తుపాను బాధిత ప్రాంతాలకు రిలీఫ్ మెటీరియల్ సిద్ధం చేస్తున్న తూర్పు నౌకాదళం సిబ్బంది
సాక్షి, విశాఖపట్నం: పెథాయ్ తుఫాన్ జనాన్ని వణికించింది. చలితోనే కాదు.. తుపాను ఎలాంటి ముప్పును తెచ్చిపెడుతుందోనన్న భయంతో విశాఖవాసుల్లో పెను ఆందోళన రేకెత్తించింది. మొన్న హుద్‌హుద్, నిన్న తిత్లీ తుపాన్లు సృష్టించిన బీభత్సమే వీరిలో భయోత్పాతాలను సృష్టించింది. అందుకనుగుణంగానే సోమవారం వేకువజాము నుంచి పెనుగాలులు, భారీ వర్షంతో పెథాయ్ తుఫాన్ సైతానులా విరుచుకుపడ బోతున్నానంటూ సంకేతాలిచ్చింది. తుపాను తీరం దాటే సమయంలో మరింతగా ఉధృతి పెరుగుతుందన్న సమాచారంతో ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో నంటూ జనం బితుకుబితుకుమంటూ గడిపారు. గాలులు, వర్షం గంట గంటకు పెరిగిపోతుండడం చూసి హెచ్చరికలు నిజమవుతాయని భీతిల్లారు. జోరు వర్షానికి చలి కూడా తోడైంది. వర్షం తగ్గినా చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. చలిని తట్టుకోలేక నగరంలోని ఆరోవార్డు ముసలయ్యపాలేనికి చెందిన కె.లక్ష్మి (65) అనే వృద్ధురాలు మృతి చెందింది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉధృతంగా కురిసిన వర్షానికి, ఈదురుగాలులకు జనం భయంతో ఇళ్లలోనే ఉండిపోయారు. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. సోమవారం భీమిలిలో అత్యధికంగా 11, విశాఖ, అనంతగిరిల్లో 9, గొలుగొండ, పాయకరావుపేట, అరకు, డుంబ్రిగుడల్లో 7 సెం.మీల చొప్పున వర్షపాతం రికార్డయింది. మరోవైపు సోమవారం ఉదయం నుంచి జిల్లాలోని పాయకరావుపేట, యలమంచిలి నియోజకవర్గాల్లో తుపాను ప్రభావం చూపింది. పొరుగున ఉన్న తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వద్ద తుపాను తీరాన్ని దాటడంతో దాని ప్రభావం ఈ నియోజకవర్గాల్లోని పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల్లో పంటలకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఒక్క పాయకరావుపేట నియోజకవర్గంలోనే 3,500 వేల ఎకరాలు, అనకాపల్లిలో 200, మాడుగుల నియోజకవర్గంలో 1500, యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలో 2,000, అచ్యుతాపురంలో 500, చోడవరంలో 100, పెందుర్తిలో 100, అరకులోయ మండలంలో 100 ఎకరాల చొప్పున వెరసి 9 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అలాగే పాయకరావుపేటలో 500 ఎకరాల్లో అరటితోటలు దెబ్బతిన్నాయి. ఈ పంట నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈదురుగాలుల ధాటికి పాయకరావుపేట నియోజకవర్గంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి.
ముగ్గురు మత్స్యకారులు గల్లంతు
తుపానుకు ముందు సముద్రంలో చేపలవేటకు వెళ్లిన జిల్లాలోని ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం గ్రామానికి చెందిన ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. కాకినాడలో ఉంటున్న వీరు ఈనెల 10న అక్కడ హార్బర్ నుంచి సముద్రంలోకి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఉండగా తుపాను గాలులకు వీరి బోటు గల్లంతయింది. అప్పట్నుంచి వీరి ఆచూకీ లభించకపోవడంతో వీరి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment