
సాక్షి, విశాఖపట్నం: రక్షణశాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం అంతార్జాతీయ విమానాశ్రయంలో పదేళ్లకోసారి నవీకరణ పనులు జరగనున్నాయి. రన్‌వే పునరుద్ధరణ కోసం పనులు జరుగుతున్న నేపథ్యంలో రాత్రి సమయంలో విమానాలు నాలుగు నెలలకు పైగా నిలిపివేయనున్నారు. దాదాపు నాలుగు నెలలపాటు (నవంబర్ 15 నుంచి మార్చి నెలాఖరు వరకు) రీ-సర్వీసింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఈ క్రమంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు మూసివేయాలని నేవీ ప్రతిపాదించింది. దీంతో విశాఖ - సింగపూర్ విమానంతో పాటు , 12 సర్వీసులు నిలిచిపోతాయి. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు విమాన సేవలతో పాటు కోల్‌కతా, పుణె విమాన సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. మరో వైపు విశాఖ ఆర్ధిక వ్యవస్థ, వివిధ వ్యాపారాలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది.
ఈ సమయంలో విమానాశ్రయాన్ని రాత్రి 10.30 నుంచి ఉదయం 6.30 వరకు పరిమితం చేస్తే కొంతవరకు ఉపశమనం ఉండచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా వైజాగ్ ఎయిర్‌పోర్టు భారత నావికాదళం అధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. నేవీకి సంబంధించిన యుద్ధ విమానాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఐఎన్ఎస్ డేగా రన్‌వే నుంచే కార్యకలాపాలు సాగిస్తాయి. పౌర విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కూడా ఈ రన్ వే మీదుగానే జరుగుతాయి. నావికాదళం ప్రతి పదేళ్లకు ఓసారి తమ రన్‌వేలకు రీ-సర్ఫేసింగ్ పనులను చేపడుతుంది.
చదవండి: వైజాగ్ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్