డ్రెయిన్ కూడా పని చేయక నీల్లు వెళ్లని పరిస్థితి ఉందన్నారు. నవంబర్‌లో పంటలు వచ్చేలా చర్యలు తీసుకున్నామని చంద్రబాబు చేసిన ప్రకటనపై నాగిరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పంటల సీజన్ మార్చేలా చర్యలు తీసుకోవడం ఏమిటి? మరి ఆర్టీజీఎస్‌లోనే 9 లక్షల పైచిలుకు హెక్టార్లలో పంటలున్నాయని ప్రకటన ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. సోమవారం సాయంత్రం తుపాను ప్రభావం ఆగిపోగా క్షేత్ర స్థాయిలో అధికారులు సందర్శించి పంట నష్టం అంచనాలు వేయకముందే మంత్రి, ముఖ్యమంత్రి, ఆర్టీజీఎస్ మధ్యాహ్నానికే నష్టం వివరాలు ఎలా వెల్లడిస్తారని నిలదీశారు. తుపాను బాధితులను మానవత్వంతో ఆదుకోవాలని, పబ్లిసిటీ చేసుకుంటూ కాలం గడపవద్దని చంద్రబాబుకు నాగిరెడ్డి హితవు పలికారు. -
ఐఎండీ కంటే.. నా టెక్నాలజీనే గ్రేట్
కాకినాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి, ముమ్మిడివరం/ఐ.పోలవరం: భారత వాతావరణ విభాగం (ఐఎండీ) కంటే తన టెక్నాలజీయే గ్రేట్ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇస్రోతో కలిసి ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చానని చెప్పారు. తాను తెచ్చిన అవేర్ వ్యవస్థ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందన్నారు. పెథాయ్ తుపాను కాకినాడ – ఒంగోలు మధ్య తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేయగా, తాను తెచ్చిన టెక్నాలజీ యానాం – తుని మధ్య అని చెప్పగలిగిందన్నారు. పెథాయ్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు తూర్పు గోదావరి జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం కాకినాడ కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ఐ.పోలవరం మండలం భైరవపాలెంలోని పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న నిర్వాసితులను పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ‘భవిష్యత్తులో తుపాన్లు ఎప్పుడు వస్తాయి? వాటి తీవ్రత ఎలా ఉండబోతుంది? ఎక్కడ తీరం దాటుతుందో చెప్పడమే కాదు. ఎన్ని చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు కూలిపోతాయి? ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఏ మేరకు నష్టం వాటిల్లబోతుందో కూడా చెప్పగలిగే స్థాయిలో టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. కోనసీమలో 22 ఏళ్ల క్రితం వచ్చిన తుపాను మొదలుకొని లైలా, హుద్‌హుద్, ఇటీవల తిత్లీ వరకూ అన్ని భారీ తుపాన్లనూ సాంకేతిక పరిజ్ఞానంతో తాను ఎదుర్కొన్నానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ స్థాయిలో తుపాను వచ్చినా పట్టించుకోలేదని విమర్శించారు. ప్రమాణ స్వీకారానికి హాజరైతే తప్పేంటి? రాష్ట్రాన్ని తుపాను చుట్టుముట్టిన సమయంలో కాంగ్రెస్ సీఎంల ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్తే తప్పేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. తాను జైపూర్ వెళ్లినా తన మనసంతా కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలపైనే ఉందన్నారు. ‘కృష్ణా నదిలో బోటు ప్రమాదం జరిగినప్పుడు అదే జిల్లాలో ఉన్నారు. శ్రీకాకుళంలో తిత్లీ తుపాను వచ్చినప్పుడు పక్కనే విజయనగరం జిల్లాలో ఉన్నారు. అప్పుడు బాధితులను పరామర్శించడానికి వెళ్లని ప్రతిపక్ష నేతలు నన్ను విమర్శించడమా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘ప్రత్యేక హోదా కోసం అడగరు, పోరాడరు. విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్‌ప్లాంట్, పెట్రో కెమికల్ కారిడార్ కోసం మాట్లాడరు. కరువు, తుపాన్లు వస్తే కేంద్రం డబ్బులివ్వకపోయినా పల్లెత్తు మాట అనరు. నన్ను మాత్రం విమర్శిస్తుంటారు. మొన్న హుద్‌హుద్.. నిన్న తిత్లీ.. నేడు పెథాయ్ తుపాన్లను సమర్థంగా ఎదుర్కొన్నాం. ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా అడ్డుకున్నాం’ అని సీఎం పేర్కొన్నారు. ప్రధాని పదవిపై తనకు ఆశలు లేవని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పట్లో ఆ ఆలోచన కూడా లేదని చెప్పారు. తుపాను సమయంలో నేలకొరిగిన చెట్లను తక్షణమే తొలగించేందుకు చర్యలు తీసుకున్న యంత్రాంగాన్ని, కలెక్టర్ కార్తికేయ మిశ్రాను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబు, అయితాబత్తుల ఆనందరావు, జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్‌తోపాటు విశాఖ, తూర్పు గోదావరి కలెక్టర్లు ఈ కార్యక్రమాల్లో సీఎం వెంట పాల్గొన్నారు. -
చలికి గజగజ...
ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల సంక్షేమం కోసం కోట్లాదిరూపాయలు ఖర్చు చేస్తున్నట్టు ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ఉంటాయి. వాస్తవానికి ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లిపోతున్నాయో ఆ పై వాడికే ఎరుక. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రభుత్వ హాస్టళ్లలోఉండే విద్యార్థులు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. సాక్షి, గుంటూరు: ప్రభుత్వ వసతి గృహాలు ఎక్కడ చూసినా విరిగిన తలుపులు, రెక్కలు లేని కిటికీలు వెక్కిరిస్తుంటాయి. శీతాకాలంలో విద్యార్థులు చలికి గజగజ వణుకుతూ ముడుచుకు పడుకోవాల్సిందే. ఓ పక్క తుపాను వచ్చి ఎన్నడూ లేని విధంగా భయంకరంగా చలిగాలులు వేస్తుంటే ప్రభుత్వం ఇంతవరకు వసతిగృహాల్లో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయలేదు. కొన్నిచోట్ల సరఫరా చేసినా నాణ్యత లేని వైనం, మరికొన్ని చోట్లా విద్యార్థులందరికీ సరిపడా దుప్పట్లు సరఫరా చేయని పరిస్థితి. జిల్లాలో 76 ఎస్సీ, 88 బీసీ, 33 ఎస్టీ వసతి గృహాలు ఉన్నాయి. అయితే వీటిలో చాలావరకూ వసతి గృహాలకు సరైన భవనాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా పాలకులు, అ«ధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లాలోని వేమూరు, వినుకొండ, గుంటూరు ఈస్ట్, వెస్ట్, తెనాలి, రేపల్లె సహా వివిధ నియోజకవర్గాల్లోని వసతి గృహాలు పశువులు ఉండే బందులదొడ్లను తలపిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలుమార్లు అధికారులు, అమాత్యుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి మార్పు లేదని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. చలికి వణకాల్సిందే... వాతావరణంలో వస్తున్న మార్పులతో రోజురోజుకు రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీనికి తోడు గత రెండు రోజులుగా పెథాయ్ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో వసతి గృహాల్లో విద్యార్థుల పరిస్థితి దైన్యంగా మారింది. వసతి గృహాల్లో గదులకు సరిగా తలుపులు, కిటికీలు లేకపోవడంతో చలికి గజగజ వణుకుతూ కిటికీలకు దుస్తులను అడ్డం పెట్టుకుని గడపాల్సివస్తోంది. డిసెంబర్ నెల సగం దాటినా నేటికి జిల్లా వ్యాప్తంగా వసతి గృహాల్లో పూర్తి స్థాయిలో దుప్పట్లు పంపిణీ కాలేదని తెలుస్తోంది. మరుగుదొడ్లు అంతంత మాత్రమే... జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మరుగుదొడ్ల సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో 100–150 వరకు విద్యార్థులు ఉన్న వసతి గృహాల్లో ఒకటి రెండు మరుగుదొడ్లు ఉంటే, మరికొన్ని చోట్ల మరుగుదొడ్ల ఉన్నా సరైన నిర్వహణకు నోచుకోని దుస్థితి. దీంతో విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆరుబయటకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. బాలికల వసతి గృహాల్లో సైతం ఇదే పరిస్థితులు నెలకొనడంతో ఆరుబయటకు కాలకృత్యాలకు వెళ్లడానికి విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సాధారణ రోజుల్లో ఎలాగోలా ఉన్నా వర్షాలు పడిన రోజు మాత్రం మరుగుదొడ్లు లేకపోవడం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు జిల్లాలోని పలు బాలికల వసతి గృహాల్లో భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. చాలావరకు ప్రభుత్వ బాలికల సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల వద్ద నైట్ డ్యూటీవాచ్మెన్లు లేకుండానే నిర్వహిస్తున్నారు. విజిలెన్స్ తనిఖీలు చేసినా అంతే... జిల్లాలోని వసతి గృహాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించినా వసతి గృహాల నిర్వహణలో మాత్రం మార్పు రావడం లేదు. గతంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి గురుకులాల్లో సిబ్బంది కొరత ఉన్నట్టు గుర్తించామని అధికారులు చెప్పారు. కనీస సౌకర్యాలు కూడా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వానికి నివేదికలు సైతం పంపారు. అయినా నేటికీ ప్రభుత్వ హాస్టళ్లలో మాత్రం మార్పు రాకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జ్ఞానభేరి సభలు అంటూ కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వృథా చేస్తున్న ప్రభుత్వ పెద్దలు విద్యార్థులకు సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. జిల్లాలో వసతి గృహాల దుస్థితి, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై పలుమార్లు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతులు ఇచ్చాం అయినా ఎటువంటి మార్పు లేదు. ఇప్పటికైనా నేతలు, అధికారులు స్పందించి సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు కనీస అవసరాలు కల్పించాలి.–భగవాన్‌దాస్,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు -
నిండు కుండలా ప్రకాశం బ్యారేజ్
సాక్షి, విజయవాడ : పెథాయ్ తుఫాను వల్ల కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజ్ నిండుకుండలాగా మారింది. పై నుంచి వచ్చి చేరే వరద నీటితో ప్రకాశం బ్యారేజ్ వద్ద గరిష్ట స్థాయికి చేరిం ది. దీంతో సోమవారం రాత్రి ప్రకాశం బ్యారేజ్ నుంచి క్రిందకు వరద నీటిని విడుదల చేయనున్నారు. వైరా, కట్టలేరు, మున్నేరు నుంచి కృష్ణానదిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కాల్వలకు నీరు బంద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తు ఉండటంతో ఇప్పటికే అనేక పంట పొలాలు నీట మునిగిపోయాయి. ఈ దశలో కాల్వలకు నీరు వదిలితే కాల్వల కట్టలు తెగిపోతాయని ఉద్దేశ్యంతో కాల్వలకునీరు వదిలి వేయడం నిలిపివేశారు. 2,175 క్యూసెక్కులు సముద్రంలోకి! కృష్ణానదిలో నీటి మట్టం గరిష్టంగా 12 అడుగులకు చేరింది. అప్పటికీపై నుంచి 3 వేల క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతోంది. దీంతో రాత్రి 7 గంటల ప్రాంతంలో మూడు గేట్ల ను ఒక అడుగు ఎత్తి 2,175 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. 5 నుంచి ఏడు వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలా లని అధికారులు భావించారు. అయితే పై నుంచి వచ్చే వరద నీటి ఉధృతిని బట్టి మంగళవారం ఉదయం గేట్లు సంఖ్య పెంచవచ్చని భావించిన తొలుత 3 గేట్లు మాత్రమే పైకి తీసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తం సముద్రంలోకి వరద నీటిని వదులుతున్నందున నదీ తీరప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీకాంతం హెచ్చరించారు. విజయవాడ, పెనమలూరు, తోట్లవల్లూరు, ఉయ్యూరు, తహసీల్దార్లు ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు నదిపరీవాహక ప్రాంతాల్లో దండోరా వేయించారు. నదిలోకి వెళ్లవద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాగా పెథాయ్ తుఫాను తీరం దాటడంతో మంగళవారం వర్షాలు తగ్గుతగ్గి వాతావరణం మార్పులు వస్తాయని భావిస్తున్నారు. -
అతలాకుతలం
‘పెథాయ్’ జిల్లాను అతలాకుతలం చేసింది. భారీ వర్షం, ఈదురుగాలులతో విరుచుకుపడింది. పలు ప్రాంతాల్లో చెట్లు,విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. మరోవైపు విపరీతమైన చలిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని రైతాంగం ‘పెథాయ్’ దెబ్బకు చేష్టలుడిగిపోయింది. కుంభవృష్టిగా కురిసిన వానకు వేల హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. దివిసీమ తీర ప్రాంతంలో సముద్రం ముందుకు చొచ్చుకువచ్చింది. బలమైన గాలులకు ఆయా ప్రాంతాల వాసులు బెంబేలెత్తిపోయారు. పునరావాస కేంద్రాల్లో అంతంత మాత్రంగానే సేవలు అందాయి. సాక్షి, కృష్ణాజిల్లా,మచిలీపట్నం: కొన్ని రోజులుగా బెంబేలెత్తించిన పెథాయ్ తుపాను కాకినాడ–యానం మధ్య తీరం దాటింది. జిల్లాకు తుపాను ముప్పు తప్పడంతో కృష్ణా వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే తుపాను ప్రభావంతో జిల్లాలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 10,000 హెక్టార్లలో పంట నష్టం.. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 3.49 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. వరి 2.49 లక్షల హెక్టార్లలో సాగు చేయగా.. ఇప్పటి వరకు 2.03 లక్షల హెక్టార్లలో తుపానుకు ముందే కోత చేసినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 46,000 హెక్టార్లలో పంట కోత, పనలపై ఉన్న దశల్లో ఉంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జి ల్లా వ్యాప్తంగా 10,000 వివిధ రకాల పంటలు నీట ము నిగాయి. అందులో వరి 8,231 హెక్టార్లు నీళ్లపాలైంది. పత్తి 270 హెక్టార్లు, మొక్కజొన్న 430 ఉండగా, మిగి లిన 1069 హెక్టార్లలో మిర్చి తదితర పంటలున్నాయి. జిల్లాలో వర్షపాతం ఇలా.. పెథాయ్ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 50 మండలాల్లో కుండపోత కురవగా.. అన్ని మండలాల్లో 20 మిల్లీ మీటర్లకు పైనే నమోదైంది. ఆదివారం రాత్రి 8.30 గంటల నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు పరిస్థితిని పరిశీలిస్తే.. జిల్లా వ్యాప్తంగా 69.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మండవల్లిలో 113.4 మిల్లీ మీటర్లు, గుడివాడ 102.2, పెనమలూరు 100.6, పెదపారపూడి 95.4, చల్లపల్లి 91.2, నందివాడ 81.2, గుడ్లవల్లేరు 79.7, అవనిగడ్డ 76.1, ఆగిరేపల్లి 76.4,ముదినేపల్లి 72.8 మొవ్వ మండలంలో 69.2గా నమోదైంది. సోమవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు జిల్లా సగటు వర్షపాతం 14.4 మిల్లీ మీటర్లుగా ఉంది. అత్యధికంగా జి.కొండూరులో 54.8 మిల్లీ మీటర్లు, వీరులపాడు 52.1, ఇబ్రహీంపట్నం 40.2, నందిగామ 36.7 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైంది. తీరం.. కల్లోలం.. తుపాను తీరం దాటే సమయంలో మంగినపూడి సముద్రంలో అలల కల్లోలం నెలకొంది. అలల ఉద్ధృతికి పెద్దగా శబ్ధాలు రావడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు. సముద్రం 20 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. నేడు పాఠశాలలు, అంగన్వాడీలకు సెలవులు తుపాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్న తరుణంలో మంగళవారం సైతం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, అన్ఎయిడెడ్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రటించినట్లు కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. ♦ బందరు మండలం చిట్టిపాలెం, అరిసేపల్లి, సుల్తానగరం, ఎన్ఎన్ గొల్లపాలెం, సీతారామపురం చిన్నాపురం, కానూరు, యాదర, పెదపట్నం గ్రామాల్లో వరి పంట నీట మునిగింది. ♦ వర్షాల కారణంగా గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రి కూడ కుప్పకూలింది. ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గుడివాడ రూరల్ మండలంలో వరి పనలు నీట మునిగాయి. ♦ అవనిగడ్డ మండలం బందలాయిచెరువులో వరి పనలు నీట మునిగాయి. ♦ నూజివీడు మండలంలో వరి పనలు, వరి మోపులు నీట మునిగాయి. బాపూనగర్‌లో చింతచెట్టు నేలవాలింది. తుక్కులూరులో మొక్కజొన్న పంట నీట మునిగింది. దేవరగుంటలో ఈదురు గాలులకు పడిపోయిన మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. బాలానగర్‌లో ఈదురుగాలులకు వందేళ్ల భారీ వృక్షం నేలకూలింది. ♦ నందివాడ మండలం పుట్టగుంట గ్రామం వద్ద బుడమేరు డ్రైన్ ఉధృతంగా ప్రవహిస్తోంది. ♦ జి.కొండూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం పొలాల్లో ఉండటంతో పట్టాలు కప్పుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. ♦ ఇబ్రహీంపట్నం మండలంలో వర్షానికి పంట పొలాల్లో వర్షపు నీరు చేరింది. వాటిని తొలగించుకునేందుకు ఆయిల్ ఇంజిన్లను పెట్టారు. ♦ ముదినేపల్లి మండలం దేవపూడి గ్రామంలో గ్రామం ముంపునకు గురైంది. ♦ ముసునూరు మండలంలో నీట మునిగిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇంజిన్లతో నీటిని తోడుతున్నారు. కాట్రేనిపాడులో పడిపోయిన నాటు పొగాకు పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
పెథాయీ.. నిరాశే!
