
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/వాకాడు: నైరుతి బంగాళాఖాతంలో ఈశాన్య శ్రీలంక వద్ద కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో శని, ఆదివారాల్లో రాయలసీమ, దక్షిణ æకోస్తాంధ్రల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వానలు కురుస్తాయని, ఆదివారం పొడి వాతావరణం నెలకొంటుందని వివరించింది. కోస్తా తీరం వెంబడి గంటకు 40–45, గరిష్టంగా 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, శనివారం మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించింది. అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు ఎగసి పడుతున్నాయి. సముద్రం దాదాపు 10 మీటర్లు వరకు ముందుకు చొచ్చుకొచ్చింది. మరోవైపు ఈనెల 16న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది.
చదవండి: ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన సీఎం జగన్