
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది సోమవారం సాయంత్రానికి బలపడి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఆ తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈ నెల 11 నాటికి నైరుతి బంగాళాఖాతానికి చేరుతుందని వెల్లడించారు.
అనంతరం తమిళనాడు–శ్రీలంక మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావం తమిళనాడు రాష్ట్రంపై అధికంగా ఉన్నప్పటికీ.. దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో కూడా కాస్త ప్రభావం చూపుతుందని చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం నుంచి అక్కడక్కడా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వివరించారు.
అదేవిధంగా ఈ నెల 17వ తేదీన అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడటానికి అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఇది 20వ తేదీ తర్వాత బలపడే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment