సాక్షి, హైదరాబాద్ : పెథాయ్ తుపానుతో ఏడెనిమిది జిల్లాల్లో పంటలు దెబ్బతిని రైతుల గుండెలు ఆగిపోతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టించుకోకపోవడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ధ్వజమెత్తారు. పెథాయ్ తుపాను తీవ్రతపై కేంద్ర సంస్థలన్నీ గత నాలుగు రోజులుగా ఘోషించినా చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోకుండా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లారని, రాష్ట్ర ప్రజలు ఏమైనా ఫర్వాలేదన్న రీతిలో ఆయన ప్రవర్తించారని దుయ్యబట్టారు. విపత్తు సమయంలో చంద్రబాబుకు తెలంగాణ రాజకీయాలు, ఈవీఎంల వ్యవహారం అవసరమా? అని సూటిగా ప్రశ్నించారు. రైతుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని పేర్కొన్నారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నాగిరెడ్డి మాట్లాడారు. పంట నష్టంపై ప్రభుత్వ లెక్కలకు వాస్తవ నష్టానికి పొంతన లేదని విమర్శించారు.
ముఖ్యమంత్రి, సాగునీటి మంత్రి, రియల్‌టైమ్ గవర్నెన్స్ ప్రకటనలకు సంబంధం లేకుండా పోయిందన్నారు. అలాగే ముఖ్యమంత్రి, ఆయన తనయుడు లోకేష్ ట్విట్టర్‌లో ఏం పోస్టు చేస్తారో అర్థం కావడం లేదన్నారు. గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకూ 13 లక్షల హెక్టార్లు వరి సాగైందన్నారు. గుంటూరు జిల్లా పశ్బిమ డెల్టాలో పంట అంతా నీటిలో తేలియాడుతున్నట్లు ప్రభుత్వం అనుకూల పత్రికల్లోనే కథనాలు వచ్చాయన్నారు. 10 నుంచి 15 సెంటీమీర్ల వర్షం పడితే ఒక్క డ్రెయిన్ కూడా పని చేయక నీల్లు వెళ్లని పరిస్థితి ఉందన్నారు. నవంబర్‌లో పంటలు వచ్చేలా చర్యలు తీసుకున్నామని చంద్రబాబు చేసిన ప్రకటనపై నాగిరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పంటల సీజన్ మార్చేలా చర్యలు తీసుకోవడం ఏమిటి? మరి ఆర్టీజీఎస్‌లోనే 9 లక్షల పైచిలుకు హెక్టార్లలో పంటలున్నాయని ప్రకటన ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. సోమవారం సాయంత్రం తుపాను ప్రభావం ఆగిపోగా క్షేత్ర స్థాయిలో అధికారులు సందర్శించి పంట నష్టం అంచనాలు వేయకముందే మంత్రి, ముఖ్యమంత్రి, ఆర్టీజీఎస్ మధ్యాహ్నానికే నష్టం వివరాలు ఎలా వెల్లడిస్తారని నిలదీశారు. తుపాను బాధితులను మానవత్వంతో ఆదుకోవాలని, పబ్లిసిటీ చేసుకుంటూ కాలం గడపవద్దని చంద్రబాబుకు నాగిరెడ్డి హితవు పలికారు.
అవి ప్రభుత్వ హత్యలే
Published Wed, Dec 19 2018 3:01 AM | Last Updated on Wed, Dec 19 2018 3:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment