డక్కిలి మండలంలో అముడూరు ప్రాంతంలో బీళ్లుగా మారిన పొలం
పెథాయ్ తుపాను కోస్తా జిల్లాలను వణికిస్తూ భారీ వర్షాలతో అతలాకుతలం చేస్తున్నా నెల్లూరు జిల్లాపై దీని ప్రభావం లేదనే చెప్పాలి. తొలుత తమిళనాడు.. మచిలీపట్నం మధ్య కొనసాగిన తుపాను ప్రభావం నెల్లూరు జిల్లాపై ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. రైతులందరూ ఆనందపడ్డారు. భారీ వర్షాలు కురిస్తే చెరువులు, కుంటలు నిండుతాయని ఆశపడ్డారు. రబీకి ఇబ్బంది ఉండదని భావించారు. అయితే వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. పెథాయ్ తుస్సు మనిపించింది. సాధారణ వర్షపాతం కూడా నమోదు కాని పరిస్థితి. సాగునీటి కోసం అన్నదాతలు యథావిధిగా ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా వచ్చిన తుపాన్లు జిల్లా రైతాంగాన్ని నిరాశపరచడం.. లోటు వర్షపాతం నమోదు కావడం.. సాగుకు అవసరమైన నీటి సరఫరా విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయడంతో లక్షల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఈ ఏడాదీ జిల్లాలో సాధారణ వర్షపాతమే. నాలుగేళ్లలో వర్షాకాలంలో సైతం జిల్లాలో సగటు వర్షపాతం నమోదు కాని పరిస్థితి. ఈశాన్య, నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. జిల్లాలో చినుకు కూడా కురవని పరిస్థితి. దీంతో ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే తుపాన్లను నమ్ముకుని కొన్ని ప్రాంతాల్లో రబీ సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది తిత్లీ, గజతోపాటు పెథాయ్ తుపానులు వచ్చాయి. అవి కూడా అన్నదాతలను పూర్తిగా నిరాశపరిచాయి. దీంతో జిల్లాలో సాగు భారంగా మారింది. అన్నదాతలు సతమతమవుతూ ఎక్కువ ఖర్చు నీటి కోసమే కేటాయించి మరీ పంటలు పండిస్తున్నారు. ఈ ఏడాది రబీ సీజన్‌లో భాగంగా జిల్లాలో అధికార, అనధికార ఆయకట్టు మొత్తం కలుపుకొని 6.15 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. ప్రస్తుతం 70 వేల ఎకరాల్లో మాత్రమే సాగు మొదలైన పరిస్థితి. గతేడాది జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు.
తీవ్ర కరువు ప్రభావం, వర్షాభావం, సోమశిల నుంచి నీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం తదితర కారణాలతో సాగు విస్తీర్ణం 3.5 లక్షల ఎకరాలకు పడిపోయింది. గతేడాది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు బాగా కురవడం, సోమశిలకు ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండడంతో సుమారు 42 టీఎంసీల నీటిని సాగునీటి అవసరాలకు కేటాయించారు. కానీ ఈ ఏడాది పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించి జిల్లాలో సాగుకు ఎక్కువ నీరు ఇవ్వలేమని అధికారులు తేల్చి చెప్పారు. సోమశిలకు ఇన్‌ఫ్లో ఎక్కువ లేకపోవడంతో డెడ్‌స్టోరేజ్ లెవల్ పోను 32 టీఎంసీల నీటిని మాత్రమే సాగునీటి అవసరాలకు కేటాయిస్తామని ప్రకటించారు. డెల్టా ప్రాంతానికే పూర్తిస్థాయిలో నీరు ఇస్తే 24 టీఎంసీలు కేటాయించాల్సి ఉంటుంది. డెల్టా ప్రాంతంలోనే 2.47 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం అధికారికంగా ఉంది. కానీ అధికారులు మాత్రం అంత నీరు ఇవ్వలేమని చేతులెత్తేశారు. కనుపూరు, కావలి, కెనాల్స్ పరిధిలో అనధికార మోటర్ల ద్వారా నీరు పూర్తిగా తోడేయడంతో చివరి భూములకు అందని పరిస్థితి ఉంది.
లోటు వర్షపాతం, ఆపై కరువు ప్రభావం
జిల్లాలో నాలుగేళ్లుగా లోటు వర్షపాతం నమోదవుతోంది. వాస్తవంగా సాధారణ వర్షపాతం కన్నా 90 శాతం లోటు వర్షపాతం జిల్లాలో నమోదవుతూ వస్తోంది. అయితే అడపాదడపా కురిసే వర్షాల వల్ల కొంత సరాసరి పెరుగుతోంది. గతేడాది జిల్లాలో 54 శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటికే 62 శాతం దాటింది. తాజాగా పెథాయ్ ప్రభావంతో కేవలం నాలుగు శాతం వర్షపాతం మాత్రమే నమోదు కావడం గమనార్హం. మరోవైపు జిల్లాలో కరువు ఛాయలు కూడా మొదలయ్యాయి. ఈ ఏడాది ఉదయగిరి ప్రాంతాల్లో సాగుతోపాటు తాగునీటి ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉండడంతో అనేక గ్రామాలకు ట్యాంకర్ల నీరే ఆధారంగా మారింది. గతేడాది జిల్లాలో 34 మండలాలను కరువు మండలాలుగా సగటు వర్షపాతం ఆధారంగా ప్రకటించారు. ఈ ఏడాది జిల్లాలోని 46 మండలాలు నెల్లూరు రూరల్‌తో సహా అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం కరువు తీవ్రతకు నిదర్శనం. మొత్తం మీద పెథాయ్ తుపాను కూడా నిరాశ పరచడంతో మళ్లీ తుపాను ఈ సీజన్‌లో పంటలకు పనికొచ్చేలా వస్తుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment