అమెరికా వల్లే నాకు ఇలాంటి దుస్థితి.. షేక్‌ హసీనా ఆవేదన | Bangladesh Ex PM Sheikh Hasina Sensational Comments Over USA | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌లో ఇలాంటి పరిస్థితికి అమెరికానే కారణం: షేక్‌ హసీనా సంచలన ఆరోపణలు

Published Sun, Aug 11 2024 3:11 PM | Last Updated on Sun, Aug 11 2024 4:35 PM

Bangladesh Ex PM Sheikh Hasina Sensational Comments Over USA

బంగ్లాదేశ్‌లో అల్లర్ల వేళ అక్కడ అలాంటి పరిస్థితులకు గల కారణాలను వెల్లడించారు బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనా. బంగ్లాదేశ్‌లో తమ ప్రభుత్వం పడిపోవడానికి అమెరికానే కారణమని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. బంగాళాఖాతంలో ఉన్న సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు ఇవ్వనందుకే ఈ పరిస్థితి నెలకొందని హసీనా చెప్పుకొచ్చారు.

కాగా, మాజీ ప్రధాని షేక్‌ హసీనా బంగ్లాదేశ్‌ను వీడిన తర్వాత మొదటిసారిగా మాట్లాడారు. తాజాగా షేక్‌ హసీనా మీడియా సంస్థతో కీలక విషయాలను వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో తమ ప్రభుత్వ పతనానికి అమెరికానే కారణమని ఆరోపించారు. బంగాళాఖాతంలో అమెరికా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోందన్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న తాను అడ్డుకోవడంతోనే అమెరికా ఈ పన్నాగం పన్నినట్లు చెప్పుకొచ్చారు. ఇక, బంగాళాఖాతంలోని సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు తాను అప్పగించనందుకే ఇలా అల్లర్లకు ప్రేరేపించినట్టు తెలిపారు.

 

 బంగ్లాదేశ్ విద్యార్థుల మృతదేహాలపై కొందరు అధికారంలోకి రావాలని కోరుకున్నారని.. కానీ దానికి తాను అంగీకరించలేదని షేక్ హసీనా స్పష్టం చేశారు. అలాగే, బంగ్లాదేశ్‌లో విద్యార్థుల మరణాలను చూడలేకనే రాజీనామా చేసినట్టు స్పష్టం చేశారు. ఒకవేళ తాను గనుక అమెరికాకు సెయింట్‌ మార్టిన్‌ దీవులను అప్పగించి ఉంటే ఇప్పుడు పరిస్థితులు మరోలా ఉండేదని అన్నారు. ఇదే సమయంలో ఛాందసవాదుల వల్ల బంగ్లాదేశ్ వాసులు తప్పుదోవ పట్టవద్దని విజ్ఞప్తి చేశారు. శాంతిని పెంపొందించాలని కోరారు. తాను అక్కడే ఉంటే మరింత విద్యార్థులు చనిపోయేవారిని ఆమె తెలిపారు. అందుకే దేశం విడిచి వెళ్లిపోయినట్టు స్పష్టం చేశారు.

 

ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో ఆందోళనలు పీక్‌ స్టేజ్‌ చేరుకోవడంతో నిరసనకారులు షేక్‌ హసీనా అధికారిక నివాసాన్ని ముట్టడించడంతో షేక్‌ హసీనా దేశాన్ని వీడారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో భారత్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం షేక్‌ హసీనా ఇండియాలోనే ఉన్నారు. ఇతర దేశాల్లో ఆశ్రయం దొరక్కపోవడంతో ఢిల్లీలోనే ఉంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement