పూసపాటిరేగ మండలం చింతపల్లిలో కెరటాల ఉధృతి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాపై పెథాయ్ తుఫాన్ ప్రతాపాన్ని చూపిం చింది. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు భయాందోళనలో ఉన్నారు. చేతికంది వచ్చిన పంటలు నీటిలో మునిగాయి. మత్స్యకారులు వేటకు దూరమై ఆహారం, తాగునీరు కరువై ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయి కుటీర పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రజలు ఇంత కష్టంలో ఉంటే జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కనీసం ప్రజలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్ వెళ్ళిపోయారు. కేంద్ర మాజీ మంత్రిగానీ, జిల్లా ఎమ్మెల్యేలు గానీ ఏ ఒక్కరూ పరిస్థితిని సమీక్షించలేదు.
బిక్కుబిక్కు మన్న జనం
జిల్లాలో పెథాయ్ తుఫాన్ ప్రభావం ఎలా ఉంటుం దోనన్న భయంతో జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. తుఫాన్ తీరం దాటే సమయంలో భారీ ఈదురుగాలులు, వర్షాలు కురుస్తాయనే వాతావరణ వాఖ హె చ్చరికల నేపథ్యంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. అనుకున్నట్లుగానే జిల్లాలో ఎడతెరపి లేకుండా 49.8 మిమీ సగటు వర్షపాతం నమోదయ్యింది. అనూహ్యంగా తీర ప్రాంతాల్లో కంటేఅత్యధికంగా పాచిపెంటలో 96.6 మీమీ, సాలూరులో 84.8 మిమీ, గుర్లలో 75.4 మీమీ వర్షపాతం నమోదైంది. తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉన్న జిల్లాలో సాయంత్రానికి వర్షం ఉధృతమైంది. కుండపోత వర్షానికి భారీ గాలులు, చలిగాలులు తోడయ్యాయి.
స్తంభించిన జనజీవనం
తుఫాన్ ప్రభావంతో జిల్లాలో జనజీవనం స్తంభించింది. భారీ ఈదురు గాలులు, వర్షంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. చలిగాలులకు పల్లె, పట్టణ ప్రజలు చివురుటాకుల్లా వణికి పోయారు. అధికార యంత్రాంగం ముందస్తు చర్యల్లో భాగంగా పాఠశాలలకు సెలవు ప్రకటించినా కొన్ని ప్రవేటు స్కూళ్లు ఈ ఆదేశాలను లెక్కచేయకుండా యథావిధిగా తరగతులు నిర్వహించడంతో విద్యార్ధులు వారి తల్లిదండ్రులు అవస్థలు పడ్డారు, పలు లోతట్టు ప్రాంతాల వారిని ముందుగా గుర్తించి వారిని 17 సురక్షిత శిబిరాలకు అధికారులు తరలించారు. విజయనగరం నుంచి దూరప్రాంతాలకు వెళ్లే 21 బస్సు సర్వీసులను ఆర్టీసీ నిలిపివేసింది. పలు రైళ్లను రద్దుచేయడంతో పాటు కొన్నిటిని నియంత్రించారు. తుఫాన్ ప్రభావం తీర ప్రాంతంతో పాటు జిల్లాలో అంచనా వేసిన దానికన్నా కాస్తా తక్కువ ప్రభావం చూపడం, జిల్లా వ్యాప్తం గా ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.
మరో రెండురోజులు వర్షాలు
తుఫాన్ తీరం దాటినా వర్షాలు మరో రెండు రోజులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జిల్లాలో ఇప్పటికే దాదాపు 450 హెక్టార్లలో మొక్కజొన్న పంటకు న ష్టం వాటిల్లినట్టు అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. నష్టం విలువ సుమారు రూ.56.25 లక్షలు ఉంటుందంటుని వ్యవసాయశాఖ ప్రకటించింది. అయితే వరి పంటకు కూడా భారీ నష్టం వాటిల్లింది. వెలుగు సిబ్బంది సమ్మె, కొనుగోలు కేంద్రాల జాప్యం కారణంగా ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడంతో పొలాల్లోనే కుప్పలుగా ఉంచారు. అవన్నీ ఇప్పుడు తడిసిపోయాయి. ధాన్యం రంగుమారే అవకాశం ఉంది. ఇక పూసపాటిరేగ మండలంలో 30 హెక్టార్లలో అరటి, బొప్పా యి పంటలు దెబ్బతినడంతో రూ. 50లక్షల వరకూ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. చేపల కంచేరు గ్రామంలో 5 బోట్లు కొట్టుకుపోగా, 14 బోట్లు బోల్తా పడ్డాయి. ముక్కాంలో మరో బోటు దెబ్బతింది. వీటి నష్టం రూ.25లక్షలు ఉంటుందని మత్స్యశాఖ లెక్కగట్టింది. గాలులు వీస్తుండటంతో జిల్లా అంతటా విడతల వారీగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో చిన్న, మధ్య తరహా కుటీర పరిశ్రమలు మూతపడ్డాయి. వ్యాపార వాణిజ్య కేంద్రాలకు కొనుగోలుదారుల తాకిడి తగ్గడంతో వ్యాపారాలు మందగించాయి.
పత్తాలేని ప్రజాప్రతినిధులు
ఓ వైపు తుఫాన్ భయంతో జిల్లా ప్రజానీకం తల్లడిల్లుతుంటే వారికి అండగా ఉండి ధైర్యం చెప్పాల్సిన ప్రజాప్రతినిధులెవరూ పత్తాలేకుండా పోయారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహరలాల్ తుఫాన్ స్థితిగతులపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్ర మంత్రి సుజయ్ కూడా కేవలం టెలికాన్ఫరెన్స్‌కే పరిమితమయ్యారు. తుఫాను ప్రమాదం జిల్లాకు పొంచి ఉందని తెలిసి కూడా ఆదివార మే జిల్లా వదిలి వెళ్లిపోయారు. ఇక కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అశోక్‌గజపతిరాజు ఎక్కడున్నారో కూడా జనానికి తెలియదు. ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment