సాక్షి, హైదరాబాద్ : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ సీజన్‌లో బంగాళాఖాతంలో దాదాపు మూడోసారి అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్‌లో రాష్ట్రంలో గురువారం నాటికి సాధారణ వర్షపాతం 47.3 సెంటీమీటర్లు కాగా, ఇప్పటికే 56.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. గురువారం ఏర్పడి న అల్పపీడనం ప్రభావంతో మరో 3 రోజుల పాటు వానలు కురుస్తాయని తెలిపారు.
బూర్గంపహాడ్‌లో 15.4 సెం.మీ. వర్షం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో గురువారం 15.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా వెంకటాపురంలో 13.2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, భద్రాచలం, ఇల్లందు మండలాల్లో 13 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. అన్నపురెడ్డిపల్లి, ముల్కపల్లి, టేకురెడ్డిపల్లి, గార్ల మండలాల్లో 10, భద్రాద్రి కొత్తగుడెం, మహబుబాబాద్ జిల్లాల్లో 8.7 సెం.మీ.చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
నేడు, రేపు వానలే వానలు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా శుక్రవారం ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం –ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్–పట్టణ, గ్రామీణ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు అత్యంత భారీవర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు గురువారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి హైదరాబాద్ నిండా మునిగింది. 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
జోరువానలు
Published Fri, Aug 14 2020 5:18 AM | Last Updated on Fri, Aug 14 2020 5:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment