ఉప్పాడ బీచ్ రోడ్డు పైకి ఉధృతంగా ఎగసి వస్తున్న సముద్రం
మూడు రోజులుగా ‘తూర్పు’వాసులను హడలెత్తించిన పెథాయ్ తుపాను ఎట్టకేలకు సోమవారం జిల్లాలోని కాట్రేనికోన మండలం వద్ద తీరాన్ని తాకింది. అనంతరం బలహీనపడి చివరకు యానాం – కాకినాడ మధ్య తీరాన్ని పూర్తిగా దాటింది. సాగరంలో ఉన్నప్పుడున్న తీవ్రత తీరం దాటిన తరువాత లేకపోవడంతో నష్టం తగ్గింది. అయినప్పటికీ ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.50 కోట్ల వరకూ నష్టాన్ని మిగిల్చింది. పైలీన్, హుద్‌హుద్, తిత్లీ, గజ తుపాన్లతో పోలిస్తే పెథాయ్ తీవ్రత బాగా తక్కువని జిల్లా ప్రజానీకం ఊపిరి పీల్చుకుంది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పెథాయ్ తుపాను ఎక్కడ తీరం దాటుతుందన్న విషయాన్ని అధికారులు కచ్చితంగా అంచనా వేయలేకపోయారు. మచిలీపట్నం – కాకినాడ మధ్య అని ఒకసారి, కాకినాడ – తుని మధ్య అని ఇంకోసారి, కాకినాడ – విశాఖపట్నం మధ్య అని మరోసారి చెప్పారు. చివరికి తాళ్లరేవు – కాట్రేనికోన మధ్య తీరం దాటుతుందని సూచించారు. కానీ, వారి అంచనాలను తల్లకిందులు చేస్తూ కాట్రేనికోన వద్ద ‘పెథాయ్’ కేవలం తీరాన్ని తాకి, యానాం – కాకినాడ మధ్య తీరం దాటింది. అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్లకుండా భూభాగంపై పయనిస్తూ తుని వైపు మళ్లింది. అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్లి తీవ్ర వాయుగుండంగా మారి అద్దరిపేట వద్ద కేంద్రీకృతమైంది.
ఇలా తొలి నుంచీ తికమక పెడుతూ వచ్చిన పెథాయ్ తుపాను చివరికి వాయుగుండంగా జిల్లాను విడిచిపెట్టింది. ఈ తుపాను కోనసీమపై తీవ్ర ప్రభావం చూపుతుందని, 1996 నాటి పీడకలను గుర్తు చేస్తుందేమోనని అందరూ భయపడ్డారు. అనుకున్నట్టుగానే ఆ మండలాల పైనే ప్రభావం చూపింది. కాకపోతే తీరం దాటేలోపే బలహీనపడడంతో వేగం మందగించి, పెనుముప్పు తప్పింది. తీరం దాటేలోపు ఈదురు గాలులు, కుండపోత వర్షంతో భయభ్రాంతులకు గురి చేసిన తుపాను తీరం తాకిన, దాటిన సమయంలో అంతగా ప్రభావం చూపలేకపోయింది. 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినప్పటికీ ప్రమాదకరపరిస్థితులు ఏర్పడలేదు. దీంతో తీరప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అల్లవరం నుంచి తుని వరకూ భారీ వర్షాలు కురిసినా, ఈదురు గాలులు వీచినా ఊహించినంత నష్టం సంభవించలేదు.
అల్లకల్లోలం
పెథాయ్ తుపాను కారణంగా అల్లకల్లోలంగా మారిన సముద్రం సోమవారం రాత్రి వరకూ ఉగ్రరూపం దాల్చింది. రెండు రోజులుగా 6 మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్న అలలతో, 30 మీటర్ల ముందుకొస్తూ తీరాన్ని కోసేస్తున్న సాగరం సోమవారం మరింత కల్లోలంగా మారింది. ముందుకు రావడమే కాకుండా అలలు ఎగసిపడడంతో అల్లవరం నుంచి తుని వరకూ తీర ప్రాంతం మరింత కోతకు గురైంది. రాకాసి అలలు విరుచుకుపడడంతో కాకినాడ – తుని బీచ్ రోడ్డుపై రక్షణ రాళ్లు కొట్టుకుపోయాయి. బీచ్ రోడ్డు ముక్కముక్కలైంది. కిలోమీటర్ల మీర కోతకు గురై ప్రమాదకరంగా మారింది.
ఎక్కడెక్కడ ఏం జరిగిందంటే..
♦ రాజోలులో చెట్లు పడి 33/11 కేవీ లైను దెబ్బ తింది. సబ్ స్టేషన్ బ్రేక్ డౌన్ అయింది.
♦ కొత్తపల్లి మండలం కోనపాపపేటలో ఇంటిపై చెట్టు కూలి ముగ్గురు గాయపడ్డారు.
♦ కరపలో 13 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి.
♦ కూనవరం మండలం టేకులబోరులో వర్షానికి పూరిల్లు కూలిపోయింది.
♦ ఆదివారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షానికి ఎటపాక పవర్‌గ్రిడ్ లైన్ దెబ్బతిని, 4 విలీన మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
♦ రాయవరం మండలం ఊలపల్లి – పందలపాక మెయిన్ రోడ్డుకు అడ్డంగా కొబ్బరి చెట్టు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.
♦ కాజులూరు మండలం చేదువాడ వద్ద యానాం – గొల్లపాలెం రహదారిపై చెట్టు నేల కూలింది.
♦ అనపర్తి మండలం రామవరంలో కొబ్బరి చెట్టు కూలి కరెంట్ తీగలపై పడింది.
