
తీరప్రాంత గ్రామంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్న రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు
విజయనగరం, పూసపాటిరేగ: పెథాయ్ తుఫాన్ ధాటికి సముద్రం ఉగ్రరూపం దాల్చడంతో తీరప్రాంతంలో ప్రజలు క్షణం క్షణం భయం భయంగా గడుపుతున్నారు. సముద్రాన్ని ఆనుకొని వున్న గ్రామాల్లో బలంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో సముద్రకెరటాలు ఉవ్వెత్తున ఎగసి గ్రామాలను తాకుతున్నాయి. గ్రామాన్ని ఆనుకొని వున్న గుడిసెలు ఎగిరిపోయాయి. తిప్పలవలసలో యాంకర్‌తో లంగరు వేసిన 5 పడవలు సముద్రంలోని కెరటాల థాటికి మునిగిపోయాయి. రాత్రి సమయంలోసముద్రం ముందుకు వస్తే ఒడ్డున నిలిపిన పడవలు కొట్టుకెళ్లే ప్రమాదం ఉందని పలువురు మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. కొబ్బరి, సరుగుడు తోటలకు ఆపార నష్టం కలిగించింది. మండల పరిధిలో 300 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరిగి తీవ్రంగా నష్టపోయింది.
కోనాడ, తిప్పలవలస గ్రామాల్లో పునరావాసకేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు భోజన వసతి కల్పిస్తున్నారు. పులిగెడ్డ, పతివాడ బర్రిపేట, తమ్మయ్యపాలెంలో గ్రామ ప్రత్యేక అధికారులు అందుబాటులో లేకపోవడంతో పునరావాసకేంద్రాలు ఏర్పాటు చేయలేదు. జాయింట్ కలెక్టర్ వెంకటరమణారెడ్డి కోనాడ గ్రామంలో పునరావాసకేంద్రాన్ని సందర్శించి బాధితులకు భోజన ఏర్పాట్లు చూశారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా నెలలు నిండిన కోనాడ గ్రామానికి చెందిన రోకళ్ల ఆదిలక్ష్మి అనే గర్భిణిని పూసపాటిరేగ పీహెచ్‌సీలో అత్యవసరంగా చేర్చడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. వాకీ టాకీల ద్వారా తిప్పలవలస, పతివాడబర్రిపేట గ్రామంలో రెడ్‌క్రాస్‌సొసైటీ సభ్యులు గ్రామంలో ప్రజలను అప్రమత్తం చేశారు. ఎటువంటి అపాయం జరగకుండా ముందుస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామాల్లో మత్స్యకారులకు అవగాహన కల్పించారు. కోనాడ, తిప్పలవలస గ్రామంలో పూసపాటిరేగ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది వైద్యశిబిరాలు నిర్వహించారు. తిప్పలవలసలో డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు, పతివాడబర్రిపేటలో జిల్లాపౌరసరఫరాల అధికారి ఎం.సుబ్బరాజు, చింతపల్లిలో జాయింట్ కలెక్టర్ వెంకటరమణారెడ్డి పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు.