పెథాయ్‌ కలవరం..! | Pethay Effect on Vizianagaram | Sakshi
Sakshi News home page

పెథాయ్‌ కలవరం..!

Published Mon, Dec 17 2018 7:08 AM | Last Updated on Mon, Dec 17 2018 7:08 AM

Pethay Effect on Vizianagaram - Sakshi

చింతపల్లిలో మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్న ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తదితరులు

బంగాళా ఖాతంలో ఏర్పడిన పెథాయ్‌ తుపాను తీరానికి చేరే వేళ అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. సముద్రం నీరు పలు చోట్ల 30 నుంచి 50 మీటర్ల మేర ముందుకొచ్చింది.తీరం భారీగా కోతకు గురైంది. మత్స్యకార గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.భారీ వర్ష సూచనతో జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఆదివారం ఉదయం నుంచి మబ్బులు వేయడంతో రైతులు అప్రమత్తమయ్యారు. కోసిన చేనును కుప్పలుగా చేర్చారు. కొన్నిచోట్ల యంత్రాల సాయంతో నూర్పిడి చేశారు.అధిక శాతం వరి పంట పొలాల్లో చిన్నచిన్న కుప్పలుగానే ఉంది. పొలాల్లో నీరు చేరేలా వర్షం కురిస్తే వరి కుప్పలు తడిసిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తుపాను హెచ్చరికలతో జిల్లా వాసులు ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. దీంతో బస్, రైల్వేస్టేషన్లు బోసిపోయాయి. వ్యాపారాలు మందగించాయి. తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు పూర్తిచేసింది.  తుపాను ప్రభావిత  తీర గ్రామాలకు సరుకులు సరఫరా చేసింది.

విజయనగరం గంటస్తంభం/పూసపాటిరేగ: బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్‌ తుపాను ఉగ్రరూపం దాల్చింది. జిల్లాపై తీవ్ర ప్రభావం ఉంటుం దన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా వాసులు కలవరపడుతున్నారు. రైతులు భయాందోళన చెందుతున్నారు. మత్స్యకారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తుపాను తూర్పు, ఆగ్నేయదిశలో కాకినాడ, మచిలీపట్నం తీరానికి దగ్గర్లో కేంద్రీకృతమై ఉంది. రాత్రికి మరింత బలపడి తీవ్ర తుపానుగా మారుతుం దని విశాఖపట్నం వాతావరణశాఖ అధికారులు తెలి పారు. సోమవారం తుపాను తీరం దాటుతుందని వెల్లడిం చారు. తీరందాటే సమయంలో 70 నుంచి 80 కిలో మీటర్లు వేగంతో గాలులు వీస్తాయని, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. దక్షిణ కోస్తాకు తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని,ఉత్తరాంధ్రాలో కూడా భారీగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఇదిలాఉంటే కాకినాడకు సమీపంలో తీరందాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నా తుపాను సముద్రంలో సుడులు తిరుగుతూ ఎప్పటికప్పుడు దిశ మారుస్తోంది. దీంతో అక్కడే తీరందాటుతుందా? వేరే వైపు వెళుతుందా? అన్న సందేహం కూడా తలెత్తుతోంది.

ముందుకొచ్చిన సముద్రం
పెథాయ్‌ తుపాను ప్రభావం జిల్లాపై ఆదివారం స్పష్టంగా కనిపించింది. భోగాపురం మండలం ముక్కాం వద్ద సముద్రం 50 మీటర్లు ముందుకొచ్చింది. పూసపాటిరేగ మండలంలోని తిప్పలవలస, చింతపల్లి తదితర తీరప్రాంతంలో కూడా 30 నుంచి 40 మీటర్లు సముద్రం ముందుకొచ్చింది. దీంతో మత్స్సకారులు ఆందోళన చెందుతున్నా రు. బోట్లును సురక్షితంగా ఉంచేందుకు ఒడ్డుకు చేర్చారు.

అప్రమత్తం చేసిన అధికారులు
తుపాను ప్రభావం జిల్లాపై కూడా ఉంటుందన్న సమాచారంతో జిల్లా అధికారులు అప్రమత్తమై ప్రజలను అప్రమత్తం చేశారు. ఇన్‌చార్జి  కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిస్థితిని పర్యవేక్షించారు.  రెవెన్యూ, మత్స్య, విద్యుత్, పంచాయతీ, మున్సిపల్‌ ఇతర శాఖల అధికారులను మరింత అప్రమత్తం చేశా రు. డీఆర్వో జె.వెంకటరావు ఆదివారమైనా కలెక్టరేట్‌లో ఉండి అధికారులకు సూచనలిచ్చారు. పూసపాటిరేగ మండలంలో భారీగా వర్షాలు పడతాయని ఆర్టీజీఎస్‌ అధికారులు హెచ్చరించడంతో అధికారులు ఆ మండలంపై దృష్టి పెట్టారు.  జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఇన్‌చార్జి కలెక్టర్‌ సెలవు ప్రకటించారు. మండల కేంద్రంలో జిల్లా అధికారులు మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గ్రామాలకు నియమించిన ప్రత్యేకాధికారులు గ్రామాల్లో ఉండి ప్రజలను అ ప్రమత్తం చేశారు. పూసపాటిరేగతోపాటు భోగాపురం తీరప్రాంతంలో సముద్రం వైపు ఎవరూ వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

అవసరమైతే జనాలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు తుపాను షెల్టర్లు సిద్ధం చేశారు. వారికి ఆహారం సరఫరా చేసేం దుకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచారు. ఈదురుగాలులు వీస్తే చెట్లు విరిగే ప్రమాదం ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేశారు. అధికారులంతా అందుబాటులో ఉండాలని, సెలవులు పెట్టరాదని ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఆదేశించారు. చింతపల్లి గ్రామంలో పర్యటించి మత్స్యకారులకు పలు సూచనలు, సలహాలిచ్చారు. తిరిగి ప్రకటించే వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. తీరప్రాంత గ్రామాలులో ఎప్పటికప్పుడు పరిస్థితిని తహసీల్దార్‌ జి.సూర్యలక్ష్మి అధికారులకు చేరవేస్తున్నారు. తీరప్రాంత గ్రామాలు రేషనుషాపులలో నిత్యవసర సరుకులను అందుబాటులో ఉంచారు. కొన్ని గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తర లించారు. గ్రీవెన్స్‌సెల్‌ రద్దు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement