మంగినపూడి బీచ్‌లో ముందుకు చొచ్చుకు వచ్చిన సముద్రం
‘పెథాయ్’ జిల్లాను అతలాకుతలం చేసింది. భారీ వర్షం, ఈదురుగాలులతో విరుచుకుపడింది. పలు ప్రాంతాల్లో చెట్లు,విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. మరోవైపు విపరీతమైన చలిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని రైతాంగం ‘పెథాయ్’ దెబ్బకు చేష్టలుడిగిపోయింది. కుంభవృష్టిగా కురిసిన వానకు వేల హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. దివిసీమ తీర ప్రాంతంలో సముద్రం ముందుకు చొచ్చుకువచ్చింది. బలమైన గాలులకు ఆయా ప్రాంతాల వాసులు బెంబేలెత్తిపోయారు. పునరావాస కేంద్రాల్లో అంతంత మాత్రంగానే సేవలు అందాయి.
సాక్షి, కృష్ణాజిల్లా,మచిలీపట్నం: కొన్ని రోజులుగా బెంబేలెత్తించిన పెథాయ్ తుపాను కాకినాడ–యానం మధ్య తీరం దాటింది. జిల్లాకు తుపాను ముప్పు తప్పడంతో కృష్ణా వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే తుపాను ప్రభావంతో జిల్లాలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
10,000 హెక్టార్లలో పంట నష్టం..
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 3.49 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. వరి 2.49 లక్షల హెక్టార్లలో సాగు చేయగా.. ఇప్పటి వరకు 2.03 లక్షల హెక్టార్లలో తుపానుకు ముందే కోత చేసినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 46,000 హెక్టార్లలో పంట కోత, పనలపై ఉన్న దశల్లో ఉంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జి ల్లా వ్యాప్తంగా 10,000 వివిధ రకాల పంటలు నీట ము నిగాయి. అందులో వరి 8,231 హెక్టార్లు నీళ్లపాలైంది. పత్తి 270 హెక్టార్లు, మొక్కజొన్న 430 ఉండగా, మిగి లిన 1069 హెక్టార్లలో మిర్చి తదితర పంటలున్నాయి.
జిల్లాలో వర్షపాతం ఇలా..
పెథాయ్ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 50 మండలాల్లో కుండపోత కురవగా.. అన్ని మండలాల్లో 20 మిల్లీ మీటర్లకు పైనే నమోదైంది. ఆదివారం రాత్రి 8.30 గంటల నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు పరిస్థితిని పరిశీలిస్తే.. జిల్లా వ్యాప్తంగా 69.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మండవల్లిలో 113.4 మిల్లీ మీటర్లు, గుడివాడ 102.2, పెనమలూరు 100.6, పెదపారపూడి 95.4, చల్లపల్లి 91.2, నందివాడ 81.2, గుడ్లవల్లేరు 79.7, అవనిగడ్డ 76.1, ఆగిరేపల్లి 76.4,ముదినేపల్లి 72.8 మొవ్వ మండలంలో 69.2గా నమోదైంది. సోమవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు జిల్లా సగటు వర్షపాతం 14.4 మిల్లీ మీటర్లుగా ఉంది. అత్యధికంగా జి.కొండూరులో 54.8 మిల్లీ మీటర్లు, వీరులపాడు 52.1, ఇబ్రహీంపట్నం 40.2, నందిగామ 36.7 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైంది.
తీరం.. కల్లోలం..
తుపాను తీరం దాటే సమయంలో మంగినపూడి సముద్రంలో అలల కల్లోలం నెలకొంది. అలల ఉద్ధృతికి పెద్దగా శబ్ధాలు రావడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు. సముద్రం 20 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది.
నేడు పాఠశాలలు, అంగన్‌వాడీలకు సెలవులు
తుపాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్న తరుణంలో మంగళవారం సైతం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, అన్‌ఎయిడెడ్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రటించినట్లు కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
♦ బందరు మండలం చిట్టిపాలెం, అరిసేపల్లి, సుల్తానగరం, ఎన్‌ఎన్ గొల్లపాలెం, సీతారామపురం చిన్నాపురం, కానూరు, యాదర, పెదపట్నం గ్రామాల్లో వరి పంట నీట మునిగింది.
♦ వర్షాల కారణంగా గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రి కూడ కుప్పకూలింది. ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గుడివాడ రూరల్ మండలంలో వరి పనలు నీట మునిగాయి.
♦ అవనిగడ్డ మండలం బందలాయిచెరువులో వరి పనలు నీట మునిగాయి.
♦ నూజివీడు మండలంలో వరి పనలు, వరి మోపులు నీట మునిగాయి. బాపూనగర్‌లో చింతచెట్టు నేలవాలింది. తుక్కులూరులో మొక్కజొన్న పంట నీట మునిగింది. దేవరగుంటలో ఈదురు గాలులకు పడిపోయిన మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. బాలానగర్‌లో ఈదురుగాలులకు వందేళ్ల భారీ వృక్షం నేలకూలింది.
♦ నందివాడ మండలం పుట్టగుంట గ్రామం వద్ద బుడమేరు డ్రైన్ ఉధృతంగా ప్రవహిస్తోంది.
♦ జి.కొండూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం పొలాల్లో ఉండటంతో పట్టాలు కప్పుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు.
♦ ఇబ్రహీంపట్నం మండలంలో వర్షానికి పంట పొలాల్లో వర్షపు నీరు చేరింది. వాటిని తొలగించుకునేందుకు ఆయిల్ ఇంజిన్లను పెట్టారు.
♦ ముదినేపల్లి మండలం దేవపూడి గ్రామంలో గ్రామం ముంపునకు గురైంది.
♦ ముసునూరు మండలంలో నీట మునిగిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇంజిన్లతో నీటిని తోడుతున్నారు. కాట్రేనిపాడులో పడిపోయిన నాటు పొగాకు పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment