విశాఖ విమానాశ్రయంలో ప్రయాణికుల పడిగాపులు
గోపాలపట్నం(విశాఖపశ్చిమ):పెథాయ్ తుపా ను ప్రభావం విమాన సర్వీసులపై విపరీతంగా చూపింది. విశాఖ నుంచి రాకపోకలు సాగిం చాల్సి విమానాలు బలమైన గాలి ఉధృతికి కొన్ని వెనక్కి మళ్లగా, మరి కొన్ని రద్దయ్యాయి. ఉదయం 7.15 గంటలకు దుబాయ్ నుంచి హైదరాబాద్ మీదుగా వచ్చిన ఎయిరిండియా విమానం గాల్లో చాలా సేపు చక్కర్లు కొట్టింది. విశాఖ విమానాశ్రయంలో రన్‌వేపై ల్యాండ్ అవడానికి ప్రయత్నించినా గాలి ఒత్తిడికి విమానం ఊగిపోయే పరిస్థితి రావడంతో దిగకుండానే హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. అదే సమయంలో ఢిల్లీ నుంచి విశాఖకు వచ్చిన ఇండిగో విమానం రన్‌వేని తాకినట్లే తాకి పైకెగిరిపోయింది. ఇది కూడా హైదరాబాద్‌కే వెళ్లిపోయింది. ఉదయం 8.30కు ముంబై నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖకు రావాల్సిన స్పైస్‌జెట్ విమానం ఇక్కడి వాతవరణ పరిస్థితుల వల్ల రాలేదు. ఇది కూడా హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. తిరిగి ముంబై వెళ్లిపోయింది.
విశాఖ నుంచి బెంగళూరు, హైదరాబాద్ ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. అలాగే విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన స్పైస్‌జెట్ రద్దు చేశారు. మధ్యాహ్నం పోర్టుబ్లెయిర్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమాన సర్వీసు కూడా వెళ్లలేదు. మధ్యాహ్నం హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో సర్వీసు, బెంగళూరు సర్వీసులు కూడా రద్దయ్యాయి. విజయవాడ నుంచి మధ్యాహ్నం 12.10కు బయలుదేరి విశాఖకు ప్రయాణమైన అలెయన్స్ ఎయిర్‌లైన్స్ విమానం రాజమండ్రి వరకూ వచ్చి తిరిగి విజయవాడకే వెళ్లిపోయింది. ఇలా రాత్రి వరకూ 14 సర్వీసులు రద్దయ్యాయి. ఇలా విమానాల రద్దుతో దేశీయ ప్రయాణికులతో పాటు అంతర్జాతీయ ప్రయాణికులూ ఇబ్బందులు పడ్డారు. అత్యవసర ప్రయాణికులు దిక్కుతోచక, ఎవర్నీ నిందించలేక ...ఏం చేస్తాం..ప్రకృతి అనుకూలించకపోతే అంటూ దిగులుగా వెనుదిరిగి వెళ్లారు. మరి కొందరు ఉదయం నుంచి పడిగాపులు కాసి సాయంత్రం తర్వాత వచ్చిన విమానాలతో కనెక్టివిటీని పొంది గమ్యాలకు చేరుకున్నారు. సాయంత్రం తర్వాత వచ్చిన విమానాల్లో కోచి, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలకు సర్వీసులు గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా వచ్చినా అతి కష్టంమ్మీద వాలాయి. విమాన సర్వీసులు దిగే వరకూ ప్రయాణికుల్లో ఒకటే ఉత్కంఠ, భయాందోళనలు కనిపిం చాయి. ఇవాళ విశాఖ వస్తామనుకోలేదంటూ దిగిన వారు సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment