కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా 15 మండలాల్లో పంట నష్టం, చెరువులకు గండ్లు, పశువుల మృతితో పాటు రోడ్లు, ఇళ్లు దెబ్బతిన్నాయి. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించడంతో కలెక్టర్ శశిధర్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మెడికల్, పబ్లిక్ హెల్త్, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్‌అండ్‌బీ తదితర కీలక శాఖల అధికారులతో గురువారం కలెక్టరేట్ సభా భవనంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేసి పరిస్థితిని సమీక్షించారు. సమ్మెలో ఉన్నప్పటికీ విపత్తుల సమయంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు అధికారులు విధులు నిర్వర్తించాల్సిందేనని స్పష్టం చేశారు. నిధులకు ఎటువంటి కొరత లేదని చెప్పారు.
2380 ఎకరాల్లో వేరుశనగ, వరి తదితర పంటలు దెబ్బతిన్నాయన్నారు. సంబేపల్లె, పులివెందుల, ముద్దనూరు, జమ్మలమడుగు, తొండూరు తదితర మండలాల్లో 12 చెరువులకు గండ్లు పడ్డాయని, మరో మూడు చోట్ల సీపీడబ్ల్యుఎస్ స్కీంలు దెబ్బతిన్నాయని వివరించారు. గండ్లు పూడ్చేందుకు అవసరమైన తాత్కాలిక ఏర్పాట్లు చేయాలన్నారు. చిన్నమండెం మండలంలోని శ్రీనివాస రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరిగే పరిస్థితి ఉంటే ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని చెప్పారు.
ఇళ్లలోకి నీరు ప్రవేశించిన చోట్ల, తాగునీటి స్కీంలు దెబ్బతిన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా రక్షిత తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. వ్యాధులు వ్యాపించకుండా ఉండేందుకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. బాధితులకు బియ్యం, కిరోసిన్ పంపిణీ చేయాలన్నారు. డ్రైన్స్ ఎక్కడైనా స్తంభించి ఉంటే వాటిలోని అడ్డంకులను తొలగించాలన్నారు. తాగునీటి క్లోరినేషన్ తప్పనిసరిగా చేయాలని, ప్రజలకు క్లోరిన్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో 359 ఇళ్లకు నష్టం వాటిల్లిందన్నారు. అలాగే 42 పశువులు మృతి చెందాయని, అవసరమైనచోట్ల పశువైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, వ్యాక్సిన్స్ పంపిణీ చేయాలని జేడీ వెంకట్రావును ఆదేశించారు. రోడ్లకు అడ్డంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడి ఉంటే వెంటనే తొలగించాలన్నారు.
తాత్కాలికంగా రోడ్లకు మరమ్మత్తు పనులు చేయించాలని చెప్పారు. పాఠశాలలు, ఇతర ప్రభుత్వ భవనాలు ఎక్కడైనా దెబ్బతిని ఉంటే నష్టం వివరాలను తమకు పంపించాలని ఆదేశించారు. వర్షాలు పడినందున రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని వ్యవసాయాధికారులకు సూచించారు. ప్రతిపాదనలు పంపితే తాను ప్రభుత్వం నుంచి తెప్పిస్తామన్నారు. కలెక్టరేట్‌తోసహా ఆర్డీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని, అవసరమైతే ప్రజలు ఫోన్ చేసి తమ సమస్యలు చెబితే అధికారులు వచ్చి సహాయక చర్యలు చేపడతారన్నారు.
పొంచి వున్న ముప్పు
జిల్లాలో 48 గంటలపాటు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు అంచనా వేస్తుండటంతో జిల్లా యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తంచేశారు. ఇప్పటికీ వంకలు, వాగుల ఉధృతి తగ్గలేదు. ప్రొద్దుటూరులో బుధవారంరాత్రి సైతం భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు ప్రవహిస్తూనే ఉంది.చాపాడు మండలం అనంతపురం గ్రామంలోకి నీరు వచ్చి చేరడంతో ప్రజలను అప్రమత్తం చేశారు. పులివెందులలో భారీ వర్షం కురవడంతో పెండ్లూరు చెరువుకు గండి పడింది. వేముల మండలంలోని మబ్బుచింతలపల్లె, గొల్లల గూడూరు, పెర్నపాడు, కె.కొట్టాల, భూమాయపల్లెలో అరటి, పత్తి, వేరుశనగ, ఉల్లిపంటలు నీట మునిగాయి. పొలాలు వంకలుగా మారాయి.
వరద ప్రాంతాలను ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పరిశీలించి రైతులను పరామర్శించారు. బద్వేలు ఆర్టీసీ గ్యారేజీలోకి నీరు చేరడంతో రూ. 3 లక్షల మేర ఆస్తినష్టం సంభవించింది.సమావేశంలో జేసీ నిర్మల, డీఆర్వో ఈశ్వరయ్య, ఆర్డీఓ వీరబ్రహ్మయ్య, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రభుదాస్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మనోహర్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ గుణభూషణ్‌రెడ్డి, కంట్రోల్ రూం అధికారి గంగయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తీరని నష్టం
Published Fri, Sep 13 2013 2:56 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
Advertisement
Advertisement