Visakhapatnam Cyclone Warning Centre
-
కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది సోమవారం సాయంత్రానికి బలపడి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఆ తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈ నెల 11 నాటికి నైరుతి బంగాళాఖాతానికి చేరుతుందని వెల్లడించారు. అనంతరం తమిళనాడు–శ్రీలంక మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావం తమిళనాడు రాష్ట్రంపై అధికంగా ఉన్నప్పటికీ.. దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో కూడా కాస్త ప్రభావం చూపుతుందని చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం నుంచి అక్కడక్కడా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వివరించారు. అదేవిధంగా ఈ నెల 17వ తేదీన అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడటానికి అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఇది 20వ తేదీ తర్వాత బలపడే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. -
నేడు వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది ఆదివారం రాత్రి తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమ–వాయవ్య దిశగా పయనించడం ప్రారంభించింది. క్రమంగా బలపడుతూ దక్షిణ బంగాళాఖాతంలో సోమవారం వాయుగుండంగా మారనుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అనంతరం వాయవ్య దిశగా కదులుతూ 27 సాయంత్రానికి తమిళనాడు–శ్రీలంక తీరాలు వైపు వెళ్లనుందనీ.. శ్రీలంక సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో సోమవారం నుంచి ఒకట్రెండుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈ నెల 27నుంచి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలకు కూడా ఆస్కారం ఉందన్నారు. రాయలసీమ జిల్లాలో చెదురుమదురు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా తీరప్రాంతంలో బలమైన గాలుల ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందనీ.. తీరం వెంబడి గంటకు 35 నుంచి 50 కి.మీ వేగం.. గరిష్టంగా 65 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని 29వ తేదీ వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. -
ఇరు రాష్ట్రాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి చురుగ్గా కదులుతుందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు బలంగా మారిన నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితలం అవర్తనం ఏర్పడిందని.... దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. -
పెరుగుతున్న చలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. చలి గజ గజ వణికిస్తోంది. శుక్రవారం ఆదిలాబాద్లో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైం ది. హైదరాబాద్లో 14.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముం దని ప్రకటించింది. గురువారం రాత్రి చలికి తట్టుకోలేక మొయినాబాద్ మండలం కనకమామిడికి చెందిన అంజయ్య(50) మరణించాడు. రాత్రి మైలార్దేవ్పల్లిలోని ప్రగతిభవన్ వద్ద నిద్రపోయిన అంజయ్య రాత్రంతా చలిలోనే పడుకోవడంతో తెల్లవారేసరికి మృతిచెందాడని మైలార్దేవ్పల్లి పోలీసులు తెలిపారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చెన్నైకి ఆగ్నేయ దిశలో 490 కిలోమీటర్ల దూరంలోను, నాగపట్నానికి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ, రాయలసీమ జిల్లాలతో పోలిస్తే కోస్తాంధ్ర ఉష్ణోగ్రతల్లో చెప్పుకోదగ్గ మార్పుల్లేవని భారత వాతావరణ శాఖ శుక్రవారంనాటి తన నివేదికలో వెల్లడించింది. రాగల 48 గంటల్లో కోస్తాంధ్రలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోను, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్టు తెలిపింది. నెల్లూరు, ప్రకాశం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. గరిష్ట/కనిష్ట ఉష్ణోగ్రతలు 28, 13 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.