bay of bangal
-
అమెరికా వల్లే నాకు ఇలాంటి దుస్థితి.. షేక్ హసీనా ఆవేదన
బంగ్లాదేశ్‌లో అల్లర్ల వేళ అక్కడ అలాంటి పరిస్థితులకు గల కారణాలను వెల్లడించారు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా. బంగ్లాదేశ్‌లో తమ ప్రభుత్వం పడిపోవడానికి అమెరికానే కారణమని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. బంగాళాఖాతంలో ఉన్న సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు ఇవ్వనందుకే ఈ పరిస్థితి నెలకొందని హసీనా చెప్పుకొచ్చారు.కాగా, మాజీ ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను వీడిన తర్వాత మొదటిసారిగా మాట్లాడారు. తాజాగా షేక్ హసీనా మీడియా సంస్థతో కీలక విషయాలను వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో తమ ప్రభుత్వ పతనానికి అమెరికానే కారణమని ఆరోపించారు. బంగాళాఖాతంలో అమెరికా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోందన్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న తాను అడ్డుకోవడంతోనే అమెరికా ఈ పన్నాగం పన్నినట్లు చెప్పుకొచ్చారు. ఇక, బంగాళాఖాతంలోని సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు తాను అప్పగించనందుకే ఇలా అల్లర్లకు ప్రేరేపించినట్టు తెలిపారు. BIG BREAKING NEWS 🚨 Sheikh Hasina accuses US of ousting her from power for Saint Martin IslandShe revealed "I could've remained in power if I surrendered the sovereignty of Saint Martin Island""US's aim was to assert control over the Bay of Bengal. I resigned to avoid… pic.twitter.com/Wa2pmtxF0G— Times Algebra (@TimesAlgebraIND) August 11, 2024 బంగ్లాదేశ్ విద్యార్థుల మృతదేహాలపై కొందరు అధికారంలోకి రావాలని కోరుకున్నారని.. కానీ దానికి తాను అంగీకరించలేదని షేక్ హసీనా స్పష్టం చేశారు. అలాగే, బంగ్లాదేశ్‌లో విద్యార్థుల మరణాలను చూడలేకనే రాజీనామా చేసినట్టు స్పష్టం చేశారు. ఒకవేళ తాను గనుక అమెరికాకు సెయింట్ మార్టిన్ దీవులను అప్పగించి ఉంటే ఇప్పుడు పరిస్థితులు మరోలా ఉండేదని అన్నారు. ఇదే సమయంలో ఛాందసవాదుల వల్ల బంగ్లాదేశ్ వాసులు తప్పుదోవ పట్టవద్దని విజ్ఞప్తి చేశారు. శాంతిని పెంపొందించాలని కోరారు. తాను అక్కడే ఉంటే మరింత విద్యార్థులు చనిపోయేవారిని ఆమె తెలిపారు. అందుకే దేశం విడిచి వెళ్లిపోయినట్టు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో ఆందోళనలు పీక్ స్టేజ్ చేరుకోవడంతో నిరసనకారులు షేక్ హసీనా అధికారిక నివాసాన్ని ముట్టడించడంతో షేక్ హసీనా దేశాన్ని వీడారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో భారత్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం షేక్ హసీనా ఇండియాలోనే ఉన్నారు. ఇతర దేశాల్లో ఆశ్రయం దొరక్కపోవడంతో ఢిల్లీలోనే ఉంటున్నారు. -
వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. రాగల 24 గంటల్లో ఒడిశాలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని హైదరాబాద్‌లోని వాతారణ కేంద్రం తెలిపింది. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, తెలంగాణపై దీని ప్రభావం నేడు, రేపు ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. హైదరాబాదులో సాయంత్రం మోస్తారు నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ఈ తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణలో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం రోజు అయిదు జిల్లాలు(కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం) జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలతోపాటు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.రెడ్ అలెర్ట్ ప్రకటించిన జిల్లాల్లో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్న కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అదే విధంగా ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ (భారీ వర్షాలు)జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్ నగరంలో నేటి సాయంత్రం(శుక్రవారం)మోస్తారు నుంచి తేలికపాటి వర్షం కురిసే అకవాశం ఉందని పేర్కొంది.మరోవైపు వాయుగుండగా బలపడిన అల్పపీడనం రేపు ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొంది. ఈ మేరకు కొస్తా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తీరం వెంబడి అత్యధికంగా గంటకు 65 కిమీ వేగంతో గాలులు స్తుండటంతో వేటకు వెళ్ళారాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది.ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రమాదస్థాయిలో ఏలూరు జిల్లా వేలేరుపాడు జలాశయం ప్రవహిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. -
ఈ సీజన్ లో తొలి తుఫాను... కోస్తాంధ్ర వైపు...
-
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం!.. పలుచోట్ల వర్షాలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/వాకాడు: నైరుతి బంగాళాఖాతంలో ఈశాన్య శ్రీలంక వద్ద కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో శని, ఆదివారాల్లో రాయలసీమ, దక్షిణ æకోస్తాంధ్రల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వానలు కురుస్తాయని, ఆదివారం పొడి వాతావరణం నెలకొంటుందని వివరించింది. కోస్తా తీరం వెంబడి గంటకు 40–45, గరిష్టంగా 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, శనివారం మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించింది. అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు ఎగసి పడుతున్నాయి. సముద్రం దాదాపు 10 మీటర్లు వరకు ముందుకు చొచ్చుకొచ్చింది. మరోవైపు ఈనెల 16న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. చదవండి: ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన సీఎం జగన్ -
6న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 6వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. అది పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరంవైపు కదిలే సూచనలున్నా దాని ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని పేర్కొంది. దీనివల్ల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తీరప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నెల 11న శ్రీకాకుళం జిల్లాలో భారీవర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రధానంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇవీ చదవండి: గూఢచారి ‘ధ్రువ్’ వచ్చేస్తోంది.. ప్రత్యేకతలివే.. మాయ‘లేడి’: చాటింగ్‌తో మొదలై.. నగ్నంగా వీడియో కాల్ -
అల్పపీడన ప్రభావం: భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్ : వాయవ్య బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రమైం ది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో రెం డ్రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రానికి మూడో నంబరు హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా రోడ్లు దెబ్బతినే అవకాశం ఉందని, అలాగే రైల్వే శాఖ కూడా జాగ్రతగా ఉండాలని పేర్కొంది. నేడు పలుచోట్ల భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో గత మూడు రోజులు గా ఎడతెరపిలేకుండా వానలు కురుస్తున్నా యి. శనివారం రాష్ట్రంలో 4.52 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ సీజన్ లో ఇప్పటివరకు 48.8 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 64.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. కాగా ఆది, సోమవారాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములు గు, వరంగల్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూ చించింది. కాగా, ఈ సీజన్లో బంగాళాఖా తంలో మూడుసార్లు అల్పపీడనం ఏర్పడగా.. ఈనెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఎలాంటి ఆపద ఉన్నా కాల్ చేయండి ∙ 040–23450624 నంబర్‌తో రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూం రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తుండడం, పలు ప్రాంతాలను వరదలు పోటెత్తుతున్న నేపథ్యంలో ఎవరికైనా ఎలాంటి కష్టం ఉన్నా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 040–23450624కు కాల్ చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమైతే తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై శనివారం ఆయన డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి బీఆర్కేఆర్ భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షించడానికి తమ కార్యాలయాల్లో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూం లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లా అధికారులందరూ జిల్లా కేంద్రంలోనే అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. జిల్లాల్లో రైల్వే లైన్లకు దగ్గరగా ఉన్న చెరువులు, కుంటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఎస్ సూచించారు. 20 వేల ఎకరాల్లో పంట నష్టం సాక్షి, హైదరాబాద్: నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఎడతెరపి లేని ముసురు కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 20 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఇందులో పత్తి అత్యధికంగా 7,500 ఎకరాలు, వరి 5,700 ఎకరాలు, కందులు 3 వేల ఎకరాల్లో నష్టపోయినట్టు భావిస్తోంది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఈ పంట నష్టం వాటిల్లినట్టు ఆ శాఖ ప్రాథమిక అంచనాల్లో తేల్చింది. -
జోరువానలు
సాక్షి, హైదరాబాద్ : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ సీజన్లో బంగాళాఖాతంలో దాదాపు మూడోసారి అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్లో రాష్ట్రంలో గురువారం నాటికి సాధారణ వర్షపాతం 47.3 సెంటీమీటర్లు కాగా, ఇప్పటికే 56.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. గురువారం ఏర్పడి న అల్పపీడనం ప్రభావంతో మరో 3 రోజుల పాటు వానలు కురుస్తాయని తెలిపారు. బూర్గంపహాడ్‌లో 15.4 సెం.మీ. వర్షం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో గురువారం 15.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా వెంకటాపురంలో 13.2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, భద్రాచలం, ఇల్లందు మండలాల్లో 13 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. అన్నపురెడ్డిపల్లి, ముల్కపల్లి, టేకురెడ్డిపల్లి, గార్ల మండలాల్లో 10, భద్రాద్రి కొత్తగుడెం, మహబుబాబాద్ జిల్లాల్లో 8.7 సెం.మీ.చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు వానలే వానలు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా శుక్రవారం ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం –ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్–పట్టణ, గ్రామీణ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు అత్యంత భారీవర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు గురువారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి హైదరాబాద్ నిండా మునిగింది. 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
పాకిస్తాన్.. వాట్సాప్ గ్రూప్ హల్ చల్
సాక్షి, చెన్నై: పాకిస్తాన్ ముజాహిద్దీన్ పేరిట వాట్సాప్ గ్రూప్ కోయంబత్తూరులో హల్చల్ చేస్తుండడం వెలుగులోకి వచ్చింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అయితే, ఉత్తరాది ఆ యువకుడికి కోయంబత్తూరులోని చిరునామాతో ఆధార్, రేషన్ కార్డులు సైతం జారీ చేసి ఉండడం పోలీసుల్ని విస్మయంలో పడేసింది. ఈ కార్డులు ఆ యువకుడికి ఎలా వచ్చాయో అన్న కోణంలోనూ విచారణను వేగవంతం చేశారు. రాష్ట్రంలో ఇటీవల కాలంగా చాపకింద నీరులా సాగుతూ వస్తున్న ఐసిస్ మద్దతుదారుల కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. శ్రీలంకలో సాగిన బాంబు పేలుళ్ల అనంతరం ఎన్ఐఏ వర్గాల దృష్టి తమిళనాడుపై పడింది. తరచూ ఇక్కడ దాడులు నిర్వహించడం ఐసిఎస్ మద్దతు దారుల్ని పట్టుకెళ్లడం జరుగుతోంది. అలాగే, నిషేధ తీవ్రవాద సంస్థల పేరిట సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న వ్యవహారాల్ని గుర్తించి విచారణలు ముమ్మరం చేశారు. ప్రధానంగా కోయంబత్తూరు చుట్టూ ఎన్ఐఏ వర్గాల విచారణలు, దాడులు ముమ్మరం చేసి ఉన్న తరుణంలో గత నెలాఖరులో తీవ్రవాదులు చొరబడ్డ సమాచారం ఉత్కంఠను రేపింది. కోయంబత్తూరులో జల్లెడ పట్టి మరీ గాలింపు సాగింది. సముద్ర మార్గంలో తమిళనాడులోకి తీవ్ర వాదులు ప్రవేశించి ఉన్నట్టుగా కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో ప్రధాన నగరాల్లో పోలీసుల యంత్రాంగం అప్రమత్తంగానే వ్యవహరిస్తూ వస్తున్నది. ఈనేపథ్యంలో పాకిస్తాన్ ముజాహిద్దీన్ పేరిట వాట్సాప్ గ్రూప్ హల్చల్ చేస్తుండడం వెలుగులోకి రావడంతో కోయంబత్తూరులో భద్రతను ప్రశ్నార్థకం చేసింది. ఓ సెల్‌ఫోన్ సర్వీసు సెంటర్లో పనిచేస్తున్న వ్యక్తి గుర్తించే వరకు పోలీసులు కూడా ఈ వ్యవహారాన్నిపసిగట్ట లేని పరిస్థితి ఉండడం గమనార్హం. సెల్‌ఫోన్ ద్వారానే వెలుగులోకి.. కోయంబత్తూరులో ఉన్న ఓ నగల తయారీ కర్మాగారంలో ఫారూక్ కౌశర్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. ఇతడి ఆండ్రాయిడ్ ఫోన్ మరమ్మతులకు గురైంది. దీనిని నగరంలోని ఆర్ఎస్ పురంలో ఉన్న ఓ సెల్ ఫోన్ సర్వీసు సెంటర్లో ఇచ్చాడు. ఆ సెంటర్లో పనిచేస్తున్న సిబ్బంది ఆ ఫోన్‌కు మరమ్మతులు పూర్తి చేశారు. ఆ సెల్‌ఫోన్ పనిచేయడంతో అందులో ఉన్న యాప్స్‌ను పరిశీలించాడు. అందులో పాకిస్తాన్ ముజాహిద్దీన్ పేరిట ఓ వాట్సాప్ గ్రూప్ ఉండడం, అందులో ప్రధానంగా తుపాకులు, ఆయుధాల ఫొటోలు, వాటి తయారీ గురించిన సమాచారాలు ఉండడంతో అనుమానాలు బయలు దేరాయి. అలాగే, ఆ సెల్ ఫోన్లోని గూగుల్ సెర్చ్‌లోనూ తుపాకీల తయారీ గురించే అధికంగా సెర్చ్ జరిగి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. కోయంబత్తూరు పోలీసులు ఆ సెల్‌ఫోన్‌ను పరిశీలించారు. అందులో ఉన్న ఫొటోలు, వాట్సాప్ గ్రూప్‌ను తనిఖీలు చేశారు. ఆ నగల కర్మాగారంలో ఉన్న ఫారూక్ కౌశర్ (28)ను ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అతగాడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువకుడిగా గుర్తించారు. అతడి వద్ద కోయంబత్తూరు చిరునామాతో ఆధార్ , రేషన్ కార్డు సైతం ఉండడంతో అవి ఎలా వచ్చాయో ఆరా తీస్తున్నారు. రహస్య ప్రదేశంలో ఉంచి అతడి వద్ద విచారణ సాగుతోంది. అలాగే, పాకిస్తాన్ ముజాహిద్దీన్ పేరిట వాట్సాప్ గ్రూప్‌ను నడుపుతున్న వ్యక్తి, అందులోఉన్న వారి వివరాలను సెల్ ఫోన్ నంబర్ల ఆధారంగా సేకరించి, ఆయా ప్రాంతాల్లోని పోలీసుల ద్వారా విచారణను వేగవంతం చేశారు. -
నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న ఒరిస్సా, పశ్చిమబెంగాల్ తీర ప్రాంతాలలో 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి వైపునకు వంపు తిరిగి ఉంది. మరోవైపు ఆదివారం ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా ఆది, సోమవారాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లా బజర్హతనూర్‌లో 13 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. మల్కాజిగిరి మండలం దిండిగల్‌లో 12 సెం.మీ., జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం, పేరూరులలో 11 సెం.మీ., ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో 10 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా జుక్కల్, ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులలో 9 సెం.మీ., నాగారెడ్డిపేట, కాళేశ్వరం, పినపాక, రంజల్, లింగంపేట, సారంగాపూర్, బాన్సువాడ, యల్లారెడ్డిలలో 8 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులుగా ముసురు వాతావరణం నెలకొని ఉంది. దీంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పడిపోయాయి. రాష్ట్రంలో వర్షపాతం లోటు గణనీయంగా తగ్గింది. జూన్ ఒకటో తేదీ నుంచి శనివారం నాటికి సాధారణంగా కురవాల్సిన వర్షపాతం 390.7 మిల్లీమీటర్లు (మి.మీ.) కాగా, ఇప్పటివరకు 381.4 ఎంఎంలు నమోదైంది. వరంగల్ అర్బన్‌లో ఈ సీజన్లో ఇప్పటివరకు 30 శాతం అధిక వర్షపాతం రికార్డు కావడం గమనార్హం. ఒక్క శనివారమే రాష్ట్రంలో సాధారణం కంటే 397 శాతం అధిక వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం సాధారణంగా 7.5 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఏకంగా 37.3 మి.మీ. నమోదైంది. ఒక్క సిద్ధిపేట జిల్లాలోనే 1,248 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అక్కడ శనివారం 3.1 మి.మీ. కురవాల్సి ఉండగా, ఏకంగా 41.8 మి.మీ. నమోదైంది. -
ఆకలి..‘ అల’మట
సాక్షి, నరసాపురం(పశ్చిమ గోదావరి) : సుముద్రంలో వేట నిషేధం గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగియనుంది. 61 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం గంగపుత్రులు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత సముద్రంలోకి అడుగుపెట్టనున్నారు. చేపల పునరుత్పత్తి సీజన్ కావడంతో ఏటా ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 వరకూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సముద్రంలో వేట నిషేధం అమలవుతూ ఉంటుంది. రెండు నెలలుగా ఖాళీగా ఉన్న మత్స్యకారులు ఆకలితో అలమటించారు. మళ్లీ వేటకు సిద్ధమవుతున్నారు. బోట్లను సముద్రంలోకి పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వలలు, ఇతర వేట సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఏడాది సవ్యంగా వేట సాగాలని గంగమ్మ తల్లిని మొక్కుకుంటూ వేటకు సన్నద్ధమవుతున్నారు. బంగాళాఖాతానికి దగ్గరగా ఉండే నరసాపురం తీరంలో మచిలీపట్నం, కాకినాడ, నెల్లూరు తదితర ప్రాంతాలకు చెందిన 100 వరకూ బోట్లు రోజూ వేట సాగిస్తాయి. వేట నిషేధ సమయం ముగియడంతో బోట్లు ఒక్కొక్కటీ చేరుకుంటున్నాయి. గతేడాది కష్టాల వేట నిజానికి గత ఏడాది వేటకు ప్రకృతి సహకరించింది. తుపాన్లు వంటి ప్రకృతి విపత్తులు పెద్దగా చుట్టుముట్టలేదు. అయినా వేట సవ్యంగా సాగలేదు. మత్స్యసంపద ఎక్కువగా దొరికే జూన్, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా పెద్దగా మత్స్య సంపద లభ్యంకాకపోవడంతో జాలర్లు దిగాలు పడ్డారు. అంతకు ముందు రెండు సంవత్సరాలు 2017, 2018లలో ప్రకృతి విపత్తులు ఎక్కువగా రావడంతో మత్స్యకారులకు వేట విషయంలో ఎదురుదెబ్బలు తగిలాయి. అందని వేట నిషేధ సాయం నరసాపురం తీరంలో వేట నిషేధ సాయాన్ని గతపాలకులు అరకొరగా అందించారు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వేట నిషేధ కాలంలో 2017లో కేవలం 104 మందికి సాయం అందించి చేతులు దులుపుకున్న ప్రభుత్వం 2018లో 173 మందిని లబ్ధిదారులుగా గుర్తించి రూ. 4వేలు చొప్పున అందించింది. ఈ ఏడాది 375 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. అయితే వేట నిషేధ సమయం ముగిసినా ఇంకా లబ్ధిదారులకు సొమ్ము చెల్లించలేదు. ఎన్నికల సమయం కావడంతో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు.నిజానికి 19 కిలో మీటర్ల మేర తీరప్రాంతం ఉన్న నరసాపురంలో దాదాపుగా 2వేల మంది వరకూ పూర్తిగా వేటనే నమ్ముకుని బతుకుతున్నారు. వారిలో పెద్దబోట్లపై పనిచేసేవారి సంఖ్య 700 వరకూ ఉంటుంది. కేవలం 375 మందిని ఎంపికచేసి మత్స్యశాఖ చేతులు దులుపుకోవడంపైనా మత్స్యకార సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌పైనే ఆశలు అధికారంలోకి వస్తే వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని రూ.10వేలకు పెంచుతామని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ఆయనపైనే గంగపుత్రులు ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది నుంచి అమలు చేస్తారా? వచ్చే ఏడాది నుంచి ఇస్తారా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు. సీజన్ కలిసొస్తే బాగుండు వేట లేకపోవడంతో రెండు నెలల నుంచి ఖాళీగా ఉన్నాం. ఇప్పుడు వేటకు వెళుతున్నాం. మంచి సీజన్. చేపలు ఎక్కువగా పడతాయి. ఈ ఏడాది బాగుంటుందని అనుకుంటున్నాం. తుపాన్లు పట్టకపోతే నాలుగు డబ్బులు వస్తాయి. దేవుడిపై భారం వేసి వేటకు వెళుతున్నాం. అంతా మంచే జరుగుతుందని ఆశ. – మైలా శ్రీనివాస్, బోటు కార్మికుడు, పెదమైనవానిలంక సొమ్ము త్వరలో జమ ఈ ఏడాది రూ.4 వేలు సాయం 375 మందికి ఇస్తున్నాం. గత ఏడాది 173 మందికే ఆర్థిక సాయం అందించాం. ఈ ఏడాది బోట్ల సంఖ్య పెరగడంతో లబ్ధిదారులు పెరిగారు. పెద్దబోట్లపై పని చేసే వారికే రూ.4 వేల సాయం అందుతుంది. సాయం రూ.4వేలు ఇస్తారా? రూ.10 వేలు పెంచి ఇస్తారా అనేది ఇంకా తేలలేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. లబ్ధిదారుల వివరాలు ఉన్నతాధికారులకు పంపించాం. – కె.రమణకుమార్, మత్స్యశాఖ అధికారి, నరసాపురం -
ఫిషింగ్ హార్బర్‌పై తీవ్ర ప్రభావం
పాతపోస్టాఫీసు(విశాఖదక్షిణ): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో పాటు మత్స్యశాఖ అధికారులు, వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో వేటకు వెళ్లిన పడవలు ఫిషింగ్ హార్బర్‌కు చేరుకుని లంగరు వేసుకున్నాయి. సోమవారం కుండపోత వర్షం కురిసింది. దీంతో ఫిషింగ్ హార్బర్లో నరసంచారం లేకుండా పోయింది. ప్రతి రోజు బోట్ల నుంచి దిగుమతి అయ్యే చేపలకు స్థానిక మార్కెట్లో గిరాకీ ఉంటుంది. అదేవిధంగా రొయ్యలు, చేపలు ఎగుమతి చేసేందుకు ప్యాకింగ్ కుర్రాళ్లతో నిరంతరం సందడిగా కనిపించే హార్బర్ సోమవారం బోసిపోయింది. జెట్టీలలో బోట్లను కట్టేసిన కలాసీలు ఇళ్లకు వెళ్లిపోయారు. అలల తాకిడికి జెట్టీల వద్ద లంగరేసిన బోట్లు ఒకదాన్ని ఒకటి తాకుతూ నీటిలో పైకి కిందకు కదిలాడాయి. ఎండుచేపల మార్కెట్లో టార్పాలిన్లు కప్పినా చేపలు తడిసిపోయాయి. దీంతో ఉసూరమంటూ మత్స్యకారులు ఇంటికి వెళ్లిపోయారు. లక్షల్లో వ్యాపారం నష్టం వచ్చిందని మత్స్యకార మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిషింగ్ హార్బర్ మీద ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా బతికే వేలాది మంది తుపాను కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మరబోట్ల సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులందరికీ తుపాన్లు అలవాటేనని అయితే గత మూడు, నాలుగు సంవత్సరాలుగా వస్తున్న తుపాన్లు తీవ్రరూపం దాల్చడంతో మత్స్యకారులు కూడా భయపడాల్సి వస్తోందని చెబుతున్నారు. ఎగిసిపడుతున్న అలలు సముద్రం ఎగిసిపడుతూ అల్లకల్లోలంగా ఉండడంతో ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్న బోట్లను ఒకదానికి ఒకటి తగిలి పగిలిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలల ఉధృతి అధికంగా ఉండడంతో బోట్లు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నా ఏ క్షణానికి ఏమవుతుందో తెలియక బోట్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. -
క్షణ క్షణం.. భయం..భయం
విశాఖపట్నం , నక్కపల్లి/పాయకరావుపేట: పెథాయ్‌తో ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని తీరప్రాంత వాసులు ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడిపారు. తుపాను కారణంగా బలమైన ఈదురు గాలులతో భయానక వాతావరణం చోటుచేసుకుంది. తీరం అలకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. సాధారణ రోజుల్లో కంటే పది మీటర్లు ముందుకు వచ్చాయి. పాయకరావుపేట మండలం పెంటకోట, రాజానగరం, రాజవరం, పాల్మన్‌పేట, రత్నాయంపేట, వెంకటనగరం, నక్కపల్లి మండలం రాజయ్యపేట, బోయపాడు, దొండవాక, బంగారయ్యపేట ,పెదతీనార్ల ప్రాంతాల్లో తీరం కోతకు గురైంది. ఒడ్డున లంగరు వేసిన తెప్పలు అలల «తాకిడికి చెల్లా చెదురయ్యాయి. అక్కడక్కడ కొన్నిపాడయ్యాయి. ఈ పరిస్థితితో మత్స్యకారులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ఆదివారం రాత్రి ప్రారంభమైన వర్షం సోమవారం అంతా కుండపోతగా పడింది. రెండు రోజుల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలులకు చెట్లు, కొమ్మలు పడి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తీగలు తెగిపడ్డాయి. జనం భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు రాలేదు. బస్సులు, రైళ్లు తిరగకపోవడంతో పలువురు ప్రయాణాలు రద్దుచేసుకున్నారు. అధికారులు అప్రమత్తం.. పెథాయ్‌తో ఎటువంటి ప్రాణనష్టం చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను ప్రభావిత గ్రామాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జేసీ సృజన ఆది,సోమవారాల్లో పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌రాయవరం మండలాల్లో పర్యటించి అధికారులకు సలహాలు, సూచనలు అందించారు. తుపాను వల్ల ఇబ్బందులు పడుతున్నవారికి, వేటకు వెళ్లకుండా ఇంటివద్ద ఉండిపోయిన వారికి పునరావాస కేంద్రాల్లో భోజన సదుపాయం కల్పించారు. బలహీన పడే వరకు బెంగే.. కాకినాడ వద్ద తీరం దాటిన పెథాయ్ మళ్లీ తుని సమీపంలో వాయుగుండం రూపంలో తీరాన్ని తాకే అవకాశం ఉందంటూ సాయంత్రం వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. తుని సమీపంలో తీరం దాటితే కనక దీని ప్రభావం పాయకరావుపేట, నక్కపల్లి మండలాలపై ఉంటుంది. దీంతో అధికారులంతా గ్రామాలకు పరుగులు తీస్తున్నారు. తీరానికి ఆనుకుని రాజయ్యపేట, బోయపాడు, బంగారయ్యపేట, అమలాపురం పెదతీనార్ల, చినతీనార్ల, దొండవాక గ్రామాలున్నాయి. సోమవారం సాయంత్రానికి ఈ రెండు మండలాల్లోను పెద్దగా నష్టమేమీ జరగలేదు.అయితే సోమవారం అర్ధరాత్రికి మళ్లీ తుని సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్న హెచ్చరికలు అధికారులను, ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సహాయ కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ.. తుపాను సహాయ కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ నాయకులు తమవంతు సాయం చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త వీసం రామకృష్ణ సూచనల మేరకు అమలాపురం మాజీ సర్పంచ్ సూరాకాసుల గోవిందు, సీడీసీ మాజీ చైర్మన్ గూటూరు శ్రీనులు తీరప్రాంత గ్రామాలకు ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరా చేశారు. ఎక్కడైనా చెట్లు కూలిపోతే తొలగించడానికి ట్రాక్టర్లు, పొక్లెయిన్లను అందుబాటులో ఉంచారు. -
రాగల 24 గంటల్లో.. అతి భారీ వర్షాలు!
విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఒడిశా తీరంపై భువేనేశ్వర్‌కు ఆగ్నేయంగా 30 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణకు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుండి 60 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
తీరని నష్టం
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా 15 మండలాల్లో పంట నష్టం, చెరువులకు గండ్లు, పశువుల మృతితో పాటు రోడ్లు, ఇళ్లు దెబ్బతిన్నాయి. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించడంతో కలెక్టర్ శశిధర్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మెడికల్, పబ్లిక్ హెల్త్, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్అండ్బీ తదితర కీలక శాఖల అధికారులతో గురువారం కలెక్టరేట్ సభా భవనంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేసి పరిస్థితిని సమీక్షించారు. సమ్మెలో ఉన్నప్పటికీ విపత్తుల సమయంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు అధికారులు విధులు నిర్వర్తించాల్సిందేనని స్పష్టం చేశారు. నిధులకు ఎటువంటి కొరత లేదని చెప్పారు. 2380 ఎకరాల్లో వేరుశనగ, వరి తదితర పంటలు దెబ్బతిన్నాయన్నారు. సంబేపల్లె, పులివెందుల, ముద్దనూరు, జమ్మలమడుగు, తొండూరు తదితర మండలాల్లో 12 చెరువులకు గండ్లు పడ్డాయని, మరో మూడు చోట్ల సీపీడబ్ల్యుఎస్ స్కీంలు దెబ్బతిన్నాయని వివరించారు. గండ్లు పూడ్చేందుకు అవసరమైన తాత్కాలిక ఏర్పాట్లు చేయాలన్నారు. చిన్నమండెం మండలంలోని శ్రీనివాస రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరిగే పరిస్థితి ఉంటే ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని చెప్పారు. ఇళ్లలోకి నీరు ప్రవేశించిన చోట్ల, తాగునీటి స్కీంలు దెబ్బతిన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా రక్షిత తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. వ్యాధులు వ్యాపించకుండా ఉండేందుకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. బాధితులకు బియ్యం, కిరోసిన్ పంపిణీ చేయాలన్నారు. డ్రైన్స్ ఎక్కడైనా స్తంభించి ఉంటే వాటిలోని అడ్డంకులను తొలగించాలన్నారు. తాగునీటి క్లోరినేషన్ తప్పనిసరిగా చేయాలని, ప్రజలకు క్లోరిన్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో 359 ఇళ్లకు నష్టం వాటిల్లిందన్నారు. అలాగే 42 పశువులు మృతి చెందాయని, అవసరమైనచోట్ల పశువైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, వ్యాక్సిన్స్ పంపిణీ చేయాలని జేడీ వెంకట్రావును ఆదేశించారు. రోడ్లకు అడ్డంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడి ఉంటే వెంటనే తొలగించాలన్నారు. తాత్కాలికంగా రోడ్లకు మరమ్మత్తు పనులు చేయించాలని చెప్పారు. పాఠశాలలు, ఇతర ప్రభుత్వ భవనాలు ఎక్కడైనా దెబ్బతిని ఉంటే నష్టం వివరాలను తమకు పంపించాలని ఆదేశించారు. వర్షాలు పడినందున రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని వ్యవసాయాధికారులకు సూచించారు. ప్రతిపాదనలు పంపితే తాను ప్రభుత్వం నుంచి తెప్పిస్తామన్నారు. కలెక్టరేట్తోసహా ఆర్డీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని, అవసరమైతే ప్రజలు ఫోన్ చేసి తమ సమస్యలు చెబితే అధికారులు వచ్చి సహాయక చర్యలు చేపడతారన్నారు. పొంచి వున్న ముప్పు జిల్లాలో 48 గంటలపాటు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు అంచనా వేస్తుండటంతో జిల్లా యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తంచేశారు. ఇప్పటికీ వంకలు, వాగుల ఉధృతి తగ్గలేదు. ప్రొద్దుటూరులో బుధవారంరాత్రి సైతం భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు ప్రవహిస్తూనే ఉంది.చాపాడు మండలం అనంతపురం గ్రామంలోకి నీరు వచ్చి చేరడంతో ప్రజలను అప్రమత్తం చేశారు. పులివెందులలో భారీ వర్షం కురవడంతో పెండ్లూరు చెరువుకు గండి పడింది. వేముల మండలంలోని మబ్బుచింతలపల్లె, గొల్లల గూడూరు, పెర్నపాడు, కె.కొట్టాల, భూమాయపల్లెలో అరటి, పత్తి, వేరుశనగ, ఉల్లిపంటలు నీట మునిగాయి. పొలాలు వంకలుగా మారాయి. వరద ప్రాంతాలను ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పరిశీలించి రైతులను పరామర్శించారు. బద్వేలు ఆర్టీసీ గ్యారేజీలోకి నీరు చేరడంతో రూ. 3 లక్షల మేర ఆస్తినష్టం సంభవించింది.సమావేశంలో జేసీ నిర్మల, డీఆర్వో ఈశ్వరయ్య, ఆర్డీఓ వీరబ్రహ్మయ్య, డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రభుదాస్, ఆర్అండ్బీ ఎస్ఈ మనోహర్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ గుణభూషణ్‌రెడ్డి, కంట్రోల్ రూం అధికారి గంగయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.