పెథాయ్ తుపాను కోస్తా జిల్లాలను వణికిస్తూ భారీ వర్షాలతో అతలాకుతలం చేస్తున్నా నెల్లూరు జిల్లాపై దీని ప్రభావం లేదనే చెప్పాలి. తొలుత తమిళనాడు.. మచిలీపట్నం మధ్య కొనసాగిన తుపాను ప్రభావం నెల్లూరు జిల్లాపై ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. రైతులందరూ ఆనందపడ్డారు. భారీ వర్షాలు కురిస్తే చెరువులు, కుంటలు నిండుతాయని ఆశపడ్డారు. రబీకి ఇబ్బంది ఉండదని భావించారు. అయితే వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. పెథాయ్ తుస్సు మనిపించింది. సాధారణ వర్షపాతం కూడా నమోదు కాని పరిస్థితి. సాగునీటి కోసం అన్నదాతలు యథావిధిగా ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా వచ్చిన తుపాన్లు జిల్లా రైతాంగాన్ని నిరాశపరచడం.. లోటు వర్షపాతం నమోదు కావడం.. సాగుకు అవసరమైన నీటి సరఫరా విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయడంతో లక్షల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఈ ఏడాదీ జిల్లాలో సాధారణ వర్షపాతమే. నాలుగేళ్లలో వర్షాకాలంలో సైతం జిల్లాలో సగటు వర్షపాతం నమోదు కాని పరిస్థితి. ఈశాన్య, నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. జిల్లాలో చినుకు కూడా కురవని పరిస్థితి. దీంతో ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే తుపాన్లను నమ్ముకుని కొన్ని ప్రాంతాల్లో రబీ సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది తిత్లీ, గజతోపాటు పెథాయ్ తుపానులు వచ్చాయి. అవి కూడా అన్నదాతలను పూర్తిగా నిరాశపరిచాయి. దీంతో జిల్లాలో సాగు భారంగా మారింది. అన్నదాతలు సతమతమవుతూ ఎక్కువ ఖర్చు నీటి కోసమే కేటాయించి మరీ పంటలు పండిస్తున్నారు. ఈ ఏడాది రబీ సీజన్లో భాగంగా జిల్లాలో అధికార, అనధికార ఆయకట్టు మొత్తం కలుపుకొని 6.15 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. ప్రస్తుతం 70 వేల ఎకరాల్లో మాత్రమే సాగు మొదలైన పరిస్థితి. గతేడాది జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. తీవ్ర కరువు ప్రభావం, వర్షాభావం, సోమశిల నుంచి నీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం తదితర కారణాలతో సాగు విస్తీర్ణం 3.5 లక్షల ఎకరాలకు పడిపోయింది. గతేడాది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు బాగా కురవడం, సోమశిలకు ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండడంతో సుమారు 42 టీఎంసీల నీటిని సాగునీటి అవసరాలకు కేటాయించారు. కానీ ఈ ఏడాది పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించి జిల్లాలో సాగుకు ఎక్కువ నీరు ఇవ్వలేమని అధికారులు తేల్చి చెప్పారు. సోమశిలకు ఇన్‌ఫ్లో ఎక్కువ లేకపోవడంతో డెడ్‌స్టోరేజ్ లెవల్ పోను 32 టీఎంసీల నీటిని మాత్రమే సాగునీటి అవసరాలకు కేటాయిస్తామని ప్రకటించారు. డెల్టా ప్రాంతానికే పూర్తిస్థాయిలో నీరు ఇస్తే 24 టీఎంసీలు కేటాయించాల్సి ఉంటుంది. డెల్టా ప్రాంతంలోనే 2.47 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం అధికారికంగా ఉంది. కానీ అధికారులు మాత్రం అంత నీరు ఇవ్వలేమని చేతులెత్తేశారు. కనుపూరు, కావలి, కెనాల్స్ పరిధిలో అనధికార మోటర్ల ద్వారా నీరు పూర్తిగా తోడేయడంతో చివరి భూములకు అందని పరిస్థితి ఉంది. లోటు వర్షపాతం, ఆపై కరువు ప్రభావం జిల్లాలో నాలుగేళ్లుగా లోటు వర్షపాతం నమోదవుతోంది. వాస్తవంగా సాధారణ వర్షపాతం కన్నా 90 శాతం లోటు వర్షపాతం జిల్లాలో నమోదవుతూ వస్తోంది. అయితే అడపాదడపా కురిసే వర్షాల వల్ల కొంత సరాసరి పెరుగుతోంది. గతేడాది జిల్లాలో 54 శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటికే 62 శాతం దాటింది. తాజాగా పెథాయ్ ప్రభావంతో కేవలం నాలుగు శాతం వర్షపాతం మాత్రమే నమోదు కావడం గమనార్హం. మరోవైపు జిల్లాలో కరువు ఛాయలు కూడా మొదలయ్యాయి. ఈ ఏడాది ఉదయగిరి ప్రాంతాల్లో సాగుతోపాటు తాగునీటి ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉండడంతో అనేక గ్రామాలకు ట్యాంకర్ల నీరే ఆధారంగా మారింది. గతేడాది జిల్లాలో 34 మండలాలను కరువు మండలాలుగా సగటు వర్షపాతం ఆధారంగా ప్రకటించారు. ఈ ఏడాది జిల్లాలోని 46 మండలాలు నెల్లూరు రూరల్‌తో సహా అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం కరువు తీవ్రతకు నిదర్శనం. మొత్తం మీద పెథాయ్ తుపాను కూడా నిరాశ పరచడంతో మళ్లీ తుపాను ఈ సీజన్లో పంటలకు పనికొచ్చేలా వస్తుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు. -
పెథాయ్ ఎఫెక్ట్: వేలాది ఎకరాల్లో పంట నష్టం
సాక్షి, కృష్ణా/తూర్పు గోదావరి: పంట చేతికొచ్చే సమయంలో విరుచుకుపడ్డ పెథాయ్ తుపాన్ రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతిసింది. తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డ తుపాన్ భారీ నష్టాన్ని మిగిల్చింది. వేలాది ఎకరాల్లో పంట నీట మునగడంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అధికారులు అంచనా ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, 3,488 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 182 హెక్టార్లలో కూరగాయలు, 630 హెక్టార్లలో అరటి పంట, 21 హెక్టార్లలో మిరప, 4 హెక్టార్లలో ఉల్లి పంటకు నష్టం వాటిల్లింది. తెలిపారు. విద్యుత్ సరాఫరాకు పలు చోట్ల తీవ్ర అంతరాయం కలిగింది. ఉప్పాడ బీచ్ రోడ్ 6 కి.మీ మేర రోడ్డు పాడవ్వటంతో కోటి రూపాయల మేర నష్టం ఏర్పడింది. కాట్రేనికోనలో 250 విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. కృష్ణా జిల్లాలో పదివేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్నతో పాటు అనేక వాణిజ్య పంటలు నీటమునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా పలు ప్రాంతాల్లో నీటిలోనే చిక్కుకుని ఉండటంతో ప్రభుత్వం మంగళవారం కూడా పాఠశాలలకు, అంగన్ వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించింది. -
గజగజ
సాక్షి, సిటీబ్యూరో: పెథాయ్ తుపాను ప్రభావంతో గ్రేటర్ గజగజలాడుతోంది. సోమవారం రోజంతా చలితో సిటీజనులు వణికిపోయారు. పట్టపగలే ఆకాశంలో దట్టమైన మేఘాలు ఆవహించి కారుచీకట్లు కమ్ముకున్నాయి. కొన్నిచోట్ల తేలిక పాటి జల్లులు కురిశాయి. తేమతోకూడిన శీతలగాలులు అధికంగా వీయడంతో వృద్ధులు, చిన్నారులు, రోగులు విలవిల్లాడారు. మధ్యాహ్నం వేళలో సైతం శీతల గాలులు ఉక్కిరి బిక్కిరిచేశాయి. చలి తీవ్రత నుంచి శరీరాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ స్వెటర్లు, జర్కిన్లు, మంకీ క్యాపులు ధరించారు. చలి కారణంగా రహదారులు, పర్యాటక ప్రదేశాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు బోసిపోయి కన్పించాయి. సోమవారం నగరంలో 18 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు, గరిష్టంగా 27 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ..శీతల పవనాలవీస్తుండటం వల్ల చలితీవ్రత ఎక్కువగా నమోదైంది. రాగల 24 గంటల్లో నగరంలో వాతావరణంలో పెద్దగా మార్పులుండవని...అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. రోగులూ తస్మాత్ జాగ్రత్త..! ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వృద్ధులు, హృద్రోగ, ఆస్తమా బాధితులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్త వహించినా అనారోగ్యం ముప్పు తప్పదు. చలితీవ్రతకు చర్మం పొడిబారి, కాళ్లు, చేతులు, ముఖంపై పగుళ్లు ఏర్పడుతున్నాయి. పెదాలు చిట్లిపోతున్నాయి. ముఖ్యంగా టూ వీలర్‌పై ప్రయాణించే వారు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఇక మార్కెట్లో రెడీమేడ్‌గా దొరికే ఉన్ని దుస్తులు, జర్కిన్లు, మంకీ క్యాపులు, మఫ్లర్లను జనం కొనుగోలు చేస్తున్నారు. ఒక్కసారిగా వీటికి డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు. పొంచిఉన్న ఫ్లూ ముప్పు.. ‘చలితీవ్రత వల్ల వాతావరణంలో స్వైన్‌ఫ్లూ మరిం త బలపడే ప్రమాదం ఉంది. ఇప్పటికే నగర వా తావరణంలో పదిహేను రకాల ఫ్లూ కారక వైరస్లు ఉన్న విషయం తెలిసిందే. తాజా పరిస్థితుల్లో ఇవి మరింత విజృంభించే ప్రమాదం ఉంది. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు ఎక్కువగా దీని బారినపడే అవకాశం ఉంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఇలా ఒకరి నుంచి మరోకరికి గాలిద్వారా వ్యాపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వీరు సాధ్యమైనంత వరకు జన సమూహాంలోకి వెళ్లక పోవడమే ఉత్తమం’ అని జిల్లా స్వైన్‌ఫ్లూ విభాగం ఇన్చార్జి డాక్టర్ శ్రీహర్ష పేర్కొనారు. దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కన్పిస్తే..ఫ్లూగా భావించి చికిత్స కోసం వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సూర్యోదయం తర్వాత వాకింగ్ వెళ్లడమే మంచిది... ‘చలికాలంలో శరీరంలో ‘కార్టిసో’ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తనాళాల సైజును తగ్గించి, బ్లడ్క్లాట్కు కారణం అవుతుంది. వేసవి, వర్షాకాలంతో పోలిస్తే చలికాలంలో గుండె నొప్పికి అవకాశం ఎక్కువ. హృద్రోగ బాధితులు చలిలో తిరగకపోవడం మంచిది. వీరు సూర్యోదయం తర్వాతే వాకింగ్ చేయాలి. ఛాతి లో ఏ చిన్న నొప్పి ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి’ అని నిమ్స్‌కు చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ ఆర్వీకుమార్ సూచించారు. అంతేకాదు ‘చలితీవ్రత వల్ల ఆస్తమా బాధితుల్లో సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. వీరు ముక్కుకు మాస్క్‌లు ధరించాలి. రాత్రిపూట ఏసీ ఆఫ్ చేసి, తక్కువ స్పీడ్‌లో తిరిగే ఫ్యాను కిందే గడపాలి. సాధ్యమైనంత వరకు సిమెంటు, సున్నం, బొగ్గు, ఇతర రసాయన పదార్థాలకు దూరంగా ఉండటంతో పాటు మంచు కురిసే సమయంలో ఆరుబయట తిరగడం, వ్యాయామం చేయడం వంటివి చేయకూడదు. తాత్కాలిక ఉపశమనం కోసం ఉదయం ‘నాడిశోధన’ ప్రాక్టీస్ చేయాలి. ఊపిరి తీసుకోవడం మరీ కష్టంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంది’ అని కేర్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ రఫీ స్పష్టం చేశారు. -
పెథాయ్‌తో పెద్ద నష్టం
రఘునాథపాలెం/ఖమ్మంఅర్బన్/కామేపల్లి: నగరంలోని విలీన పంచాయతీల పరిధిలోని గ్రామాలు, రఘునాథపాలెం, కామేపల్లి మండలాల పరిధిలోని గ్రామాల్లో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి వందల ఎకరాల్లో వరి పంట, మిరపతోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తుండటంతో వరిపంట నేల మట్టమైంది. మిర పతోటల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో పాటు గాలులకు వందల ఎకరాల్లో పంట నేలవాలింది. రైతులు వరిపంట కోసి పంట పొలాల్లోనే ఉంచడంతో వర్షపు నీటితో పూర్తిగా మునిగిపోయాయి. కొందరు రైతులు వరి కుప్పలపై చేతికి వచ్చిన పంటను కాపాడుకొనేందుకు పట్టాలు కప్పుకున్నారు. వరి కుప్పలు ఉన్న వరి మడులలోకి వర్షపు నీరు చేరుతుండటంతో రైతులు గట్లకు గండ్లు పెట్టారు. నీటిలో మునిగిన వరి పంట చేతికి రాదని, నోటికాడికి వచ్చిన పంట వర్షంతో తీవ్రంగా నష్టపోయిందని, దీంతో తమకు ఆర్థికంగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
రాష్ట్రం విడిపోయిందని ఎవరయ్యా చెప్పింది..!!
సాక్షి, హైదరాబాద్ : ఏపీలో ‘పెథాయ్’ తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అసలైన శీతాకాలం రుచి తెలుస్తోంది. ఒక్కసారిగా ఊష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. ఓవైపు వర్షం. మరోవైపు చలితో ప్రజల దైనందిన కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. ఇళ్లలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. చలిగాలుల తీవ్రతకు పెథాయ్ ప్రభావిత శ్రీకాకుళం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మొత్తం 26మంది మృత్యువాత పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు ప్రాంతంలో మేతకు వెళ్లిన సుమారు వెయ్యి గొర్రెలు కూడా చలికి తట్టుకోలేక చనిపోయాయి. ఇక ఘటన ఎలాంటిదైనా తమ పాండిత్యాన్ని నలుగురితో పంచకోవడానికి వాట్సాప్ లాంటి సోషల్ ప్లాట్‌పామ్‌లలో కొందరు రెడీ అయిపోతారు. అటు ఏపీ, ఇటు తెలంగాణాల్లో దారుణమైన చలి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కొందరి కామెంట్లు వైరల్ అయ్యాయి. ఆంధ్రా తెలంగాణ విడిపోలేదనీ వారు అంటున్నారు. ఏపీలోని జనం తడిస్తే.. తెలంగాణ ప్రజలు వణుకుతున్నారని తమ చాతుర్యాన్ని బయటపెడుతున్నారు. ‘దేవుడా, ఓ మంచి దేవుడా.. అందరినీ చల్లగా చూడాలని వేడుకుంటే.. మరీ ఇంత చల్లగా చూడాలా స్వామి. మీకు ఇలా అర్థం అయిందా స్వామి. ఇక చాలు స్వామి చలితో విలవిల్లాడిపోతున్నాం. ఆంధ్రాలో తుపానుకి తెలంగాణలో వణుకుతున్నాం. ఎవరండి మేము విడిపోయామన్నది. వాళ్లు తడిస్తే మేము వణుకుతున్నాం. బంధం అంటే ఇదే కదా..!! అని చమత్కరిస్తున్నారు. -
తీరంలో భయం... భయం...
విజయనగరం, పూసపాటిరేగ: పెథాయ్ తుఫాన్ ధాటికి సముద్రం ఉగ్రరూపం దాల్చడంతో తీరప్రాంతంలో ప్రజలు క్షణం క్షణం భయం భయంగా గడుపుతున్నారు. సముద్రాన్ని ఆనుకొని వున్న గ్రామాల్లో బలంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో సముద్రకెరటాలు ఉవ్వెత్తున ఎగసి గ్రామాలను తాకుతున్నాయి. గ్రామాన్ని ఆనుకొని వున్న గుడిసెలు ఎగిరిపోయాయి. తిప్పలవలసలో యాంకర్‌తో లంగరు వేసిన 5 పడవలు సముద్రంలోని కెరటాల థాటికి మునిగిపోయాయి. రాత్రి సమయంలోసముద్రం ముందుకు వస్తే ఒడ్డున నిలిపిన పడవలు కొట్టుకెళ్లే ప్రమాదం ఉందని పలువురు మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. కొబ్బరి, సరుగుడు తోటలకు ఆపార నష్టం కలిగించింది. మండల పరిధిలో 300 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరిగి తీవ్రంగా నష్టపోయింది. కోనాడ, తిప్పలవలస గ్రామాల్లో పునరావాసకేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు భోజన వసతి కల్పిస్తున్నారు. పులిగెడ్డ, పతివాడ బర్రిపేట, తమ్మయ్యపాలెంలో గ్రామ ప్రత్యేక అధికారులు అందుబాటులో లేకపోవడంతో పునరావాసకేంద్రాలు ఏర్పాటు చేయలేదు. జాయింట్ కలెక్టర్ వెంకటరమణారెడ్డి కోనాడ గ్రామంలో పునరావాసకేంద్రాన్ని సందర్శించి బాధితులకు భోజన ఏర్పాట్లు చూశారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా నెలలు నిండిన కోనాడ గ్రామానికి చెందిన రోకళ్ల ఆదిలక్ష్మి అనే గర్భిణిని పూసపాటిరేగ పీహెచ్సీలో అత్యవసరంగా చేర్చడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. వాకీ టాకీల ద్వారా తిప్పలవలస, పతివాడబర్రిపేట గ్రామంలో రెడ్‌క్రాస్‌సొసైటీ సభ్యులు గ్రామంలో ప్రజలను అప్రమత్తం చేశారు. ఎటువంటి అపాయం జరగకుండా ముందుస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామాల్లో మత్స్యకారులకు అవగాహన కల్పించారు. కోనాడ, తిప్పలవలస గ్రామంలో పూసపాటిరేగ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది వైద్యశిబిరాలు నిర్వహించారు. తిప్పలవలసలో డీఆర్డీఏ పీడీ సుబ్బారావు, పతివాడబర్రిపేటలో జిల్లాపౌరసరఫరాల అధికారి ఎం.సుబ్బరాజు, చింతపల్లిలో జాయింట్ కలెక్టర్ వెంకటరమణారెడ్డి పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. -
వణికించిన పెథాయ్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాపై పెథాయ్ తుఫాన్ ప్రతాపాన్ని చూపిం చింది. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు భయాందోళనలో ఉన్నారు. చేతికంది వచ్చిన పంటలు నీటిలో మునిగాయి. మత్స్యకారులు వేటకు దూరమై ఆహారం, తాగునీరు కరువై ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయి కుటీర పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రజలు ఇంత కష్టంలో ఉంటే జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కనీసం ప్రజలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్ వెళ్ళిపోయారు. కేంద్ర మాజీ మంత్రిగానీ, జిల్లా ఎమ్మెల్యేలు గానీ ఏ ఒక్కరూ పరిస్థితిని సమీక్షించలేదు. బిక్కుబిక్కు మన్న జనం జిల్లాలో పెథాయ్ తుఫాన్ ప్రభావం ఎలా ఉంటుం దోనన్న భయంతో జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. తుఫాన్ తీరం దాటే సమయంలో భారీ ఈదురుగాలులు, వర్షాలు కురుస్తాయనే వాతావరణ వాఖ హె చ్చరికల నేపథ్యంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. అనుకున్నట్లుగానే జిల్లాలో ఎడతెరపి లేకుండా 49.8 మిమీ సగటు వర్షపాతం నమోదయ్యింది. అనూహ్యంగా తీర ప్రాంతాల్లో కంటేఅత్యధికంగా పాచిపెంటలో 96.6 మీమీ, సాలూరులో 84.8 మిమీ, గుర్లలో 75.4 మీమీ వర్షపాతం నమోదైంది. తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉన్న జిల్లాలో సాయంత్రానికి వర్షం ఉధృతమైంది. కుండపోత వర్షానికి భారీ గాలులు, చలిగాలులు తోడయ్యాయి. స్తంభించిన జనజీవనం తుఫాన్ ప్రభావంతో జిల్లాలో జనజీవనం స్తంభించింది. భారీ ఈదురు గాలులు, వర్షంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. చలిగాలులకు పల్లె, పట్టణ ప్రజలు చివురుటాకుల్లా వణికి పోయారు. అధికార యంత్రాంగం ముందస్తు చర్యల్లో భాగంగా పాఠశాలలకు సెలవు ప్రకటించినా కొన్ని ప్రవేటు స్కూళ్లు ఈ ఆదేశాలను లెక్కచేయకుండా యథావిధిగా తరగతులు నిర్వహించడంతో విద్యార్ధులు వారి తల్లిదండ్రులు అవస్థలు పడ్డారు, పలు లోతట్టు ప్రాంతాల వారిని ముందుగా గుర్తించి వారిని 17 సురక్షిత శిబిరాలకు అధికారులు తరలించారు. విజయనగరం నుంచి దూరప్రాంతాలకు వెళ్లే 21 బస్సు సర్వీసులను ఆర్టీసీ నిలిపివేసింది. పలు రైళ్లను రద్దుచేయడంతో పాటు కొన్నిటిని నియంత్రించారు. తుఫాన్ ప్రభావం తీర ప్రాంతంతో పాటు జిల్లాలో అంచనా వేసిన దానికన్నా కాస్తా తక్కువ ప్రభావం చూపడం, జిల్లా వ్యాప్తం గా ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. మరో రెండురోజులు వర్షాలు తుఫాన్ తీరం దాటినా వర్షాలు మరో రెండు రోజులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జిల్లాలో ఇప్పటికే దాదాపు 450 హెక్టార్లలో మొక్కజొన్న పంటకు న ష్టం వాటిల్లినట్టు అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. నష్టం విలువ సుమారు రూ.56.25 లక్షలు ఉంటుందంటుని వ్యవసాయశాఖ ప్రకటించింది. అయితే వరి పంటకు కూడా భారీ నష్టం వాటిల్లింది. వెలుగు సిబ్బంది సమ్మె, కొనుగోలు కేంద్రాల జాప్యం కారణంగా ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడంతో పొలాల్లోనే కుప్పలుగా ఉంచారు. అవన్నీ ఇప్పుడు తడిసిపోయాయి. ధాన్యం రంగుమారే అవకాశం ఉంది. ఇక పూసపాటిరేగ మండలంలో 30 హెక్టార్లలో అరటి, బొప్పా యి పంటలు దెబ్బతినడంతో రూ. 50లక్షల వరకూ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. చేపల కంచేరు గ్రామంలో 5 బోట్లు కొట్టుకుపోగా, 14 బోట్లు బోల్తా పడ్డాయి. ముక్కాంలో మరో బోటు దెబ్బతింది. వీటి నష్టం రూ.25లక్షలు ఉంటుందని మత్స్యశాఖ లెక్కగట్టింది. గాలులు వీస్తుండటంతో జిల్లా అంతటా విడతల వారీగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో చిన్న, మధ్య తరహా కుటీర పరిశ్రమలు మూతపడ్డాయి. వ్యాపార వాణిజ్య కేంద్రాలకు కొనుగోలుదారుల తాకిడి తగ్గడంతో వ్యాపారాలు మందగించాయి. పత్తాలేని ప్రజాప్రతినిధులు ఓ వైపు తుఫాన్ భయంతో జిల్లా ప్రజానీకం తల్లడిల్లుతుంటే వారికి అండగా ఉండి ధైర్యం చెప్పాల్సిన ప్రజాప్రతినిధులెవరూ పత్తాలేకుండా పోయారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహరలాల్ తుఫాన్ స్థితిగతులపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్ర మంత్రి సుజయ్ కూడా కేవలం టెలికాన్ఫరెన్స్కే పరిమితమయ్యారు. తుఫాను ప్రమాదం జిల్లాకు పొంచి ఉందని తెలిసి కూడా ఆదివార మే జిల్లా వదిలి వెళ్లిపోయారు. ఇక కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అశోక్‌గజపతిరాజు ఎక్కడున్నారో కూడా జనానికి తెలియదు. ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. -
పలు రైళ్ల రద్దు
విజయనగరం టౌన్: పెథాయ్ ప్రభావం రైల్వేశాఖపై పడింది. తుఫాన్ తాకిడి ఎక్కువగా ఉండడం, పెనుగాలులు వీస్తుండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈస్ట్‌కోస్ట్ రైల్వే శాఖ పలు రైళ్లను రద్దుచేసింది. మరికొన్నింటిని దారి మళ్లించారు. వీటితో పాటు రెగ్యులర్‌గా వచ్చే ప్యాసింజర్ రైళ్లతో పాటు, తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంతాల వైపు వెళ్లే రైళ్లను రద్దుచేసింది. ఆయా స్టేషన్లలో కొన్ని రైళ్లను నిలుపుదల చేసి, వాతావరణం అనుకూలంగా ఉన్న తర్వాతనే పంపిస్తోంది. ఈ మేరకు రైల్వే అధికారులు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా విజయనగరం రైల్వేస్టేషన్లో హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో కేవలం రిజర్వేషన్ల ద్వారా వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు, అత్యవసరమైన ప్రయాణాలు తప్ప మరెవరూ కానరాలేదు. గాలుల తాకిడి, మంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రయాణాలు వాయిదాలు వేస్తున్నారు. విజయనగరం మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను స్టేషన్లోనే గంటల తరబడి ఉంచేశారు. ప్రయాణికులకు తప్పని తిప్పలు రైళ్ల రాకపోకలకు కాస్త ఇబ్బందులు ఏర్పడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ముఖ్యంగా అయ్యప్ప దీక్షాపరులు ఇరుముడులతో బయలుదేరి, గంటల తరబడి స్టేషన్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. చిన్నారులతో ప్రయాణాలు చేసేవాళ్లు, వృద్ధులు చలిగాలులకు ఇబ్బందులు పడ్డారు. దారిమళ్లించిన రైళ్ల వివరాలు రైలు నంబరు 20809 సంబల్ పూర్ – నాందేడ్ ఎక్స్‌ప్రెస్ సంబల్పూర్ నుంచి టిట్లాఘర్, రాయపూర్, బల్లార్ష మీదుగా మళ్లించారు. రైలునంబరు 22663 హౌరా –యశ్వంత్‌పూర్ హౌరా నుంచి ఖర్గపూర్, టాటా, ఝార్సుగూడ, బిలాస్పూర్, బల్లార్ష మీదుగా పంపించారు. 18645 హౌరా– హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను హౌరా నుంచి ఖర్గపూర్, టాటా, ఝార్సుగూడ, బిలాస్పూర్, బల్లార్ష మీదుగా పంపించారు. 15906 దిబ్రూఘర్, కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌ను దిబ్రూఘర్ నుంచి ఖర్గపూర్, టాటా, ఝార్సుగుడ, బిలాస్పూర్, బల్లార్ష మీదుగా మళ్లించారు. 22605 పురులియా– విల్లుపురం ఎక్స్‌ప్రెస్‌ను పురులియా నుంచి హిజిలి, ఝార్సుగుడ, బిలాస్పూర్, బల్లార్ష మీదుగా మళ్లించారు. మరికొన్ని రైళ్ల సమయ వేళల్లో మార్పులు చేశారు. రద్దయిన రైళ్ల వివరాలిలా.. రైలు నంబరు 67292 విశాఖ – విజయనగరం ప్యాసింజర్, 67291 విజయనగరం–విశాఖ ప్యాసింజర్, 67294 విశాఖ– శ్రీకాకుళం ప్యాసింజర్, 67281 శ్రీకాకుళం రోడ్డు – పలాస ప్యాసింజర్, 67282 పలాస –విజయనగరం ప్యాసింజర్లను రద్దుచేశారు. 18న, 67293 విజయనగరం –విశాఖ ప్యాసింజర్‌ను రద్దుచేశారు. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే.. విజయనగరం రైల్వేస్టేషన్లో హెల్ప్‌డెస్క్ నంబర్లను కమర్షియల్ విభాగం అధికారులు ఏర్పాటుచేశారు. రైల్వేఫోన్ ద్వారా 83331, 83332, 83333, 83334 బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ : 08922–221202, 221206 బీఎస్ఎన్ఎల్ మొబైల్: 8500358610, 8500358712 ఎయిర్టెల్: 8106052987, 8106053006 -
గుబులు రేపి.. గాయం చేసి..
మూడు రోజులుగా ‘తూర్పు’వాసులను హడలెత్తించిన పెథాయ్ తుపాను ఎట్టకేలకు సోమవారం జిల్లాలోని కాట్రేనికోన మండలం వద్ద తీరాన్ని తాకింది. అనంతరం బలహీనపడి చివరకు యానాం – కాకినాడ మధ్య తీరాన్ని పూర్తిగా దాటింది. సాగరంలో ఉన్నప్పుడున్న తీవ్రత తీరం దాటిన తరువాత లేకపోవడంతో నష్టం తగ్గింది. అయినప్పటికీ ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.50 కోట్ల వరకూ నష్టాన్ని మిగిల్చింది. పైలీన్, హుద్‌హుద్, తిత్లీ, గజ తుపాన్లతో పోలిస్తే పెథాయ్ తీవ్రత బాగా తక్కువని జిల్లా ప్రజానీకం ఊపిరి పీల్చుకుంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ: పెథాయ్ తుపాను ఎక్కడ తీరం దాటుతుందన్న విషయాన్ని అధికారులు కచ్చితంగా అంచనా వేయలేకపోయారు. మచిలీపట్నం – కాకినాడ మధ్య అని ఒకసారి, కాకినాడ – తుని మధ్య అని ఇంకోసారి, కాకినాడ – విశాఖపట్నం మధ్య అని మరోసారి చెప్పారు. చివరికి తాళ్లరేవు – కాట్రేనికోన మధ్య తీరం దాటుతుందని సూచించారు. కానీ, వారి అంచనాలను తల్లకిందులు చేస్తూ కాట్రేనికోన వద్ద ‘పెథాయ్’ కేవలం తీరాన్ని తాకి, యానాం – కాకినాడ మధ్య తీరం దాటింది. అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్లకుండా భూభాగంపై పయనిస్తూ తుని వైపు మళ్లింది. అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్లి తీవ్ర వాయుగుండంగా మారి అద్దరిపేట వద్ద కేంద్రీకృతమైంది. ఇలా తొలి నుంచీ తికమక పెడుతూ వచ్చిన పెథాయ్ తుపాను చివరికి వాయుగుండంగా జిల్లాను విడిచిపెట్టింది. ఈ తుపాను కోనసీమపై తీవ్ర ప్రభావం చూపుతుందని, 1996 నాటి పీడకలను గుర్తు చేస్తుందేమోనని అందరూ భయపడ్డారు. అనుకున్నట్టుగానే ఆ మండలాల పైనే ప్రభావం చూపింది. కాకపోతే తీరం దాటేలోపే బలహీనపడడంతో వేగం మందగించి, పెనుముప్పు తప్పింది. తీరం దాటేలోపు ఈదురు గాలులు, కుండపోత వర్షంతో భయభ్రాంతులకు గురి చేసిన తుపాను తీరం తాకిన, దాటిన సమయంలో అంతగా ప్రభావం చూపలేకపోయింది. 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినప్పటికీ ప్రమాదకరపరిస్థితులు ఏర్పడలేదు. దీంతో తీరప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అల్లవరం నుంచి తుని వరకూ భారీ వర్షాలు కురిసినా, ఈదురు గాలులు వీచినా ఊహించినంత నష్టం సంభవించలేదు. అల్లకల్లోలం పెథాయ్ తుపాను కారణంగా అల్లకల్లోలంగా మారిన సముద్రం సోమవారం రాత్రి వరకూ ఉగ్రరూపం దాల్చింది. రెండు రోజులుగా 6 మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్న అలలతో, 30 మీటర్ల ముందుకొస్తూ తీరాన్ని కోసేస్తున్న సాగరం సోమవారం మరింత కల్లోలంగా మారింది. ముందుకు రావడమే కాకుండా అలలు ఎగసిపడడంతో అల్లవరం నుంచి తుని వరకూ తీర ప్రాంతం మరింత కోతకు గురైంది. రాకాసి అలలు విరుచుకుపడడంతో కాకినాడ – తుని బీచ్ రోడ్డుపై రక్షణ రాళ్లు కొట్టుకుపోయాయి. బీచ్ రోడ్డు ముక్కముక్కలైంది. కిలోమీటర్ల మీర కోతకు గురై ప్రమాదకరంగా మారింది. ఎక్కడెక్కడ ఏం జరిగిందంటే.. ♦ రాజోలులో చెట్లు పడి 33/11 కేవీ లైను దెబ్బ తింది. సబ్ స్టేషన్ బ్రేక్ డౌన్ అయింది. ♦ కొత్తపల్లి మండలం కోనపాపపేటలో ఇంటిపై చెట్టు కూలి ముగ్గురు గాయపడ్డారు. ♦ కరపలో 13 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ♦ కూనవరం మండలం టేకులబోరులో వర్షానికి పూరిల్లు కూలిపోయింది. ♦ ఆదివారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షానికి ఎటపాక పవర్‌గ్రిడ్ లైన్ దెబ్బతిని, 4 విలీన మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ♦ రాయవరం మండలం ఊలపల్లి – పందలపాక మెయిన్ రోడ్డుకు అడ్డంగా కొబ్బరి చెట్టు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ♦ కాజులూరు మండలం చేదువాడ వద్ద యానాం – గొల్లపాలెం రహదారిపై చెట్టు నేల కూలింది. ♦ అనపర్తి మండలం రామవరంలో కొబ్బరి చెట్టు కూలి కరెంట్ తీగలపై పడింది. ♦ కాట్రేనికోనలో విద్యుత్ స్తంభం కూలిపోవడంతో కారు నుజ్జునుజ్జయింది. కాకినాడ కలెక్టరేట్ వద్ద చెట్టు పడి, కారు దెబ్బతింది. ♦ తాళ్లరేవులో సెల్ టవర్ విరిగి పడిపోయింది. ♦ ముమ్మిడివరం మండలం గేదెల్లంకలో కొబ్బరి చెట్టు పడి పెంకుటిల్లు పాక్షికంగా ధ్వంసమైంది. ముమ్మిడివరం అభయాంజనేయ స్వామి ఆలయ ధ్వజస్తంభం విరిగిపడింది. ♦ సామర్లకోట మండలం ఉండూరులో రోడ్డుకు అడ్డంగా కొబ్బరి చెట్టు విరిగిపడింది. ♦ మండపేటలో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. ♦ కాకినాడ సూర్యారావుపేటలో మత్స్యకారుడు బోడు అప్పారావు ఇల్లు కుప్పకూలింది. ♦ కె.గంగవరం మండలం కుడుపూరులో కొబ్బరి చెట్టు పడి ఇల్లు దెబ్బతింది. ♦ కాకినాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి మెడికల్ వార్డు దగ్గర భారీ చెట్లు కూలి, విద్యుత్ లైన్లపై పడటంతో స్తంభాలు నేలకొరిగిపోయాయి. జరిగిన నష్టమిదీ.. ♦ తీరం దాటే ముందు కురిసిన కుండపోత వర్షానికి, భారీగా వీచిన ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు, సెల్‌టవర్లు నేలకొరిగాయి. చెట్లు పడి పలు వాహనాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. మరికొన్నిచోట్ల పూరిళ్లు, రేకుల ఇళ్లు నేలకూలాయి. కొన్నిచోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. ♦ జిల్లాలో 3,448 హెక్టార్లలో పండిన 19,390 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసి ముద్దయ్యింది. దీంతో రూ.33 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అధికారులు రైతుల నుంచి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయనందువల్లనే ఈ నష్టం జరిగింది. ♦ జిల్లాలో 2 వేల హెక్టార్లలో రూ.2 కోట్ల విలువైన పొగాకు పంటకు నష్టం జరిగింది. ♦ 817 హెక్టార్లలో ఉద్యాన పంటలకు రూ.1.97 కోట్ల నష్టం వాటిల్లింది. ♦ జిల్లావ్యాప్తంగా 40 వేల నుంచి 50 వేల ఎకరాల్లో నారుమళ్లు దెబ్బ తిన్నాయి. ఇక్కడ మళ్లీ నారు వేసుకోవలసిన పరిస్థితి నెలకొంది. ♦ ఇది కాకుండా చేతికందిన పత్తి పంట తుడిచిపెట్టుకుపోవడంతో రూ.6 కోట్ల నష్టం జరిగినట్టు అంచనా. ♦ గాలుల ధాటికి 86 కొబ్బరి చెట్లు, 70 ఇతర చెట్లు నేలకొరిగాయి. 17 ఇళ్లు కూలిపోయాయి. ఈ లెక్క మరింత పెరగనుంది. పడిపోయిన చెట్లు వందల్లో ఉండనున్నాయి. ♦ ఆర్టీసీ బస్సులు, రైళ్ల రద్దుతో రూ.కోటి ఆదాయానికి గండి పడింది. బస్సులు, రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ♦ తుపాను కారణంగా కాకినాడ పోర్టులో 15 నౌకల్లో ఎగుమతులు, దిగుమతుల కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. చాంబర్ ఆఫ్ కామర్స్ వర్గాల అంచనా ప్రకారం రూ.1.50 కోట్ల నష్టం వాటిల్లింది. ♦ లారీ రవాణా నిలిచిపోవడంతో రూ.1.50 కోట్లు, రోజంతా గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో రూ.10 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు స్తంభించిపోయాయి. ♦ రోజంతా ప్రదర్శనలు నిలిచిపోవడంతో సినిమా థియేటర్లు సుమారు రూ.25 లక్షల మేర ఆదాయం కోల్పోయాయి. ♦ పలుచోట్ల సెల్ టవర్లు నేలకొరిగాయి. ♦ ఆదివారం రాత్రి నుంచి ఈదురు గాలులతో వర్షం పడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 250 విద్యుత్ స్తంభాలు, 20 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బ తిన్నాయి. రెండు కిలోమీటర్ల మేర కేబుళ్లు తెగిపడ్డాయి. పడిపోయిన విద్యుత్ స్తంభాల సంఖ్య మరింత పెరగనుంది. ♦ 12 మండలాల పరిధిలోని 17 సబ్ స్టేషన్ల ఫీడర్లు దెబ్బతిన్నాయి. దీంతో జిల్లా కేంద్రం కాకినాడతో పాటు అనేక పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అధికారికంగా 96 గ్రామాల్లో మాత్రమే విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టు చెబుతున్నారు. సోమవారం రాత్రి వరకూ సరఫరా పునరుద్ధరణ జరగలేదు. మంగళవారం మధ్యాహ్నానికి పునరుద్ధరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారీవర్షాలు తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం ఉదయం 8.30 నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకూ సగటున 33.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సోమవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సగటున 46.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనేకచోట్ల పంట పొలాలు నీట మునిగాయి. వరి, అరటి, మొక్కజొన్న, చెరకు, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. ఆది, సోమవారాల్లో కలిపి అత్యధికంగా అమలాపురంలో 184.8, ఉప్పలగుప్తంలో 175, కాజులూరులో 153.4, కాట్రేనికోనలో 143.8, తాళ్లరేవులో 139.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
తలదాచుకునే తావేదీ!
తూర్పుగోదావరి, పిఠాపురం/గొల్లప్రోలు: సుమారు 30 వేల మందికి పైగా తుపాను బాధితులు. అంతమందికి ఆరేసి తరగతి గదులున్న ఎనిమిది పాఠశాలలే పునరావాస కేంద్రాలు. పట్టుమని పదిమంది పడుకుందామన్నావీలు లేనంత ఇరుకుగా గదులు. కరెంటు లేదు. తాగునీరు లేదు. మరుగుదొడ్ల మాటే లేదు. గత్యంతరం లేక ఇటువంటి అవస్థల నడుమనే పెథాయ్ తుపాను బాధితులు ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని పునరావాస కేంద్రాల్లో తల దాచుకోవాల్సి వచ్చింది. తుపాను ముప్పు ముంచుకువస్తోందని, ఇళ్లు వదిలి పునరావాస కేంద్రాలకు తరలిరావాలని, అన్ని వసతులూ కల్పించామని అధికారులు హడావుడి చేశారే తప్ప.. వసతుల కల్పనలో పూర్తిగా విఫలమయ్యారని బాధితులు విమర్శిస్తున్నారు. ఇవీ ఇబ్బందులు ♦ తమ వద్ద పేర్లు నమోదు చేసుకున్న వారికే పునరావాస కేంద్రాల్లో అధికారులు భోజనం పెట్టారు. ఇది తమను అవమానించడమేనని పలువురు వాపోయారు. ♦ పునరావాస కేంద్రాలు కేవలం భోజనాలు వండి పెట్టడానికే తప్ప వందల కుటుంబాలు తలదాచుకోడానికి, పిల్లాపాపలతో నిద్రించడానికి వీలు లేకుండా ఉన్నాయని పలువురు అన్నారు. భోజనం మాత్రమే పెడితే తమ సామగ్రిని ఇళ్ల వద్ద వదిలేసి పునరావాస కేంద్రాలకు ఎలా వస్తామని మత్స్యకారులు ప్రశ్నించారు. ♦ ఆదివారం రాత్రే శిబిరానికి వచ్చినా పాలు, రొట్టెల వంటివి లేక చంటి పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లులు వాపోయారు. పునరావాస శిబిరాలను సందర్శించిన వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు వద్ద పలువురు ఈ విషయమై ఆవేదన వ్యక్తం చేశారు. ♦ అన్ని పునరావాస కేంద్రాల వద్ద భోజనాలు ఏర్పాటు చేయకుండా ఒకచోట వండించి బాధితులకు లెక్క ప్రకారం తెచ్చి పెడుతున్నారని, దీంతో గంటల తరబడి ఆకలితో అలమటించాల్సి వచ్చిందని బాధితులు వాపోతున్నారు. ♦ మూలపేటలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉదయం అల్పాహారం పూర్తిస్థాయిలో సరఫరా చేయలేదు. దీనిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంటి పిల్లలకు పాలు లేవని మహిళలు మండిపడ్డారు. మధ్యాహ్నం రెండు గంటలయినా భోజనం పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు వదిలి కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు వచ్చిన తమకు కనీసం దుప్పట్లు కూడా ఇవ్వలేదన్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా తెలపలేదని అధికారులపై గ్రామస్తులు మండిపడ్డారు. ♦ వందల మందికి ఒకేచోట పునరావాసం ఏర్పాటు చేసినా మరుగుదొడ్లు, మంచినీరు, కరెంట్ వంటి వసతులు కల్పించలేదు. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ♦ రెవెన్యూ అధికారులు అసలు పునరావాస కేంద్రాల వద్దకే రాలేదని మత్స్యకారులు ఆరోపించారు. కొత్తపల్లి జెడ్పీ హైస్కూలులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో కేవలం ఉపాధ్యాయులే పర్యవేక్షకులుగా ఉన్నారు. దీంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నామని బాధితులు చెప్పారు. -
ఇది తుపాన్ల సమయం
తూర్పు తీరానికి ఇది తుపాన్ల సమయమే. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ ఈ ప్రాంతాన్ని తుపాన్లు పలకరిస్తుంటాయి. 50 ఏళ్లలో పది పెద్ద తుపాన్లను జిల్లావాసులు చూశారు. వాటిలో రెండు పెను విషాదాన్ని నింపాయి. తూర్పుగోదావరి, అమలాపురం: బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న తూర్పు తీరం తరచూ తుపాన్ల బారిన పడుతూనే ఉంది. సాధారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలల్లో తుపాన్లు వస్తుంటాయి. అర్ధశతాబ్ద కాలంలో పది పెద్ద తుపాన్లను తూర్పు తీరం చవిచూసింది. వాటిలో 1969, 1996లో వచ్చిన పెనుతుపాన్లకు జిల్లా భారీ మూల్యం చెల్లించుకుంది. అవి వందల కోట్ల ఆస్తినష్టమే కాదు.. భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. 1969లో వచ్చిన పెను తుపానులో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. 1996 నవంబర్ 6వ తేదీ రాత్రి వచ్చిన పెను తుపాను కోనసీమకు కాళరాత్రిని మిగిల్చిం ది. తీరంలో ఐదు నుంచి పది మీటర్ల ఎత్తున రాకాశి ఆలలు ఎగిసిపడ్డాయి. ఈ తుపానుకు సుమారు 560 మంది మృత్యువాత పడ్డారు. ఐ.పోలవరం మండలం బలుసుతిప్ప, భైరవపాలెం, కాట్రేనికోన మండలం చిర్రయానాం, పల్లం, మగసానితిప్ప, కొత్తపాలెం, బలుసుతిప్పలో వందలాది మత్స్యకారులు మృత్యువాత పడ్డారు. వేట పడవలు కొట్టుకుపోయాయి. ఈ తుపాను వేళ గంటకు 200 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. తొలుత తూర్పు నుంచి పడమరకు, తరువాత పడమర నుంచి తూర్పునకు పెనుగాలులు వీయడంతో కొబ్బరిచెట్లు ఈనుల్లా విరిగిపడ్డాయి. సుమారు 80 వేల ఎకరాల్లో కొబ్బరికి నష్టం వాటిల్లింది. 24 లక్షల కొబ్బరిచెట్లు నేలకు ఒరిగిపోగా, 33 లక్షల చెట్లు మొవ్వులు విరిగిపడ్డాయి. రహదారులపై భారీ వృక్షాలు పడ్డాయి. కొన్ని గ్రామాలకు వెళ్లడానికి అధికారులకు వారం రోజులుపైనే పట్టింది. 1996 తరువాత కొబ్బరికి నష్టం చేసిన తుపాన్లలో 2013 నవంబర్ 18న వచ్చిన హెలెన్ తుపాను ఒకటి. ఈ తుపానుకు కోనసీమలో 80 వేల కొబ్బరిచెట్లు నేలకొరిగాయి. 2010లో ఏకంగా రెందు తుపాన్లు జిల్లాను ముంచెత్తాయి. దీనిలో లైలా విచిత్రంగా మే నెలలో సంభవించగా, అదే ఏడాది నవంబరు నెలలో జల్ తుపాను వచ్చింది. ఇవి కాకుండా వాయుగుండాలు, అల్పపీడ ప్రభావంతో భారీ వర్షాలు కురవడం వందలాది ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిడం జిల్లాలో పరిపాటే. నష్టాల పాల్జేసిన తుపాన్లు సంవత్సరం తుపానుపేరు వచ్చిన తేదీ 1969 ను తుపాను డిసెంబర్ 6 1996 పెను తుపాను మే 17 2010 లైలా నవంబర్ 1 2010 జల్ అక్టోబర్ 28 2012 నీలం నవంబర్ 18 2013 హెలెన్ అక్టోబర్ 7 2014 హుద్‌హుద్ డిసెంబర్ 17 (తుని, ఏలేశ్వరం మండలాలు మాత్రమే) 2018 పెథాయ్ డిసెంబర్ 17 -
వణికించిన పెథాయ్
సాక్షి, విశాఖపట్నం: పెథాయ్ తుఫాన్ జనాన్ని వణికించింది. చలితోనే కాదు.. తుపాను ఎలాంటి ముప్పును తెచ్చిపెడుతుందోనన్న భయంతో విశాఖవాసుల్లో పెను ఆందోళన రేకెత్తించింది. మొన్న హుద్‌హుద్, నిన్న తిత్లీ తుపాన్లు సృష్టించిన బీభత్సమే వీరిలో భయోత్పాతాలను సృష్టించింది. అందుకనుగుణంగానే సోమవారం వేకువజాము నుంచి పెనుగాలులు, భారీ వర్షంతో పెథాయ్ తుఫాన్ సైతానులా విరుచుకుపడ బోతున్నానంటూ సంకేతాలిచ్చింది. తుపాను తీరం దాటే సమయంలో మరింతగా ఉధృతి పెరుగుతుందన్న సమాచారంతో ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో నంటూ జనం బితుకుబితుకుమంటూ గడిపారు. గాలులు, వర్షం గంట గంటకు పెరిగిపోతుండడం చూసి హెచ్చరికలు నిజమవుతాయని భీతిల్లారు. జోరు వర్షానికి చలి కూడా తోడైంది. వర్షం తగ్గినా చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. చలిని తట్టుకోలేక నగరంలోని ఆరోవార్డు ముసలయ్యపాలేనికి చెందిన కె.లక్ష్మి (65) అనే వృద్ధురాలు మృతి చెందింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉధృతంగా కురిసిన వర్షానికి, ఈదురుగాలులకు జనం భయంతో ఇళ్లలోనే ఉండిపోయారు. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. సోమవారం భీమిలిలో అత్యధికంగా 11, విశాఖ, అనంతగిరిల్లో 9, గొలుగొండ, పాయకరావుపేట, అరకు, డుంబ్రిగుడల్లో 7 సెం.మీల చొప్పున వర్షపాతం రికార్డయింది. మరోవైపు సోమవారం ఉదయం నుంచి జిల్లాలోని పాయకరావుపేట, యలమంచిలి నియోజకవర్గాల్లో తుపాను ప్రభావం చూపింది. పొరుగున ఉన్న తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వద్ద తుపాను తీరాన్ని దాటడంతో దాని ప్రభావం ఈ నియోజకవర్గాల్లోని పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల్లో పంటలకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఒక్క పాయకరావుపేట నియోజకవర్గంలోనే 3,500 వేల ఎకరాలు, అనకాపల్లిలో 200, మాడుగుల నియోజకవర్గంలో 1500, యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలో 2,000, అచ్యుతాపురంలో 500, చోడవరంలో 100, పెందుర్తిలో 100, అరకులోయ మండలంలో 100 ఎకరాల చొప్పున వెరసి 9 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అలాగే పాయకరావుపేటలో 500 ఎకరాల్లో అరటితోటలు దెబ్బతిన్నాయి. ఈ పంట నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈదురుగాలుల ధాటికి పాయకరావుపేట నియోజకవర్గంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. ముగ్గురు మత్స్యకారులు గల్లంతు తుపానుకు ముందు సముద్రంలో చేపలవేటకు వెళ్లిన జిల్లాలోని ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం గ్రామానికి చెందిన ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. కాకినాడలో ఉంటున్న వీరు ఈనెల 10న అక్కడ హార్బర్ నుంచి సముద్రంలోకి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఉండగా తుపాను గాలులకు వీరి బోటు గల్లంతయింది. అప్పట్నుంచి వీరి ఆచూకీ లభించకపోవడంతో వీరి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. -
గాలిలో గింగిరాలు
గోపాలపట్నం(విశాఖపశ్చిమ):పెథాయ్ తుపా ను ప్రభావం విమాన సర్వీసులపై విపరీతంగా చూపింది. విశాఖ నుంచి రాకపోకలు సాగిం చాల్సి విమానాలు బలమైన గాలి ఉధృతికి కొన్ని వెనక్కి మళ్లగా, మరి కొన్ని రద్దయ్యాయి. ఉదయం 7.15 గంటలకు దుబాయ్ నుంచి హైదరాబాద్ మీదుగా వచ్చిన ఎయిరిండియా విమానం గాల్లో చాలా సేపు చక్కర్లు కొట్టింది. విశాఖ విమానాశ్రయంలో రన్‌వేపై ల్యాండ్ అవడానికి ప్రయత్నించినా గాలి ఒత్తిడికి విమానం ఊగిపోయే పరిస్థితి రావడంతో దిగకుండానే హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. అదే సమయంలో ఢిల్లీ నుంచి విశాఖకు వచ్చిన ఇండిగో విమానం రన్‌వేని తాకినట్లే తాకి పైకెగిరిపోయింది. ఇది కూడా హైదరాబాద్‌కే వెళ్లిపోయింది. ఉదయం 8.30కు ముంబై నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖకు రావాల్సిన స్పైస్‌జెట్ విమానం ఇక్కడి వాతవరణ పరిస్థితుల వల్ల రాలేదు. ఇది కూడా హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. తిరిగి ముంబై వెళ్లిపోయింది. విశాఖ నుంచి బెంగళూరు, హైదరాబాద్ ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. అలాగే విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన స్పైస్‌జెట్ రద్దు చేశారు. మధ్యాహ్నం పోర్టుబ్లెయిర్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమాన సర్వీసు కూడా వెళ్లలేదు. మధ్యాహ్నం హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో సర్వీసు, బెంగళూరు సర్వీసులు కూడా రద్దయ్యాయి. విజయవాడ నుంచి మధ్యాహ్నం 12.10కు బయలుదేరి విశాఖకు ప్రయాణమైన అలెయన్స్ ఎయిర్‌లైన్స్ విమానం రాజమండ్రి వరకూ వచ్చి తిరిగి విజయవాడకే వెళ్లిపోయింది. ఇలా రాత్రి వరకూ 14 సర్వీసులు రద్దయ్యాయి. ఇలా విమానాల రద్దుతో దేశీయ ప్రయాణికులతో పాటు అంతర్జాతీయ ప్రయాణికులూ ఇబ్బందులు పడ్డారు. అత్యవసర ప్రయాణికులు దిక్కుతోచక, ఎవర్నీ నిందించలేక ...ఏం చేస్తాం..ప్రకృతి అనుకూలించకపోతే అంటూ దిగులుగా వెనుదిరిగి వెళ్లారు. మరి కొందరు ఉదయం నుంచి పడిగాపులు కాసి సాయంత్రం తర్వాత వచ్చిన విమానాలతో కనెక్టివిటీని పొంది గమ్యాలకు చేరుకున్నారు. సాయంత్రం తర్వాత వచ్చిన విమానాల్లో కోచి, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలకు సర్వీసులు గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా వచ్చినా అతి కష్టంమ్మీద వాలాయి. విమాన సర్వీసులు దిగే వరకూ ప్రయాణికుల్లో ఒకటే ఉత్కంఠ, భయాందోళనలు కనిపిం చాయి. ఇవాళ విశాఖ వస్తామనుకోలేదంటూ దిగిన వారు సంతోషం వ్యక్తం చేశారు. -
ఫిషింగ్ హార్బర్‌పై తీవ్ర ప్రభావం
పాతపోస్టాఫీసు(విశాఖదక్షిణ): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో పాటు మత్స్యశాఖ అధికారులు, వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో వేటకు వెళ్లిన పడవలు ఫిషింగ్ హార్బర్‌కు చేరుకుని లంగరు వేసుకున్నాయి. సోమవారం కుండపోత వర్షం కురిసింది. దీంతో ఫిషింగ్ హార్బర్లో నరసంచారం లేకుండా పోయింది. ప్రతి రోజు బోట్ల నుంచి దిగుమతి అయ్యే చేపలకు స్థానిక మార్కెట్లో గిరాకీ ఉంటుంది. అదేవిధంగా రొయ్యలు, చేపలు ఎగుమతి చేసేందుకు ప్యాకింగ్ కుర్రాళ్లతో నిరంతరం సందడిగా కనిపించే హార్బర్ సోమవారం బోసిపోయింది. జెట్టీలలో బోట్లను కట్టేసిన కలాసీలు ఇళ్లకు వెళ్లిపోయారు. అలల తాకిడికి జెట్టీల వద్ద లంగరేసిన బోట్లు ఒకదాన్ని ఒకటి తాకుతూ నీటిలో పైకి కిందకు కదిలాడాయి. ఎండుచేపల మార్కెట్లో టార్పాలిన్లు కప్పినా చేపలు తడిసిపోయాయి. దీంతో ఉసూరమంటూ మత్స్యకారులు ఇంటికి వెళ్లిపోయారు. లక్షల్లో వ్యాపారం నష్టం వచ్చిందని మత్స్యకార మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిషింగ్ హార్బర్ మీద ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా బతికే వేలాది మంది తుపాను కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మరబోట్ల సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులందరికీ తుపాన్లు అలవాటేనని అయితే గత మూడు, నాలుగు సంవత్సరాలుగా వస్తున్న తుపాన్లు తీవ్రరూపం దాల్చడంతో మత్స్యకారులు కూడా భయపడాల్సి వస్తోందని చెబుతున్నారు. ఎగిసిపడుతున్న అలలు సముద్రం ఎగిసిపడుతూ అల్లకల్లోలంగా ఉండడంతో ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్న బోట్లను ఒకదానికి ఒకటి తగిలి పగిలిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలల ఉధృతి అధికంగా ఉండడంతో బోట్లు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నా ఏ క్షణానికి ఏమవుతుందో తెలియక బోట్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. -
క్షణ క్షణం.. భయం..భయం
విశాఖపట్నం , నక్కపల్లి/పాయకరావుపేట: పెథాయ్‌తో ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని తీరప్రాంత వాసులు ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడిపారు. తుపాను కారణంగా బలమైన ఈదురు గాలులతో భయానక వాతావరణం చోటుచేసుకుంది. తీరం అలకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. సాధారణ రోజుల్లో కంటే పది మీటర్లు ముందుకు వచ్చాయి. పాయకరావుపేట మండలం పెంటకోట, రాజానగరం, రాజవరం, పాల్మన్‌పేట, రత్నాయంపేట, వెంకటనగరం, నక్కపల్లి మండలం రాజయ్యపేట, బోయపాడు, దొండవాక, బంగారయ్యపేట ,పెదతీనార్ల ప్రాంతాల్లో తీరం కోతకు గురైంది. ఒడ్డున లంగరు వేసిన తెప్పలు అలల «తాకిడికి చెల్లా చెదురయ్యాయి. అక్కడక్కడ కొన్నిపాడయ్యాయి. ఈ పరిస్థితితో మత్స్యకారులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ఆదివారం రాత్రి ప్రారంభమైన వర్షం సోమవారం అంతా కుండపోతగా పడింది. రెండు రోజుల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలులకు చెట్లు, కొమ్మలు పడి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తీగలు తెగిపడ్డాయి. జనం భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు రాలేదు. బస్సులు, రైళ్లు తిరగకపోవడంతో పలువురు ప్రయాణాలు రద్దుచేసుకున్నారు. అధికారులు అప్రమత్తం.. పెథాయ్‌తో ఎటువంటి ప్రాణనష్టం చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను ప్రభావిత గ్రామాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జేసీ సృజన ఆది,సోమవారాల్లో పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌రాయవరం మండలాల్లో పర్యటించి అధికారులకు సలహాలు, సూచనలు అందించారు. తుపాను వల్ల ఇబ్బందులు పడుతున్నవారికి, వేటకు వెళ్లకుండా ఇంటివద్ద ఉండిపోయిన వారికి పునరావాస కేంద్రాల్లో భోజన సదుపాయం కల్పించారు. బలహీన పడే వరకు బెంగే.. కాకినాడ వద్ద తీరం దాటిన పెథాయ్ మళ్లీ తుని సమీపంలో వాయుగుండం రూపంలో తీరాన్ని తాకే అవకాశం ఉందంటూ సాయంత్రం వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. తుని సమీపంలో తీరం దాటితే కనక దీని ప్రభావం పాయకరావుపేట, నక్కపల్లి మండలాలపై ఉంటుంది. దీంతో అధికారులంతా గ్రామాలకు పరుగులు తీస్తున్నారు. తీరానికి ఆనుకుని రాజయ్యపేట, బోయపాడు, బంగారయ్యపేట, అమలాపురం పెదతీనార్ల, చినతీనార్ల, దొండవాక గ్రామాలున్నాయి. సోమవారం సాయంత్రానికి ఈ రెండు మండలాల్లోను పెద్దగా నష్టమేమీ జరగలేదు.అయితే సోమవారం అర్ధరాత్రికి మళ్లీ తుని సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్న హెచ్చరికలు అధికారులను, ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సహాయ కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ.. తుపాను సహాయ కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ నాయకులు తమవంతు సాయం చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త వీసం రామకృష్ణ సూచనల మేరకు అమలాపురం మాజీ సర్పంచ్ సూరాకాసుల గోవిందు, సీడీసీ మాజీ చైర్మన్ గూటూరు శ్రీనులు తీరప్రాంత గ్రామాలకు ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరా చేశారు. ఎక్కడైనా చెట్లు కూలిపోతే తొలగించడానికి ట్రాక్టర్లు, పొక్లెయిన్లను అందుబాటులో ఉంచారు. -
ప్రకాశం బ్యారేజీలోకి భారీ వరద నీరు
సాక్షి, విజయవాడ : పెథాయ్ తుపాను ధాటికి ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీలో 12 అడేగుల మేర నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల వల్ల ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరిందని అధికారులు పేర్కొన్నారు. బ్యారేజీ నుంచి దాదాపు 7 వేల కూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మరికొద్దిసెపట్లో నీటిని విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీకాంత్ విజ్ఞప్తి చేశారు. విజయవాడ, పెనమలూరు, పమిడిముక్కల, తోట్లవల్లూరు, ఉయ్యూరు తహశీల్దార్లు ప్రజల్ని అప్రమత్తం చేయాలని సూచించారు. నదీపరివాహక ప్రాంతాల్లో దండోరా వేయించాలని అధికారులను ఆదేశించారు. -
కోనసీమలో పెథాయ్ బీభత్సం
-
బలహీన పడిన పెథాయ్ తుపాను
సాక్షి, అమరావతి: వేగంగా దూసుకొస్తూ తీవ్ర ఉత్కంఠ రేపిన పెథాయ్ తుపాను ఎట్టకేలకు బలహీన పడింది. తీవ్ర వాయుగుండంగా మారి కాకినాడ సమీపంలో కేంద్రీకృతమైంది. ఈశాన్య దిశగా పయనిస్తూ, సోమవారం రాత్రి తునికి సమీపంలో తీరాన్ని దాటనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. క్రమేణా బలహీన పడుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. రాగల పన్నెండు గంటల్లో ఉత్తర కోస్తా, యానాంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉందని వాతావారణ అధికారులు తెలిపారు. ఇక పెథాయ్ తుపాన్ ధాటికి సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీగా వర్షం కురుస్తోంది. వివిధ ప్రాంతాల్లో పెథాయ్ తుపాన్ అప్డేట్స్ ఇవి.. ఉప్పొంగి గ్రామానికి చేరువగా వచ్చిన సముద్రం! శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం నడుమూరు వద్ద సముద్రం ఉప్పొంగి.. గ్రామ సమీపంలోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో అలల తాకిడికి ఒడ్డున లంగరు వేసిన బోట్లును సముద్రంలోకి కొట్టుకుపోయాయి. దీంతో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. తిత్లీ తుపాన్ సమయంలోనూ సముద్రం ఇంతగా ముందుకురాలేదని, పెథాయ్ తుపాన్ తీవ్రంగా ఉండటంతోనే ఈ పరిస్థితి నెలకొందని మత్య్సకారులు అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం పెథాయ్ తుపాన్ ధాటికి తూర్పు గోదావరి జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా 33,448 హెకార్లలో ఖరీఫ్ పంటకు నష్టం వాటిల్లింది. రూ.33 కోట్లు విలువైన చేసే ధాన్యం తడిసి ముద్దయింది. రూ. ఆరు కోట్ల విలువ పత్తిపంట తుడిచిపెట్టుకుపోయింది. రూ. రెండు కోట్లు విలువ చేసే పొగాకు పంట నష్టం వాటిల్లింది. రూ. కోటి తొంభై ఏడు లక్షల విలువ చేసే ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. పెథాయ్ వల్ల శ్రీకాకుళంకు వరద ముప్పు పెథాయ్ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాకు వరద ముప్పు ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. ధనంజయ రెడ్డి హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహాయ చర్యలకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నాగావళి, వంశధార, బహుదా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. విజయవాడలో జలమయమైన రోడ్లు.. పెథాయ్ తుపాన్ ధాటికి విజయవాడలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మొగల్ రాజపురం వద్ద అపార్ట్మెంట్లలోకి నీళ్లు చొచ్చుకొని రావడంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రకాశ్ నగర్, సింగ్ నగర్, పాయకాపురం ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపునీరు వచ్చింది. వన్‌టౌన్‌లో దుకాణాల్లోని నీరు రావడంతో వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సహాయక చర్యలు చేపడుతున్నామని విజయవాడ కార్పొరేషన్ అధికారులు చెప్తున్నా.. పరిస్థితి మాత్రం ఘోరంగా ఉందని బాధితులు అంటున్నారు. వర్షం తగ్గితేకానీ నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు. తుపాను వల్ల వీచిన చలిగాలులకి తట్టుకోలేక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం చింతపాడు వద్ద దాదాపు వెయ్యి గొర్రెలు మృతి చెందాయి. ఏడుగురు మత్స్యకారులు ఆచూకి లభ్యం చేపల వేటకు వెళ్లి కనబడకుండా పోయిన కాకినాడకి చెందిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకి లభ్యమైంది. గత గురువారం వేటకు వెళ్లిన వీరు అల్లవరం మండలం సీతారామపురం వద్ద సరక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. నష్టపోయిన రైతులు ప్రభుత్వం ఆదుకోవాలి: ఎమ్మెల్యే వీరయ్య పెథాయ్ తుపాను కారణంగా నష్టపోయిన వరి, మిరప పంటచేలను భద్రాచలం ఎమ్మెల్యే పొదెం. వీరయ్య పరిశీలించారు. భద్రాద్రి జిల్లాలోని చర్ల మండలంలో పర్యటించి నష్టపోయిన రైతును పరమార్శించారు. పంట నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాం: ఎస్పీ రవి ప్రకాశ్ తుపాను ప్రభావిత ప్రాంతాలలో ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాలైన భీమవరం, నరసాపురం, మొగల్తూరు, కాళ్ల మండలంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చిన 300 మంది సివిల్ పోలీసులను సహాయక చర్యల్లో నియమించామని తెలిపారు. ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు. రోడ్లకు ఎటువంటి నష్టం కలగలేదు : కలెక్టర్ కాటంనేని భాస్కర్ పెథాయ్ తుపాను కాట్రేనీకోన వద్ద తీరాన్ని తాకడంతో జిల్లాకు కొంత ఉపశమనం కలిగిందని పశ్చిమగోదావరి కలెక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. సోమవారం ఆయన నర్సాపురం సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి జిల్లాలో తుపాను పరిస్థితిని సమీక్షించారు. తుపాను తీవ్రత వల్ల రోడ్లకు ఎటువంటి నష్టం కలుగలేదన్నారు. కొన్ని చోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడిందని, వెంటనే పునరుద్ధరించామని చెప్పారు. ఆచంట, పాలకొల్లు పోడూరు, పెనుగొండ మొదలగు మండలాలలో భారీ వర్షం కురిసిందని, పరిస్థితిపై ఇంకా కొంత జాగ్రత్తగా ఉండాలని అధికారులకు సూచించారు. కాకినాడను తాకిన పెథాయ్ పెథాయ్ తుపాన్ కాకినాడను తాకింది. దీంతో కాకినాడ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయ్. మరో రెండు గంటలపాటు కాకినాడ ప్రాంతంలో పెథాయ్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రాకూడదని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సూచించింది. తీవ్ర ప్రభావం చూపే అవకాశం పెథాయ్ తుపాన్ ప్రభావంతో గంటకు 80 కి.మీ వేగంతో ఈదురుగాలు వీస్తాయని, మరో రెండు గంటలపాటు తుపాన్ కాకినాడపై తీవ్ర ప్రభావం చూపనుందని అధికారులు తెలిపారు. గాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, సెల్ టవర్లు, కొబ్బరి చెట్లు కూలిపోతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఆలయ ధ్వజ స్తంభం కూలిపోయింది. తుపాన్ తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకింది. తుపాన్ తీరం దాటడంతో కాకినాడు, యానాం, తుని మండలాల్లో రానున్న రెండు గంటలపాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తుపాన్ ప్రభావంతో మరోవైపు విజయవాడలోనూ భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. తుపాన్ తీరం దాటే సమయంలో కొనసీమపై పెను ప్రభావాన్ని చూపుతుంది. తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. రాజోలు, సఖినేటిపల్లి, అమలాపురం, మలికిపురం, అంబాజీపేట, మామిడికుదురు, అల్లవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో మరో గంటలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కాట్రేనికోనలో కారుపై విద్యుత్ స్తంభం కూలిపోయింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విజయనగరం జిల్లా: పెథాయ్ తుపాను ప్రభావంతో పూసపాటిరేగ మండలంలో భారీ ఈదురు గాలులు.. దీంతో పెద్ద ఎత్తున నేలకొరిగిన మెుక్కజొన్న పంట బాధితులకు వైఎస్సార్సీపీ నేతల పరామర్శ కాకినాడ: దుమ్ములపేటలో వైఎస్సార్సీపీ కాకినాడ సిటీ కో-ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పర్యటించి.. సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబాలను పరామార్శించారు. వెంటనే అధికారులు స్పందించి తుపాన్లో చిక్కుకున్న వారిని రక్షించాలని ఆయన కోరారు. కాగా, తుపాన్ ప్రభావిత గ్రామాల్లో పిఠాపురం వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ పెండెం దొరబాబు పర్యటించారు. తుపాన్ సహాయక కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులను ఆయన పరామార్శించారు. ఉదయం నుండి అధికారులు తమకు ఎటువంటి ఆహరం, త్రాగునీరు అందించలేదని దొరబాబుకు బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులకు ఆయన బిసెట్లు, త్రాగునీరు అందించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తుపానుపై భయాందోళన వద్దు
తూర్పుగోదావరి, కాకినాడ సిటీ: తుపానుకు సంబంధించి అవసరమైన అన్ని ముం దస్తు చర్యలూ తీసుకున్నామని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. కలెక్టరేట్లో ఏ ర్పాటు చేసిన కాకినాడ, అమలాపురం తుపాను కంట్రోల్ విభాగంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. ♦ కోస్తా ప్రాంతంలోని 17 మండలాల్లో 295 గ్రామాలపై తుపాను ప్రభావం చూపే అవకాశం ఉంది. ♦ తుపాను సమయంలో నష్టపోయే 77 రోడ్లు గుర్తించాం. వీటిలో కోస్తాలో 44, సమీప ప్రాంతాల్లో 33 ఉన్నాయి. ఈ రోడ్లపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయడానికి ప్రత్యేక బృందాలను నియమించాం. ఎక్కడైనా చెట్లు నేలకొరిగితే వాటిని తొలగించి రహదారిని క్లియర్ చేసేందుకు వీలుగా జేసీబీలను, కూలీలను సిద్ధం చేశాం. ఇందుకోసం ప్రతి 20 కిలోమీటర్లకు ఒక అధికారుల బృందాన్ని నియమించాం. ♦ తుపాను సహాయక చర్యల కోసం 14 మంది డీఈలు, 33 మంది ఏఈలు, 96 మంది అగ్నిమాపక సిబ్బంది, ఏడు జేసీబీలు, 10 వేల లీటర్ల డీజల్ సిద్ధం చేశాం. ♦ కోస్తా ప్రాంతంలోని 57 మంచినీటి పథకాల వద్ద జనరేటర్లు ఏర్పాటు చేశాం. ♦ 26 విద్యుత్ సబ్ స్టేషన్ల (33/11 కేవీ) వద్ద సిబ్బందిని, జేసీబీలను సిద్ధంగా ఉంచాం. ♦ కాకినాడ – తుని మధ్య అత్యవసర పనుల కోసం 4 వేల విద్యుత్తు స్తంభాలు సిద్ధం చేశాం. ♦ జిల్లాలోని 500 సెల్ టవర్ల పనితీరుకు ఆటంకం లేకుండా అవసరమైన జనరేటర్లు, ఇంధనం, సిబ్బందిని అందుబాటులో ఉంచాం. ♦ 283 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశాం. 61 తుపాను షెల్టర్లు సిద్ధం చేశాం. సహాయ శిబిరాల్లో బాధితులకు అందించడానికి 3 వేల దుప్పట్లు, 770 రెయిన్ కోట్లు సమకూర్చాం. సహాయ శిబిరాల వద్ద ఆహార పంపిణీకి 1664 మంది వంట సిబ్బందిని నియమించారు. 61 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ♦ సహాయ శిబిరాల కోసం 60 వాహనాలు, రోడ్లపై ఆటంకాలను తొలగించడానికి 200 తుపాను పవర్ బ్లేడులు సిద్ధం చేశాం. ♦ సముద్రంలో వేటకు వెళ్లిన రెండు మత్స్యకార పడవల్లో ఏడుగురితో కూడిన ఒక పడవను సమీపంలోని ఓఎన్జీసీ రిగ్ వద్దకు తరలించాం. కొత్తపాలేనికి చెందిన పడవను ఓడలరేవులో గుర్తించాం. ♦ అమలాపురం, కాకినాడల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశాం. -
పెథాయ్‌ను ఎదుర్కొందాం
విశాఖపట్నం, నక్కపల్లి/పాయకరావుపేట: పెథాయ్ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ సృజన ఆదేశించారు. తుఫాన్ నేపథ్యంలో ఆమె నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం మండలాల్లో ఆదివారం పర్యటించారు. నక్కపల్లి మండలం రాజయ్యపేట, ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం, రేవుపోలవరం తీర ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. మత్య్సకారులు, తీరప్రాంత గ్రామాలవారితో మాట్లాడారు. భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టిందన్నారు. మండల, గ్రామస్థాయి అధికారులను అప్రమత్తం చేసి తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో అందుబాటులో ఉంచామన్నారు. కేటాయించిన గ్రామాల్లో అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో కంట్రోలు రూములు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అధికారులతో సమీక్ష.. పాయకరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో తీరప్రాంతం ఉన్న రాంబిల్లి, అచ్యుతాపురం,ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల అధికారులతో జేసీ సృజన అత్యవసర సమావేశం నిర్వహించారు. దీనికి రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, పోలీస్, ఉపాధిహామీ, ట్రాన్స్‌కో, రవాణా, విద్యా, వైద్య ఆరోగ్యశాఖల అధికారులు హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ సృష్టించిన విధ్వంసం తెలిసిందే అన్నారు. అక్కడ చోటుచేసుకున్న పొరపాట్లు ఇక్కడ జరగకుండా పెథాయ్‌ను సమర్ధంగా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. సోమవారం ఉదయం పదిగంటలకు తీరం దాటవచ్చని తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభావిత గ్రామాలకు ముందుగానే నిత్యావసర సరుకులు తరలించాలని పౌరసరఫరాలశాఖ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రక్షిత భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను పునరావాస కార్యక్రమాలకోసం స్వాధీనంలోకి తీసుకోవాలన్నారు. విద్యుత్‌సరఫరాకు అంతరాయం ఏర్పడితే జనరేటర్లను అందుబాటులో ఉంచాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. 4 వేల విద్యుత్ స్తంభాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. 400 స్తంభాలు పాయకరావుపేట నియోజకవర్గానికి కేటాయించామన్నారు. మిగిలిన స్తంభాలు తూర్పుగోదావరి జిల్లాకు పంపినట్టు చెప్పారు. గ్రామాల్లోని రక్షిత మంచినీటి పథకాల ఓవర్ హెడ్ ట్యాంకులన్నింటినీ నీటితో నింపాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లోని ట్యాంకులను కూడా నింపి తాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు. అవసరమైతే వాటర్ ప్యాకేట్ బస్తాలు కూడా అందుబాటులో ఉంచాలన్నారు. రేషన్ డీలర్లతో పాటు, మధ్యాహ్నభోజన పథక నిర్వాహకులను కూడా అందుబాటులో ఉండాలన్నారు. ఒక్కో తుఫాన్ రక్షిత కేంద్రంలో 3 వేల మందికి భోజన వసతి ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నిత్యావసర సరకులు ఈ రాత్రికే తీరప్రాంత గ్రామాలకు చేర్చాలని ఆదేశించారు. పొక్లెయిన్లు, జనరేటర్లతో సిద్ధంగా ఉండాలని విపత్తుల నివారణ శాఖను ఆదేశించారు. ఎక్కడైనా భారీ వృక్షాలు కూలిపోతే వెంటనే తొలగించడానికి అవసరమైన సంరంజామా సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రభుత్వంనుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తీరప్రాంత గ్రామాల్లో విధులకు నియమించిన వారంతా అక్కడే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సమావేశంలో నర్సీపట్నం ఆర్డీవో విశ్వేశ్వరరావు, ఏఎస్పీ హఫీజ్, డ్వామాపీడీ కల్యాణ చక్రవర్తి, డీపీవో కృష్ణకుమారి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, ఐదుమండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు,ఈవోపీఆర్డీలు పాల్గొన్నారు. -
తీరాన్ని తాకిన పెథాయ్ తుపాన్..
సాక్షి, అమరావతి: పెథాయ్ తుపాన్ కొద్దిసేపటి క్రితం తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకింది. మరికొద్దిసేపట్లో కాకినాడ-యానాం మధ్య తుపాన్ తీరం దాటనుందని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. కాకినాడు, యానాం, తుని మండలాల్లో రానున్న రెండు గంటలపాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. తుపాన్ ప్రభావంతో విజయవాడలో భారీ వర్షం కురుస్తుంది. గంటకు 80 కి.మీ వేగంతో ఈదురుగాలు వీస్తాయని అధికారులు వెల్లడించారు. మరో రెండు గంటలపాటు తుపాన్ కాకినాడపై తీవ్ర ప్రభావం చూపనుందని అధికారులు తెలిపారు. గాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, సెలటవర్లు, కొబ్బరి చెట్లు కూలిపోతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఆలయ ధ్వజ స్తంభం కూలిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. తుపాన్ తీరం దాటే సమయంలో కొనసీమపై పెను ప్రభావాన్ని చూపుతుంది. తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. రాజోలు, సఖినేటిపల్లి, అమలాపురం, మలికిపురం, అంబాజీపేట, మామిడికుదురు, అల్లవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో మరో గంటలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కాట్రేనికోనలో కారుపై విద్యుత్ స్తంభం కూలిపోయింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. -
పెథాయ్ ఎఫెక్ట్ : బస్సులు, విమానాలు రద్దు
సాక్షి, అమరావతి : తీవ్ర తుపానుగా మారిన పెథాయ్ దెబ్బకు జన జీవనం అస్తవ్యస్థంగా మారింది. విజయవాడ, ఉభయ గోదావరి, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. వాతావరణం అనుకూలించకపోవడంతో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ విమాన సర్వీస్‌లను నిలిపివేసింది. దాంతో బెంగళూరు వెళ్లవలసిన ఎయిర్ ఏసియా విమానం బోర్డింగ్ పాస్‌లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విశాఖలో వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఢిల్లీ - విశాఖ ఇండిగో విమానం హైదరాబాద్‌లో ల్యాండ్ అవ్వగా చెన్నై - విశాఖ విమానం తిరిగి చెన్నైకి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపోతే హైదరాబాద్ - విశాఖ స్పైస్‌జెట్ విమానాన్ని రద్దు చేయడమే కాక.. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన 14 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. విమానాల రద్దుతో దాదాపు 700 మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు గాస్తోన్నారు. అంతేకాక తుపాను ప్రభావం దృష్ట్యా విద్యాశాఖ అధికారులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. (ఏపీలో పలు రైళ్లు రద్దు) శ్రీకాకుళం.. పెథాయ్ తుపాన్ కారణంగా విద్యాశాఖ అధికారులు జిల్లాలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కానీ ఉపాధ్యాయులు, వంట ఏజేన్సీలు, వంట కార్మికులు పాఠశాలల వద్ద అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశించారు. విజయనగరం.. పెథాయ్ తుపాన్ విజృంభిస్తోన్న నేపథ్యంలో అధికారలు హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్ - 08922 276713, ఆర్డీవో ఆఫీస్ హెల్ప్‌లైన్ నంబర్ - 08922 276888 తూర్పు గోదావరి జిల్లా... జిల్లాలోని ముమ్మిడివరంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. విద్యాశాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గోకవరం డిపో నుంచి బయలుదేరాల్సిన పలు బస్సు సర్వీసులను కూడా రద్దు చేశారు. ఆత్రేయపురంలో అత్యధికంగా 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం, కోరుకొండ మండలంలోని రాఘవపురం, కోటి కేశవరం గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. తుఫాన్ ప్రభావంతో విశాఖ నుంచి రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విజయవాడ వైపు వెళ్లే సర్వీసులను ఆర్టీసీ నిలిపివేసింది. పశ్చిమ గోదావరి... పెథాయ్ తుపాన్ కారణంగా జిల్లాలోని తీర ప్రాంతంలోని ఆరు మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. పాలకొల్లు మండలం దిగమర్రు గ్రామంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో దాదాపు 100 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. గడిచిన 24 గంటల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో 46(4.6 సెంటిమీటర్ల) మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఏలూరులో 7.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరు... జిల్లావ్యాప్తంగా ఎడతెరపిలేని జల్లులు, తీవ్రమైన చలితో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో జిల్లాలోని కొన్ని పాఠశాలలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. నిజాం పట్నం పోర్టులో 5వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. జిల్లా కలెక్టర్ కోన శశీధర్ తీరప్రాంతంలో పరిస్థిని సమీక్షిస్తున్నారు. -
పెథాయ్ తుపాను బీభత్సం
-
అన్నదాతల్లో ‘పెథాయ్’ తుపాన్ భయం
అశ్వారావుపేట రూరల్: అన్నదాతల్లో పెథాన్ తుపాన్ భయం వెంటాడుతోంది. బలంగా వీస్తున్న ఈదురు గాలులతో రైతుల్లో అలజడి మొదలైంది. గడిచిన మూడు రోజులుగా వాతావరణం చల్లబడి, ఆకాశం మేఘావృతమై ఉండటంతోపాటు ఆదివారం ఉదయం నుంచి వర్షం కురవడంతో రైతుల్లో అందోళన నెలకొంది. ఇప్పటికే వరి కోతలు దాదాపుగా పూర్తి కాగా, పొలాల్లో ధాన్యం రాశులు ఆరబెట్టుతున్నారు. అదేవిధంగా ఆరిపోయిన ధాన్యం రాశులను అధిక శాతం మంది రైతులు విక్రయించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించారు. కేంద్రాల్లో రైతులు విక్రయాలకు తీసుకొస్తున్న ధాన్యాన్ని రోజుల తరబడి కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. దాంతో రైతులు ధాన్యం కేంద్రాల్లోనే ఉండిపోతుంది. ఈ తరుణంలో ముంచుకొస్తున్న పెథాయ్ తుపాన్, కురుస్తున్న వర్షంతో ధాన్యం తడిచిపోకుండా ఉండేందుకు రైతులు పడుతున్న పాట్లు వర్ణాతీతంగా ఉన్నాయి. మండలంలోని నారాయణపురం, నెమలిపేట, అచ్యుతాపురం, ఊట్లపల్లితోపాటు మరికొన్ని చోట్ల ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులు కుప్పకుప్పలుగా ఉండగా వర్షానికి తడిచిపోకుండా ఉండేందుకు కప్పడానికి టార్ఫాలిన్లు అంతంత మాత్రంగా ఉండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. దాంతో చాలా మంది రైతులు టార్ఫాలిన్ల కోసం ఇతర ప్రాంతాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. అదే విధంగా మరికొంత మంది రైతులు అశ్వారావుపేట, వినాయకపురం గ్రామాల్లో అద్దెకు ఇస్తున్న పరదాలను తీసుకొచ్చి ధాన్యం బస్తాలు, పొలాల్లో ఆరబోసిన ధాన్యం రాశులపై కప్పుతున్నారు. ఒకొక్క పరదాను వ్యాపారులు రోజుకు రూ.30 వరకు అద్దె తీసుకుంటుండటంతో రైతులపై మరింత భారం పడుతోంది. మరో వైపు నారాయణపురం, నెమలిపేట, ఊట్లపల్లి, అచ్యుతాపురంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు పేరుకుపోగా, వీటిపై కప్పేందుకు టార్ఫిలిన్లు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో గ్రామ సమైఖ్య సిబ్బంది సైతం వాటిని వర్షం పాలు కాకుండా చూసేందుకు ఇక్కట్ల పడాల్సి వస్తోంది. కాగా కేంద్రాలకు తీసుకొస్తున్న ధాన్యం రాశులను ఎప్పటికప్పడు రైతుల నుంచి కొనుగోలు చేసి, లారీల ద్వారా రైస్ మిల్లర్లు, గోదాంలకు తరలిస్తే ఈ సమస్య ఉండదని, కానీ అధికారులు చేస్తున్న తాత్సారం వల్ల ఇటు గ్రామ సమైఖ్య బాధ్యులు, అటు రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. పట్టాల కోసం పరుగులు చండ్రుగొండ:పెథాన్ తుపాన్ అన్నదాత గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఆరుగాలం శ్రమించి పంట చేతికొచ్చిన దశలో పెథాన్ తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షం పంటను తడిపేస్తుంది. మండలంలోని దామరచర్లలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సుమారు 20 వేల క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉన్నాయి. కాంటాలు కాకపోవడంతో ధాన్యం రాసులుగా పడి ఉన్నాయి. వర్షం నుంచి పంటను కాపాడుకునేందుకు పట్టాల కోసం రైతులు పరుగులు తీశారు. కిరాయి పట్టాలు సరిపడక పోవడంతో కొత్త పట్టాలు కొనుగోలు చేశారు. పట్టాల కొనుగోళ్ళు రైతులకు ఆర్థికంగా అదనపు భారంగా పరిణమించింది. పట్టాలు ఏర్పాటు చేసినప్పటికీ ధాన్యం తడుస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తడిచిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. మండలంలో చిరు జల్లులు అన్నపురెడ్డిపల్లి: పెధాయ్ తుపాన్ ప్రభావంతో మండలంలోని అన్నపురెడ్డిపల్లి, ఎర్రగుంట, పెంట్లం, అబ్బుగూడెం, మర్రిగూడెం, రాజాపురం, జానికీపురంలో ఆదివారం ఉదయం నుంచి చిరుజల్లులు పడాయి. మండల పరిధిలోని గుంపెన సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రైతులు తాము విక్రయించిన ధాన్యం తడవకుండా బస్తాలపై పరదాలు కప్పి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. వర్షం కారణంగా చలిప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వణికిస్తున్న తుఫాను దమ్మపేట: పెథాన్ తుపాను ముంచుకొస్తుందని తెలుసుకుని రైతుల్లో వణుకుపుడుతోంది. ఆదివారం ఉదయం నుంచి మబ్బులు, చల్లటి గాలుల నడుమ చిరుజ్లులు పడ్డాయి. దీంతో పొలం పనుల్లో రైతులు శ్రమిస్తుండగా పడిన జల్లులతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కోసిన వరి పంటను సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లలో ఉన్నారు. ఇప్పుడు తుపాను విరుచుకు పడితే కోలుకోలేమని, ఎవరు ఎంత సాయం చేసినా తమను కష్టాల నుంచి గట్టెక్కించలేరన్న ఆందోళన రైతుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. -
ప్రజలు తస్మాత్ జాగ్రత్త: ఆర్టీజీఎస్ హెచ్చరికలు
సాక్షి, అమరావతి : పెథాయ్ తుఫాను వేగంగా కాకినాడ వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) పలు హెచ్చరికలు జారీ చేసింది. తీవ్ర తుపాను కాకినాడకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. తుపాను తూర్పుగోదావరి జిల్లావైపు వేగంగా కదులుతోందని, గంటకు 19 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుపాను ఈరోపు మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తుని-యానాంల మధ్య తీరం దాటనుందని వెల్లడించింది. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులతో పెథాయ్ తీరం దాటనుందని తెలిపింది. తూర్పుగోదారి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తూర్పు గోదావరి జిల్లాల్లో గంటకు 110 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తీరం దాటే సమయంలో పెనుగాలులతో కూడిన వర్షం విరుచుకుపడుతుందని తెలిపింది. ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని, అరటి రైతులు, ఉద్యానవన రైతులు తగు జాగ్రత్తల్లో ఉండాలని హెచ్చరించింది. వరి, జొన్న తదితర ధాన్యాలను కోసినవారు వాటిని తక్షణం గోదాముల్లో భద్రపరచాలని సూచించింది. పొలాల్లోనే ఇంకా ధాన్యం ఉంటే దానిపైన టార్పాలిన్ పట్టలు కప్పి భద్రపరచాలని, వ్యవసాయ శాఖ అధికారుల నుంచి రైతులు టార్పాలిన్ పట్టలను పొందవచ్చునని తెలిపింది. గుడిసెల్లో, రేకుల షెడ్డుల్లో నివాసముంటున్న వారిని పునరావాస కేంద్రాలకు, లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తక్షణమే తరలించాలని సూచించింది. తుపాను తీరం దాటే వరకు ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, రోడ్లపై వాహనాల్లో తిరగరాదు.. చెట్ల కింద తలదాచుకోరాదని.. తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. -
పెథాయ్ కలవరం..!
బంగాళా ఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుపాను తీరానికి చేరే వేళ అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. సముద్రం నీరు పలు చోట్ల 30 నుంచి 50 మీటర్ల మేర ముందుకొచ్చింది.తీరం భారీగా కోతకు గురైంది. మత్స్యకార గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.భారీ వర్ష సూచనతో జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఆదివారం ఉదయం నుంచి మబ్బులు వేయడంతో రైతులు అప్రమత్తమయ్యారు. కోసిన చేనును కుప్పలుగా చేర్చారు. కొన్నిచోట్ల యంత్రాల సాయంతో నూర్పిడి చేశారు.అధిక శాతం వరి పంట పొలాల్లో చిన్నచిన్న కుప్పలుగానే ఉంది. పొలాల్లో నీరు చేరేలా వర్షం కురిస్తే వరి కుప్పలు తడిసిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తుపాను హెచ్చరికలతో జిల్లా వాసులు ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. దీంతో బస్, రైల్వేస్టేషన్లు బోసిపోయాయి. వ్యాపారాలు మందగించాయి. తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు పూర్తిచేసింది. తుపాను ప్రభావిత తీర గ్రామాలకు సరుకులు సరఫరా చేసింది. విజయనగరం గంటస్తంభం/పూసపాటిరేగ: బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుపాను ఉగ్రరూపం దాల్చింది. జిల్లాపై తీవ్ర ప్రభావం ఉంటుం దన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా వాసులు కలవరపడుతున్నారు. రైతులు భయాందోళన చెందుతున్నారు. మత్స్యకారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తుపాను తూర్పు, ఆగ్నేయదిశలో కాకినాడ, మచిలీపట్నం తీరానికి దగ్గర్లో కేంద్రీకృతమై ఉంది. రాత్రికి మరింత బలపడి తీవ్ర తుపానుగా మారుతుం దని విశాఖపట్నం వాతావరణశాఖ అధికారులు తెలి పారు. సోమవారం తుపాను తీరం దాటుతుందని వెల్లడిం చారు. తీరందాటే సమయంలో 70 నుంచి 80 కిలో మీటర్లు వేగంతో గాలులు వీస్తాయని, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. దక్షిణ కోస్తాకు తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని,ఉత్తరాంధ్రాలో కూడా భారీగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఇదిలాఉంటే కాకినాడకు సమీపంలో తీరందాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నా తుపాను సముద్రంలో సుడులు తిరుగుతూ ఎప్పటికప్పుడు దిశ మారుస్తోంది. దీంతో అక్కడే తీరందాటుతుందా? వేరే వైపు వెళుతుందా? అన్న సందేహం కూడా తలెత్తుతోంది. ముందుకొచ్చిన సముద్రం పెథాయ్ తుపాను ప్రభావం జిల్లాపై ఆదివారం స్పష్టంగా కనిపించింది. భోగాపురం మండలం ముక్కాం వద్ద సముద్రం 50 మీటర్లు ముందుకొచ్చింది. పూసపాటిరేగ మండలంలోని తిప్పలవలస, చింతపల్లి తదితర తీరప్రాంతంలో కూడా 30 నుంచి 40 మీటర్లు సముద్రం ముందుకొచ్చింది. దీంతో మత్స్సకారులు ఆందోళన చెందుతున్నా రు. బోట్లును సురక్షితంగా ఉంచేందుకు ఒడ్డుకు చేర్చారు. అప్రమత్తం చేసిన అధికారులు తుపాను ప్రభావం జిల్లాపై కూడా ఉంటుందన్న సమాచారంతో జిల్లా అధికారులు అప్రమత్తమై ప్రజలను అప్రమత్తం చేశారు. ఇన్చార్జి కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిస్థితిని పర్యవేక్షించారు. రెవెన్యూ, మత్స్య, విద్యుత్, పంచాయతీ, మున్సిపల్ ఇతర శాఖల అధికారులను మరింత అప్రమత్తం చేశా రు. డీఆర్వో జె.వెంకటరావు ఆదివారమైనా కలెక్టరేట్లో ఉండి అధికారులకు సూచనలిచ్చారు. పూసపాటిరేగ మండలంలో భారీగా వర్షాలు పడతాయని ఆర్టీజీఎస్ అధికారులు హెచ్చరించడంతో అధికారులు ఆ మండలంపై దృష్టి పెట్టారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్చార్జి కలెక్టర్ సెలవు ప్రకటించారు. మండల కేంద్రంలో జిల్లా అధికారులు మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గ్రామాలకు నియమించిన ప్రత్యేకాధికారులు గ్రామాల్లో ఉండి ప్రజలను అ ప్రమత్తం చేశారు. పూసపాటిరేగతోపాటు భోగాపురం తీరప్రాంతంలో సముద్రం వైపు ఎవరూ వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవసరమైతే జనాలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు తుపాను షెల్టర్లు సిద్ధం చేశారు. వారికి ఆహారం సరఫరా చేసేం దుకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచారు. ఈదురుగాలులు వీస్తే చెట్లు విరిగే ప్రమాదం ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేశారు. అధికారులంతా అందుబాటులో ఉండాలని, సెలవులు పెట్టరాదని ఇన్చార్జి కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఆదేశించారు. చింతపల్లి గ్రామంలో పర్యటించి మత్స్యకారులకు పలు సూచనలు, సలహాలిచ్చారు. తిరిగి ప్రకటించే వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. తీరప్రాంత గ్రామాలులో ఎప్పటికప్పుడు పరిస్థితిని తహసీల్దార్ జి.సూర్యలక్ష్మి అధికారులకు చేరవేస్తున్నారు. తీరప్రాంత గ్రామాలు రేషనుషాపులలో నిత్యవసర సరుకులను అందుబాటులో ఉంచారు. కొన్ని గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తర లించారు. గ్రీవెన్స్‌సెల్ రద్దు చేశారు. -
తీరం వైపు దూసుకొస్తున్న పెథాయ్
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుపాన్ తీవ్ర వాయువేగంతో దూసుకొస్తోంది.పెథాయ్ తుపాన్ పశ్చిమ బంగాళాఖాతానికి అనుకొని కొనసాగుతోంది. మచిలీపట్నానికి తూర్పున ఆగ్నేయంగా 480 కి.మీ దూరంలోను, కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 510 కి.మీ, దూరంలో కేంద్రికృతమైంది. శ్రీహరికోటకు 280 కిలోమీటర్ల దూరంలోను, ఉత్తర వాయువ్య దిశగా గంటకు 28 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఇది మరింత బలపడి రాత్రికి తీవ్రంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రేపు సాయంత్రం నాటికి కాకినాడ, తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదుగాలులు వీస్తాయని అధికారులు అంచనావేస్తున్నారు. పెథాయ్ తుపాన్ ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలో తాళ్లరేవు, కాజులూరు, తుని పాటు, తొణంగిలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్నారు. విశాఖ, గాజువాక, భీమునిపట్నం, పరవాడ, పెదగంట్యాడ, అచ్యుతాపురం, రాంబిలి, ఎస్. రాయవరం, పాయకరావు పేటలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అదే విధంగా విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో భారీ వర్షలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో గార, పలాస, మందస, సంతబొమ్మాళి, కవిటి, ఇచ్చాపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశలు ఉన్నాయని ఆధికారులు తెలిపారు. -
పెథాయ్ ప్రభావం కృష్ణా జిల్లాపై ఉండదు: కలెక్టర్
సాక్షి, విజయవాడ: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన పెథాయ్ తుపాన్ ప్రభావం కృష్ణా జిల్లాపై ఉండదని కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సముద్ర తీరం వెంబడి ఉన్న నాలుగు మండలాలు, 181 గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి పది మంది ప్రత్యేక ఆధికారులను నియమించామని చెప్పారు. జిల్లాలో నేడు, రేపు చిరుజల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో రెండు లక్షల హెక్టార్లలో వరి కోతలు జరిగాయన్నారు. ప్రస్తుతం 20 వేల హెక్టార్లలో వరి పంట పాలుపోసుకునే దశలో వుంది. ఇప్పుడు కురుస్తున్న వర్షాం వల్ల పంటలకు ఎటువంటి నష్టం వాటిల్లదని అన్నారు. తాజా సమాచారం ప్రకారం కాకినాడ, విశాఖపట్నం మధ్య పెథాయ్ తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. -
దూసుకొస్తున్న‘ పెథాయ్’ తుపాను
సాక్షి, విశాఖ పట్నం : వాయువేగంతో దూసుకొస్తున్న ఫెథాయ్ తుపాను కోస్తాంధ్ర జిల్లాలను వణికిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతం, పశ్చిమ బంగాళాఖాతానికి ఆనుకొని కొనసాగుతున్న తుపాను మచిలీ పట్నానికి తూర్పు ఆగ్నేయంగా 560 కిలో మీటర్లు, కాకినాడ దక్షిణ ఆగ్నేయంగా.. శ్రీహరికోటకు 450 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఫెథాయ్ తుపాను ఉత్తర వాయవ్య దిశగా గంటకు 20 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న తుపాను తీవ్ర తుపానుగా మారింది. సోమవారం మధ్యాహ్నానానికి వాయుగుంగం బలహీనపడి కాకినాడ, తుని మధ్య తీరాన్ని దాటవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. తీరం దాటే సమయంలో 100 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు, 6మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. కోస్తాలోని అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. తుపాను తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100 ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లంతా సురక్షితం. జాలర్లతంగా సురక్షితంగా తీరానికి చేరారు. సుముద్రంలో ఉండిపోయిన ప్రకాశం జిల్లాకు చెందిన జాలర్లకు ఆశకావాణి ద్వారా సందేశాలు పంపించాం. తుపాను హెచ్చరికలు విని తిరుగు ప్రయాణమైన జాలర్లు ఆదివారం సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. - రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ( ఆర్టీజీఎస్) కాకినాడ పరిసర ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం తుపాను తీరం దాటుతుంది. తీర ప్రాంతాల్లో 60 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖ పట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో ఈ నెల 18న ఓ మోస్తరు, రాయలసీమలో తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది- వైకే రెడ్డి, వాతావరణ శాఖ డైరెక్టర్ తూర్పుగోదావరి జిల్లా సఖినేటి పల్లి, మలికిపురం మండలాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. మూడు గంటలుగా కరెంట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుఫాను ప్రభావంతో విజయనగరం జిల్లా బోగాపురం మండలం కోయ్యపేడలో ఈదురగాలుల బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షానికి కొబ్బరిచెట్లు విరిగిపడి ఆవు మృతి మృతి చెందింది. -
అవనిగడ్డలో ఆకలి కేకలు
సాక్షి, కృష్ణా : ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పెథాయ్ తుపాన్ కన్నెర్ర చేసింది. తుపాన్ ప్రతాపానికి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కూడు,గూడూ,బట్ట లేక అన్నమో రామచంద్రా అంటూ బోరున విలపిస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ పునరావాస కేంద్రాల్లో రెండు రోజుల నుంచి మంచినీరు, భోజనం లేక తుపాను బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోడూరు మండలం పాలకాయతిప్ప సహాయ కేంద్రాల్లో ఉన్న బాధితులను ఆదివారం పరామర్శించడానికి వచ్చిన జిల్లా ఎస్పీ సర్వేష్ఠ త్రిపాఠి వద్ద వారి బాధలను వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం కనీసం మంచినీరు కూడా అందిచలేకపోతుందని, రెవిన్యూ సిబ్బంది అందుబాటులో లేకుండా పోయిందని వారు అవేదన వ్యక్తం చేశారు. తుపాను దాటికి పిల్లల నుంచి పెద్దల వరకు అనేక ఇబ్బందులు పడుతున్నారని, సహాయ చర్యలను చేపట్టడంలో ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలమయ్యరని తుపాను బాధితులు వాపోయారు. పంటలు నష్టపోయి, ఉండడానికి ఇళ్లు, తినడానికి తిండిలేకపోయినా తమను పట్టించుకునే నాథుడే కరువైయ్యారని ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. -
తప్పిన పెథాయ్ ముప్పు
నెల్లూరు(పొగతోట): పెథాయ్ తుపాను ముప్పు నుంచి జిల్లా తప్పించుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి, శుక్రవారం రాత్రి దిశమార్చుకుంది. శనివారం రాత్రి తుపానుగా మారి తూర్పుగోదావరి వైపు అతి వేగంగా పయనిస్తోంది. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలో తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తొలుత అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారి నెల్లూరు–చెన్నైల మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు భావించారు. తుపాను ప్రభావం జిల్లాపై అధికంగా ఉంటుందని, తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రత్యేకాధికారులను నియమించారు. అయితే పెథాయ్ తన దిశను మార్చుకుంటూ మచిలీపట్నం వైపు నుంచి కాకినాడ వైపు కదిలిపోయింది. దీంతో జిల్లాకు ముప్పు తప్పిందని అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. అయితే తుపాను ప్రభావంతో జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. గత నెలలో ఏర్పడిన గజ తుపాను కూడా నెల్లూరు ప్రాంతంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు భావించారు. గజ తన దిశను మార్చుకుని తమిళనాడులో తీరం దాటింది. వాతావరణంలో పెనుమార్పులు పెథాయ్ తుపాన్ తీరం వైపు దూసుకున్న నేపథ్యంలో జిల్లాలో వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. విపరీతంగా చలిగాలు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోంగా మారింది. తుపాను ప్రభావంగా తీర ప్రాంతాల మండలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు జిల్లా యంత్రాంగాన్ని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతంలోని 13 మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. ప్రతి హ్యాబిటేషన్‌కు వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శులను నియమించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లతో అధికారులు సిద్ధంగా ఉన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులను జిల్లా అధికారులు వెనక్కి రప్పించారు. ఎటువంటి విపత్తు సంభవించినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలతో సిద్ధంగా ఉంది. అల్లకల్లోలంగా తీరం పెథాయ్ ప్రభావంతో జిల్లాలోని సముద్రం తీరప్రాంతం అల్లకల్లోలంగా మారింది. పలుచోట్ల సముద్రం 50 నుంచి 60 మీటర్లు ముందుకొచ్చింది. గాలులు తీవ్రంగా ఉన్నాయి. తోటపల్లిగూడూరు మండలంలోని కోడూరు, వెంకన్నపాళెం సముద్రతీరాల్లో శనివారం సాయంత్రానికి అలల తాకిడి అధికమై అల్లకల్లోలంగా మారిపోయింది. సముద్రపు నీరు దాదాపు 50 నుంచి 60 అడుగుల మేర ముందుకు చొచ్చుకుని రావడంతో తీరం కోతకు గురవుతోంది. ఉవ్వెత్తిన ఎగిసి పడుతున్న అలలతో తీర ప్రాంత వాసుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. మత్స్యకారులు వేటకు విరామం పలికి ఇళ్లకే పరిమితమయ్యారు. ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్‌కు పర్యాటకుల రాక తగ్గుముఖం పట్టింది. మత్స్యకారులు ఇప్పటికే వేటను తాత్కాలికంగా నిషేధించారు. తీర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దారు మధుసూదన్‌రావు హెచ్చరించారు. వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో అలల ఉధృతి, ఈదురు గాలులు అధికమై సముద్రం అల్లకల్లోంగా మారింది. నిత్యం పర్యాటకులు, చిరుతిండి దుకాణాలతో సందడిగా ఉండే తూపిలిపాళెం బీచ్ తుపాన్ కారణంగా బోసిపోయింది. తీరంలో ఉన్న చిల్లర దుకాణాలు ఈదురు గాలులకు నేలవాలి కుప్ప కూలాయి. మత్స్యకారులు రెండు రోజులుగా వేట మానేసి బోట్లను ఒడ్డుకు చేర్చారు. సముద్రంపై వేట చేస్తోన్న పొరుగు ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు తమ బోట్లతో ఆయా సమీప ప్రాంతాల ఒడ్డుకు చేరుకుని వేట సామగ్రిని భద్ర పరుకుంటున్నారు. సముద్రం సాధారణ స్థితికన్నా ఇప్పుడు 10 మీటర్లు ముందుకు చొచ్చుకు రావడంతో తీరానికి సమీపంలో ఉన్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
‘పెథాయ్‌ను సమర్థంగా ఎదుర్కొండి’
సాక్షి, నెల్లూరు : పెథాయ్ తుపాను నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి తగిన చర్యలు చేపట్టడంపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి మున్సిపాలిటీ పరిధిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు ముమ్మరం చేయాలని, ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా కట్టర్లు, జనరేటర్లు, వాటర్ ట్యాంకర్లు, డీజిల్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజలకు ఆహారం అందించడానికి తగిన ఏర్పాట్లు వేగంగా చేయాలన్నారు. తుపాను ప్రభావం కలిగిన గంటల్లోనే సహాయక చర్యలు ప్రజలకు అందాలన్నారు. -
పడగ విప్పిన పెథాయ్.. రేపు తీరం దాటే అవకాశం!
సాక్షి, అమరావతి: తుఫాన్ పెథాయ్ పడగ విప్పుకొని వస్తోంది. తిత్లీ తుఫాన్‌తో ఇంకా కోలుకొని కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రపై విరుచుకుపడబోతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం ఇప్పుడు పెనుతుఫాన్ పెథాయ్‌గా మారింది. ప్రస్తుతం తుఫాన్ చెన్నైకి 670 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 870 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతూ సోమవారం సాయంత్రం ఒంగోలు, కాకినాడ మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటిమీటర్ల వర్షం కురవవచ్చని అప్రమత్తం చేసింది. తీరప్రాంతంలో గంటకు 100 కిలోమీటర్లతో వేగంతో గాలులు వీచనున్నాయి. భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరికలు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం, మంగళవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు, మామిడికుదురు మండలం ఆదుర్రు మధ్య పెథాయ్ తుఫాన్ తీరం దాటే అవకాశముందని, ఈ నేపథ్యంలో గ్రామస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేయాలని, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులకు సూచించారు. కాగా, పెథాయ్ తుఫాన్ నుంచి తీవ్ర ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గవర్నర్ నరసింహాన్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి ఫోన్ చేసి.. ముందస్తు చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా గవర్నర్ సీఎంకు సూచించారు.