రాష్ట్రంలో రెండు రోజులు తక్కువ ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో ఈనెల 23న తుపాను ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. ప్రస్తుతం ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఎగువ గాలులతో ఏర్పడిన చక్రవాతపు ఆవర్తనం ప్రభావం వల్ల సోమవారం ఉదయానికి తూర్పు–మధ్య బంగాళాఖాతం, పరిసర ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇది పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడి ఈ నెల 22వ తేదీ ఉదయం కల్లా వాయుగుండంగా మార్పు చెందుతుందని వెల్లడించింది.
ఆ తర్వాత వాయుగుండం బలపడి ఈనెల 23న పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వివరించింది. ఇది వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 24వ తేదీ ఉదయం కల్లా ఒడిశా–పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. మరోవైపు ఉత్తర తమిళనాడు తీరానికి ఆనుకుని నైరుతి, పరిసర పశి్చమ మధ్య బంగాళాఖాతంలో మరో చక్రవాతపు ఆవర్తనం కొనసాగుతోంది. ఇది బలపడి అల్పపీడనం, ఆ తర్వాత వాయుగుండంగా మార్పు చెందే క్రమంలో రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగుడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment