రాజయ్యపేట తీరంలో అల్లకల్లోలంగా ఉన్న సముద్రం
విశాఖపట్నం , నక్కపల్లి/పాయకరావుపేట: పెథాయ్‌తో ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని తీరప్రాంత వాసులు ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడిపారు. తుపాను కారణంగా బలమైన ఈదురు గాలులతో భయానక వాతావరణం చోటుచేసుకుంది. తీరం అలకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. సాధారణ రోజుల్లో కంటే పది మీటర్లు ముందుకు వచ్చాయి. పాయకరావుపేట మండలం పెంటకోట, రాజానగరం, రాజవరం, పాల్మన్‌పేట, రత్నాయంపేట, వెంకటనగరం, నక్కపల్లి మండలం రాజయ్యపేట, బోయపాడు, దొండవాక, బంగారయ్యపేట ,పెదతీనార్ల ప్రాంతాల్లో తీరం కోతకు గురైంది. ఒడ్డున లంగరు వేసిన తెప్పలు అలల «తాకిడికి చెల్లా చెదురయ్యాయి. అక్కడక్కడ కొన్నిపాడయ్యాయి. ఈ పరిస్థితితో మత్స్యకారులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ఆదివారం రాత్రి ప్రారంభమైన వర్షం సోమవారం అంతా కుండపోతగా పడింది. రెండు రోజుల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలులకు చెట్లు, కొమ్మలు పడి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తీగలు తెగిపడ్డాయి. జనం భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు రాలేదు. బస్సులు, రైళ్లు తిరగకపోవడంతో పలువురు ప్రయాణాలు రద్దుచేసుకున్నారు.
అధికారులు అప్రమత్తం..
పెథాయ్‌తో ఎటువంటి ప్రాణనష్టం చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను ప్రభావిత గ్రామాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జేసీ సృజన ఆది,సోమవారాల్లో పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌రాయవరం మండలాల్లో పర్యటించి అధికారులకు సలహాలు, సూచనలు అందించారు. తుపాను వల్ల ఇబ్బందులు పడుతున్నవారికి, వేటకు వెళ్లకుండా ఇంటివద్ద ఉండిపోయిన వారికి పునరావాస కేంద్రాల్లో భోజన సదుపాయం కల్పించారు.
బలహీన పడే వరకు బెంగే..
కాకినాడ వద్ద తీరం దాటిన పెథాయ్ మళ్లీ తుని సమీపంలో వాయుగుండం రూపంలో తీరాన్ని తాకే అవకాశం ఉందంటూ సాయంత్రం వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. తుని సమీపంలో తీరం దాటితే కనక దీని ప్రభావం పాయకరావుపేట, నక్కపల్లి మండలాలపై ఉంటుంది. దీంతో అధికారులంతా గ్రామాలకు పరుగులు తీస్తున్నారు. తీరానికి ఆనుకుని రాజయ్యపేట, బోయపాడు, బంగారయ్యపేట, అమలాపురం పెదతీనార్ల, చినతీనార్ల, దొండవాక గ్రామాలున్నాయి. సోమవారం సాయంత్రానికి ఈ రెండు మండలాల్లోను పెద్దగా నష్టమేమీ జరగలేదు.అయితే సోమవారం అర్ధరాత్రికి మళ్లీ తుని సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్న హెచ్చరికలు అధికారులను, ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
సహాయ కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ..
తుపాను సహాయ కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు తమవంతు సాయం చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త వీసం రామకృష్ణ సూచనల మేరకు అమలాపురం మాజీ సర్పంచ్ సూరాకాసుల గోవిందు, సీడీసీ మాజీ చైర్మన్ గూటూరు శ్రీనులు తీరప్రాంత గ్రామాలకు ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరా చేశారు. ఎక్కడైనా చెట్లు కూలిపోతే తొలగించడానికి ట్రాక్టర్లు, పొక్లెయిన్‌లను అందుబాటులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment