మునిగిన మరబోట్లు
తీవ్ర తుపాను హెచ్చరికలతో సముద్రంలో సుదూర ప్రాంతాల్లో వేట సాగిస్తున్న బోట్లన్నీ రెండు రోజుల క్రితమే చేరుకున్నాయి. ఫిషింగ్ హార్డర్ జెట్టీల్లో నిలిచిపోయాయి. సముద్రంలో ఉంటే ప్రమాదమని భయపడి తీరానికి చేరుకుంటే.. ఇక్కడా పెథాయ్ తుపాను ముప్పు తప్పలేదు.తుపాను ప్రభావంతో వీచిన పెనుగాలులు, విరుచుకుపడిన అలల ఉధృతికి జెట్టీల్లో ఉన్న బోట్లు పరస్పరం ఢీకొని సముద్రంలో మునిగిపోయాయి. విశాఖ ఫిషింగ్ హార్డర్‌లో ఇలా లంగరేసిన 9 మరబోట్లు, 3 ఫైబర్ బోట్లు బోల్తాపడి సముద్రంలో మునిగిపోయి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిణామంతో బోట్ల యజమానులకు సుమారు రూ.3 కోట్ల నష్టం వాటిల్లిందంటున్నారు. మరోవైపు వీటిపైనే ఆధారపడిన మత్స్యకారులు, కలాసీలు తమ జీవనోపాధి పోయిందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరుస తుపాన్ల వల్ల వేట సక్రమంగా సాగక పూట గడవని స్థితిలో ఉన్న తాము ఇప్పుడు పూర్తిగా ఉపాధి కోల్పోయామని వారు వాపోతున్నారు.
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): పెథాయ్ ప్రకోపానికి విశాఖ మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. సముద్ర తీర ప్రాంతాలను చిగురుటాకులా వణికించి తీరం దాటిందన్న సంతోషం ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఆవిరైపోయింది. ఫిషింగ్ హార్బర్‌లో జెట్టీలకు చేర్చిన తొమ్మిది మరబోట్లు, మూడు ఫైబర్‌బోట్లు నీటిలో మునిగిపోవడంతోపాటు మరో ఐదు ఫైబర్ బోట్లు దెబ్బతినడంతో బోట్ల యజమానులకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. జెట్టీలలో కట్టిన బోట్లు సోమవారం ఉదయం నుంచి వీచిన ఈదురుగాలుల ప్రభావంతో తాళ్లను తెంచుకుని ఒకదానికి ఒకటి గుద్దుకుని నీట మునిగాయి. బోటులో బిగించిన ఇంజిను, డీజిల్ ఆయిల్, వలలు, ఇతర వేట పరికరాలు నీట మునిగిపోయాయి. బోట్లు ముక్కలు చెక్కలుగా విడిపోయాయి. వీటిని నీటి నుంచి వెలుపలికి తీసినా పనిచేసే పరిస్థితి కనిపించడం లేదని బోట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బోటులో ఉన్న పరికరాలతో సహా మునిగిపోవడంతో ఒక్కొక్క మర బోటుకు సుమారుగా రూ.30 లక్షలు, ఫైబర్ బోటుకు రూ.3 లక్షల వరకూ నష్టపోయామని... అన్ని బోట్లకు కలిపి రూ.3కోట్లకు పైబడి ఆస్తి నష్టం జరిగిందని యజమానులు వాపోతున్నారు. మరోవైపు బోట్లు మునిగిపోవడంతో వీటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేసే సుమారు 200 మంది ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వం ఆర్థికంగా తమను ఆదుకోవాలని వీరంతా కోరుతున్నారు. ఇటీవలి వరకూ వేట సక్రమంగా సాగకపోయినా అప్పులు చేసి చేపల వేటకు బోట్లను పంపామని, ఇప్పుడు పూర్తిగా మునిగిపోవడంతో తాము కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మునిగిన బోట్ల వివరాలివీ
జీరో జెట్టీలో ఒకటి, 7వ నంబరు జెట్టీలో 4, 11వ నంబరు జెట్టీలో 3, 9వ నంబరు జెట్టీలో ఒకటి చొప్పున మరబోట్లు మునిగిపోగా... 9వ నంబరు జెట్టీలో మూడు ఫైబర్ బోట్లు మునిగిపోగా, 5 ఫైబర్ బోట్లు దెబ్బతి న్నాయి. అల్లిపిల్లి సత్యవతి, కె.సత్యనారాయణ, మైలపిల్లి పోలయ్య, మైలపిల్లి ఎర్రన్న, పుక్కళ్ల మస్తానమ్మ, సుగ్గళ్ల నూకరత్నం, సీహెచ్.వీర్రాజు, మేడ ఎల్లయ్యల బోట్లు నీటమునిగాయి. 11వ నంబరు జెట్టీలో మునిగిపోయిన బోటు యజమాని వివరాలు ఇంకా తెలియరాలేదు.
గాలి తాకిడికి గుద్దుకున్నాయి
తుపాను గాలి తీవ్రతకు జెట్టీలో కట్టి ఉంచిన మరబోట్లు తాళ్లను తెంచుకుని ఒకదాన్ని ఒకటి గుద్దుకోవడం వల్ల చెక్కలు పగిలి బోట్లు నీట మునిగిపోయాయి. మునిగిన బోట్ల వల్ల సుమారుగా రూ.3కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నాం. మత్స్యశాఖ అధికారులు, ప్రభుత్వం బోటు యజమానులను ఆదుకోవాలి. – పి.సి.అప్పారావు,
బోటు యజమాని, మరబోట్ల సంఘం అధ్యక్షుడు
మునిగిన బోటు పనికిరాదు
బోటు ఉప్పు నీటిలో మునిగిపోవడంతో అందులో ఉన్న ఇంజిన్‌తో సహా ఏ పరికరమూ పనికిరాకుండా పోయింది. సుమారుగా రూ.30 లక్షల వరకూ నష్టపోయాను. నేను, నాస్నేహితుడు కలిసి బోటు నడుపుతున్నాం. ప్రభుత్వ అధికారులు ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు ప్రయత్నించాలి.– సీహెచ్.వీరరాజు, బోటు యజమాని
ఇటీవలే రూ.3 లక్షలు వెచ్చించాను
వేటకు వెళ్లి వచ్చిన తరువాత ఇటీవలే రూ.3 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయించాను. బోటు పూర్తిగా మునిగిపోవడంతో సుమారుగా రూ.35 లక్షల వరకూ నష్టపోయాను. ఇప్పటికే అప్పులు చేశాను. ఇప్పుడు పూర్తిగా ఊబిలో కూరుకుపోయాను.– సుగ్గళ్ల నూకరాజు, బోటు యజమాని
నిండా మునిగిపోయాం
బోటు నీటిలో మునిగిపోవడంతో నా కుటుంబం నిండా అప్పుల్లో మునిగిపోయింది. బోటును నీటి నుంచి వెలుపలికి తీసినా ఎందుకూ పనికిరాదు. ముక్కలుగా విడిపోయింది. రూ.30 లక్షల వర కూ నష్టపోయాను. అధికారులు తగిన చర్యలు తీసుకొని బోట్ల యజమానులను ఆదుకోవాలి. – కంబాలి హరి, బోటు యజమాని
Comments
Please login to add a commentAdd a comment