సాక్షి, సిటీబ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ ప్రభావంతో నగరంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. అసలే శీతాకాలం కావడంతో పరిస్థితి దారుణంగా మారింది. దీంతో ప్రజలు వెచ్చదనం కోసం వివిధ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ఇందులో భాగంగా నిద్రిస్తున్న గదుల్లో బొగ్గుల కుంపట్లను ఏర్పాటు చేసుకోవడమేగా, చల్లగాలి గదిలోకి రాకుండా తలుపులు, కిటికీలు భిగిస్తున్నారు. ఇలాంటి గదుల్లో నిద్రిస్తే ప్రాణాలకే ప్రమాదమని ఫోరెన్సిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. . ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లలో జరిగే న్యూ ఇయర్ పార్టీల నేపథ్యంలోనూ ఇలాంటి అపశృతులకు ఆస్కారం ఉందని పేర్కొన్నారు.
అన్నీ బిగించేస్తే...
బొగ్గులు, నిప్పులు, మంట... ఇలా ఏదైనా మండటానికి ఆక్సీజన్ అవసరం. ఏదైనా గదిలో బయట నుంచి చలి, గాలి రాకుండా తలుపులు, కిటికీలు మూసేసి వీటిని వెలిగిస్తే... గదిలోని ఆక్సీజన్‌ను ఈ మంట, నిప్పు గ్రహిస్తాయి. దీంతో గాలిలోని ఆక్సిజన్, బొగ్గుల్లో ఉండే కార్బన్ కలిసి కార్బన్‌డయాక్సైడ్ (సీఓ2) విడుదలవుతోంది. ఇదే పరిస్థితి మరి కొద్దిసేపు కొనసాగితే కార్బన్‌డయాక్సైడ్‌లో ఉన్న ఆక్సీజన్‌ను సైతం మంట లాక్కుని కార్బన్‌మోనాక్సైడ్ విడుదలవుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన విష వాయువుగా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి వాసన ఉండని ఈ వాయువును కేవలం నాలుగైదు సార్లు పీలిస్తే చాటు... ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే.
కార్బాక్సీ హిమోగ్లోబిన్ తయారై...
ఇలా పీల్చిన కార్బన్‌మోనాక్సైడ్ గుండె, మెదడుకు చేరుకుని కొన్ని నిమిషాల్లోనే మెదడును నిస్తేజం చేస్తుంది. గుండె ద్వారా ఈ వాయువు రక్తంలోకి ప్రవేశించి కార్బాక్సీ హిమోగ్లోబిన్‌ను తయారు చేస్తుంది. దీని ఫలితంగానే మనిషి ప్రాణాలు కోల్పోతాడు. నిద్రలో ఉండే వారు తమ శరీరంలో అంతర్గతంగా వస్తున్న ఈ మార్పులను సైతం గుర్తించలేరని తద్వారా మృత్యువాత పడతారని ఫోరెన్సిక్ నిపుణులు పేర్కొన్నారు. ఇలాంటి మరణాలు చలి ఎక్కువగా ఉండే ఉత్తరాదిలో ఏటా పెద్ద సంఖ్యలో ఉంటాయన్నారు. ఈ కార్బన్ మోనాక్సైడ్ వాయువు డ్రైనేజీ గుంతలు, లోతైన బావుల్లోనూ పుడుతుంటుందని, వాటిలో దిగిన కార్మికులు ప్రాణాలు కోల్పోయేందుకు ఇదే కారణమని వారు పేర్కొంటున్నారు.
గాలి వచ్చి పోయేలా...
చలి కారణంగా తలుపులు, కిటికీలు పూర్తిగా బిగించుకుని పడుకోవడం సరికాదని ఫోరెన్సిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికి తట్టుకోలేక గదుల్లో హీటర్ ఆన్ చేసుకున్నా, కుంపటి పెట్టుకున్నా, మరో మార్గాన్ని అనుసరించినా కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆయా గదులకు కచ్చితంగా గాలి ప్రసరించే మార్గాలు ఉండేలా చూసుకోవాలని, లోపలి గాలి బయటికి, బయటకు లోపలికి వచ్చేలా కనీస ఏర్పాట్లు ఉండాలని తెలిపారు.
‘కుంపటి’ ప్రమాదాలు ఇవీ
♦ బుధవారం జూబ్లీహిల్స్‌లో ఇంట్లో బొగ్గుల కుంపటి పెట్టుకుని నిద్రించిన తల్లీకుమారులు బుచ్చి వేణి, పద్మరాజు కన్నుమూశారు.
♦ గత ఏడాది డిసెంబర్‌లో యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట శివారులోని పౌల్ట్రీఫామ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారు. వీరు నిద్రిస్తున్న గదిలో ఓ బొగ్గుల కుంపటి ఉండటాన్ని గుర్తించిన పోలీసులు అదే వీరి ప్రాణం తీసిందని ప్రాథమికంగా తేల్చారు.
♦ 2008లో డిసెంబర్ 31న కొందరు యువకులు దేవరయాంజల్‌లోని రామరాజు ఫామ్‌హౌస్‌లో విందు చేసుకున్నారు. వీరిలో శ్రీరామమూర్తి, వెంకటపతిరాజు ఓ గదిలో నిద్రిస్తూ నిప్పు రవ్వలు రాజేసుకున్నారు. తెల్లవారేసరికి ఇద్దరూ మరణించారు. దీనికి కారణం నిప్పుల కుంపటే.
♦ కొన్నేళ్ళ క్రితం నాంపల్లిలోని చాకలిబస్తీలో ఇలాంటి మరణమే సంభవించింది. తన గది తలుపులు, కిటికీలు బిగించుకున్న ఓ వ్యక్తి కూలర్ ఆన్ చేసుకుని పడుకున్నారు. ఆ కూలర్ కాలిపోవడంతో తయారైన కార్బన్‌మోనాక్సైడ్ పీల్చి కన్నుమూశాడు. తొలుత ఇది హత్యగా భావించినా... ఫోరెన్సిక్ నిపుణులు చిక్కుముడిని విప్పారు.
Comments
Please login to add a commentAdd a comment