పాతపోస్టాఫీసు(విశాఖదక్షిణ): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో పాటు మత్స్యశాఖ అధికారులు, వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో వేటకు వెళ్లిన పడవలు ఫిషింగ్ హార్బర్‌కు చేరుకుని లంగరు వేసుకున్నాయి. సోమవారం కుండపోత వర్షం కురిసింది. దీంతో ఫిషింగ్ హార్బర్లో నరసంచారం లేకుండా పోయింది. ప్రతి రోజు బోట్ల నుంచి దిగుమతి అయ్యే చేపలకు స్థానిక మార్కెట్‌లో గిరాకీ ఉంటుంది. అదేవిధంగా రొయ్యలు, చేపలు ఎగుమతి చేసేందుకు ప్యాకింగ్ కుర్రాళ్లతో నిరంతరం సందడిగా కనిపించే హార్బర్ సోమవారం బోసిపోయింది. జెట్టీలలో బోట్లను కట్టేసిన కలాసీలు ఇళ్లకు వెళ్లిపోయారు.
అలల తాకిడికి జెట్టీల వద్ద లంగరేసిన బోట్లు ఒకదాన్ని ఒకటి తాకుతూ నీటిలో పైకి కిందకు కదిలాడాయి. ఎండుచేపల మార్కెట్‌లో టార్పాలిన్లు కప్పినా చేపలు తడిసిపోయాయి. దీంతో ఉసూరమంటూ మత్స్యకారులు ఇంటికి వెళ్లిపోయారు. లక్షల్లో వ్యాపారం నష్టం వచ్చిందని మత్స్యకార మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిషింగ్ హార్బర్ మీద ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా బతికే వేలాది మంది తుపాను కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మరబోట్ల సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులందరికీ తుపాన్లు అలవాటేనని అయితే గత మూడు, నాలుగు సంవత్సరాలుగా వస్తున్న తుపాన్లు తీవ్రరూపం దాల్చడంతో మత్స్యకారులు కూడా భయపడాల్సి వస్తోందని చెబుతున్నారు.
ఎగిసిపడుతున్న అలలు
సముద్రం ఎగిసిపడుతూ అల్లకల్లోలంగా ఉండడంతో ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్న బోట్లను ఒకదానికి ఒకటి తగిలి పగిలిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలల ఉధృతి అధికంగా ఉండడంతో బోట్లు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నా ఏ క్షణానికి ఏమవుతుందో తెలియక బోట్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment