దక్షిణ కోస్తాలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు
27న నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం
29 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది ఆదివారం రాత్రి తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమ–వాయవ్య దిశగా పయనించడం ప్రారంభించింది. క్రమంగా బలపడుతూ దక్షిణ బంగాళాఖాతంలో సోమవారం వాయుగుండంగా మారనుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
అనంతరం వాయవ్య దిశగా కదులుతూ 27 సాయంత్రానికి తమిళనాడు–శ్రీలంక తీరాలు వైపు వెళ్లనుందనీ.. శ్రీలంక సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో సోమవారం నుంచి ఒకట్రెండుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈ నెల 27నుంచి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలకు కూడా ఆస్కారం ఉందన్నారు.
రాయలసీమ జిల్లాలో చెదురుమదురు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా తీరప్రాంతంలో బలమైన గాలుల ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందనీ.. తీరం వెంబడి గంటకు 35 నుంచి 50 కి.మీ వేగం.. గరిష్టంగా 65 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని 29వ తేదీ వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment