గరివిడి: వెదుళ్లవలసలో చనిపోయిన గొర్రెలను పరిశీలిస్తున్న తహసీల్దార్ సుభాష్‌బాబు
పెథాయ్ తుఫాన్ జిల్లాలో మూగజీవాల పాలిట మృత్యువుగా మారింది. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో 990 పశువులు మృతి చెందాయి. వీటిలో ఆవులు, లేగదూడలు, గొర్రెలు, మేకలు తదితరమైనవి ఉన్నాయి. వీటి మృతితో రూ.లక్షల్లో నష్టం సంభవించింది. పశుసంవర్ధక శాఖ అంచనాల మేరకు మంగళవారం నాటికి 20 గేదెలు, 18 దూడలు, పది ఎద్దులు, 618 మేకలు, 324 కోళ్లు మృత్యువాత పడ్డాయి. పెంపకందారులు లబోదిబోమంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకొంటున్నారు.
విజయనగరం ,గరివిడి: పెథాయ్ తుఫాన్ గొర్రెల పాలిట యమపాశమైంది. తుఫాన్ చలిగాలులకు మండలంలో 95 గొర్రెలు చనిపోయినట్టు రెవెన్యూ, పశు వైద్యాధికారులు గుర్తించారు. ఒక్క కుమరాం గ్రామంలోనే 71 గొర్రెలు మృతి చెందాయి. ఆ గ్రామానికి చెందిన వైగాల రాముడు, వైగాల పెద్దోడు, డొప్ప చిన్నయ్య, డొప్ప కర్రి అప్పయ్య, డొప్ప తాత, డొప్ప తవుడు, తొండ్రంగి తాత, వైగాల మాలచ్చి, వైగాల అప్పమ్మలకు చెందిన గొర్రెలు చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. వెదుళ్లవలస గ్రామంలో బందపు సత్యవతి, బందపు ఈశ్వరరావు, బందపు చిన్నయ్య, బందపు రాములు, వాకాడ అప్పయ్య, దువ్వాన నందినలకు చెందిన గొర్రెలు చనిపోయాయి. కొండశంభాం గ్రామంలో లెంక అసిరినాయుడుకు చెందిన గొర్రెలు చనిపోయాయి. మండలం మొత్తం తుఫాన్ కారణంగా చలికి తట్టుకోలేక 95 గొర్రెలు చనిపోయినట్లు గుర్తించినట్లు తహసీల్దార్ కె.సుభాష్‌బాబు, పశువైద్యాధికారిణి డాక్టర్ కమలకుమారి తెలిపారు.
సతివాడలో 108 గొర్రెలు...
తెర్లాం: మండలంలోని సతివాడ గ్రామానికి సమీపంలో మామిడితోటలో గొర్రెల మందల్లోని 108 గొర్రెలు, పిల్లలు తుఫాన్ వల్ల వీచిన గాలులకు చల్లి తట్టుకోలేక మృతి చెందాయి. చీపురుపల్లి మండలం పేరిపి గ్రామానికి చెందిన 11 మంది గొర్రెల కాపరులు వారి గొర్రెల మందలను సతివాడ గ్రామంలో మంద కాసేందుకు తీసుకొచ్చారు. పెథాయ్ తుఫాన్ వల్ల కురిసిన వర్షాలు వీచిన గాలులకు సోమవారం రాత్రి మృతి చెందాయి. పేరిపికి చెందిన బాగు చినప్పయ్య, రామప్పమ్మ, లక్ష్మి, శ్రీదేవి, సూర్యకళ, గంగిమ్మ, రామప్పమ్మ, కాకి రాములమ్మ, సూరీడు, చినప్పమ్మ, రాములమ్మ, ఆదిలక్ష్మిలకు చెందిన 108 గొర్రెలు, పిల్లలు చనిపోయాయి. మంగళవారం మందను వేరే ప్రాంతానికి తరలించేందుకు చూడగా అవి మృతి చెంది ఉండడాన్ని గుర్తించి బోరున విలపించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వి.రామస్వామి, ఎస్‌ఐ శ్రీనివాస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. వివరాలు తెలుసుకున్నారు. చీపురుపల్లికి చెందిన మండల పశువైద్యాధికారితో పాటు గోపాలమిత్రలు వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు.
చలితో..
చీపురుపల్లి రూరల్: పెథాయ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవటంతో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. మండలంలోని రావివలస గ్రామంలో పొదిలాపు గణపతికి చెందిన రెండు గేదె దూడలు మృతి చెందాయి. ఇదిలా ఉండగా అలజంగి పంచాయతీ పరిధి ఎలకలపేట గ్రామం కాకి సూర్యనారాయణకు చెందిన 15 గొర్రెలు రాజాం సమీపంలో గల అగూరు కంచరాం వద్ద చలి తీవ్రతతో మృతి చెందాయి.
చలి గాలులకు 17 గొర్రెలు...
శృంగవరపుకోట రూరల్: తుఫాన్ చలిగాలులకు తట్టుకోలేక మండలంలోని కొట్టాం గ్రామంలో 17 గొర్రెలు మృతి చెందినట్టు గ్రామ రెవెన్యూ అధికారి గణేష్ మంగళవారం తెలిపారు. కొట్టాం గ్రామానికి చెందిన నెక్కళ్ల అబద్ధం, నెక్కళ్ల రాములమ్మ, టేకుబోయిన ఎర్నాయుడు తమ గొర్రెల మందలను విశాఖ జిల్లా పెందుర్తి మండలం, పెదగాడ గ్రామాని కి మందకు తీసుకువెళ్లారు. సోమవారం రాత్రి వీచిన గాలులకు 17 గొర్రెలు మృతి చెందాయి. తహసీల్దార్ ఎం.అరుణకుమారికి సమాచారం అందజేశారు.
32 మూగజీవాలు మృతి
సాలూరు రూరల్: పెథాయ్ తుఫాన్ వల్ల వీచిన చలి గాలులకు సాలూరు, పాచిపెంట మండలాల్లో సుమారు 32 మూగజీవాలు మృతి చెందాయి. సాలూరు మండలంలో 2, పాచిపెంట మండలంలో 30 మూగజీవాలు మృతి చెందాయి. సాలూరు మండలంలో దుగ్దిసాగరం పంచాయతీలో పుల్లేరిగుడ్డివలసలో 1 ఆవు, ఒక దూడ మృతి చెందాయి. పాచిపెంట మండలంలో పద్మాపురం, కేసలి, కొటికిపెంట, పనుకువలస, బొర్రమామిడి పంచాయతీల్లో తెట్టేడివలసలో 4 మేకలు, కేసలిలో 2 గొర్రెలు, కోష్టువలసలో 4 గొర్రెలు, పెదచీపురువలసలో 4 మేకలు, బడ్నాయికవలసలో 2 ఆవులు, రాయివలసలో 1 మేక, 3 ఆవులు, బొర్రమామిడిలో 1 ఆవు, చినచీపురువలసలో 1 మేక, బడేవలసలో 6 మేకలు, సేరిగుడ్డిలో ఆవు దూడ, మెట్టగుడ్డిలో 1 మేక మృతి చెందినట్లు ఇన్‌చార్జి తహసీల్దార్ కుప్పిలి నాగేశ్వరరావు తెలిపారు. పశు వైద్యాధికారులు, సిబ్బంది, రెవెన్యూ అధికారులు పర్యటించి దర్యాప్తు నిర్వహించారు.
చలి తీవ్రతతో..
మెంటాడ: ఈదురు గాలులతో ప్రారంభమైన పెథాయ్ తుఫాన్ చలికి తట్టుకోలేక పోరాంలో నాలుగు, ఉద్దంగిలో నాలుగు, జయితిలో 8, చింతలవలస ఆరు గొర్రెలు, మేకలు మృతి చెందాయి. సవరివల్లిలో రెండు ఎద్దులు మృతి చెందినట్లు పెంపకందారులు తెలిపారు.
22 గొర్రెలు మృతి
గుర్ల: పెథాయ్ తుఫాన్ వల్ల రెండు రోజులుగా వీస్తున్న చలి గాలులకు 22 గొర్రెలు మృతి చెందాయి. మణ్యపురిపేటలో 14 గొర్రెలు, గుర్లలో 8 గొర్రెలు, చింతలపేటలో ఎద్దు మరణించాయి. రెండు రోజులుగా చలితీవ్రత అధికంగా ఉండడం వల్ల చలికి తట్టుకొలేక మరణించినట్లు పశువైద్యాధికారులు మంగళవారం తెలిపారు. గుర్లలోని గొర్రెల కాపరులను ఎంపీడీవో ఆమంచి కామేశ్వరరావు, ఈవోపీఆర్‌డీ అల్లు భాస్కరరావు పరామర్శించారు. గొర్రెల మృతి చెందిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహరం అందేలా చర్యల తీసుకుంటాం ఎంపీడీవో హమీ ఇచ్చారు.
మృతి చెందిన పశువులు
బొబ్బిలి రూరల్: పెథాయ్ తుఫాన్‌తో వీచిన చలి గాలులకు కారాడలో వై.గంగయ్య, వై.అప్పలస్వామిలకు చెందిన చెరో మేక మృతి చెందగా మెట్టవలసలో ఒక మేక చనిపోయింది. నారశింహునిపేటకు చెందిన పి.లకు‡్ష్మనాయుడుకు చెందిన ఆవు, దూడ మృత్యువాత పడ్డాయి. పెంపకందారులకు ప్రభుత్వ పరంగా సాయం అందేలా చూస్తామని పశువైద్యులు సుధాకర్, అనిత తెలిపారు.
లెంకపేటలో...
మెరకముడిదాం: మండలంలోని గర్భాం మేజర్ పంచాయతీ పరిధిలో గ్రామమైన లెంకపేట గ్రామంలో పెథాయ్ తుఫాన్ కారణంగా చలికి తట్టుకోలేక గ్రామానికి చెందిన కోరాడ చిన్నయ్యకు చెందిన ఐదు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పాటూ ఈదురు గాలుల వల్ల గొర్రెలు మృతి చెందాయి.
Comments
Please login to add a commentAdd a comment