♦ కాట్రేనికోనలో విద్యుత్ స్తంభం కూలిపోవడంతో కారు నుజ్జునుజ్జయింది. కాకినాడ కలెక్టరేట్ వద్ద చెట్టు పడి, కారు దెబ్బతింది.
♦ తాళ్లరేవులో సెల్ టవర్ విరిగి పడిపోయింది.
♦ ముమ్మిడివరం మండలం గేదెల్లంకలో కొబ్బరి చెట్టు పడి పెంకుటిల్లు పాక్షికంగా ధ్వంసమైంది. ముమ్మిడివరం అభయాంజనేయ స్వామి ఆలయ ధ్వజస్తంభం విరిగిపడింది.
♦ సామర్లకోట మండలం ఉండూరులో రోడ్డుకు అడ్డంగా కొబ్బరి చెట్టు విరిగిపడింది.
♦ మండపేటలో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి.
♦ కాకినాడ సూర్యారావుపేటలో మత్స్యకారుడు బోడు అప్పారావు ఇల్లు కుప్పకూలింది.
♦ కె.గంగవరం మండలం కుడుపూరులో కొబ్బరి చెట్టు పడి ఇల్లు దెబ్బతింది.
♦ కాకినాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి మెడికల్ వార్డు దగ్గర భారీ చెట్లు కూలి, విద్యుత్ లైన్లపై పడటంతో స్తంభాలు నేలకొరిగిపోయాయి.
జరిగిన నష్టమిదీ..
♦ తీరం దాటే ముందు కురిసిన కుండపోత వర్షానికి, భారీగా వీచిన ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు, సెల్‌టవర్లు నేలకొరిగాయి. చెట్లు పడి పలు వాహనాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. మరికొన్నిచోట్ల పూరిళ్లు, రేకుల ఇళ్లు నేలకూలాయి. కొన్నిచోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి.
♦ జిల్లాలో 3,448 హెక్టార్లలో పండిన 19,390 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసి ముద్దయ్యింది. దీంతో రూ.33 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అధికారులు రైతుల నుంచి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయనందువల్లనే ఈ నష్టం జరిగింది.
♦ జిల్లాలో 2 వేల హెక్టార్లలో రూ.2 కోట్ల విలువైన పొగాకు పంటకు నష్టం జరిగింది.
♦ 817 హెక్టార్లలో ఉద్యాన పంటలకు రూ.1.97 కోట్ల నష్టం వాటిల్లింది.
♦ జిల్లావ్యాప్తంగా 40 వేల నుంచి 50 వేల ఎకరాల్లో నారుమళ్లు దెబ్బ తిన్నాయి. ఇక్కడ మళ్లీ నారు వేసుకోవలసిన పరిస్థితి నెలకొంది.
♦ ఇది కాకుండా చేతికందిన పత్తి పంట తుడిచిపెట్టుకుపోవడంతో రూ.6 కోట్ల నష్టం జరిగినట్టు అంచనా.
♦ గాలుల ధాటికి 86 కొబ్బరి చెట్లు, 70 ఇతర చెట్లు నేలకొరిగాయి. 17 ఇళ్లు కూలిపోయాయి. ఈ లెక్క మరింత పెరగనుంది. పడిపోయిన చెట్లు వందల్లో ఉండనున్నాయి.
♦ ఆర్టీసీ బస్సులు, రైళ్ల రద్దుతో రూ.కోటి ఆదాయానికి గండి పడింది. బస్సులు, రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
♦ తుపాను కారణంగా కాకినాడ పోర్టులో 15 నౌకల్లో ఎగుమతులు, దిగుమతుల కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. చాంబర్ ఆఫ్ కామర్స్ వర్గాల అంచనా ప్రకారం రూ.1.50 కోట్ల నష్టం వాటిల్లింది.
♦ లారీ రవాణా నిలిచిపోవడంతో రూ.1.50 కోట్లు, రోజంతా గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో రూ.10 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు స్తంభించిపోయాయి.
♦ రోజంతా ప్రదర్శనలు నిలిచిపోవడంతో సినిమా థియేటర్లు సుమారు రూ.25 లక్షల మేర ఆదాయం కోల్పోయాయి.
♦ పలుచోట్ల సెల్ టవర్లు నేలకొరిగాయి.
♦ ఆదివారం రాత్రి నుంచి ఈదురు గాలులతో వర్షం పడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 250 విద్యుత్ స్తంభాలు, 20 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బ తిన్నాయి. రెండు కిలోమీటర్ల మేర కేబుళ్లు తెగిపడ్డాయి. పడిపోయిన విద్యుత్ స్తంభాల సంఖ్య మరింత పెరగనుంది.
♦ 12 మండలాల పరిధిలోని 17 సబ్ స్టేషన్ల ఫీడర్లు దెబ్బతిన్నాయి. దీంతో జిల్లా కేంద్రం కాకినాడతో పాటు అనేక పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అధికారికంగా 96 గ్రామాల్లో మాత్రమే విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టు చెబుతున్నారు. సోమవారం రాత్రి వరకూ సరఫరా పునరుద్ధరణ జరగలేదు. మంగళవారం మధ్యాహ్నానికి పునరుద్ధరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
భారీవర్షాలు
తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం ఉదయం 8.30 నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకూ సగటున 33.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సోమవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సగటున 46.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనేకచోట్ల పంట పొలాలు నీట మునిగాయి. వరి, అరటి, మొక్కజొన్న, చెరకు, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. ఆది, సోమవారాల్లో కలిపి అత్యధికంగా అమలాపురంలో 184.8, ఉప్పలగుప్తంలో 175, కాజులూరులో 153.4, కాట్రేనికోనలో 143.8, తాళ్లరేవులో 139.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment