గల్లంతై.. గట్టున చేరి.. | Missing Boats Findout in East Godavari | Sakshi
Sakshi News home page

గల్లంతై.. గట్టున చేరి..

Published Wed, Dec 19 2018 12:37 PM | Last Updated on Wed, Apr 3 2019 5:26 PM

Missing Boats Findout in East Godavari - Sakshi

బాధిత మత్స్యకారులను పరామర్శిస్తున్న వైఎస్సార్‌ సీపీ నేత కన్నబాబు

తూర్పుగోదావరి, కరప (కాకినాడ రూరల్‌): కరప మండలం ఉప్పలంక గ్రామం నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన రెండు బోట్లు పెథాయ్‌ తుపాను ప్రభావంతో గల్లంతయ్యాయి. వాటిల్లోని 14 మంది మత్స్యకారుల జాడ తెలియరాకపోవడంతో వారి కోసం కుటుంబ సభ్యులు, బంధువులు నిద్రాహారాలు మాని కళ్లల్లో ఒత్తులు వేసుకుని రేయింబవళ్లు ఎదురు చూశారు. తమవారిని క్షేమంగా ఇంటికి చేర్చాలని వేయి దేవుళ్లను వేడుకున్నారు. చివరకు వారి ప్రార్థనలు ఫలించాయో ఏమో కానీ, గల్లంతై న మత్స్యకారులు క్షేమంగా ఒడ్డుకు చేరారని మంగళవారం రాత్రి సమాచారం అందింది. ఒక బోటు అంతర్వేది వద్ద, మరో బోటు కొత్తపాలెం వద్ద ఉన్నట్టు మత్స్యశాఖ అధికారులు గుర్తిం చారు. వాటిల్లోని మత్స్యకారులను ఫోనులో మా ట్లాడించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చు కున్నారు. ఉప్పలంక గ్రామ మాజీ సర్పంచ్‌ బొమ్మిడి గంగావతి భర్త కామేశ్వరరావుకు చెందిన 3255 నంబరు బోటులో ఏడుగురు, ఆయన తమ్ముడు బొమ్మిడి శివకు చెందిన 3306 నంబరు బోటులో ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 12న సముద్రంలో వేటకు వెళ్లారు. పెథాయ్‌ తుపాను హెచ్చరికల నేపథ్యంలో వెనక్కి వచ్చేయాలని వారికి బంధువులు సమాచారమందించారు.

దీంతో వారు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో తుపాను తీవ్రత ఎక్కువవడంతో వారి బోట్లు సముద్రంలోకి వెళ్లిపోయాయి. ఒక బోటులో బొమ్మిడి శ్రీను (ఉప్పలంక), గంటా కృష్ణ (పగడాలపేట), సూరాడ అయ్యన్న (పగడాలపేట), అరదాడి రాము (పగడాలపేట), గేదెల ముసలయ్య (ఉప్పలంక), చోడిపల్లి సూర్యారావు (చొల్లంగి), లంకే ఏసు (ఉప్పలంక) ఉన్నారు. రెండో బోటులో ఆకుల వెంకటరాజు (ఉప్పలంక), గలగళ్ల కామేశ్వరరావు (పగడాలపేట), నీలపల్లి వీరబ్బాయి (పగడాలపేట), దండుప్రోలు వెంకటేశులు (చినవలస), ఓలేటి వీరబాబు (ఏటిమొగ), పంతాడి దుర్గ (ఉప్పలంక), పాలెపు ప్రసాద్‌ (ఉప్పలంక) ఉన్నారు. తమవారి జాడ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు మాజీ సర్పంచ్‌ గంగావతి ఇంటి వద్ద ఎదురు చూస్తున్నారు. బొమ్మిడి శివ తల్లి నూకరత్నం (మాజీ సర్పంచ్‌ గంగావతి అత్త) కుమారుని ఆచూకీ కోసం విషణ్ణవదనంతో ఎదురు చూసింది. గ్రామంలోని మహిళలు వచ్చి ఆమెకు ధైర్యం చెప్పారు. మూడేళ్ల క్రితం భర్త కామేశ్వరరావును పోగొట్టుకున్నానని, ఇప్పుడు ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. బోట్లు, మత్స్యకారుల గల్లంతు సమాచారాన్ని బంధువులు కోస్ట్‌గార్డ్, ఫిషరీస్‌ శాఖలకు అందించారు. కోస్ట్‌గార్డ్‌ కమాండెంట్‌ శ్యామ్‌కుమార్, విశాఖపట్నంలోని నేవీ డీఐజీ నవదీప్‌ రాజుల పర్యవేక్షణలో కోస్ట్‌గార్డ్‌కు చెందిన ఆరు నౌకలు, తూర్పు నౌకాదళానికి చెందిన రెండు నౌకలతో ప్రత్యేక బృందాలు గల్లంతైన బోట్ల కోసం గాలించాయి. కోస్ట్‌గార్డ్, నౌకాదళానికి చెందిన రెండు హెలికాప్టర్ల సహాయంతో కూడా గాలింపు చర్యలు చేపట్టారు.

కన్నబాబు పరామర్శ
ఉప్పలంకలో బాధిత కుటుంబాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మంగళవారం పరామర్శించారు. సముద్రంలో చిక్కుకున్నవారు క్షేమంగా తిరిగి వస్తారని ధైర్యం చెప్పి ఓదార్చారు. మత్స్యకారుల గల్లంతు సమాచారాన్ని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఫోనులో వివరించారు. జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి, ఫోనులో మాజీ సర్పంచ్‌ గంగావతి భర్త కామేశ్వరరావుతో మాట్లాడారు. ‘‘అధైర్యపడకండి. వేటకు వెళ్లినవారందరూ క్షేమంగా తిరిగివస్తారు’’ అని ధైర్యం చెప్పారు.

మరో 20 మంది క్షేమం
కాకినాడ సిటీ: పెథాయ్‌ తుపానులో చిక్కుకున్న మరో మూడు బోట్లు తీరానికి చేరడంతో వాటిల్లోని మరో 20 మంది మత్స్యకారులు క్షేమంగా బయటపడ్డారు. నగరంలోని దుమ్ములపేట, పర్లోవపేట గ్రామాలకు చెందిన 13 మంది మత్స్యకారులు గత మంగళవారం రెండు బోట్లలో సముద్రంలో వేటకు వెళ్లారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో తిరిగి వస్తుండగా బోట్లలో ఆయిల్‌ అయిపోవడంతో సముద్రంలో ఉన్న ఓఎన్‌జీసీ ఆయిల్‌ రిగ్గుల వద్దకు వారు చేరుకున్నారు. అక్కడే బోట్లను నిలిపివేసి, వారిని రక్షించాలని మూడు రోజులుగా కోరినా అధికారులు స్పందించలేదని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. చివరకు ఒక రిగ్గు వద్ద ఉన్న ఏడుగురు మత్స్యకారులను కోస్టుగార్డు కమాండెంట్‌ పి.శ్యామ్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఓఎన్‌జీసీ సిబ్బంది రక్షించి, రిగ్గులో ఆశ్రయం కల్పించారు. వారిని మంగళవారం ఉదయం కోస్ట్‌గార్డ్‌ హెలికాప్టర్‌పై కాకినాడ తీసుకువచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదిలా ఉండగా మరో రిగ్గు వద్దకు చేరిన దుమ్ములపేటకు చెందిన వాసిపల్లి దానయ్యకు చెందిన బోటు తుపాను తీవ్రతతో సముద్రంలో మునిగిపోయింది. దానిపై ఉన్న ఆరుగురు కళాసీలను, పర్లోవపేటకు చెందిన వాడమొదలు కోటయ్య (బంగారయ్య) బోటుకు చెందిన మత్స్యకారులు రక్షించి, తమ బోటుపై ఎక్కించుకున్నారు. అందులో మరో ఏడుగురు మత్స్యకారులున్నారు. ఆయిల్‌ అయిపోవడంతో ఆ బోటు గాలివాటానికి మచిలీపట్నం వైపు వెళ్లి నాగాయలంక సమీపంలోని స్వర్ణగొందికి చేరుకుంది. మొత్తం 13 మంది మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. వారిని కాకినాడ తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు మత్స్యశాఖ అధికారులు తెలిపారు.

రెండు రోజులుగా ఎదురుచూస్తున్నాం
సముద్రంలోకి వేటకు వెళ్లిన నా తమ్ముడు శివ, మరో 13 మంది ఇంతవరకూ తిరిగి రాలేదు. మూడేళ్ల క్రితం నా తండ్రి కామేశ్వరరావు వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. ఇంతలోనే ఇలా జరిగింది. వేటకు వెళ్లినప్పడు ఇటువంటివి జరుగుతాయని, మూడు రోజుల్లో తిరిగి వస్తారని ధీమాతో ఉన్నాం. శివకు పదేళ్ల నుంచి వేటకు వెళ్లే అనుభవం ఉంది. ఏదో దరికి చేరుతారని నమ్మకంగా ఉన్నాం. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకూ మాట్లాడాడు. సిగ్నల్స్‌ లేక సమాచారం అందడం లేదు. కోస్ట్‌గార్డ్, నేవల్‌ సిబ్బంది గాలిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కురసాల సత్యనారాయణ ఇతర నాయకులు వచ్చి పరామర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి సార్‌తో మాట్లాడించారు. చాలా ధైర్యం చెప్పారు. వారు క్షేమంగా ఉన్నారనే కబురు చెప్పలేని ఆనందాన్నిచ్చింది.
– బొమ్మిడి కామేశ్వరరావు(మాజీ సర్పంచ్‌ భర్త), ఉప్పలంక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement